తోలుబొమ్మలాట – 10వ భాగం

పొద్దు చల్లబడింతర్వాత –

పడమటిళ్ళ నీడలు వీధుల్లోకి పాకిన పిదప –

గుడిముందంతా ఆక్రమించుకొన్న వేపచెట్టు నీడలో కొందరు హుషారుగా పన్జేస్తున్నారు.

గుంతలు తవ్వేవాళ్ళు తవ్వుతూ ఉంటే, కూసాలు బాతే వాళ్ళు బాతుతున్నారు. అడ్డకొయ్యలు కడుతున్నారు. కొందరింకా కొయ్యలు మోసుకొస్తున్నారు. మోకులు చంకకు తగిలించుకొస్తున్నారు.

అంబోరు సుబ్బారావు వాళ్ళకు సూచనలిస్తున్నాడు.

పాములేటి వగైరా యాదవులే ఎక్కువున్నారక్కడ.

దేవాలయం వద్ద సందడి జరగబోతోందనే విషయం తెలిసి చిన్న పిల్లలంతా అక్కడ మూగుతున్నారు.

ఆడమగ చిన్నచిన్న గుంపులుగా వీధుల్లో కొచ్చి రంగస్థల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు.

గుడి పంచలో కూచుని ఉన్న కమలాబాయి కళ్ళు అప్రయత్నంగానే జనాల్లో వెదకుతున్నాయి. అసంకల్పితంగానే ఆమె మనస్సు ఆందోళనకు గురవుతూ ఉంది.

మీగడోల్ల రాఘవరెడ్డికి సంబంధించిన అలజడి అది.

పురుగుల మందు తాగడు గదా!
ఆత్మహత్య చేసికోడు గదా!

రాత్రి వరకూ అతనా పని చేయలేదు.

ఈ రాత్రికి కూడా అతనికా ధైర్యం భగవంతుడు ఇవ్వకుంటే చాలు.

తర్వాత ఏం జరిగేది తను చూడదు గాబట్టి ఇబ్బందిలేదు.

ఎట్లా పరిచయమయ్యాడు! చివరకు ఎట్లా ఎదురయ్యాడు!

దీర్ఘంగా నిట్టూర్చింది ఆమె.

అప్పుడే కల్రోలు దగ్గరి యువకులు ఆమె దృష్టిలో పడ్డారు.

ఆమె ప్రేరేపించకుండానే చూపులు వాళ్ళల్లో వెదకాయి.

నిన్న మొన్న వనజతో తెగముచ్చట్లాడిన యువకుడు కన్పించలేదు.

అద్భుతమైన మానసిక సౌందర్యాన్ని జీవితాంతం వెంట తీసికెళ్ళే శక్తి ఉన్న ఈ యవ్వన పరిచయాన్ని ఎంత కృత్రిమంగా మలచబోయాడు అతను!

తన యవ్వనంలో తారసపడిన యువకునికీ ఇతనికీ ఎంత తేడా!

ఈ నాటికీ అతని స్మృతులు మధురం.

ఇన్నేళ్ళ తర్వాత – వ్యవసాయం చెదలుగుంపై తినేసిన అతని జీవిత దృశ్యాన్ని చూసే మానసిక స్థైర్యంలేక అతని ఎదుట బడలేకపోతోంది గాని, అతన్ని చూడలేకపోతోంది గాని .. ఈ యువకునిలా నిన్న పరిచయమై ఈ రోజు ఉదయానికే ఏహ్యభావన కలిగించే పరిస్థితి కాదు గదా!

డేరా వద్ద నించి తన మగని గొంతు.

‘‘ఖగపతి అమృతము తేగా

భుగభుగమని చుక్క యొకటి భూమిని వ్రాలెన్‌

పొగ చెట్టై జన్మించెను

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌’’

బీడీలకోసం వెంపర్లాట … అమూల్యమైన సాహిత్యాన్ని పణంగా పెట్టినా చిన్న చిన్న అవసరాలు కూడా తీరని పరిస్థితి.

