తెరచాటు-వులు: 12. ఆండాళ్ళూ! నీకేమయినా అర్థమయిందా?

ధృవం జన్మ మృతస్య చ…

మహోన్నతమైనది మట్టికరవడం ఎంత సహజమో పంకిలంలోంచే పద్మం ఉద్భవించడం అంతే సహజం. ఏదీ ఏ స్థితిలోనూ శాశ్వతంగా ఉండిపోదు అన్నది ప్రాకృతిక నియమం. సినిమా అందుకు విరుద్ధం కాదు. ఏభైల, అరవైల రెండు దశాబ్దాల స్వర్ణ యుగం అనుభవించిన తరువాత తెలుగు సినిమా మరి కొన్ని దశాబ్దాల చీకటిని చూడక తప్పింది కాదు. న్యూటన్ రెండో సూత్రాన్ని అనుసరించి గతి మారాలంటే మాడు మీద ఒకటి తగలాల్సిందే! హిందీ పరిశ్రమ 80లు, 90లలో (ప్రస్తుత తెలుగు పరిశ్రమ పడి కొట్టుకుంటున్న) తారాతిమిరంలో పొర్లాడుతుంటే, తన ఆలోచలనలతో, అంతకు మించిన ఆచరణతో, తను అనుకున్న దానికి కట్టుబడే ఖచ్చితమైన నిబద్ధతతో, ఒంటి చేతితో పరిశ్రమను ఒడ్డున పడేశాడు రామ్‌గోపాల్ వర్మ. ఇది ఏదో ఒక సినిమాతోనో, ఒక యేడాదిలోనో జరిగిన అద్భుతం కాదు. నిజానికి తను తీసిన సినిమాలలో అధిక శాతం ప్రజాదరణకి నోచుకోనివే. వర్మ మార్చగలిగింది హిందీ సినిమా తలరాతను కాదు, దాని ఆలోచనా సరళిని. సినిమా అంటే ఇదే, అందులో ఉండాల్సింది వీళ్ళే, దానికి ఉండాల్సిన హంగులు ఇవే అన్న పాతుకుపోయిన భావాల్ని పునాదుల నించి పెకలించి ఆవల పారేయడమే తను చేసిన అతి పెద్ద మేలు. బడ్జెట్‌ని పరిమితులలో ఉంచగలిగితే వ్యాపారపరంగా ఎటువంటి ప్రయోగంలోంచైనా అతి కొద్ది నష్టంతో బయటపడొచ్చు; వృత్తి పట్ల అంకితభావం, పరాజయానికి వెరవని ధైర్యం, వీటన్నిటినీ మించి కాదే వస్తువు సినిమాకి అనర్హం అన్న సృజనాత్మకత ఉంటే ఎంత పెద్ద నటులనైనా ఎంత తక్కువ పారితోషికంతోనైనా ఆకర్షించవచ్చు- అన్న జోడు గుర్రాల మీద ఒక దశాబ్దం పాటు హింది చిత్ర సీమలో స్వైరవీర విహారం చేశాడు వర్మ. నిజం చెప్పాలంటే ఇది తను కనిపెట్టిన సూత్రం కాదు. 60లలో హాలీవుడ్ పరిశ్రమ ఇటువంటి యుగసంధిలో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు ఇంచుమించు ఇటువంటి ఆలోచనలతోనే పెద్ద యెత్తున ఒక సమాంతర పరిశ్రమ నడిపి వినుతికెక్కాడు రోజర్ కార్మన్ (Roger Corman). తక్కువ బడ్జెట్, కొత్త తారలు, ఉత్కంఠ రేకెత్తించే కథాంశాలతో, ప్రస్తుత హాలీవుడ్ దిగ్గజాల (జార్జ్ లూకాస్, మార్టిన్ స్కోర్సెసి, ఫ్రాన్సిస్ కపోల, రాన్ హావర్డ్) కెరియర్లకి తన వద్ద అంకురార్పణ జరిపించాడు. తను తీసిన చిత్రాలు చరిత్ర స్మృతిపథంలోంచి తొలిగిపోయినా, తను తీసిన పద్ధతి ఇప్పటికీ ఎందరికో ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకమై నిలిచింది. భారతీయ చిత్ర పరిశ్రమలో NFDC (National Film Development Corp.) వాళ్ళు ఇదే తరహాలో 80వ దశకంలో ఇటువంటి ప్రయోగమే చేపట్టి వాసి పరంగా ఎంతో విజయం సాధించగలిగినా ఆ ప్రయోగం పెద్ద తెర వరకూ చేరక దూరదర్శన్‌కే పరిమితమైపోవడం వల్ల, పరిశ్రమలో పుట్టించవలసిన ప్రకంపనలు పుట్టించలేదనే చెప్పాలి. ఇక్కడే వర్మ కృతకృతుడయ్యాడు. నాడు తను నాటిన ఈ ప్రయోగాల విత్తనమే నేడు వటవృక్షమై బహిర్భూముల మీద, స్త్రీల నెలసరి ఉత్పత్తుల ఇతివృత్తాల మీద కూడా పెద్ద తారలు సైతం ఆసక్తి కనపరచి, నటించి, నిర్మించే దిశగా వారి ఆలోచనలను, తద్వారా పరిశ్రమను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఈ ప్రయోగం ఫలించడానికి కారణం సృజన, ప్రపంచీకరణ (ద్వారా విప్పారిన ప్రేక్షకుల కళ్ళు, దృక్పథాలు), విపణి తొక్కిన కొత్త పుంతలు (బహుళ ప్రదర్శనశాలల ఆవిర్భావం) వీటన్నిటి సమ్మేళనం.

