తోలుబొమ్మలాట – 02వ భాగం

తొలిరోజు

తోపుడి బండి ఒకటి తార్రోడ్డుమీద జమాయించి కదులుతూ ఉంది.

‘తిక్కలకండి’ అనబడే వనపర్తి కొండలరావు దాన్ని తోస్తూ పయనిస్తున్నాడు.

వెనగ్గా ఏవేవో మాటలు చెబుతూ పయనిస్తున్నాడు అంబోరు సుబ్బారావు.

బండిమీద ఈ చివరినించి ఆ చివరిదాకా తోలుబొమ్మల పెట్టె పండబెట్టి ఉంది.

రోడ్డుమీద అడపాదడపా బస్సులు ట్రాక్టర్ల లాంటివి ఎదురవుతున్నాయి.

ఉదయమే సద్దన్నం తాగి బైల్దేరారు వాళ్ళు.

దాదాపు పది కిలోమీటర్లు తార్రోడ్డుమీద ప్రయాణించి, ఆ పైన బండ్లబాట పట్టాలి. మూడు కిలోమీటర్ల దూరం మట్టిరోడ్డు మీద నడిస్తేగాని ‘చిలకల పాడు’ గ్రామం రాదు. ఎందుకోమరి ప్రత్యేకించి ఆ ఊరినే ఎంపిక చేశాడు ముసలాయన.

బొమ్మల పెట్టెను బస్సులో వేసుకెళ్ళగలిగినా ఆ మూడు కిలోమీటర్లూ అవస్థపడాల్సిందే. పెట్టెను భుజాన మోసుకెళ్ళటమనేది సాధ్యం కాని విషయం.

గతంలో ఒంటెద్దు బండ్లు ఉండేవి.

ఎదురు తడికను వంచి గుడారంలా కప్పిన గూడుబండ్లు.

తోలుబొమ్మల పెట్టె వగైరా ఆటకు కావలసిన సామానంతా బండిలో వుంచి, ముసలీ ముతకా అందులోనే కూచుని పల్లెనించి పల్లెకు ప్రయాణిస్తూండే వాళ్ళు. వంట సామాగ్రితో సహా అన్నీ బండ్లోనే అమర్చబడి ఉండేవి. బండి ఒక సంచార గృహంలా ఉండేది.

ఆటాడే ప్రతి గుంపుకూ స్వంతంగా బండి, ఒంటెద్దు ఉండటం తప్పనిసరి.

ఆటాడటంలో తనకు మంచి పేరే ఉండేది. గాత్రంలో, మాటచాతుర్యంలో తనెంతో ఆహ్లాదంగా బొమ్మల్ని ఆడించే వాడు. ఆట పూర్తయ్యేసరికి నిద్రలేమివల్ల కలిగే నీరసం కంటే జనాల్ని మెప్పించామనే తృప్తి ఎక్కువగా ఉండేది తనలో. మామతో కలిసి ఊరు వదలితే ఆరు నెలలపాటు గ్రామాలన్నీ చుడుతూ కన్నడ దేశందాకా వెళ్ళి వచ్చేవాళ్ళు. మంచిగొంతుతో, మాట పొందికతో మామకు ధీటుగా ఆటను రక్తి కట్టించే తనంటే ఆయనెంతో అభిమానించే వాడు.

తన పెళ్ళయిన తర్వాతే ఆట మందగించింది.

ఆటకు పల్లెలు దూరమయ్యాయి.

క్రమేణా ఆటకూడా తమకు దూరం కాజొచ్చింది.

బొమ్మలకు విశ్రాంతి మిగిలింది. విశ్రాంతి నిద్రగా మారింది. అటకెక్కి దీర్ఘనిద్రకు పూనుకున్నాయి …. సుదీర్ఘమైన నిద్ర …. తమను విస్మరించేంతటి గాఢనిద్ర.

ఏదో పాట చెవుల సోకి ఆలోచనల్నించి బైట పడ్డాడు.

తిక్కలకండి పాడుతున్నాడు.

పాటలో లీనమై బండిని నెడుతున్నాడు.

