పరిచయం: ఓల్గా – సంతులిత

రాజ్యాంగం – అంటే తెలిసినట్టే అనిపిస్తుంది.

రాజ్యాంగ నైతికత – అంటే తెలియదనే అనిపిస్తుంది.

రాజ్యాంగమన్నది ఏదో ఒక తాత్విక దృక్పథం మీద ఆధారపడినది కాదు. ప్రపంచాన్ని ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో విప్పి చెప్పే పని అది పెట్టుకోదు. నిజానికి అది ప్రపంచం గురించి మాట్లాడదు. అది ఒక దేశపు సరిహద్దులకే పరిమితం. ఆ దేశ పరిధిలో జీవిస్తున్న అనేకానేక మనుషుల్ని పౌరసత్వం అన్న ఒక గొడుకు నీడకు తీసుకువస్తుంది. ఏ సూత్రాలు, ఏ నియమాలు, ఏ పద్ధతుల వల్ల భిన్న రీతులలో జీవిస్తున్న విభిన్న వర్గాల వాళ్ళు ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా జీవించగలరో ఆ విధి విధానాలను రాజ్యాంగం తనలో పొందుపరుచుకొంటుంది.


విశాలాంధ్ర ప్రచురణ, 2015. Rs.75

విభిన్న జాతులు, వివిధ సంస్కృతులు, అనేక మతాలు, అనేకానేక భాషలు, ఒకదానితో ఒకటి పోలికలేని ప్రాంతాలు, వివిధ రాజకీయ సంప్రదాయాలూ ఏకకాలంలో సహజీవనం చేస్తున్న భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేయడమంటే– అదో గొప్ప సవాలు. ఎంతో మంది మేధావులూ అనుభవజ్ఞులూ రెండేళ్ళకు పైగా శ్రమపడి మన రాజ్యాంగ రచన చేశారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం అన్న ఆధార పీఠాలపైన దాన్ని నిర్మించారు. కాని అలాంటి ఆదర్శాల పునాది మీద రాసుకొన్న రాజ్యాంగం –వైరుధ్యాల పుట్ట అయిన భారతదేశంలో– బతికి బట్టకట్టగలదా? సమానత్వం ఆశించే రాజ్యాంగానికీ అసమానత్వాల భారతదేశానికీ ఎలా పొసుగుతుందీ? ఈ సందేహం రాజ్యంగ నిర్మాతలకే వచ్చింది. మన దేశంలో రాజ్యాంగం అమలు జరగాలంటే కొత్త భావజాలం వేళ్ళూనాలి. కొత్త నీతి నియమాలు ఏర్పడాలి. ఆ పని సహజంగా, సులభంగా జరగదు. దాన్ని దేశమూ దేశ పౌరులూ క్రమక్రమంగా అలవరుచుకోవాలి. అలా అలవరుచుకునే ప్రక్రియే రాజ్యాంగ నైతికత (constitutional morality).

సాహిత్యాన్ని సీరియస్‍గా తీసుకునే చాలామందికి సాహిత్యానికీ జీవితానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలుసు. ఆ సంబంధం వ్యక్తిగతమే గాదు, సామాజికం అని కూడా లీలగా తెలుసు. కానీ, ఆ సంబంధమూ ఆ ప్రభావమూ ఏ రకంగా మన జీవితాలను మలచగలవో, నిర్మాణాత్మకమైన జీవన పథంలో మనల్ని ఎలా ముందుకు నడిపించగలవో– ఈ విషయంలో అనేకానేకుల భావనలు స్పష్టాస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మరి, తెలుగు సాహిత్యంలో రాజ్యాంగ నైతికత స్థానమేమిటి? అవసరమేమిటి?

