తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు

మన ఇంటిపేర్లలో నూటికి తొంబదికి మించి ఊళ్లపేర్లే చోటు చేసుకున్నాయి. అంటే ఆయా పేర్లు గల ఇంటిపేరులున్న కుటుంబాలు ప్రాయికంగా మొదలు ఆ గ్రామానికి చెందిన వారన్నమాట. అంటే ఇప్పుడున్న గ్రామానికి వారు ఆ గ్రామం నుంచి తరలి వచ్చారని తెలుస్తుంది. మరి అలా తరలి రావడానికి కారణాలను తరచి చూస్తే ఆ కారణాల నేపథ్యం తెలుస్తుంది. అవి యుద్ధాలు కావచ్చు, వర్షాభావం కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, భయంకరమైన వ్యాధులు కావచ్చు. ఏ కారణం లేకుండా వున్న ఊరును విడిచి పోవడానికి ఎవరూ ఇష్టపడరు. ఆ కారణాలను అన్వేషించుట వలన, ఆ నాడు సమాజంలో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కల్గుతుంది. ఇక, మరికొన్ని కుటుంబాల ఇంటి పేర్లు, ప్రస్తుతం వారు ఏ గ్రామంలో వున్నారో, ఆ గ్రామ నామాలే అయి వుంటాయి. అంత మాత్రంచేత, అనాది నుండి వారు ఆ గ్రామవాసులేనని, అంటే ఆ గ్రామానికి వారే గడ్డ ఎత్తారని చెప్పడం సాధ్యంకాదు. ఎందుకంటే జనం వచ్చాకే, ఆ జనావాసానికి పేరు ఏర్పడుతుందనేది సాధారణ సూత్రం. అయితే కొన్ని ఇంటిపేర్లతో ఏర్పడ్డ గ్రామాలు లేకపోలేదు. వలేటివారి పాలెం, యార్లగడ్డవారి లంక లాంటివి వాటికి ఉదాహరణలు. అయితే ఇలాంటి గ్రామ నామాలు ఇంటిపేర్లు గావడం చాలా అరుదు. అయితే పై సన్నివేశాలకి — అంటే, ఇప్పుడున్న ఊరి పేరే ఇంటిపేరు గావడానికి కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశం, గ్రామాధిపతుల, పంచాణం వారి విషయంలో వుంటుంది. అంటే కరణాలు, వెట్టి, తలారి, మున్సిఫ్‌, కమ్మరి, వడ్రంగం, కంసాలి, పురోహితుల కుటుంబాల విషయంలో మాత్రమే ఇది సాధారణంగా కన్పిస్తుంది. ఇది ఊళ్ళ పేర్లు ఇంటి పేర్లయిన వాని విషయం.

కొందరి ఇంటిపేర్లు వ్యక్తి నామాలుగా వుంటాయి. భైరవభట్ల, అప్పాజోస్యుల, వీరమాciనేని, తమ్మిశెట్టి, గుండుబోయిన, తిమ్మావఝల మొదలైనవి ఇలాంటివి. ఇందులో భైరవ, అప్ప, వీరమాచ, తమ్మి, గుండు, తిమ్మ అనేవి ఆయా వ్యక్తుల పేర్లు. భట్ల, జోస్యుల, నేని, శెట్టి, బోయిన, వఝల అనేవి ఆయా వ్యక్తులు అనుసరించిన వృత్తులు. భట్టు అనేది బ్రాహ్మణుల్లో ఒక స్థాయిని సూచిస్తుంది. జోస్యుల, వారి జ్యోతిష్య పరిజ్ఞానానికి సంకేతం. నేని నాయక శబ్దభవం. శెట్టి వాణిజ్యపరమైనది. బోయడు అనేది దేవాలయానికి చెందిన ఒక వృత్తి. భక్తులు ఇచ్చిన పశువులను సాకి, ఇచ్చిన వారి అభీష్టం మేరకు, దేవాలయానికి నేయి అందించే వృత్తి ఇది. వఝల ఉపాధ్యాయ శబ్దానికి మారు రూపం. ఆ పేర్లు గల వ్యక్తులు ప్రసిద్ధులు గావడం వలన తరువాతి కాలంలో, వారి వారి సంతతికి, వారి పేర్లు ఇంటి పేర్లు అయినాయి.