కీచుగొంతు, అసంబద్ధమైన విరుపులతో కూడిన రాగం …. చెవుల్లో పలుగురాళ్ళు పగలగొట్టినట్టుగా భావన.

అడ్డరోడ్డు దాకా ఈ తాకిడి భరించాల్సిందే.

అక్కడికి కిలోమీటరు దూరంలో తమకోసం నిరీక్షిస్తూ ఉంటామని చెప్పాడు మామ. బస్సులో వెళ్ళి దిగుతారుట.

ఈ పూట సద్దికూళ్ళ బియ్యపు నూకకోసం, ఆట సరంజామా కోసం, చార్జీల కోసం డబ్బు సంపాదించే సరికి తలప్రాణం తోకకొచ్చింది. బొమ్మల బేరగాడు మునిరావును కాళ్ళా వేళ్ళా పడితేగాని పని జరగలేదు.

మునిరావు తమను ఎన్నోసార్లు అడిగాడు బొమ్మల్ని బేరం పెట్టమని.

ఇప్పుడు – ఆటాడేందుకు వెళుతున్నామని ఎగతాళిగా నవ్వాడు.

అతనేగాదు – తోటి బొమ్మలాటగాళ్ళంతా వింతగా చూశారు. తోపుడు బండిమీద బొమ్మల పెట్టెను ఉంచి తోసుకొస్తూవుంటే జాలిగా చూశారు.

వాళ్ళ చూపులు తన్నింకా గుచ్చుతూనే ఉన్నాయి.

తనను సైతం తిక్కలకండితో కలిపి ఒకేగాటన కట్టేసి ఎకసక్కెంగా చూడటం మర్మాల్లో భేదిస్తూ ఉంది.

బండిదాకా వచ్చి తమకేసి అదోలా చూశాడు కిరీటి.

దౌర్జన్యం చేసి బొమ్మలు లాక్కెళతాడేమోనని మనస్సులో ఓ వైపు పీకుతూనే ఉన్నా – అతనాపని చెయ్యలేదు. తండ్రిమీద గౌరవం ఇంకా తగ్గలేదు కాబోలు. అతని భార్య మాత్రం శోకాలు తీస్తూ శాపాలు పెట్టటం అవతలి వీధినించి సన్నగా విన్పించింది.

ఎంత తేడా!

ఆనాడు మామతో కలసి ఒంటెద్దు బండి కటుకొని పల్లెలకు ప్రయాణమవుతోంటే –

శకునం చూపుగా వచ్చే ముత్తయిదువలూ –

నుదుట బొట్టుబెట్టి సాగనంపే పునిస్త్రీలూ –

నిజంగా.. పల్లెలపైకి సాంస్కృతిక దండయాత్రకు వెళుతున్నట్లే ఉండేది.

ఆరునెలల పాటు పల్లెజనాల హృదయాల్ని జయించుకు రావటమంటే మాటలా? – నిజంగా అది దండయాత్రే.

ఇప్పుడు కూడా తన వెంట తన మేనల్లుడే వస్తున్నాడు.

తేడా అల్లా వీడు తిక్కలోడు.

వీడిలాగే తమ పని కూడా తిక్కల పనిలాగే జనాలకు కన్పించటం బాధాకారంగా ఉంది.

‘‘మామో! .. నేనింటికాన్నే సెప్పినా. బువ్వలేకి సియ్యల్దెచ్చుకోండి – సేపల్దెచ్చుకోండి. నాకు మాత్రం చింతపండూరిమిండి గావాల. అది లేకుంటే నియ్యక్క ఒక్కపూట కూడా మీకాడుండను.. ఆ..’’ బండి తోస్తున్న వాడల్లా వెనుదిరిగి చెప్పాడు కొండల్రావు.

సుబ్బారావుకు నవ్వొచ్చింది.

‘‘మారాజు.. సియ్యా సేపా అడిగింటే చిక్కచ్చిపడు. ఉండేదే అడిగిండు’ అనుకొన్నాడు ‘‘అట్లనే పా నాయినా!’’ చెప్పాడు.