తొలి కోడి కూసింది

సృజన పరంగా తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ఒక అడుగు వెనకే. మన దగ్గర అందానికి ఇచ్చిన ప్రాధాన్యం అభినయానికి (సరే, ఇప్పుడు ఆ రెండూ కూడా లేకుండా జాగ్రత్తపడ్డాం అనుకోండి!), కళ్ళకిచ్చిన ప్రాముఖ్యత బుద్ధికి, ఉద్వేగానికి వేసిన పెద్దపీట ఆలోచనకి, ఎప్పుడూ ఇవ్వడం జరగలేదు. అది ఇప్పుడే కాదు, తొలినాళ్ళ నించీ అంతే. చేసిన ఒకటి రెండు ప్రయోగాలకీ చేతులు కాలడంతో వాటి జోలికే పోకుండా ఫక్తు కాలక్షేపం వైపు మళ్ళింది పరిశ్రమ. పోనీ, అందులో ఏమన్నా చరిత్రలు తిరగ రాసిందా అంటే అదీ లేదు, ఏదో పరిశ్రమకి ఆశ పుట్టించి పక్కదోవ పట్టించిన ఒకటి రెండు మినహాయింపులు తప్ప! ఒకే సమయంలో తొలి అడుగులు వేసిన, పక్కనేవున్న తమిళ పరిశ్రమతో పోల్చుకుంటే తెలుగు చిత్రాలు 60ల తరువాత ఎదగడం ఆగిపోయినాయి. దానికి ముఖ్య కారణం, మనం అందానికి ఇచ్చిన అంతులేని గౌరవం. భీష్మ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత చక్రపాణి ఎన్టీయార్ని ఇలాంటి ముసలి ముతక పాత్రల్లో ఎవరు చూస్తారు, ఇక నించి అలాంటి ఆలోచనలూ ప్రయోగాలూ మానుకోమని సలహా ఇచ్చిన సంగతి వింటే ఈ జబ్బు ఇప్పుడొచ్చింది కాదు, ముందు నుంచే ఉందన్న విషయం బోధపడుతుంది. హీరో స్ఫురద్రూపిగా ఉండాలన్న తప్పనిసరి నిబంధన తెలుగు చిత్రగతినే మార్చేసింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 70ల చివరిలో, 80లలో భారతీరాజా, బాలచందర్, మహేంద్రన్, బాలు మహేంద్ర వంటి వారి చిత్రాలను గమనిస్తే వారు రూపు రేఖల కంటే పాత్రౌచిత్యానికి ఇచ్చిన ప్రాధాన్యత కనిపిస్తుంది. అందాన్ని పక్కన పెట్టేయొచ్చన్న సడలింపు ఎన్ని తరహా కొత్త కథలకు ద్వారాలు తెరుస్తుందో చెప్పి, తీసి చూపించారు వారు. మొదట తళుకుబెళుకుల వెనక, తరువాతి కాలంలో వారసత్వపు వరసల వెనక తెలుగు చిత్రాలు ఎలా గతి తప్పినాయో గత మూడు దశాబ్దాల చిత్రాలు చెప్పకనే చెబుతాయి. ఇక్కడ కూడా కొత్త శకానికి నాంది పలికింది (డిజిటల్ సాంకేతికత సహకారంతో) ఒక విధంగా రామ్‌గోపాల్ వర్మే. 90లలో హిందీ చిత్రాలని కొత్త కథల వైపు ఎలా మలుపు తిప్పగలిగాడో, గత కొద్ది సంవత్సరాలుగా తను చేస్తున్న (అభాసు) ప్రయత్నాల ద్వారా కొత్త సాంకేతికతను ఉపయోగించుకుని ఎంత తక్కువ ఖర్చుతో సినిమా తీయవచ్చో చేసి చూపించాడు. ఇది ఆదర్శం చేసుకుని ఒక విధంగా నానా కశ్మలం వెండితెర వెలుగు చూసినా, తను చేసిన ఈ ప్రయోగం మంచి కథకులకు/దర్శకులకు/సినిమాలకు సైతం ఊతం ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రయోగానికి పేరు పెట్టాలంటే ‘ప్రజాస్వామీకరణ’ (Democratization) అన్నది సబబుగా తోస్తుంది. ఏదో చెప్పాలన్న తపన ఉంటే ఏదీ అడ్డు కాదు, అడ్డు రాదు అన్నది దీని నినాదం. మొదటి నించి తమిళ, మళయాళ పరిశ్రమలని కాపు కాచింది ఈ సిద్ధాంతమే. మనసులో మంచి కథ, చేతిలో చిన్న (మామూలు ఫోటోలు తీసే) కేమెరా ఉంటే చాలు, ఆ చిత్రం ఏదో ఒక విధంగా ప్రేక్షకులని చేరటం తథ్యం అని నిరూపించినాయి ఈ మధ్య కాలంలో పేరు లేని తారాగణంతో విడుదలయి వారి ఆదరణ చూరగొన్న చిన్న చిత్రాలు– పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, వగైరాలు.