చాటు పద్యాలూ, పురాణ కథలతో అవసరం లేని కాలమొచ్చింది.

అన్ని అవసరాల్నీ టీవీ సీరియళ్ళు తీరుస్తున్నాయి.

తను అప్పుడప్పుడూ తమ వీధి ఆడపిల్లలకు చెప్పేది ‘బొమ్మలాట కథ నేర్పుతాను’ రమ్మని. పాటలు, పద్యాలు నేర్పిస్తానని బంగ పడినా ఎవ్వరూ ముందుకు రారు…’’ అవి నేర్చుకొని మీరు బతికినారా? బతుకుదెరువు చూపని విద్య నేర్చుకోవడం ఎందుకూ? దండగ …’’ అంటూ తన్ను గేళిచేశారు. చివరకు తన కూతురు కూడా నేర్చుకొనేందుకు ముందుకు రాలేదు.

తనుకూడా చాలా పద్యాలు మర్చిపోయింది.

స్త్రీ పాత్రలకు తనే గొంతివ్వాలి … ఆడించాలి…

పల్లెలకు వెళ్ళటం ఖాయమని తెలిసిన ఈ కొద్దినాళ్ళూ పాటల్ని మళ్ళీ మననం చేసికొంది. వల్లె వేసికొంది. ఆడగలననే ధైర్యం ఉన్నా మనస్సు లోపలి పొరల్లో ఎక్కడో సన్నని అలజడి.

డేరా కట్టటం పూర్తి కాపచ్చింది.

ముందు వైపున తెల్లటి పంచెలు కలిపి కుట్టిన గుడ్డను పరదాగా కట్టారు.

మెల్లిగా డేరాకేసి నడిచింది ఆమె.

డేరా నిర్మాణం వద్ద జనాలకు హుషారు కలిగించేందుకు శ్రీనాథుని చాటువులు చెబుతున్నాడు తన తండ్రి.

‘‘సిరిగల వానికి చెల్లును

తరుణుల పదియారు వేల తగబెండ్లాడన్‌.

తిరిపెమున కిద్దరాండ్రా?

పరమేశా గంగవిడుము పార్వతి చాలున్‌.’’

అర్థాన్ని వివరిస్తున్నాడు.

దప్పికతో తల్లడిల్లిన శ్రీనాథుడు వ్యంగ్యంగా చెప్పిన పద్యం అది ..

ఎంత చమత్కారం! ఎంత తెగువగా మాట్లాడటం!

గరళము మింగితినని గర్వించే ఈశ్వరుణ్ణి ‘రేనాటి జొన్న మెతుకులు దినుమీ!’’ అంటూ సవాలు చేయటాన్ని అందంగా చెబుతున్నాడు.

అవెవరికీ రుచించినట్టు లేదు.

బహుశా అర్థంకాలేదు కాబోలు.

సినిమా వాళ్ళ గురించి చెబితే అర్థమై ఉండేది.

రాజకీయ నాయకుల గురించో, క్రికెట్‌ ఆటగాళ్ళ గురించో చెబుతే ఉత్సాహంగా వినేవాళ్ళు.

రంగస్థల నిర్మాణం ఓ మాదిరిగానే ఉంది.

ముందు వైపు తెరకట్టినా మిగిలిన మూడు పక్కలా, పైభాగానా ప్లాస్టిక్‌ గోనెసంచులతో కుట్టిన పట్టలను బిగించారు.

తోటి వారితో కలిసి రంగస్థల నిర్మాణ సన్నాహంలో మునిగిపోయింది కమలాబాయి కూడా.

మొదలు లావు కొస సన్నగా ఉన్న ఈతపుల్లల్ని తగినన్ని        ఉన్నాయో లేదో చూసుకొన్నారు. తక్కువైతే వాగులోకి వెళ్ళి చీరుకు రాపచ్చు.