కొండల్రావు తిరిగి సంతోషంగా గొంతెత్తాడు.

‘‘ఆళ్ళగడ్డ సంతలోన అర్దసేరు ఉల్లి పొట్టు

రొమ్ము దగలకుండ ఎత్తినాను.

కట్టమీద రెండు గుడ్డి కొంగల జూసి

దొంగలనుకొని నీళ్ళ దూంకినాను.

జాలాడి గుంతలో డిడుగ్గప్పల జూసి

గజ్జెల కాఠారు దూసి పొడిచినాను.

ఉడికిన పొట్ట పేగులను కాలికిందేసి

నిగిడి పెరికి నియ్యక్క .. నేను తుంచినాను.’’

వింటోన్న సుబ్బారావుకు నప్వచ్చింది.

కేతిగానికో, అల్లాటప్పా దానికో ఉపయోగించుకోవచ్చు ఆ పదాన్ని.

మెల్లగా అతని మనస్సును బొమ్మలాటల గురించిన ఆలోచనలు ముసురుకున్నాయి.

బొమ్మలు తెరకెక్కేసరికి ద్విపదలు వాటికై అవే నోట్లోంచి తన్నుకు రావాలి. తమ ప్రతిమాటా ద్విపద రూపాన్ని సంతరించుకోవాలి. బొమ్మల ముందు నిల్చుంటే ద్విపద రూపంలోనే మాట్లాడగలగాలి. శైలిమీద అంతటి ఆధిపత్యం ఉంటేగాని బొమ్మలాట ఆడేందుకు వీలుగాదు. అలాగని బొమ్మలాట గాళ్ళంతా అంతటి నిష్ణాతులై ఉంటారని గాదు. లోపాల్లేకుండా సంప్రదాయ బద్ధంగా ఆడాలంటే ఆ నైపుణ్యం తప్పదు మరి.

ఒకప్పుడు తను బొమ్మల్ని ఆడించటంలో మొనగాడే.

కానీ .. ఇప్పుడా గాత్రం, మాట చాతుర్యం గుర్తుకొస్తాయో లేదోనని అనుమానం …. రసాభాస అవుతుందేమోనని భయం.

మరోభయం కూడా తనను వెంటాడుతోంది.

గ్రామంలో పురాణం తెలిసిన ముసలాళ్ళుంటారు.

తమను చూడగానే పంచలోకి పిల్చి కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణాన్ని చేతబెట్టి చదవమంటారు. రాగయుక్తంగా చదవటమనేది తమకు వెన్నతో బెట్టిన విద్యే. అంతటితో ఆగితే సరి. అర్థం చెప్పమంటారు. పదాల్ని విడదీసి సరైన తాత్పర్యం చెప్పటంలోనే చిక్కొచ్చిపడుతుంది. ఒక్క పద్యంతోనే తమ సత్తా అంచనా వేయగలరు వాళ్ళు.

బమ్మలాట గాళ్ళందరికీ అంతటి అర్థపరిజ్ఞానం ఉండదు.

అర్థజ్ఞానం ఉన్న వాళ్ళను వాళ్ళు వదలరు.

మరీ ముఖ్యంగా – గోవిందరావు మామను చూస్తే వాళ్ళకెంతో కుశాల. పురాణం చదివి అర్థం చెప్పటంలో ఆయన నిష్ణాతుడు కాబట్టి.

ఇప్పుడా అర్థజ్ఞానం జ్ఞాపకంగా నైనా మిగిలుందో లేదో?

ఎన్నేళ్ళాయిందో గద – గ్రంథం చేతబట్టక.

ఆటాడేందుకు వెళ్ళాలని తీర్మానించిన తర్వాత ఈ నాలుగు రోజులూ బొమ్మలాట కథను పునశ్చరణ చేసికొనేందుకే సమయం చాల్లేదు.

బండి దొబ్బుతూ పాటకు అనుగుణంగా అడుగులు కూడా తొక్కుతున్నాడు తిక్కలకండి.

