The National Zoo

లెదర్ బూట్సు, లెదర్ చెప్పులు, బెల్టులు, ఇంకా జంతువుల దంతాలు, కొమ్ములతో చేసిన నానారకాల వస్తువులు ధరించి వచ్చిన మనుషుల గుంపు కంచెకి ఓ వైపు.

తాము, తమ కుటుంబాలు వచ్చి తిలకించడానికి వీలుగా వాటి పరిసరాలనించి, గుంపులనించి విడగొట్టి పట్టి తెచ్చిన నానారకాల జంతువులు మరో వైపు.

విక్టరీ! విక్టరీ!
పిల్లా పాపల్తో కేరింతలు కొడుతూ విక్కీ దాదాస్ ఓ వైపు.
ఏడుపు మొహాలతో బోనుల్లో కంచెల్లో డిమిత్రీ జంతువులు మరో వైపు.

హై హై మానవ నాయకా!
జయము. జయము.

పిల్లి
పిల్లెనకాల పిల్లి
పిల్లి
పిల్లి ముందు పిల్లి
పిల్లి
పిల్లి ముందు
పిల్లి ముందు
పిల్లి

ఎన్ని పిల్లులో చెప్పుకో చూద్దాం?

పిల్లి కాదెహె! పెద్ద పులి.
ఇంటి పిల్లికి పెద్దన్న.

పెద్ద రాయిలాంటి కెమెరా వేసుకున్న ఆ జపానాయన ఏనుగు, పక్కన్నేను అని ఫొటో తీసుకుందామని ఎంతసేపు చూసినా అది నడ్డి అటేపు తిప్పి అగ్రవర్ణ అహంకారాన్ని చూపిస్తోంది. చువ్వలు పట్టుకుని చింపాంజీలు ప్రజాసంఘాల వాళ్ళల్లాగా హడావిడి చేస్తున్నాయి.

చింపాంజీలకు పళ్ళు తోమే ఉద్యోగాలు ఉంటాయిక్కడ. అంతకు ముందు చింపాజీల పళ్ళు తోమడం ఎలా అనేదాని మీద పీహెచ్.డీ చేసి ఉండాల.

అట్టాగే హిప్పోపోటమస్‌లకు వీపు తోమే ఉద్యోగాలు. ఎలుగుబంట్లకు నాలిగ్గీసే ఉద్యోగాలు.

వేటాడ్డం మర్చిపోయిన కొదమ సింహాలు. రగులుతున్న అగ్ని పర్వతాలు. ఉత్తుత్తి పంజాలు గాల్లోకి విసిరి నానీలని భయపెడుతున్నాయి. నానీలంటే ఈగల్రా. హహ్హ.

దుప్పులన్నీ రిజర్వేషన్ల కోసం వర్సగా నిలబడి పోరాటం మోడ్‌లో. అటెన్షన్!

ఈ జంతువులున్నాయి చూశా, వీటికి నీతోనే ఢంకా పలాసు అని ఏమీ ఉండదు రా. అది మనోళ్ళు కనిపెట్టి నువ్వు మనిషివా జంతువ్వా అన్న తిట్టు కనిపెట్టారు. జూలో బంగారు జింకలు ఉండవు. ఆ విషయం తెలుసుకోవాలి నువ్వు. తెలిసిందా. ఇంక నడూ ముందుకి.

జిరాఫీ విజిటర్స్ వంక తూస్కారంగా చూసి నాలుగు ఆకులు పీకి చపక్ చపక్ మని నముల్తోంది కారా కిళ్ళీ నమిల్నట్టు. ఏనుగులు నిద్రలేచి దుమ్ము స్నానాలు చేస్తన్నాయి. పక్కన్నే తొట్లల్లో నీళ్ళు. ఎన్నియల్లో మల్లియల్లో అని పాడుకుంటా తానాలు చేసుంటాయి చిన్నప్పుడెప్పుడో అడవుల్లో. వాటిని పాపం ఎర వేసి. వల వేసి. పట్టార్రా మామా.

మొసలి గజరాజు కాలు పట్టుకుంటే అప్పుడెప్పుడో విష్ణు మూర్తి రష్షించాడు చూశావా. వీటిని రష్షించడానికి జూకి వస్తాడంటావా ఇప్పుడు?

ఏనుగు మీద రాముడు!
ఎంతో చక్కని దేవుడు!

చూడు చూడు. బాతులు. నిశ్చింతగా.
ఈ నీళ్ళు ఎక్కడికీ పోవని తెలిస్తేనా వాటికి.
ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక.
అబ్బే.అస్సలు అడగొద్దు.

