లోలోపలగా…

ఒక సంభాషణేదో
నడుస్తూనే వుంటుంది
అర్థంగాని సైగలు చేస్తూ
కనుల ముందే వున్నట్లనిపిస్తూ

కొంచెంగానే నవ్వి చెప్పిన మాట
కలువల కింద మెదిలి వెళ్లిన చేపపిల్లలా
చెప్పకనే చూపు మిగిల్చుకున్న నవ్వొకటి
చలిమంటలో అగ్గి ఆరనట్టే

ఎప్పుడూ ఇంతే
ఏవో చెప్పాల్సినవి ఇంకా వున్నప్పుడే
ఎడద పొరల లోపలి నీటి జలలా కవ్విస్తూ
గురుతెరుగని మెలకువలా
తెరిపిరాని స్వప్నంలా
అలజడి చేస్తూ…

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...