ఈత పుల్లల చివర రెండంగుళాల పొడవుండే కందిపుల్లల్ని తగినంత వెసులుబాటుతో వేలాడగట్టారు.

చెక్క పలకల్ని తెప్పించుకొన్నారు.

ఇళ్ళల్లో వెదకి రేకు డబ్బాను తెచ్చుకొన్నారు.

తాళాలు సవరించుకొన్నారు.

కాళ్ళ గజ్జెలు సరిచూసికొన్నారు.

కథలు రాసిపెట్టిన నోటు పుస్తకాన్ని జాగ్రత్త పరిచారు.

కరెంటు తీగలాగి డేరాలో లైట్లు అమర్చినా పెట్రొమాక్స్‌ లైట్లు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు.

ముత్రాసుల ఇంట్లో కోడికూర ఉడుకుతోంది.

మందు సీసాలు కూడా వచ్చిపడ్డాయి.

మందు ఎప్పుడు తాగాలో, మాంసం ఎప్పుడు తినాలో వాళ్ళ సమయం వాళ్ళకుంది.

గుడిలోని గరుడ స్థంభాన్ని పంచలో పెట్టి నిండా ఆముదం పోసి వత్తి వెలిగించారు.

గ్రామస్తులు తొందరగా భోజనాలు పూర్తిచేసి వస్తే ఆట మొదలెట్ట బోతోన్నట్టుగా మైకులో చెప్పారు.

ఆ విషయాన్ని పదే పదే మైకులో ప్రకటిస్తూనే ఉన్నారు.

అప్పటికే సమయం ఏడు గంటలు దాటింది.

టీవీల డిష్‌ ఏంటెన్నాలను ఆపేయమని ప్రాధేయపడ్డారు.

ఆట మొదలవగానే ఆపుతామని వాళ్ళు అన్నా కళాకారులు ఒప్పుకోలేదు. టివిలు ఆడుతోంటే బొమ్మలాట వద్దకు ఎవ్వరూ రారని కాళ్ళా వేళ్ళాపడి ఎట్టకేలకు డిష్‌లను బంద్‌ చేయించారు.

తొందరగా భోంచేసి రమ్మంటూ మైకులో జనాల్ని పిలుస్తూనే    ఉన్నారు.

ఎనిమిది గంటలకు గాని పదిమంది జనం డేరా ముందు గుమిగూడలేదు.

కొందరు ఇళ్ళల్లోంచి మంచాలు తెచ్చుకని డేరా ముందు నడివీధిలో వేసుక్కూచున్నారు.

నులక మంచాల్ని వెల్లకిలా వేసికొని కూచున్నారు ఆడవాళ్ళు.

డేరా లోపల కదలిక ఆరంభమైంది.

బొమ్మల్ని తెరకెత్తుతున్నారు.

బొమ్మల వెన్నెముకలాంటి వెదురు బద్దల్ని తెరకు అడ్డుకొయ్యకు మధ్యన చెక్కి అంటిస్తున్నారు. సన్నని వెలుతురులో ఆ పని చేస్తూండటం వలన బొమ్మలు బైటకు స్పష్టం కావటం లేదు.

విగ్రహాలకు ముక్కుమొహాలు సరిజూసుకొని మంచివాటిని తెరకెత్తమని సూచించాడు గోవిదంరావు.

బొమ్మలేవి చెడిపోలేదు.

తరాలుగా వాడుతోన్నా పాడయిపోకుండా ఉన్నాయంటే తమ పూర్వీకుల నుంచి కూడా మంచి జాగ్రత్తలు తీసికోవడం వల్లే.

తోలుబొమ్మలకు నీరు, నిప్పు, ఎలుకలు ప్రధాన శత్రువులు.

వాటిన్నించి బొమ్మల్ని నిరంతరం కాపాడుకోవాలి. తప్పదు.

నీరు తగిలితే రంగులు వెలిసిపోతాయి.