సుబ్బారావుకు కూడా పాడాలనిపించింది.

బొమ్మలాట కథను మననం చేసుకొంటూ ద్విపదల్ని గొంతెత్తాడు.

తార్రోడ్డంతా మామ అల్లుళ్ళ గొంతుకల రాపిళ్ళతో నల్లగా జారిపోతూ ఉంది. ఎదురయ్యే బస్సులూ, మోటారు బైకుల రొదలు కూడా వాళ్ళ గానంలో కరగిపోతున్నాయి.

క్రమ క్రమంగా తన పంథా మార్చుకన్నాడు సుబ్బారావు.

కనిపించిన దృశ్యాలన్నిట్నీ ద్విపద రూపంలోకి మార్చి పాడేందుకు ప్రయత్నించసాగాడు.

గుంపించి కాసే ఎండ వేడిమిని కూడా వాళ్ళు మరిచారు.

అక్కడక్కడా రోడ్డు పక్కల బోరుబావుల కింద సాగు చేసిన పొద్దు తిరుగుడు పైరు వాడుమొహం పట్టిన పూలతో వాళ్ళకేసి వింతగా చూస్తోంది.

మామతో పోటీపడి మరీ పాడుతున్నాడు తిక్కలకండి.

ఎట్టి పరిస్థితుల్లోనూ మామముందు ఓడిపోదల్చుకోలేదు.

వనజాబాయి అతని కళ్ళముందు మెదలుతూ ఉంది.

ఆమె రూపం అతనికి మరింత ఉత్సాహాన్ని రగిలించి గొంతులోంచి ఎన్నెన్నో పాటలు తన్నుకొచ్చేలా చేస్తోంది.

వనజాబాయి మీద మనస్సు పడ్డాడు తిక్కలకండి అనే వనపర్తి కొండలరావు. అతని దృష్టితో ఈ లోకాన వనజాబాయి ఒక్కతే ఆడపిల్ల. తనకు తెలిసి ఆమె కూడా ఏడాది యివతలే ఆడపిల్ల అయ్యింది. ఏడాదికి ముందు కేవలం మామ కూతురుగా ఉన్న ఆమెను ఇరుగు పొరుగులు విచిత్రంగా ఆడపిల్లను చేశారు. ముఖ్యంగా రత్నాబాయి పెద్దమ్మా, లక్షుంబాయి జేజీ తన పెళ్ళి విషయంగా తెగబాధపడి, బెండకాయలా ముదిరి పోతున్నాడని ఆవేదన చెంది ఆమెను ఆడపిల్లను చేశారు. లేకుంటే వనజాబాయి ఆడపిల్ల అయ్యుండేది కాదు. ఈ మరాఠా వీరుడు ఆమె మీద మనస్సు పడేవాడు కాదు.

మామకేసి ఓసారి ఎగాదిగా చూశాడు కొండల్రావు.

‘ఈయప్పే తన్నెందుకో చులకనగా చూస్తున్నాడు. ఎవరైనా తన పెళ్ళి విషయం ఎత్తితే తిక్కలోడి పంచాయితీగా కొట్టిపారేస్తున్నాడు.’

ఎవరెట్లా అనుకంటేనేం? – వనజాబాయి తన్ను చూసి నవ్వుతుంది.

‘బావా!’ అని నోరారా పిలుస్తుంది. చాలు .. చాలు .. ఆ పిల్లకు తను దగ్గరయితే మామేం చేయగలడు? ఆ పిల్ల ఆడపిల్ల అయిన సంగతి ఈయప్ప తెలిసికొనేలోపు తనెగరేసుకొని పోతే సరి!

మనస్సులో హుషారు పెరిగింది అతనికి.

ఎండ వేడిమి మాడును చుర్రుమనిపిస్తూ – పొద్దు నడిమింటికి ఎక్కినా, తార్రోడ్డు మీద దూరంగా నీటి తడిని భ్రమింపజేస్తూ ఎండ గుర్రాలు పరుగెడుతోన్నా లెక్కజేయకుండా గొంతెత్తి పాటలు పాడుతూ బండిని నెట్టసాగాడు.