పులి ఎముకలు
కప్ప కాళ్ళు
పావురాయి రక్తం
పులి చంపిన లేడి నెత్తురు.
అన్నీ కావాలి మనిషికి.

బకిషిస్తాం!
శత్రువులని బకిషిస్తాం!
దుషట చతుషటయాలం!
గూళ్ళలో గుడ్లని.
కడుపులో పిల్లని.

ఆఫ్రికా నించి
అంటార్కిటికా వరకూ.
వెంటాడి. వేటాడి.
లేడీ లేడీ కన్నె లేడీ.
భలే భలే! ఎన్ని రంగులో దాని ఒంటి మీద.

అంతేరా. అందమైనది ఎక్కడ కనిపించినా తీసుకొచ్చి ప్రదర్శనలో పెడతాడు మనిషి.

చూశావా, ఇక్కడ సింహాలు గర్జించవు. ఏనుగులు ఘీంకరించవు. పులులు గాండ్రించవు. కోతులు కిచకిచలాడవు. అన్నీ మజ్జుగా మెత్తగా ఖైదీ నం.786 ల్లాగా బోనుల్లోంచి కంచెల్లోంచి మనుషులని చూస్తూ ఉంటాయి.

జూ లేకపోతే ఆ జంతువులని చూసే అవకాశం మనకెక్కడ ఉంటుందండీ? మీరు మరీ విడ్డూరం మాట్లాడతారు. హాయిగా తిండీ నీళ్ళూ ఇస్తుంటే. బయట ఉంటే ఈపాటికి వేరే జంతువు నోట్లో పడి చచ్చుండేవి. ఇక్కడ చూడండీ కాస్త జబ్బు చేస్తే వెట్ వస్తాడు. జూ తీసెయ్యాలంటారా ఏమిటి? చాల్లెండి. సంబడం.

వేట.
వేట.
గుహల్లో ఆదిమ మానవుల వేట చిత్రాలు.
జంతువులని తరుముతూ చంపుతూ ఉన్న బొమ్మలు.
మిగిలిన జంతుజాలం మీద మనిషి సాధించిన విజయాలు.
చెట్టు మీది కోతిని
నీళ్ళలోని షార్కును
తన ఇంటి వెనక పెట్టుకోగలడు.
ఫ్రిజ్‌లో కూడా.
కొరమీను కోమలం.
సొర చాప శోభనం.
దొరసాని బురద కొయ్య.
వేట.
అడవి దొంగ.

ఎన్ని రంగుల చిలకలో. ఎవరో వీటి ఒంటి మీద బ్రష్‌తో పైంటింగ్ వేసినట్టు.
ఆ వల లోపలే ఎగరాలి.
లోపల్లోపల్లోపలే.

విజిటర్స్ తినిపిస్తోన్న జూ ఆహారం కోసం మోమాటం లేకుండా దగ్గరికొస్తున్నాయి.

చిట్టి చిలకమ్మా!
అమ్మ కొట్టిందా?
తోటకి వెళ్ళలేవు!
పండు తేలేవు!
గూట్లో పెట్టలేవు!
గుటుక్కున అసలే మింగలేవు!

మాకూ న్యాయం కావాలి!
అని నేర్పించాలి.

ఇంగ్లీష్‌లో. స్పానిష్‌లో. జపనీస్‌లో. చైనీస్‌లో. తెలుగులో.

అప్పుడు చూసుకో. కొన్ని వేల చిలకలు –
మాకూ న్యాయం కావాలి!
న్యాయం కావాలి!
కావాలి! అని అరుస్తూ ఉంటే నా సామి రంగా. ఈ విజిటర్స్ అంతా దడుచుకోని…

చూడు.

ఈ జంతువుల్ని పట్టడం. వాటిని జూల్లో, ఇళ్ళల్లో, బోనుల్లో పెంచడం పెద్ద యాపారం. మళ్ళా వాటికి పాకేజీల్లో ఆహారం. వాటికి జబ్బొస్తే మందు. డాక్టర్లు. ఏమనుకుంటున్నావ్?

ఏందో పెద్ద గౌతమ బుద్దుడు మాదిరి కబుర్లు చెప్తా ఉండావే? విజిటర్‌వి విజిటర్ లాగుండు.

సాల్లే. ఇదిగో ఈ చెట్టు పక్కన్నిలబడి కొంగలతో ఫూటో దిగు.

మా టిక్కెట్లన్నీ నీ కాడే ఉన్నయ్యిగా?

$18 for adults
$ 13 for seniors
$14 for children ages 2-11.