నిప్పు తగిలితే బొమ్మలు కాలిపోతాయి.

ఎలుకలు బారిన పడితే తోలును కొరికేస్తాయి.

ప్రతిరోజూ బొట్టుపెట్టి ప్రార్థన చేస్తోన్న వినాయకుని వాహనాలైన ఈ మూషిక రాజులకు తమ మీద కరుణ లేదు.

ఎక్కడ కొరికినా బాగుచేసికోవచ్చు.

ముక్కు కొరికితే మాత్రం ఆ బొమ్మ పనికి రాదు.

అదేం మక్కువోగాని ఈ ఎలుక మారాజులు బొమ్మల పెట్టెలో దూరినాయంటే ఖచ్చితంగా ముక్కు దగ్గరే కొరుకుతాయి.

నీరు, నిప్పు, ఎలుకల నించి సమర్థవంతంగా రక్షించుకొనేందుకే జింకతోలు కుట్టిన వెదురు పెట్టెను తయారు చేయించుకొనేది. దానికి పంచెగుడ్డ చుట్టి బొటనవేలిలావు గుడ్డ పేలికల తాడుతో కట్టేది. వీలున్నంతవరకు ఎలుకలకు అందకుండా అటకల మీదో, దూలాలకు వేలాడదీసో దాచేది.
వెలుతురు పైకెత్తి బొమ్మలకు సమాంతరంగా ఉంచగానే బొమ్మల విశ్వరూపం తెరముందున్న జనాలకు కనిపిస్తుంది. మెరుగు ఆముదం రాయటం వలన జిగేల్మని మెరుస్తూ వింతగా ప్రతిఫలిస్తుంటాయి. బొమ్మకు వెన్నెముకలాంటి దబ్బను ఎడమచేత్తో పట్టుకొని, ఈతపుల్లల చివర చిన్న దారానికి అంగుళం పొడవున కట్టిన సన్నటి పుల్లను ప్రతిబొమ్మకు చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన ఏర్పరచిన రంధ్రంలో దూర్చి, హావభావాలకు తగినట్టుగా కుడిచేత్తో ఈతపుల్లల్ని కదిలించటం ద్వారా బొమ్మల చేతులకు చలనం కలిగించటంతో తోలుబొమ్మలు జీవం పోసుకంటాయి. బొమ్మ కదలికలకు అనుగుణంగా తాము సంభాషించటం, సంభాషణకు తగినట్టుగా కాలిగజ్జెలు కదల్చటం, హార్మోనియం, మద్దెల, తాళాల వాయిద్యం, కాలికింది చెక్కల చప్పుడూ వెరసి అద్భుతమైన నటనతో కూడిన దృశ్యం ప్రేక్షకుల కళ్ళముందు ఆవిష్కరించబడుతుంది. మగాళ్ళు పాడుతూ ఉంటే, ఆడాళ్ళు పైరాగాలు ఎత్తుకోవటం, ఒళ్ళంతా చెమటలు కక్కుతూ ఉన్నా – డేరాలోంచి బైటకు రాకుండా ఉండటం …. డేరా ఒక వెలుతురు పోసిన సంగీతపు బుడగలా తెల్లార్లూ రగులుతూనే ఉండటం ….

డేరా పట్టల సందుల్లోంచి లోపలికి తొంగి చూసింది ఓ తల.

అది ముత్రాసు వెంకటేశుడిగా అర్థమై ‘‘నాయినా! జనమంతా పచ్చినారా?’’ అడిగాడు గోవిందరావు.

‘‘వస్తార్లే పెద్దయ్యా!’’

‘‘ఆట మొదలయినాంక లోపలికి రా నాయినా! మీ నాయన గారు తోడు లేకుండా మేమెప్పుడూ ఆటాడింది లేదు. అతగాడు వృద్దుడయి పాయె. నువ్వయినా రా వెంకటేశం!’’ చెప్పాడు. ‘‘మద్దెల గాని, తాళాలు గాని, గజ్జెలు గాని చేతికి తీసుకుంటే బహు పసందుగా వాయించే వాడు.’’

