నాపై కథ రాస్తావా?

“నాపై కథ రాస్తావా? కవిత రాస్తావా?”

గోడకు దిగేసిన పటం లాంటి వాడిని నేను. ఎప్పుడో దండ మార్చాల్సి వచ్చినప్పుడు, గోడకు వెల్ల వేయాల్సి వచ్చినప్పుడు తప్ప ప్రాముఖ్యం లేని వాడిని. నేనేం రాయగలను? లోలోపలే మథనపడుతూ అనుకున్నాను.

“ఏదో ఒకటి! ఏదన్నా పర్లేదు… అన్ని విషయాలు ఇంత బాగా ఆర్టిక్యులేట్ చేసిన వాడివి, నీవిష్టపడే మనిషి మీద పిడికెడు వాక్యాలు రాయలేవా?”

నేను కొన్ని విషయాలు చెప్పను. నాతో ఏవీ కమిట్ చేయించకు… ప్లీజ్! నా ఆత్మ మూలిగింది.


ఆమె ‘హలో’ అన్నప్పుడు శీతాకాలపు వెన్నెలగాలి బంతిపూల వనాల్ని దాటి వచ్చినట్టు ఉంటుంది. ఏదైనా బతిమాలినట్టుగా అడుగుతున్నప్పుడు ఆమె పెదవులు ఇంద్రధనస్సులా ఒక విచిత్రమైన వొంపు తిరిగి మళ్ళీ యథా స్థానానికి వచ్చేస్తాయి. అందుకే నేనెప్పుడూ ఆమె మొహంలో మొహం పెట్టి ఒక రెండు నిమిషాలకంటే ఎక్కువసేపు మాట్లడలేదు.

“నన్ను కేవలం ప్రేమించకుండా ఎందుకు ఉండకూడదు అనడానికి ఒక్క కారణం చెప్పు?” ఒక రోజు నిలదీసింది.

నేను నా రాతలో నిమగ్నమై ఉన్నాను. ఒకేసారి వంద యూకలిప్టస్ చెట్లు తుఫాను గాలికి బాధగా తలలూపుతూ రోదిస్తున్నట్టుంది నా మనసులో. ఆమె విప్పారిన కనులలో ప్రశ్న నన్ను ఎగాదిగా పరికిస్తున్నట్టు నాకు తెలుస్తోంది. ఆ నాసిక నుంచి వెచ్చటి శ్వాస మీటర్ దూరంలో ఉన్నా నా వీపుకు తగులుతున్నట్టే ఉంది.

నా వీపు మీదుగా వచ్చి వాలి నా చేతిలో పేపర్‌ను మెల్లగా చేతిలోకి తీసుకుంది. నివారించబోయిన నా ప్రయత్నం క్షణంలోనే విఫలమయింది.

గుప్పెడు నక్షత్రాలను పోసి
సముదాయించా ఈ ఆకాశాన్ని
బుక్కెడు మేఘాలను పరిచేసి
వర్షపు చినుకులను నింపుకున్నా
నా మెడ కింద వెచ్చగా తగులుతున్న
నీ పెదాలను బతిమాలి
ఇదుగో ఇంద్రధనస్సు తెచ్చుకున్నా
చూపు మరలని నీ రెండు కళ్లలో
నా రూపానికి ప్రకృతి చివరి మెరుగులద్దుతుంటే…
ఇదుగో! నా జీవితానికి తుది శ్వాసను వెతుకుతున్న వాణ్ణి
వేధించకిక… మరుజన్మపై నిరాశను మమకారంగా పెంచుకోనీ
… ఇలాగే!

ఆమె చదువుతూ ఉంటే తెలుగు అంత స్వచ్ఛంగా అందంగా ఉంటుందా అనిపించింది!

“హ్మ్! ఇంత బాగా రాస్తావు. కాని చివర్లో ఇంత పెసిమిజం దేనికి నీకు?! నన్నిలా చూడు, చూడూ!” పొడుగాటి తన చూపుడు వేలును నా గడ్డం కింద పెట్టి కొద్దిగా లాగింది. తిప్పకుండా ఆగుదామనుకున్న నేను క్షణమాత్రం ఆగగలిగాను.

“నన్నిలా చూడు! నీ దగ్గర్నుండి నేను ఆశించేదేమీ లేదు. మనిద్దరి మధ్య ఏ ఇబ్బందులున్నాయో అవి అలానే ఉండనీ. ఎందుకంటే– మనిద్దరి మధ్య రెండు పెదాల కదలిక మాత్రమే భాషను పుట్టిస్తుంది. ఆ భాషలోనే మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. మనమింకొకరికి అర్థం కావాల్సిన మనుషులం కావాల్సిన అవసరం లేదు. హయ్యో… మనిద్దరం కన్‌సెన్సువల్ అడల్ట్స్‌మి… మగడా! ఏం చెప్పాలి నీకు?!”

