హళ్ళికి సున్న

రోజు గడిచింది
ఆ దిబ్బ మీద
యథావిధిగా
రాత్రి మొలిచింది

మొలిచిన రాత్రి
కిటికీ దగ్గరకు
చంద్రుడిని
తీసుకొచ్చింది

పనీపాటూ లేని
చంద్రుడు
కిటికీ వెనక
చెట్టెక్కి
వెన్నెల రజను
రాల్చాడు

​అప్పుడది ​
పోన్లే పాపం అని
గోడ​ల మీద
నీడల విగ్రహాలను
వరసాగ్గా పేర్చింది

ఆ సందట్లో
కరుగుతూన్న రాత్రి
ఆలోచనలను తురిమి
చిన్ననాటి ముచ్చట్ల
తీగె పాకంలో
లడ్డూలు చుడుతోంది

విగ్రహాలకు
లడ్డూలు
నైవేద్యం
పెట్టాను

పెరిగిపోతోన్న
లడ్డూ గుట్టల్లో
పచార్లు కొట్టాను

నన్నా గుట్టల్లో
వదిలేసి
కలల తలగడా
మీద పడి
నిద్దర
నిద్రపోయింది

ఇంతలో
నిప్పు కళ్ళ
సూర్యుడు
ఎప్పుడు
మలుపు తిరిగాడో

మాడు మొహం
చంద్రుడు
విగ్రహాలు
మూట కట్టుకుని

చెప్పకుండా
చెట్టు దూకి
పారిపోయాడు.