‘‘ఇప్పుడు నన్ను పంపించింది మా నాయనే. మీతోబాటు తెల్లవార్లూ లోపల కూకుంటాడంట …. వస్తానని సెప్పమన్నెడు….’’

‘‘రమ్మను నాయినా! బంగారంగా రమ్మను….’’

వెంకటేశు వెనుదిరిగాడు.

మరి కొంతసేపటికి ముత్రాసు పిచ్చన్నను ఇరువైపుల రెక్కలు పట్టుకొచ్చి డేరాలో కూచోబెట్టారు.

గోవిందరావు పక్కన ఆనందంగా సర్దుక్కూచున్నాడు పిచ్చన్న.

‘‘ఏమోయ్‌ పిచ్చోడా! తాళాలా? …. మద్దెలా? ….’’ గోవిందరావు అడిగాడు.

పిచ్చన్న నవ్వాడు. ‘‘తాలాలే తీసుకుందామని బుద్ధి …. ఎందుకులే .. గజ్జెలు యా సాలు – అప్పుడప్పుడూ పైరాగాలకు గొంతు కలుపుతాలే ….’’

‘‘చుక్కేసుకొని గొంతు కలుపుతావా?.. మల్లేసుకుంటావా?….’’

గట్టిగా నవ్వాడు పిచ్చన్న. చేతులు చాచి గోవిందరావు మోకాళ్ళ వద్ద తాకాడు. ‘‘ఇప్పుడెందుకులే మామా! మీతో బాటే …. రొప్వంత సాల్లే …. ఒక్క సుక్క ….’’

తెరమీద బొమ్మలు అలంకరిస్తున్నారు.

తెరకు పైభాగాన ఓ మూల దిష్టిబొమ్మల్ని ఉంచి బాణాలతో అతికించాడు. ఆ బాణాల్ని యుద్ధ సమయంలో గాని విడదీయరు.

తెరమీద పెద్దవిగా ఉండే విఘ్నేశ్వరుడు, సరస్వతి, కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు వగైరా బొమ్మల్ని అంటించారు.

బైట జనాల్ని గురించి ఎంక్వయిరీ చేస్తూనే ఉన్నాడు గోవిందరావు.

ఓ మాదిరి మంది కన్పించినా ఆట మొదలెడదామని ఆలోచన.

ధనుర్ధారుడైన అర్జునుని బొమ్మ ఆయన మనస్సులో ఏవో జ్ఞాపకాల్ని కెలుకుతున్నాయి. తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ….

అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ గారికి ఓ నడిరాత్రి విచిత్రమైన కలపచ్చిందట. ఎవడో వీరుడు విల్లంబులు చేతబట్టి యుద్ధానికి బయలు దేరుతున్న దృశ్యం …. పురాణ కాలంనాటి వీరుడొకడు ధనుర్ధారుడై వీరావేశంతో యుద్ధరంగంలోకి అడుగుపెడుతోన్న దృశ్యం పదే పదే కనిపించిందట…. తైలవర్ణ చిత్రంలాంటి ఆ దృశ్యం …. సినిమాల్లోలా మనుషుల వేషాలతో కూడినది కాదు. బొమ్మలా కనిపించే వీరుడు …. అతను మహాభారతంలోని అర్జునునిగా ఆయనకు అర్థమైంది. ఉదయం లేవగానే ఆంతరంగికులతో చర్చించాడు. సాయంత్రానికంతా ఓ పండితుడు వచ్చి చెప్పాడుట కలలోని దృశ్యాన్ని కళ్ళముందు వీక్షించాలంటే తోలుబొమ్మలాట సరైన పద్ధత’ని. వెంటనే ఆ కళను ప్రదర్శించే వాళ్ళ కోసం దేశ వ్యాప్తంగా అన్వేషించటం …. కడప జిల్లా పార్లమెంటు సభ్యునిద్వారా బద్వేలు తాలూకాలోని పోరుమామిళ్ళ దగ్గరున్న సిద్ధవరం అగ్రహారంలోని తమను గురించి తెలిసికోవటం, తమను ఢిల్లీకి పిలిపించి ఆటాడించి నెహ్రూగారు స్వయంగా వీక్షించి అభినందనలు తెలుపటం …. తర్వాత్తర్వాత అగ్రహారం నుంచి పోరుమామిళ్ళ టౌను శివార్లలో స్థిరపడి రంగసముద్రం కళాకారులుగా గుర్తింపు పొందిన ఈ సంగతిని అందరికీ ఘనంగా చెప్పుకొని మురిసిపోవటం ….

