నాకు నచ్చిన పద్యం: ప్రాతఃకాల వ్యాకరణం

శా.
ప్రాతఃకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్త్రంబులోఁ
దాతఙ్ స్థానులు చెప్పుడెవ్వియను చందంబొప్పఁ గౌకౌయనన్
జాతుర్యంబలరార నుత్తరము విస్పష్టంబుగాఁ గోకిల
వ్రాతంబిచ్చెఁ దుహీ,తుహీయని గృహారామప్రదేశంబులన్.

ఇదొక తమాషా ఐన పద్యం. శ్రీనాథ మహాకవి శృంగారనైషధం లోనిది.

పాపం చాలా చిక్కులు పడి, దిక్పాలకులే తనకు పోటీ వచ్చినా ఎదుర్కొని, తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా తను ప్రేమించిన, తన్ను ప్రేమించిన దమయంతిని శ్రీమతిగా చేసుకున్నాడు నలుడు. అత్తవారింట పెళ్ళయింతర్వాత భార్యతో సొంత నగరానికి వచ్చి దమయంతితో, ‘అస్తి వామ్యభార మస్తి కౌతూహలం, బస్తి ఘర్మసలిల, మస్తి కంప, మస్తి భీతి, యస్తి హర్ష, మస్తి వ్యధం, బస్తి వాంఛ మయ్యెనపుడు రతము‘ అన్నట్టు తొలి రాత్రి గడిపాడు. వేకువన కొంచెం మాగన్ను పడుతుండగా– వైతాళికులు నిద్రలేపడం మొదలుపెట్టారు నలుణ్ణి. ఆ వైతాళిక గీతాల్లోని ప్రాతఃకాల వర్ణన ఈ పద్యం. ఈ పద్యంలో ఉదయకాల వర్ణనకు పాణిని వ్యాకరణంలోని ఒక అంశాన్ని ముడిపెట్టాడు కవి.

ఇండ్ల పెరళ్ళలో నాలుగైదు పెద్ద వృక్షాలు– మామిడీ పనసా లాంటివి ఉండటం సర్వసాధారణం. అలాంటి ఒక చెట్టు మీద పొద్దున్నే కాకి ఒకటి వచ్చి వ్రాలి కౌ కౌ అని అరుస్తున్నది. మరో చెట్టు మీద కోకిలలు కూర్చుని వాటి అరుపులను అవి తుహీ తుహీ అని అరుస్తున్నాయి. ఒక కూత వినపడగానే జవాబుగా కూయడం కోకిలలకు అలవాటు. కూ అని కోకిల కూయగానే పిల్లలు దాన్ని అనుకరిస్తూ వారూ కూ అనటం– ఆ వెంటనే కోకిలా మళ్ళీ పిల్లలూ, ఇలాంటి దృశ్యం చాలామంది గమనించే ఉంటారు. ఇక్కడ కాకి కూత విని కోకిలలు కూడా కూస్తున్నాయన్నమాట. ఈ కాకీ కోకిలల కూతల ముచ్చట కవికి, కాకులేదో ప్రశ్న వేస్తున్నట్లూ కోకిలలు ఆ ప్రశ్నకు సమాధానం చెపుతున్నట్లూ అనిపించింది. కాకి కౌ కౌ అని కూయడం సహజమే గదా. కౌ అంటే ఏవి అని సంస్కృతంలో అర్థం. కిమ్ అనే ప్రశ్నవాచక పదానికి ప్రథమాద్వివచన విభక్తి రూపం కౌ. కౌ కౌ అంటే రెండూ ఏవి, రెండూ ఏవి అని కాకులు అడుగుతున్నాయట. దేన్ని గురించి ఏవి ఏవి అని అవి అడుగుతున్నాయి? ఇక్కడ పాణిని వ్యాకరణాన్ని పట్టుకొచ్చాడు కవి. సంస్కృత వ్యాకరణంలో ఒక అక్షరం వ్యాకరణ కార్యం జరిగిన పిమ్మట ఇంకొక అక్షరంగా మార్పుచెందితే, మార్పు జరిగే ప్రదేశంలో ముందున్న అక్షరాన్ని స్థాని అనీ, మార్పు చెందాక వచ్చే అక్షరాన్ని ఆదేశమనీ అంటారుట. ఆ న్యాయం ప్రకారం తా, తఙ్ అనే అక్షరాలకు స్థానులు ఏవి ఏవి – కౌ కౌ – అని కాకులు అడుగుతున్నాయి. తా, తఙ్ అనే అక్షరాలకు స్థానులు తు, హీ అనేవి. దీనికి ఆధారమైన పాణిని సూత్రం: తుహ్యోస్తాతఙ్ ఆశిష్యన్యతరస్యామ్. అంటే, ఆశీర్వాద అర్థంలో ‘తు’, ‘హి’ అనే క్రియా విభక్తులకు, తా తఙ్ అనేవి ఆదేశంగా వస్తాయి. అదే సంగతిని కోకిలలు, కాకులు అడిగినదానికి తు హీ తు హీ అని చతురంగా స్పష్టంగా జవాబిస్తున్నాయట. అలా కాకీ కోకిలల అరుపుల్లోంచి ఇంత గీర్వాణాన్ని ఇవతలికి లాగాడు కవి. కాకి కౌ కౌ రావాలనూ కోకిలల తుహీ తుహీ రావాలనూ వ్యాకరణంతో ముడిపెట్టి ప్రౌఢంగా ఉత్ప్రేక్షించాడు.