నా రెండు బుగ్గలు లాగుతుంటే నొప్పవుతున్నట్టు మొహం పెడితే, పకపకా నవ్వుతూ వదిలేసి నా బుంగమూతిని దిష్టి తీస్తూ, “నా మాట విను. నన్ను ప్రేమించు. నేనే మగాణ్ణి అయిపోతాను. అప్పుడు నీవు ఆడదానిలా నా చేతిలో ఇరుక్కోకపోతే నన్నడుగు!” ఫక్కున నవ్వింది. ఆ నవ్వులో ఇప్పటివరకూ ఈ భూగోళంపై వాలని నక్షత్రకాంతి.

నేను నా మొహంలో తీక్షణతను తెచ్చిపెట్టుకుంటున్నాను.

“మెటీరియలిస్ట్‌గా బతకాల్సిన అవసరం మన ప్రేమకు లేదు. మనిద్దరికి భాష అవసరం లేదు. మాటలు అవసరం లేదు. అర్థం చేసుకో!” నా చేతి మునివేళ్లను తాకి అనింది, “ఇదిగో ఈ వేళ్ళతో ఏ ఉదయమో నా పెదాలపై రాస్తూ ఉంటే చాలు!”

తాను వెళ్ళిపోయింది. కానీ నాకేం అయ్యింది? ఈ కళ్ళల్లో తడి ఆరదేం?!


ఈ రోజు బలంగా నిర్ణయించుకున్నాను. తనను డిస్కరేజ్ చేయాలి. నేను సరయినవాడిని కాదు తనకు. తన జీవితం లోకి నేను వెళ్ళడం ఆమెకు మంచిది కాదు. ఆమె వయసులో నాకన్నా పదేళ్ళు పైగా చిన్నది. నాకున్న మెచ్యూరిటీ తనకు ఉండకపోవచ్చు. తను పెరిగిన విధానాన్ని బట్టి ఆమె తన జీవితంలోకి ఒక గీత దాటితే వచ్చే భావావేశపు ఆనందాన్ని ఆహ్వానిస్తుందేమో! అనిపిస్తుంది.

వెంటనే మొబైల్ తీశాను. మొబైల్‌లో కీస్ ఏవో ఇనుప మీటల్లా చాలా కష్టంగా నొక్కుకుంటున్నాయి. ఎవరో ఫోన్ ఎత్తారు. ఆమె కాదు. వెంటనే పెట్టేశాను. నంబర్ కరెక్టే. రిపీట్ డయల్ నొక్కా. ఎవరి గొంతో తెలీట్లేదు.

‘హలో… హలో…’ దబాయింపుగా ఉంది. అమ్మాయి గొంతే కాని తనది కాదు. కొంచెం సముదాయించుకున్నా. అలాగే ఫోన్ పట్టుకుని ఉన్నా గాని, నా భాష తెలిసిన తాను కాదు కాబట్టి నేను మాట్లడేదేమీ లేక పెట్టబోయాను.

ఫోనులో నా శ్వాస విని నా దగ్గరకొస్తుంది తను మరుక్షణం!

ఫోనులో నా నంబర్ చూసిన వెంటనే తాను ఎప్పుడూ మొదటి రెండు నిమిషాలు మాట్లాడదు! నా శ్వాస ఏదో ఊసు చెబుతున్నట్టు శ్రద్ధగా వింటుంది!

మా మధ్య స్వీట్ నథింగ్స్ ఏవీ ఉండవు. ఒకరి గుండె నుండి ఇంకొకరి గుండెకు మోర్స్ కోడ్ సిగ్నల్స్ వంటివేవో అందుతుంటాయి. అంతే!

తాను అటుపక్క నేను ఇటు పక్క ఉన్నామనే భావనతోనే నిమిషాలు గడిచిపోతాయి!

చివర్లో తను పెట్టేస్తుంది…

నా అనుమానం ఆమె అటుపక్క నాకు ముద్దు పెట్టాకే పెట్టేస్తుందని!

నాకెప్పుడూ ఈ ఫోన్ అవసరం పడలేదు. తనే ‘నీ శ్వాస వింటే చాలు’ అంటూ నా చేతిలో పెట్టింది.