చెవినింటి పోరు

తొంభైల చివరిలో చలనచిత్ర గతిని సరికొత్త మలుపు తిప్పే మహత్తర ఘట్టం హాలీవుడ్‌లో జరిగింది. సినిమా పర్వంలో ఇది చిట్టచివరి అంకం, అదే ప్రచార పర్వం. గొప్ప సినిమా తీసేస్తే బ్రహ్మాండంగా నడిచేస్తుందనే వాదన ఎన్నో సార్లు ఎన్నో కారణల చేత ఖండింపబడినా, హిట్టు కొట్టాలంటే పిచ్కెక్కే కథ ఉండాలనే ఛాందస వాదనని బూజుకర్రతో క్షుణ్ణంగా దులిపిన చిత్రం 1999లో విడుదల అయ్యింది. అదే, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair witch project). పెట్టిన పెట్టుబడికి అత్యధిక వసూళ్ళని రాబట్టిన చిత్రంగా ఇప్పటికీ అగ్ర స్థానంలో నిలబడిన చిత్రం అది. డిజిటల్ విప్లవం ఇంకా మొదలవని నాళ్ళలో, అంతర్జాలం అప్పుడప్పుడే విస్తరిస్తున్న రోజులలో రెండు పదులు దాటిన ఇద్దరు కుర్రాళ్ళు ఒక ఆనలాగ్ విడియో కేమెరాతో పది వేల డాలర్లు మించని ఖర్చుతో ఒక హారర్ సినిమా తీశారు (చివరికి లెక్కలు సరిచూసుకునేటప్పటికి బాక్సాఫీసు వద్ద రెండు వందల మిలియన్ డాలర్ల పైచిలుకే రాలకొట్టింది ఈ చిత్రం!). విషయం చూస్తే అది ఒక మామూలు హారర్ చిత్రమే, అంతకు మించి భయపెట్టిన సినిమాలు అప్పటికే కోకొల్లలు. కానీ వారు సాధించిన విజయం వస్తుపరంగా కాదు, ప్రచారపరంగా. ఒక యథార్థ కథగా ప్రకటించి, అందులో నటీనటులను సినిమా విడుదలై దుమారం సృష్టించేదాకా బయట కనపడనీయకుండా జాగ్రత్త పడి, ఒక వెబ్‌సైటు ద్వారా అప్పుడే అంతర్జాలంలో తొలి అడుగులు వేస్తున్న టీనేజ్ పిల్లల ద్వారా స్కూళ్ళలో, కాలేజీలలో కాణీ ఖర్చు లేకుండా నమ్మశక్యం కాని విధంగా సినిమాకి విశేష ప్రచారం కల్పించి, సినిమా పేరుని విడుదలకి రెండు మూడు వారాలముందే అందరి నోళ్ళలో నానేట్టుగా చేసి, అది ఎపుడెప్పుడు విడుదలవుతుందా అన్నంత ఉత్కంఠని రేపి, అప్పటికే సిద్ధహస్తులు, లబ్ధప్రతిష్టులైన పెద్ద స్టూడియోల మార్కెటింగ్, పబ్లిసిటీ పెద్దల చేతే ముక్కున వేలేయించుకుని ఔరా అనిపించే విధంగా, విడులైన మొదటి వారంలోనే ఇరవై మిలియన్ డాలర్లను మించిన వసూళ్ళను సాధించిన ఆ చిత్రం ఫిజిక్స్‌లో గురుత్వాకర్షణ సూత్రానికున్నంత ప్రాధాన్యత సంతరించుకుంది. గొప్ప కథ ఉండడం, అద్భుతంగా తీయడమే కాదు, అది చూసే ప్రేక్షకులని ముక్కు పట్టి హాలు వరకూ లాక్కు రాగలిగే (అతి)తెలివితేటలు ఉన్నాయా అన్నది కూడా సినిమా విజయంలో ఒక ప్రధాన అంగమైపోయింది. ఇది అసలు ఎలా ఆడిందని ఆ తరువాత కాలంలో అనిపించే ఎన్నో సినిమాలు కేవలం ఈ ప్రచార ఆపన్న హస్తం అందుకుని గట్టెక్కినవే. ఇది ఒక విధంగా ఒక మంద మనస్తత్వం (mob mentality). ఎనభైలలో అప్పుడప్పుడే ఫలానా సినీతారకి ‘ఆలిండియా అభిమాన సంఘ అద్యక్షుడు’గా ఉండడం అన్నది ఒక వృత్తిగా మారుతున్న రోజులలో, వసూళ్ళు మందికొడిగా మొదలైన సినిమాని వెనక నించి ఒక తోపు తోయడానికి ఈ అభిమాన సంఘాల ద్వారా ఆ తారలే పెట్టుబళ్ళు పెట్టి ప్రధాన సెంటర్లలో ‘టికెట్లు కోయించడం’! (అంటే టికెట్లు మొత్తం వీరే కొని, దారిన పోయే దానయ్య/దానమ్మలకు దానంచేసి హవుస్ ఫుల్ బోర్డు పడేట్టుగా చేయడం.) మంచం దింపిన సినిమా నోట్లో తులసి తీర్థం పోయడం లాంటిది ఈ పని. గుక్క తిప్పుకుని బొమ్మ నిలబడిందా పెట్టిన పెట్టుబడికి పరమార్థం లేదా ప్రయత్నం చేసిన పుణ్యం. ఇక సామాజిక మాధ్యమాలు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న నేటి రోజుల్లో ప్రచారం అనేది కథ కంటే ప్రధానమై పోయింది, దానికి పట్టే ఖర్చు సైతం పేట్రేగి పోయింది, అంతకు మించి, అనివార్యమయిపోయింది.