ఇంతకూ దీనిలో ప్రభాత వర్ణన ఏం ఉందంటారా? రాత్రంతా మదన కదనంలో అలసిపోయి నిద్రమంపులో ఉన్న రాజును– అయ్యా తెల్లవారింది, ఇండ్ల చెట్ల మీది పక్షులు కూడా లేచి కూస్తున్నాయి, ఇక లేవండి మహాప్రభూ– అని వైతాళికులు మేల్కొలుపుతున్నారన్నమాట.

పద్యాన్ని సాఫీగా కథ చెపుతూ పోయే ధోరణిలో మాత్రమే కాక ఏదో ఒక వైచిత్రి చూపాలనుకుంటాడు సమర్థతా ఆత్మవిశ్వాసమూ కొత్తదనం మీద కోరికా ఉన్న కవి. అపారమైన వివిధ శాస్త్ర పరిచయం ఉన్న కవి ఏదో ఒకచోట తన తెలివిడినీ ప్రజ్ఞనూ వ్యక్తపరచాలనుకోవడమూ సహజమే. తాను కేవలం కవిని మాత్రమే కాదు, వైయాకరణిని కూడానూ అని తెలుపుతున్నాడు ఇక్కడ. ఒక చిన్న నాలుగు పాదాల పద్యంలో ఒక శాస్త్ర విషయ చర్చను నిర్వహించడమే కాకుండా ప్రభాత కాలంలో ఇంటి పెరళ్ళూ వాటిలో చెట్లూ చెట్లమీది పక్షులూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అవి కూసే కూతలూ– ఇంత చక్కని దృశ్యాన్ని నిబంధించాడు. ఆ కూతలకొక అర్థాన్ని సూచిస్తూ వ్యాకరణ శాస్త్రంలోని వివరంతో ముడిపెట్టి చక్కని అలంకారాన్ని సాధించాడు. వ్యాకరణ విషయాలు తెలిసిన తర్వాత పద్యం చదివితే, ముందు కొంచం భయపెట్టిన పద్యం వడ్లగింజలో బియ్యపు గింజ అన్నట్లు సులభంగా అర్థమైపోతుంది. పాణిని –అందరికీ తెలిసిందే– సంస్కృత వ్యాకర్త. ఆయన పణిన మహర్షి పుత్రుడు. అందుకని వ్యాకరణం పణిన-అపత్య-ఉక్త పణినాపత్యోక్త శాస్త్రం అయింది. ఇటువంటి గంభీర వివేచనలు మిక్కుటంగా ఉన్నందుననే నైషధం విద్వదౌషధం అయింది. ఈ వక్కణం తెలుగు నైషధం గురించి చెప్పిందే. ఎందుకంటే శ్రీనాథుడే రచించిన మరో కావ్యంతో కలిపి కాశీఖండ మయఃపిండం నైషధం విద్వదౌషధం అని చెప్పారు కాబట్టి.

ఈ పద్యంలోని ప్రౌఢభావ సౌందర్యానికి అభినందనార్హుడు మూలకవి ఐన శ్రీహర్షుడే. శార్దూలంగా తెలుగులోకి అనువదించినంతవరకే శ్రీనాథునికి స్తుత్యర్హత. ఐనా ఎంతో సొగసుగానూ భావం స్పష్టపడేట్టూ పద్యధార బెసగకుండానూ ఆ ఉక్తి వైచిత్రిని పద్యంలో పొదగడం మామూలు కవికి సాధ్యమవుతుందా! అనువాదమైనప్పటికీ, శ్లోకస్య శ్లోకానువాదం మరి- తెలుగు కావ్యం మహాకావ్యంగా ప్రశస్తి పొందడానికి శ్రీనాథుని అనువాద సామర్థ్య వైదగ్ధ్యాలే గదా కారణం!

ఒక విశాల భావాన్ని క్లుప్తంగా ఐనా సమగ్రంగా రూపుకట్టించిన ప్రతిభ పద్య నిర్మితిలో ద్యోతకమవుతుంది. నైషధంలోని నాకు నచ్చిన వందలాది పద్యాల్లో ఇదొకటి.

(85 ఏండ్ల వయస్సులో అనారోగ్యంతో మంచం మీద ఉండి కూడా ఈ పద్యం కోసం అడగ్గానే స్థానులను గురించి వివరించిన ప్రఖ్యాత సంస్కృత విద్వాంసులు శ్రీ మల్లాది సుబ్రహ్మణ్య శర్మగారికి కృతజ్ఞతలు.)