“హలో… హలో… మీరెవరో త్వరగా రండి… షి ఈజ్ స్పాట్ డెడ్. సారీ… పెద్ద యాక్సిడెంట్. మీరు త్వరగా రావాలి!”

ఏంటిది! నిజమా? నిజమా? నా మనసు చదివిన ఒకే మనిషి! నా హృదయంలోకి ప్రవేశించగలిగిన ఒకే ఒక్క స్త్రీ! నా భాష తెలిసిన ఒకే వ్యక్తి! వేనవేల కాంతి సంవత్సరాలు ప్రయాణించి, పాలపుంత దాటి వచ్చిన ఒకే ఒక దేవత!

ఈ క్షణం నుండి ఈ మూగవాడి డైరీలో ఇక రాసుకోడానికి ఏమీ లేదు! కవితలు రాయాల్సిన ఆ తెల్ల కాగితాలపై సిరా ఒలికించడం కోసం తప్ప ఇక నా మనసును ఎప్పుడూ పలికించలేను. అది కూడా మూగబోయింది!


పుస్తకం మూసి వాడిని చూశా. ఈ రైటప్ అంతా చదివాకా నాలో ఏదో తెలీని గుబులు.

వాడి కళ్ళ చివరి కొసల్లో ఒక చుక్క ఆగిపోయినట్టు ఉంది.

“ఏరా? ఆ అమ్మాయి నిన్ను అంత ప్రేమించిందా? ఇది ఉత్తి కథ కదూ?” అడిగాను. అదేంటి అలా అడిగేశాను అని మనసులో అనుకున్నా. మనసులో నిజానికి అంతో ఇంతో అసూయ కూడా తట్టిందేమో?! ఒక మూగవాడు ఒక అమ్మాయితో ఇంత ప్రేమించబడ్డాడు అంటే!

“సారీ రా… ఇదెప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు?”

“నాకు తెలిసి ఆమె చనిపోయింది. అంతే తెలుసు నాకు. ఎన్నాళ్ళు అని నేను లెక్కపెట్టదల్చుకోలేదు.” పేపర్ మీద రాశాడు.

వాడినేదో ఓదార్చబోయాను గాని ఎలా ఓదార్చను?! ఏమని ఓదార్చను? నాలోనూ వాడి గురించి తన్నుకుని వచ్చే జాలి లాంటి బాధను వెళ్ళగక్కుకోవాలని ఉంది. కానీ అది వాడికి నచ్చకపోవచ్చు కూడా!

“కొన్నాళ్ళు నాతో పాటు ఉందువు రా ఇంటికి. ఇంతకు ముందులా కాక ఈ సారి ఇంకో నెల రోజులు పైగా ఉండేట్టు ప్రిపేర్ అయి రా.”

వాడి మొహం నిండా ఎవరో అరచేత్తో పులిమినట్టు బాధ కనిపించింది. వదిలొచ్చే ముందు వాడి మొహం చూస్తూ అన్యమనస్కంగా వచ్చేశాను. వాడి మనసులో ఉండే పెనుగులాట ఏదో నా మనసుకు అందకుండా పోయిందని నాకు సంకేతం అందుతున్నట్టు ఉంది.

నేను మిస్సైన పాయింట్ ఏదో ఉంది!


తలంతా బరువుగా ఉంది.

గుర్తు తెలిసినప్పటి నుండి చూస్తున్నా వాడిని. మూగ అయినా మల్టీ టేలెంటెడ్! వాడి భావుకతకు నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాడి చూపులో ఒక మెస్మరిజం ఉంది. దానికి తగ్గట్టుగా చక్కటి విగ్రహం. వాడు మూగవాడని తెలియగానే ఎలా ఉంటాడో ఊహించుకునే స్టీరియోటైప్ సమాజాన్ని ఛాలెంజ్ చేస్తున్నట్టుంటాడు.

ఎంతో ఆప్తమిత్రుడైనా, నాకు ఒకమూల వాడంటే ఎక్కడో చిన్న అసూయ. అన్ని బహుమతుల్నీ ఒక్కడే మూట గట్టుకుని ఉన్నట్టు అగుపిస్తాడు వాడు నాకు!