మధ్యాహ్నానికంతా చిలకపాడు అడ్డరోడ్డుకు చేరుకున్నారు.

రోడ్డు పక్కన ఇప్పుడిప్పుడే ఓ చెట్టును బతికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జువ్వికమ్మను నాటి చుట్టూ దడి కట్టివున్నారు.

బొమ్మల పెట్టెను మోస్తోన్న బండి మట్టిబాటపైకి మళ్ళింది.

బాటమీద కనుచూపుమేరా నిక్కి చూశాడు సుబ్బారావు.

మామ చెప్పిన విడిది ఆనవాళ్ళ కోసం కళ్ళు విచ్చుకొని చూశాడు.

చింతవనమూ, దిగుడుబావీ, పైరుపచ్చలతో కలకలలాడే పొలమూ, వంకగట్టూ, దగ్గరికెళితేగాని కన్పించని ఆ పల్లపు నేలను గురించి కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పాడు ఆయన.

చింత చెట్ల ఆనవాళ్ళయినా కన్పించాలి గదా!

తిక్కలకొండితో కలిసి తోపుడు బండిని దొబ్బుకొంటూ నడవసాగాడు.

బాటకు దూరంగా అక్కడక్కడా బీడు పొలాల్లో గొర్రెలు మేస్తున్నాయి.

చిన్న చిన్న కంపచెట్ల నీడన కర్ర వూతేసుకొని గొంతుక్కూచుని ఉన్నారు గొర్రెల కాపరులు.

రోడ్డుకు అటు ఇటు ఎగుడు దిగుడుల వంకజేడెలు మొదలయ్యాయి.

వంకగట్టు మీద ఆగి తూర్పుదిశకేసి చూశాడు సుబ్బారావు.

ఏదీ చింతతోపు? ఎక్కడ దిగుడు బావి?

అతనికి ఆశ్చర్యంగా ఉంది.

ఇరవై యేళ్ళ కిందటెప్పుడో చిలకపాడుకచ్చాడు తను.

రవ్వంత రవ్వంత తనకు గుర్తే. దారితప్ప లేదు.

మరి చింతవనం ఎక్కడ?

దారికి పడమటి వైపు కూడా చూశాడు.

వంక పూర్తిగా ఎండిపోయి గుండ్రాళ్ళతో నిండివుంది.

వంకదరులన్నీ సీమతుమ్మకంప పొదలతో కిర్రుమంటూ భయపెడుతున్నాయి.

చింతచెట్ల జాడమాత్రం చిక్కలేదు.

కొంతసేపు అటు ఇటు నిక్కిచూసి తర్వాత గొంతెత్తాడు ‘‘మామా! ఓ మామా! …. మామోప్‌! ….’’ అంటూ.

‘‘అబ్బోప్‌ …. ఓ గోయిందబ్బా!’’ కొండల్రావు కూడా కేకేశాడు.

రెండు పిలుపుల అనంతరం రోడ్డుకు తూర్పువైపు వంకగట్టున కంపచెట్ల చాటున్నించి సమాధానం వచ్చింది. ఆ వెనకే వెంకట్రావు బైటకొచ్చి వాళ్ళకేసి చేయూపి ‘‘ఓబ్బీ! ఇట్రాండి …. రండి …. రాండ్రో!’’ అంటూ పిల్చాడు.

బండిని అటువైపు మళ్ళించారు.

ఎగుడు దిగుడుల్లో మెల్లగా తోసుకొంటూ వాళ్ళ వద్దకు చేరుకున్నారు.

దట్టంగా పెరిగిన కంపచెట్ల నీడలో కూచుని వున్నారు అందరూ.

గోవిందరావు మాత్రం మొద్దు చింతమాని మొదట్లో వేరుమీద తలాన్చి పడుకొని ఉన్నాడు.

