ఏరిన మాటలు

మారేలోకం

మొదట నీవు మారి ఎదుటివారిని మార్చి
ప్రగతి పథమునందు పయనమగుము
జనులు మారినపుడు జగతియు మారును
కోలగొట్ల మాట కోటి తెలుపు

ధరణితాపం

గాలి నీరు నేల కలుషితమై పోయె
ఇంధనముల ధూమ మెంతొ పెరిగె
వెచ్చదనము హెచ్చి పచ్చదనము చచ్చె
కోలగొట్ల మాట కోటి తెలుపు

గుడిచేటి గుంట

గుట్టుగ గుడిచేటి గుంటతో నాతండు
క్లింటనేదొ వింతకేళి సలుప
గద్దెదింపగోరు గ్రంథసాంగుల పోరు
కోలగొట్ల మాట కోటి తెలుపు

దమననీతి

అణువుబాంబు వేసి అసువుల బలిగొన్న
అమెరికనులనెవడు అనుసరించు?
ఒరులకది తగదని ఒప్పింతురేవారు!
కోలగొట్ల మాట కోటి తెలుపు

బసివిరాలు

పడుపుతనము సోకె బడుగు కన్నియలకు
వీరశైవమందు వెఱ్ఱిపుట్టి
బసివిరాలితనము పశుపతి మెచ్చునా
కోలగొట్ల మాట కోటి తెలుపు