రెన్నెళ్ళ క్రితం ఏదో జాతీయ రచయితల సమావేశం ఉండి హైదరాబాదు వస్తే, మా ఇంట్లోనే రెండు వారాలు ఉన్నాడు. ఒక వారానికే వెళ్తానని గోలపెట్టాడు. నేనే బలవంతపెట్టి ఇంకో వారం ఉంచేసుకున్నాను. వాడితో మాట్లాడుతూ ఉంటే నాకు గొప్ప సాంత్వన ఉంటుంది. వాడు అన్ని సమాధానాలు వాడి నవ్వుతోనే చెప్తాడు. చేతిలో ఉన్న పేపర్ పెన్ను ఎప్పుడో గాని వాడడు. కాలేజిలో వాడిని అమ్మాయిలు స్మైలింగ్ స్టార్ అనేవాళ్ళు. కాలేజిలో నాకన్నా వాడు సీనియర్. కాని చిన్నప్పట్నుండీ పరిచయం కాబట్టి, సీనియర్ అయినా కాలేజిలో ‘అరేయ్, ఒరేయ్’ అనే పిలిచేవాణ్ణి. ఎప్పుడూ కలిసే తిరిగేవాళ్ళం.

సోఫాలో కూర్చుని ఉన్నా గాని మనస్సు మనస్సులో లేదు.

ఘుమఘుమలాడే కాఫీ కప్పు కళ్ళకెదురుగా పట్టుకుని చరిత నా ముందు ప్రత్యక్షమై నా పరధ్యానం పోగొట్టింది. తనను చూసినప్పుడల్లా నన్ను భర్తగా స్వీకరించి నాకు ఈ విశ్వాన్ని బహుకరించినట్టు ఉంటుంది. పెళ్ళై ఐదేళ్ళైనా నాకు చరిత ఎప్పుడూ ఒక విచిత్రమైన స్వప్నంలా ఉంటుంది. చరిత చీరకట్టు అన్ని వంపులు తిరిగినా, ఏదో ఘాట్ సెక్షన్‌లో వేసిన జాతీయ రహదారిలా ఎంతో శ్రద్ధగా క్రమంలో తిరుగుతున్నట్టు ఉంటుంది. తన కళ్ళకో విశ్వసంగీతం తెలిసినట్టు ఉంటుంది. తన నవ్వు అల ఒకటి తీరంపై మెరిసే వెన్నెల నురగ రాసినట్టు ఉంటుంది.

నిజానికి నాకన్నా ఐదేళ్ళు మాత్రమే చిన్నది గాని, చూసే వాళ్ళకు మా ఇద్దరి మధ్య ఎంతో వయసులో తేడా ఉన్నట్టు ఉంటుంది.

చేత్తో కాఫీ కప్పు అందుకుని చరితను చూస్తూనే తాగేశాను.

రెణ్ణెళ్ళ క్రితమే కదా వాణ్ణి చూశాను?! వీడి మూగతనం చూసైనా సరే వీడిని ఏ పిల్లయినా పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. మరి ఆ కథలో పెళ్ళి ఊసు ఎందుకు రాయలేదు? నేనెలా మిస్ అయ్యాను ఇదంతా…

చరిత వంగి కప్పు అందుకుంది. నన్నే చూసి ఒక చిరునవ్వు నా గుండెకు దానం చేసి వెళ్ళిపోయింది. చరితలో ఆడతనం అణువణువునా ఉంటుంది. ప్రతి కదలికలో ఉంటుంది. ఆమె చుట్టూ ఆడతనం తీగలా అల్లుకుపోయినట్టు ఉంటుంది.

కానీ నాలో ఏదో వ్యాకులత! చరిత నవ్వులో నాకు దొరకని అంశమేదో ఉన్నట్టు అనిపిస్తుంది!

వాడి కథలో హీరోయిన్ చనిపోలేదు బతికే ఉందని నా అనుమానం!


ఈ కథ చదివిన పాఠకులు కొందరు ఆ కథలో అమ్మాయిని చంపివేయాల్సింది కాదు అన్నారు. మరి కొందరు ఒక అమ్మాయిపై రాశావు ఆ అమ్మాయితో నీకు పరిచయం నిజంగా లేదా అని అడిగారు. ఇది కల్పితమా, నిజమా? అని ఇంకొందరు అనుమానపడ్డారు. “నాపై కథ రాస్తావా?” అని అడగగలిగేదెవరో నాకు తెలుసు. నన్ను విస్మరించిన మనిషిని నేనెందుకు అందరితో పంచుకుని స్మరించుకుంటాను?! అందుకే అందరికి– వాడి మీద వాడికి కాన్ఫిడెన్స్ లేక వాడి చుట్టూ రాసుకున్న ఒక ఫిక్షన్ అనే చెప్తాను. లేకపోతే అసూయ అనో, అనుమానం అనో, పేరనోయిక్ రైటర్ అనో… ఏదో చర్చ పెడ్తారు. నాకవసరం లేదు అదంతా.