నాలుగేండ్ల కిందట హైదరాబాదు రవీంద్ర భారతిలో తోలుబొమ్మల కళాకారుల సెమినార్‌ జరిగితే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఏమేమో చెప్పారు. ఏదేదో చేస్తామన్నారు. అరచేతిలో స్వర్గాన్ని చూపించారు. కళాకారులు ఎవరి ఊర్లకు వాళ్ళు తిరిగొచ్చినారు గాని ఈ నాలుగేళ్ళలో వాళ్ళు చెప్పిన మాటలు తర్వాత ఎక్కడా విన్పించలేదు.

నెహ్రూ మెచ్చుకోవచ్చు. ఎంతటి వారినయినా మెప్పించే కళ బొమ్మలాటకు ఉండొచ్చు. అంతమాత్రాన – టీవీల మోజులో అన్ని కళలనూ మరచిపోయిన జనాలను ఇక్కడికి రప్పించటం ఈ బొమ్మలకు సాధ్యపడేట్టు లేదు.

గట్టిగా నిట్టూర్చాడు గోవిందరావు.

స్టేజి లోపల దూరితే తెల్లార్లూ బైటకొచ్చే అలవాటులేదు తమకు.

ఇప్పుడేముంది? – లోగడయితే చంటి పిల్లలకు ఉయ్యాల కూడా లోపలే కట్టేవారు. యుద్ధ సీనులో తాము చేసే రభసకు ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఏడ్చేవాళ్ళు పిల్లలు.

సన్నగా హార్మోనియం సవరించుకొన్నాడు వెంకట్రావు.

మెల్లగా తబలా మీద దరువేయసాగాడు రామారావు.

సుతారంగా తాళాల చప్పుడు మొదలెట్టింది కమలాబాయి.

తబలా సవ్వడి వినగానే గజ్జల్ని తాటించసాగాడు ముత్రాసు పిచ్చన్న.

సుబ్బారావు మాత్రం పుస్తకం చేతబట్టి పేజీలే తిరగేస్తున్నాడు.

వాళ్ళంతా శాశ్వత వాయిద్య కారులేం కాదు. కొద్దిసేపుంటే వాయిద్య పరికరాలు చేతులు మారుతుంటాయి.

జనాలు కూడుకొనేదాకా ఏదొక చప్పుడు చేస్తూ ఉండాలి.

తిక్కలకొండికి ఏమీ పాలుపోలేదు.

ఖాళీగా ఉండేది తను, వనజ, ముసలాయన …. అంతే.

ఆయనంటే వయసై పోయినోడు. వనజ ఆడపిల్ల …. వాళ్ళతో తన్ను పోల్చుకొంటే ఎట్లా? ఆలోచించసాగాడు ‘ఏం చేయాలా’ అని

ఈలోపు బైట్నించి వెంకటేశు వచ్చాడు కడవతో.

తనూ కొంత తావు కల్పించుకని ఘటం వాయించసాగాడు.

‘‘భేష్‌ …. బాగుంది …. భలే భలే …. తండ్రికి మించిన తనయునివి.’’

గోవిందరావు పొగడ్తలు.

ఇక లాభం లేదనుకన్నాడు తిక్కలకొండి.

