సమయానికి…

డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రామ్‌నగర్లో కిరాయికున్నాం. నలుగురం. ఏదైనా ఉద్యోగం చూసుకోవడమా, ఇంకేదైనా చదవడమా అనే కన్‌ఫ్యూజన్ దశ అది. రెండంతస్తుల పెద్ద ఇల్లు. రెండు అర్ధ దీర్ఘచతురస్రాల్ని ఎదురెదురు నిలిపినట్టు చుట్టూరా గదులు ఉంటాయి. అద్దెల కోసమే ప్రత్యేకంగా కట్టినట్టు తెలుస్తుంటుంది. మేము పైన ఉండేవాళ్లం.

ఒకరోజు మధ్యాహ్నం మావాళ్లు ఎటో పోయినట్టున్నారు; నేను ఒక్కడినే ఉన్నాను. ఓనర్‌వాళ్ల కోడలు మా రూమ్ దగ్గరికి వచ్చింది. వాళ్లు కూడా పై అంతస్తులోనే ఉండేవాళ్లు. బ్యాచిలర్ వయసులో కబుర్లకు కారణమయ్యేంత చక్కగా ఉంటుంది. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసు. అయితే, ఆమెతో నాకు పెద్ద పరిచయం లేదు.

సందేహిస్తున్నట్టుగానే తలుపు తట్టి, “మీరేమైనా బయటికెళ్తున్నారా?” అని మృదువుగా అడిగింది.

అప్పుడు నాకు బయటికెళ్లే పనేమీ లేదు. అదే చెప్పాను.

“ఒకవేళ వెళ్తే కొంచెం పెరుగు తెచ్చిపెడతారేమోనని…”

ఇంతకుముందు జవాబు ఇచ్చి వున్నాను కాబట్టి, నొచ్చుకుంటూనే తల అడ్డంగా ఊపాను. ఏం మాట్లాడలేక ఆమె వెళ్లిపోయింది.

నా అన్ని సెన్సెస్ పూర్తిగా అలెర్టుగా ఉండవు. అందుకే నా తలకాయ చాలాసార్లు టైముకు పనిచేయదు. ఒక సంఘటనను మళ్లీ మళ్లీ రివైండ్ చేసుకుని, నన్ను నేను తరచి చూసుకుంటే తప్ప నాకు నేను అర్థం కాను. ‘బయటికెళ్తున్నారా?’ అని ఆమె అడిగింది. నాకు నిజంగా పనేమీ లేదు కాబట్టి, నేను అదే జవాబిచ్చాను. ఇందులో దోషమేముంది! కాబట్టి ఈ వ్యవహారం ఇక్కడితో అయిపోవాలి. కానీ ఆమెకు జవాబివ్వడంలో నేనేదో తేడా చేసినట్టు తెలుస్తోంది.

సాయంత్రం మావాళ్లు వచ్చారు. ఇదంతా చెప్పాను. “నిన్ను తన్నినా తప్పులేదురా,” అన్నాడు రాజుగాడు. “ఒక ఆడిమనిషి, మీదికెల్లి ప్రెగ్నెంటు, పగటీలి ఎండపూట నీ దగ్గరికచ్చి, పాపం పెరుగు దెచ్చియ్యిమని డైరెక్టుగ అడుగుటానికి నోరు రాక ఇంకోతీరుగ అడిగింది… దేడ్దిమాగ్గానివి నీకు అర్థంగాలేదు.”

“కానీ నాకు పనేం లేదు గదరా; ఉన్నమాట జెప్పిన.”

“నీ నిజాయితీ బంకన…” బూతును చేత్తో సైగచేస్తూ కొనసాగించాడు. “పనుందనాల్నోయ్; నేనైతే పనిలేకపోయినా పొయెటోన్ని.”

పదిహేను, పదహారేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను ఇప్పుడు పరిశీలించుకుంటే నాకు రెండు జవాబులు దొరుకుతున్నాయి. ఒకటి: నిజంగానే నాకు సమయానికి తగినట్టుగా నడుచుకునే తెలివి లేకపోవడం. రెండు: తెలివి అతి కావడం. అంటే, ఆమె అందగత్తె కాబట్టి, కేవలం ఆమె అందం కారణంగా నేను ఆమెకు లోబడకూడదన్నదేదో ఆ సమయంలో నా లోపల పనిచేసి వుంటుంది. తద్వారా నాలో ఒక ఋషిత్వపు ఆధిక్యతను నిలబెట్టుకోవాలన్న తలంపు కావొచ్చు. మొదటిదానికి ఏమో గాని, రెండోదే నిజమైతే మాత్రం నిజంగానే నా అంత ‘దేడ్దిమాగ్గాడు’ ఎవరూ ఉండరు.

తర్వాత కొన్ని వారాలకే ఆ రూమ్ ఖాళీ చేశాం. ఆమెకు ప్రసవం అయ్యి, బాబో పాపో పుట్టి వుంటారు. వాళ్లు ఇప్పుడు ఏ పదో తరగతికో వచ్చి వుంటారు. వాళ్లమ్మకు అవసరానికి పెరుగు తెచ్చివ్వలేనితనంతో తప్ప వాళ్లకూ నాకూ ఇంకేం సంబంధం!