పాఠకులకు రాజ్యంగ నైతికతాదృష్టితో సాహిత్యాన్ని చదివే పద్ధతిని పరిచయం చెయ్యాలి. అలాగే మన రాజ్యాంగ పరిధిని విస్తరించి రాజ్యాంగ నైతికతను పునర్నిర్వచించుకోవడంలో సాహిత్యానికి ఉన్న పాత్రను గురించి చెప్పాలి‘– అన్న ఉద్దేశ్యంతో, ఓల్గా సంతులిత: రాజ్యాంగ నైతికత-అక్కినేని కుటుంబరావు నవలలు అన్న పుస్తకం రాశారు.

ఆ పరిశీలన కోసం అక్కినేని కుటుంబరావు రాసిన నాలుగు నవలలను (సొరాజ్జెం, 1981; కార్మిక గీతం, 1987; మోహన రాగం, 1986; కొల్లేటి జాడలు, 2014) ఎంచుకున్నారు. ఈ నవలలు 1947-1990ల నాటి సామాన్య జనజీవితాన్ని విభిన్న కోణాల్లోంచి చిత్రించినవి. మన రాజ్యాంగంలోని అతి ముఖ్యమైన నాలుగు ఆర్టికల్స్ చుట్టూ (ఆర్టికల్ 15- వివక్ష; 17- అంటరానితనం; 19- భావప్రకటనా స్వేచ్ఛ; 21- జీవించే హక్కు) ఈ నాలుగు నవలలు తిరుగుతుంటాయని, రాజ్యంగ ఉల్లంఘనా నేపథ్యమే ఈ నవలల జీవనాడి అని, రాజ్యాంగ నైతికత పట్ల స్పృహని పాఠకులలో కలిగించడమే ఈ నవలల ఉద్దేశమని– అంచేత తాను ఎన్నుకొన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి ఈ నవలలు ఎంతో అనుకూలమనీ ఓల్గా వివరిస్తారు.

సమానత్వం ప్రాతిపదికగా పుట్టిన మన రాజ్యాంగం బలంగా ఎదిగి స్థిరపడడానికి ఎలాంటి సాధనాలనూ కార్యక్రమాలనూ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు. అలాంటి సమయంలో అసమానత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రజాపోరాటాలూ, వాటికి నైతిక మద్దతు ఇచ్చే సాహిత్యం రాజ్యాంగ నైతికత సమాజంలో వేళ్ళూనుకునేలా చేసే సాధనాలు అవుతాయి… అలాగే అమలులో ఉన్న న్యాయం గురించే కాకుండా దానిని దాటి ఆలోచించి మరింత మానవీయమైన నీతి నియమాలను అలవర్చుకోగల నైతిక దృష్టిని సాహిత్యం మనిషికి ఇస్తుంది‘– అని అంటూ అందుకు, కన్యాశుల్కం, మాలపల్లి లాంటి రచనల్ని ఓల్గా ఉదాహరణలుగా చూపుతారు.

సొరాజ్జెం గ్రామీణ కుల వ్యవస్థలోని దారుణాలను విప్పిచెప్పిన నవల. పరస్పర సంబంధం కలిగిన బానిసత్వం-పరాధీనత ఈ నవలలోని ముఖ్య విషయాలు. స్వతంత్ర్యం, రాజ్యంగం ఆ సంబంధాన్ని కాస్తంత కదిలించిన మాట నిజమే గానీ ఆ కదిలించడమన్నది ఆధిపత్య వర్గాన్ని భయపెట్టేంతగా, బానిసత్వాన్ని పోగొట్టేంతగా జరగలేదు. స్వాతంత్ర్యపు తొలిదినాలలో మన వ్యవస్థ దళితులకు సరిపడా ఆత్మగౌరవాన్నీ ప్రతిఘటనా స్వరాన్నీ ఇవ్వలేకపోవడం గురించి సొరాజ్జెం సమగ్రంగా వివరిస్తుంది. నవలలోని ‘జోజి హత్య’ నేపథ్యంలో అసమానతలను తగ్గించడానికి కృషి చేయవలసిన ప్రభుత్వమే రాజ్యాంగ ఉల్లంఘనకు ఎలా పాల్పడుతుందో వివరిస్తుంది.