తనూ ఏదొక వాయిద్యాన్ని అందుకోవాలి.

అటు ఇటు చూస్తే – రేకు డబ్బా కన్పించింది.

యుద్ధ సమయంలో వాయించేందుకు తెచ్చిన డబ్బా!

చిన్న కర్రపుల్ల అందుకని దానిమీద వాయించటం మొదలెట్టాడు.

జనాల్ని దేవాలయం వద్దకు ఆకర్షించేందుకు చేసే చప్పుళ్ళే కాబట్టి తిక్కలకొండి వాయిద్యాన్ని ఎవరూ ఏమంతగా పట్టించుకోలేదు.

ఇప్పుడు అన్ని వాయిద్యాల్ని రేకు డబ్బా సంగీతం తనలో ఇముడ్చుకుంది.

‘‘మామా! నీ కొడుకుండాల్నే! …. ఏంజేస్చాండు? సదివించినావా?’’ పిచ్చన్న అడిగాడు కేకేసినట్టుగా.

కొద్ది క్షణాల మౌనం తర్వాత చెప్పాడు గోవిందరావు ‘‘ఆ …. పది దాకా చదివిండు..’’

తిక్కలకొండి సంగీతపు హోరులో ఆయన మాటలు పిచ్చన్న చెవిదాకా చేరలేదు.

మరోసారి చెప్పినా అదే ఫలితం.

‘‘నాయినా సుబ్బారావూ!’’ సైగచేసి పిల్చాడు. ‘‘ఈ బాధ తప్పించు ….’’ తిక్కలకొండి కేసి చూపాడు.

ఎవరికేసి చూడకుండా కర్రతో డబ్బామీద వీరబాదుడు బాదే మేనల్లుని గమనించాడు సుబ్బారావు.

‘‘అబ్బీ!’’ అన్నాడు. ‘‘కొండల్రావూ!’’ అంటూ తట్టి పిల్చాడు. ‘‘ఇట్రా’’ అంటూ డేరా పట్ట దాకా తీసికెళ్ళి ‘‘మనమిక్కడ ఆటాడ్తాంటే మనుసులంతా ఇండ్లకాన్నే కూకోనుండారబ్బీ!’’ అన్నాడు.

‘‘ఉండనీ .. మనకేమీ?’’

‘‘ఉంటే …. రేప్పొద్దున మనకు లెక్కెవురిస్తారబ్బీ!’’

‘‘అప్‌ గదూ …. దీనెక్క …. నిజమే..’’

‘‘అందుకే …. వాల్లందర్నీ ఈడికి తోలక రావాల్నా పద్దా?’’

‘‘తోలక రాకుంటే ఎట్టా?’’

‘‘మనోల్లల్లో హుషారైన మొగోనివి నువ్వేబ్బీ! ఈ పని నీతోనే అయితాది ….’’ ఈ రేకు డబ్బా తీసుకొని కొట్టుకొంటా ఈధులన్నీ తిరిగినావనుకో …. అందరూ పరిగెత్తుకొని వస్తారు ….’’

ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు తిక్కలకొండి.

రేకు డబ్బా కర్రపుల్లా తీసికొని గుడారంలోంచి బైటబడ్డాడు.

నాలుగుసార్లు డమడమ మోగించేసరికి నలుగురు పిల్లలు అతన్ని చుట్టుకొన్నారు. వాళ్ళతో కలిసి వీధులపైకి వెళ్ళాడు.

తిక్కలకొండి బాధ తప్పటం అందరికీ కొంత తెరపిగానే అన్పించింది.

కిరీటి చదువును గురించి మరోసారి పిచ్చన్న చెవి వద్ద అరిచాడు గోవిందరావు. తర్వాత మరింకేదో చెబుదామనుకొన్నాడు గాని మనస్సు ఎటో ఈడ్చుకు పోతోంది.

కిరీటి లాగే తమ ఇళ్ళల్లో చాలామంది పిల్లలు చదువుకొన్నారు.

