రసాస్వాదన

మనోజ్ఞ జలధితరంగ విన్యాసముల వెదకితినెన్నాళ్ళు
మనోహర మాకరంద గాన మాధుర్యము కొరకు
సుందరోద్యాన సుధానికుంజముల వెదకితి నెన్నాళ్ళు
సురుచిర సౌరభశ్రీ సామీప్యము కొరకు
ఇంద్రచాప శత సౌవర్ణ మెరుపుల వెదకితి నెన్నాళ్ళు
ఇంద్రనీలచ్ఛాయల మిసిమి వెలుగుల కొరకు
మలయపవన మోహనవీచికల వెదకితి నెన్నాళ్ళు
మందార గంధాల మందహాసము కొరకు
రాజతాచల రమణీయ శృంగాన వెదకితి నెన్నాళ్ళు
రాజీవలోచనాల రమ్యవీక్షణము కొరకు

మరి నిరీక్షలు సహియింపలేని శుష్కమానసను
మరు జన్మలకయినచాలు కోరితినా సార్ధకతను
మదిని హృదిని స్వాంతన పరచితి నాశనిరాశల నడుమను

అంత నంతలో,

చేరువవబోవు నొక చైతన్యపు ఉషస్సున
చేజారబోవు నొక జలతారు సుషుప్తిన

అలవోక చలనాల శ్రీచరణమై
అలరింపు నగవుల అమల హాసమై
అలనీతి నయనాల అమృతవర్షమై
అల్లన జాలువారిన అమర వాహినై
అహో కురిసెనతి మధుర గానమకరందము నా శిరసుపై

మరల మరలనా రసాస్వాదనమున మునిగెమానసము
మురిసి మురిసి రాగధారjైు సాగె జీవితము
మరింక నొకటియె కోరిక ఈ జన్మకు ` జన్మరాహిత్యము.