మోహన రాగం నవలలో చిత్రితమైన లైంగిక వివక్ష-వేధింపుల నేపథ్యంలో లైంగిక వేధింపులు నేరం అని చట్టాలు కూడా రాని ఆ కాలంలోనే ఆయా అణచివేతలకు గురి అవుతోన్న వాళ్ళల్లో పెరుగుతున్న ఒత్తిడిని గ్రహించి– అలాంటి వాటిని ఉద్యమాల కన్నా, చట్టాల కన్నా ముందే సాహిత్యంలో పొందుపరచగల రచయితలే నిజమైన జాతి వైతాళికులు అని ఓల్గా భావిస్తారు.

కార్మిక గీతం ఎనభైల నాటి నగరాలకు చెందిన కార్మికుల జీవితాలను వివరంగా చిత్రించిన నవల. ఈ నవల నేపథ్యంలో పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు, కార్మికుల రక్షణ కోసం నిర్దేశించబడిన అనేకానేక రాజ్యాంగ నిబంధనలనూ చట్టాలనూ ఎలా ఉల్లంఘిస్తున్నాయో వివరిస్తారు ఓల్గా. ఈ నవల రాసిన తర్వాత వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ప్రపంచీకరణ, శ్రమజీవులు అందరినీ మింగేసే యాంత్రిక భూతమయ్యింది. ఈ మారిన పరిస్థితులలో కార్మికుల జీవితాలను చిత్రించే సమగ్రమైన సాహిత్యం రావలసిన అవసరం ఇపుడు ఉందని ప్రతిపాదిస్తారు.

కొల్లేటి జాడలు జీవించే హక్కుకూ, పర్యావరణ సమతుల్యత-పరిరక్షణకూ మధ్య ఉన్న సంబంధాన్ని ఎత్తి చూపిన నవల. పర్యావరణ విధ్వంసం విషయంలో కోర్టులు ఎన్నెన్నో అనుకూలమైన తీర్పులు ఇచ్చినా, వాటిని అమలు చేయని ప్రభుత్వపు బాధ్యతా రాహిత్యం, వెరసి కొల్లేరు అనునిత్యం మరణానికి చేరువ అవుతున్న వైనమూ వివరిస్తారు ఓల్గా. ఆ క్రమంలో నవలలోని ఓ ముఖ్యమైన అంశాన్ని బలంగా ప్రస్తావిస్తారావిడ. అది రంగయ్య పాత్ర. ఆ పాత్ర ద్వారా పర్యావరణం పట్ల పౌరుల బాధ్యతలను ఈ నవల ఎలా గుర్తించి ఎత్తి చూపుతుందో వివరిస్తారు. రాజ్యాంగమంటే ప్రాథమిక హక్కులేగాదు; ప్రాథమిక విధులు కూడా గదా!

తాను ఉద్దేశించిన ప్రక్రియను వేగవంతం చేయడంలో సంతులిత సఫలీకృతమవుతుందన్న విషయంలో నాకు అనుమానం లేదు. అలాగే మనకు రాజ్యాంగమూ చట్టాలూ ఇచ్చిన హక్కులూ బాధ్యతలను అమలుపరచడంలో సమస్త పౌరులూ చొరవ తీసుకున్న పక్షంలో– ఈ వ్యవస్థ పరిధిలోనే సామాన్య ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది అన్న నమ్మకాన్నీ విజ్ఞత ఉన్న చదువరులలో సంతులిత: రాజ్యాంగ నైతికత-అక్కినేని కుటుంబరావు నవలలు కలిగించగలదు.

ఇతర భారతీయ భాషల సంగతి ఎలా ఉన్నా, మన తెలుగులో జీవితాన్నీ, సాహిత్యాన్నీ, రాజ్యాంగాన్నీ, వ్యవస్థనూ అనుసంధానించే దిశా నిర్దేశపు ప్రక్రియలో ఒక ముందడుగు వేసిన రచన సంతులిత.