‘‘సింత వనమంటివీ. దిగుడు బావి అంటివీ …. తోటలంటివీ …. ఏంది మామా? ఏ ఊరిగుర్తులో ఈ ఊరికి సెప్పినట్టుండావు గదూ!’’ వాళ్ళ వద్ద కూచుంటూ అన్నాడు సుబ్బారావు.

‘‘నేనట్లా మర్చిపోయే మనిసిని కాదులేబ్బీ!’’ చెప్పాడు గోవిందరావు.

‘‘మరి …. చెట్లు ….?’’

‘‘ఇదే – ఈ తావులోనే చింతవనమున్నెది …. ఇదుగో .. నేను తలాన్చిన మొద్దుమాను ఆ వనంలోదే..

మానుకేసి పైకి కిందకు చూశాడు సుబ్బారావు.

తుమ్మచెట్ల చాటున వక్కరంగు చింతమొద్దు. మొండి చేతుల్లాంటి రెండు కొమ్మల చివర అక్కడక్కడా చివురులు తొడిగిన రెమ్మలు …. మొద్దులో ఇంకా కొనప్రాణాలు ఉన్నాయనేందుకు గుర్తుగా ఆ నాలుగు పచ్చని ఆకులు.

‘‘అదుగో …. ఆ లోతు గుంతే దిగుడు బావి .. నారుబోసినట్టు తుమ్మచెట్లు పెరిగున్న ఆ బాడవ నేలంతా తోటలే….’’

ఆశ్చర్యంతో సుబ్బారావు కళ్ళు విప్పారాయి.

‘‘కరువుల్నాయినా! పాపిస్టి కరువులు …. అంతలావు చెట్లనూ .. తరాలనాటి చింతచెట్లను కూడా ఎండబెట్టినాయంట నాయినా కరువులు …. బావులు వంకలు ఎప్పుడో ఎండిపోయినాయి. తోటలు బీల్లు కమ్మంటే ఎందుక్కావూ! నాలుగైదొందల అడుగుల లోతుదాకా భూమిలోకి బొక్కలేసి మోటార్లు దించి నీల్లుతోడి నేలను తడిపినోడే ఇప్పుడు రైతు. పైన మొబ్బుల్ని నమ్ముకున్నాడూ, కింద వంకలు వాగులు చెరువులు దొరువుల నమ్ముకున్నాడూ రైతుగాదు …. అదుగో ఆ పక్క ఒక రైతున్నాడు సూడు ….’’

తలెత్తి అటుకేసి చూశాడు సుబ్బారావు.

వంకకు అవతలి గట్టున తుమ్మకంప పొదల మాటున ఎకరో, అర్దెకరో పైరు కన్పిస్తూ ఉంది.

పొద్దు తిరుగుడు పైరులాగే ఉంది.

కంపచెట్ల మద్యన బిక్కు బిక్కుమంటూ ఆ కొద్దిపాటి పొలంలోని పైరూ …. దాన్ని కాపాడుతూ మొండి మానవుడు రైతూ …. అతను ఏ మాత్రం ఏమారినా చుట్టుముట్టి పైరును తమ ఒళ్ళోకి తీసికొనేందుకు పొంచివున్న సీమతుమ్మ పొదలూ ….

అన్ని మొక్కలకూ కరపచ్చింది గాని ఈ కంపకు కరవురాలేదు.

రైతును అడిగి బిందెనీళ్ళు తెచ్చారుట.

దిగుడు బావిలోని వడగళ్ళలాంటి నీళ్ళు తాగాలని ఆశపడ్డాడు పాపం షిండే గోవిందరావు. చివరకు ప్లాస్టిక్‌ బిందెలోని పిల్లి వుచ్చలాంటి వెచ్చటి నీళ్ళతో గొంతు తడుపుకోవలసి వచ్చింది.

సద్దికూళ్లు తిన్న తర్వాత కొంతసేపు చెట్ల కింద నడుం వాల్చారు గుంపంతా.

ప్రకృతిని రవ్వంత చల్లబరచుకొన్న పిదప తిరిగి ప్రయాణమయ్యారు.

మూటముల్లె సర్దుకని బిందెను రైతుకిచ్చి వచ్చి తోపుడుబండిని సమీపించేసరికి కొండలరావు కన్పించలేదు.