ఉద్యోగాలు సద్యోగాలు లేక వీధులెంట బలాదూరు తిరుగుతున్నారు.

తమది ఏకులమో ఇంతదాకా తమకే అర్థం కావటం లేదు.

మహారాష్ట్ర నించి వలస వచ్చారు కాబట్టి మరాఠీలు అంటారు. మరాటి కులంగా పిలుస్తారు. అగ్రకులాల్లోకే చేర్చారు. తమను ‘ఆరెకాపు’లని కూడా అంటారు. ఏమని పిల్చినా అగ్రకులాల గాటనే కట్టారు. ఊరూరా తిరిగి యాచన మీద బతికే తాము, స్థిరాస్తుల్లేకుండా బొమ్మలనే నమ్ముకొన్న తాము, బతకలేక ఎక్కన్నించో వలస వచ్చిన తాము అగ్రకులమట ….

తక్కువ కులంగా రాయించుకొనేందుకు అప్పటి తమ పూర్వీకులకు అడ్డొచ్చిన అహం . ఇప్పటి యువతరానికి బతుకుదెరువు లేకుండా చేసింది.

సెంటు పొలం లేదు.

వంశ పారంపర్యంగా సంక్రమించిన ఈ వృత్తి బతికేందుకు పనికిరాదు.

ప్రభుత్వం కట్టించి ఇచ్చిన బిల్డింగులు ఉన్నాయి.

అప్పటి సమితి ప్రెసిడెంటు బాలిరెడ్డి హయాంలో ఇచ్చిన ఇల్లు.

తమ వాళ్ళెవరికీ పొలం సంపాదించాలనే కోరికలేదు. ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే – తమ జీవితానికీ వ్యవసాయానికీ కుదరదు కాబట్టి.

ఊరూరా తిరిగే జీవితం.

ఆరు నెలలపాటు ఇంటినీ, ఊరినీ విడిచి వెళ్ళే జీవితం.

బతుకు దెరువుకు ఇబ్బంది లేని వృత్తి.

పూర్వీకులు అంతో ఇంతో డబ్బు సంపాదించే వెళ్ళారు.

ఆ డబ్బు ఎప్పుడో కరగిపోయింది.

ఈ తరం బతకడానికే ఇబ్బంది పడుతున్నారు.

భూములు సంపాదించలేని తమ ముందుతరాన్ని బండబూతులు ఆడుతున్నారు.

ఇంటింటా టీవీలు వచ్చింతర్వాత బొమ్మలాట కళ దాదాపు అంతరించే దశకు చేరుకొంది.

టీవీ పెట్టెలో బొమ్మలు మాట్లాడతాయి. పాటలు పాడతాయి. ఆటలాడతాయి. ఇప్పుడు ప్రతి ఇంటా ఆ బొమ్మలాటలే …. చివరకు తమ ఇళ్ళల్లో కూడా ….

ఈ తరం యువకులకు బొమ్మలాట ఉపయోగం లేని కళగా కన్పిస్తోంది. చాలామందికి రాగాలు రావు. పైరాగాలు తీసేందుకు కూడా నోరు పెగలదు.

బతికేందుకు ఏవేవో పనుల్జేస్తున్నారు.

ప్లాస్టిక్‌ బిందెల్ని సైకిల్‌కు కట్టుకొని పల్లెల్లో అమ్ముకొంటూ పొట్ట పోసికొంటున్నారు.

వెదురు బుట్టల్ని మేదర్ల వద్ద కొని మారుబేరంకు విక్రయిస్తున్నారు.

ఐసు డబ్బా, వేయించిన విత్తనాలూ, అరటి పళ్ళ బళ్ళు …. ఒకటేమిటి?.. బతికేందుకు ఎన్నెన్నో అవస్థలు.

ఆడాళ్ళయితే దగ్గరి పొలాల్లోకి కూలి పనులకు వెళుతున్నారు.