వెండి తెర విశ్వరూపం

ప్రభో నటరాజా! సహస్రానేక కథాంశాలతో, చిత్రవిచిత్ర విన్యాసాలతో, వేనవేల నాలుకలతో, వివిధ వైవిధ్యాలతో, మిరుమిట్లాడే మేని మెరుపులతో, నాదమో ఘోషో తెలియని శబ్దాకృతితో, ఏకత్వములో బహుళత్వము భిన్నత్వములో ఒకే తత్వము చూపుతున్న నీ రూపు తర్కించలేకున్నాము. చేతిలో ఒదిగినట్టుండే చిన్న బడ్జెట్ చిత్రమై ఒక సేపు, తేడాకొట్టెనా సృష్టి తలక్రిందులయ్యే భారీ బడ్జెట్ బొమ్మగా మరో వైపు, ఈ రెంటి మధ్యలో, చిన్న వైపు చిన్న చూపు చూస్తూ, పెద్ద వైపు పెద్ద అంగలేసుకుంటూ నీ ఊర్ధ్వమూలము అందుకోను వడివడి అడుగులేస్తున్న బడా ప్రొడ్యూసర్లు ఒక వైపు, అంతలోనే వారి ఆశకు వారే ఆహుతైపోతూ నెత్తురు కక్కుకుంటూ రాలిపోతున్న ఓ నాటి ఉల్కలని నిబిడాశ్చర్యంతో కంటూ కూడా నిచ్చెనెక్క చూస్తున్న భావినిర్మాతలు మరో వైపు, నీ చుట్టూ చేరి నిన్ను కీర్తిస్తున్న కథకులు, శ్లాఘిస్తున్న దర్శకులు, కొలుస్తున్న కళాకారులూ- వీరందరితోటీ నాకు ఆది మధ్యాంతము తెలియకున్నవి. దిక్కులు తోచకున్నవి. ఏమీ అర్థముగాకున్నది.” విలియం గోల్డ్‌మన్ గారి వేష్ట కూడా ఇదే – ఎవడికీ ఏమీ తెలీయ్దు మొర్రో!

ఇతి.

నేను వినినంత, కనినంత, తెలుసుకున్నంత, అందులో నాకు అర్థమయినంత.

(బాపు గారి) భంశు.