అటు ఇటు పారజూశారు.

కేకలేసి పిల్చారు.

నలుగురూ నాలుగువైపుల కంపపొదల సందుల్లో వెదకే సరికి ఓ పొదలో పంది గురకలా విన్పించి గుండె దిటవు చేసికని లోపలికి దూరిన వెంకట్రావుకు తిక్కలకొండి కన్పించేసరికి పాదాలు పట్టుకని బైటకు ఈడ్చుకొచ్చాడు.

‘‘దీనెక్క … పచ్చడి బో రుసిగా వుండె. కడుపు నిండా తినేతలికి కంటినిండా నిద్దరొచ్చె ’’ బండి వద్దకు చేరుకన్నాడు అతను.

ఆ జీవిని వొడిసి పట్టుకొచ్చిన వెంకట్రావు అగచాట్లు అందరికీ నవ్వు తెప్పించాయి.

గుంపంతా కదిలి చెట్ల చాటున్నించి బైటబడి రోడ్టెక్కారు.

వంకదాటి, జేడెలు ఎక్కిదిగి మిట్టపైకి చేరుకొనే సరికి దూరంగా ఊరు కన్పించింది.

నుదుటికి చేయడ్డుంచి ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూశాడు గోవిందరావు.

అది ఊరుగా, చిలుకలపాడుగా స్పష్టమయ్యేసరికి ఆయన గుండెల్లో అవ్యక్త భావన ఏదో ఒకటి జొరబడింది.

చేతిలోని వంకీ కర్ర బిగుసుకొంది.

చేయి అప్రయత్నంగానే మీసాల్ని తడివింది.

తన బీదరికానికీ, తన ఆకలికీ, తన నిస్సహాయతకూ అతీతమైన భావన ఒకటి హృదయంలోకి జొరబడింది.

పాతకాలం నాటి బొమ్మలాట కళాకారుల ఆత్మగౌరవాలూ, అభిమాన సంపదలూ, పొందికైన మాటలూ, అపశబ్దాలు దొర్లని బాషా, ఈ రెండింటి కలయిక వల్లా కలిగిన వృత్తికి అందాన్ని ఆపాదించే కొద్దిపాటి అహంభావ సంపదా – మనస్సు లోపలి పొరల్నుంచి బైటకు తన్నుకొచ్చేందుకు ప్రయత్నించాయి. తమను గౌరవించి తాంబూళాలిచ్చే రెడ్డిగారి పెద్దరికాలూ, గ్రామ కట్టుబడుల వినయాలూ, పురాణ గాధల పట్ల చెవికోసికొనే గ్రామస్తుల ఉత్సాహాలూ కళ్ళముందు కదలాడాయి. కొంతసేపు ఎదలనిండా ఊహా ప్రపంచాలు. మనస్సులో సన్నపాటి ఉద్వేగంతో కూడిన స్పందనా వలయాలు రగులుతూ ….

బొమ్మలాట ఆడే అవకాశం లభిస్తుందో లేదోననే శంక.

లభించినా తాము పద్ధతిగా ఆడి గ్రామస్తుల్ని మెప్పించగలరో లేదోననే అనుమానం.

తోలుబబొమ్మల్ని చేతబట్టక ఎన్నో ఏళ్ళయింది గదా!

గొంతెత్తి పాడక దశాబ్దాలు గడిచింది గదా!

బొమ్మలాటను మించిన వినోద ప్రక్రియ తెలీని పూర్వకాలం కాదుగదా ఇది! సినిమాలొచ్చాయి. టీవీలొచ్చాయి. టీవీలోని సజీవమైన బొమ్మల్ని చూసే కళ్ళకు నిర్జీవమైన తోలుబొమ్మలు రుచించాలి గదా!

తమ ఆట గ్రామస్తుల్ని తృప్తి పరచగలదా?

వాళ్ళు తమను ఆదరించగలరా?

కమలాబాయి ఆలోచనలు మరో విధంగా సాగుతున్నాయి.