ఇవిగాక కొన్ని వృత్తులు, సాధారణ నామాలు కూడ ఇంటి పేర్లుగా కన్పిస్తాయి. అవసరాల, సమయమంతుల, గడియారం, అయాచితుల, సోమయాజుల, భారతుల, రామాయణం, పంతులు, వ్యాకరణం, దిట్టకవి, సంగీతం, కప్పగంతుల, గుడి సేవ, అర్చకం, భండారు, జన్యావుల, సుంకరి, కిలారి, ఉపద్రష్ట, వాజపేయాజుల, అవధానుల, పచ్చిపులుసు, వరికూటి, జొన్న కూటి, ఆరిగె కూటి, భాగవతుల, శరణు, అగ్నిహోత్రం, అశ్వ ధాటి, నీరుకట్టి, దశబంధాలు, ఆరాధ్యుల, సూరి, బందా, వేదాంతం, పడితరం — ఇలా అనేక విధాలైన పేర్లు కన్పిస్తాయి. ఇందులో కొన్ని తేలికగా బోధపడతాయి. మరికొన్నింటికి వివరణలు అవసరం. అవసరాల అనేది, ప్రభువు కాలోచితమైన వ్యవహారాలను గుర్తుచేసేవారు. సమయమంతుల అలాంటిదే. గడియారం కాలమానాన్ని పరిగణించేవారిది. అయాచితుల, యజ్ఞం నిర్వహించేటపుడు, ఆహ్వానం లేకుండానే, యధాలాపంగా హాజరయ్యేవారు. సోమయాజుల, యజ్ఞం చేసి సోమ యాజి ఐన వారికి వచ్చినది. భారతుల, ఒక ఆధ్యాత్మికవ్యవస్థకు సంబంధించినది.

కప్పగంతుల వేదం చదివే తీరులోని ఒక విశేషం. జన్యావుల, పునరుత్పత్తి కొరకు పశువులను సాకేవారిది. కిలారి, ప్రభువు ఆలమందలపై అధికారులకు సంబంధించినది. ఉపద్రష్ట యజ్ఞ నిర్వహణ పర్యవేక్షకుడు. వాజపేయాజుల, తత్సంబంధమైన యజ్ఞం చేయింప సామర్థ్యం గలవారు. శరణు, శైవ మతానుయాయులలో ఒక అంతరువు. అశ్వధాటి కవిత్వం చెప్పడంలోని విశేషాన్ని సూచిస్తుంది. నీరు కట్టి, గ్రామంలోని చెరువునీటిని వంతుల ప్రకారం సరఫరా చేసే ఉద్యోగం. దశబంధం చెరువులను నిర్మించడంలో, మరమ్మత్తులు చేయడం లోని నిర్వహణకు పరిహారంగా చెల్లించవలసిన శిస్తులో పొందిన రాయితీ. బందా దేవాలయ నిర్వహణలో ఒక ఉద్యోగం. పడితరం, ఆలయంలో ప్రసాదాలను వినియోగించే పదార్ధాల వంతు. పై వివరణలను బట్టి ఒకనాటి మన సమాజపు తీరు తెన్నులెలాంటివో అర్థమవుతున్నాయి గదా!

అయితే మరి కొన్ని ఇంటిపేర్లు కొంత తబ్బిబ్బుకులోను చేస్తాయి. గాలి, మల్లెమాల, ఇందుకు ఉదాహరణలు. ఇక్కడ గాలి అంటే వాయువు కాదు. అదొక ప్రాంతనామం. ఆ ప్రాంతానికి ఆ పేరు, గాలి అనే చెట్ల వలన వచ్చింది. మల్లెమాల అంటే మల్లెపూలదండ కాదు. అది ఒక ఊరిపేరు. కొండదాపున గల అడవిలో నున్న పల్లెను మాల అంటారు. అలాంటి చోట వచ్చిన గ్రామాలు అర్తమాల, వికృత మాల, మల్లెమాల మొదలైనవి. అలాగే తేళ్ళ. ఇది విష జంతువుకు సంకేతం కాదు. త్యాడ అనే ఊరి పేరుపై బహువచనం తేళ్ళ. ఇలా ఇంటిపేర్లలో చాల వైవిధ్యముంది. అన్నీ తెలుసుకోదగ్గవే.