శరీరాలయాలు

శరీరదేవాలయంలో
ఆకలి, రుచి
అన్నింటినీ ఆహ్వానిస్తుంటాయి
దేనికీ నిషేధం లేదు

అద్భుతమైన శిల్పం కదా శరీరం
చూసేకొద్దీ చూడముచ్చటగా ఉంటుంది
రంగులు హంగులు అందంగా తీర్చిదిద్దుతుంటాయి

అయినా పెరిగేకొద్దీ అరిగిపోతూనే ఉంటాయి కొన్ని

తెలియకుండా లోపల చేరిన శత్రువులు
లోపలిభాగాల్ని ధ్వంసం చేస్తుంటారు
ఉన్నట్టుండి
ఏవో కదులుతున్న సంకేతాలు అందుతుంటాయి
మందు మాకులు ఆసరాలు
కూలిపోకుండా నిలబెట్టుతుంటాయి కొన్నాళ్ళు

శిధిలావస్థలో కొచ్చాక
కాలగర్భంలో కలసిపోకుండా
ఆసుపత్రి మంచాలు
ఆపగలుగుతాయో లేవో ఇంకొన్నాళ్ళు