రాత్రి భోజనం గురించిన అనుమానాలు ఆమెను చుట్టు ముట్టాయి. గ్రామం తమ ఆకలిని తీరుస్తుందో లేదో? తామయితే పస్తులయినా ఉండగలరు. తమ వెంట వచ్చిన వాళ్ళను పస్తులు పడుకోబెట్టలేరు గదా!

ఆహారానికి సంబంధించిన ఆందోళన మనస్సులో ఓవైపు మెలిబెడుతున్నా మరోవైపు ఏదో సన్నని ఆశ. కన్నెప్రాయంలో ఈ ఊరికి వచ్చింది తను. ఆనాటి గ్రామ ప్రజల ఆదరణ ఇంకా జ్ఞప్తికుంది. అందులో ఏ కొద్ది పాలు మంచితనం మిగులున్నా చాలు – తమకు సమస్యలు ఎదురు కాకుండేందుకు.

చిలకలపాడుకు వెళ్ళాలని తండ్రి ప్రతిపాదించినప్పుడే ఆ గ్రామానికి సంబంధించిన ఓ జ్ఞాపకం తన మనస్సులో తళుక్కున మెరిసి మాయమైంది. …. అది మధురమైన జ్ఞాపకం …. యవ్వన రుచుల్ని జీవితాంతం తాజాగా వుంచిన జ్ఞాపకం …. ఒంటరిగా కూచున్నప్పుడు గుర్తుకొచ్చి ఎన్నోసార్లు తన్మయావస్థలోకి జారిపోయేలా చేసిన జ్ఞాపకం …. తనిప్పుడు ఆ జ్ఞాపకం సజీవమై కదలాడే పరిసరాల్లోకి వెళుతూండటం వింతైన అనుభూతినిస్తోంది.

తను తన కూతురి వయసున్నప్పుడు ఈ ఊరికొచ్చింది.

ఇప్పుడు కూతురితో కలిసి మళ్ళీ వస్తోంది.

బొమ్మల బండి మెల్లగా గ్రామంకేసి కదలుతూ ఉంది.

ఎదుట కనిపిస్తోన్న పల్లె – కళాకారుల అందరి హృదయాల్లో ఏవేవో భావాల్ని రగిలిస్తూ ఆహ్వానిస్తోంది. వేప చింత చెట్ల మధ్య అస్పష్టంగా కనిపిస్తోన్న ఇళ్ళతో స్వాగతం పలుకుతోంది.

గ్రామాన్ని గురించిన భావుకతలో మునిగిపోతూ అందరూ నిశ్శబ్దంగా అడుగులేస్తూ ఉన్న సమయంలోనే వెనకనించి ఏదో వాహనం వస్తోన్న సవ్వడి.

దుమ్ము మేఘాల్ని రేపుకొంటూ మూడుటైర్ల ఆటో.

తోపుడు బండిని దారి అంచులదాకా తీసికెళ్ళి ఆపాడు సుబ్బారావు.

చిక్కటి దుమ్ముతో వాళ్ళను ముంచెత్తుతూ ఆటో దాటుకెళ్ళింది.

కళ్ళు విప్పి చూసిన వెంకట్రావుకు అందులో నిండుగా పేర్చి ఉన్న అట్టపెట్టెలు కన్పించి, అవి ఛీప్‌ లిక్కర్‌ పెట్టెలుగా అర్థమై….

వెనకే మరో ఆటో ….

దాన్నిండా రెండు పెద్ద అట్ట పెట్టెలు..

పెట్టెల మీది బొమ్మను చూసి – అవి టివీలుగా అర్థమై

‘‘ఒక్క ఊరికే అంత సరుకు మందా!’’ సుబ్బారావు ఆశ్చర్యపోతూ..

‘‘ఒక్కరోజే రెండు టీవీ దయ్యాలా!’’ గోవిందరావు భయపడుతూ..

దుమ్ము తెరలు అణగగానే తోపుడు బండి వెనగ్గా కళాకారుల గుంపు నడుస్తూ వెళ్ళసాగింది.