నేను లేని ప్రపంచం

ఆమె గడుసైనది!
తన పనిని ఎక్కడున్నా ఏ పరిస్థితిలోనైనా
నెరవేర్చుకోగల సమర్థురాలు!
అలాటి సమర్థత నేనెవరిలోనూ చూడలేదు, నిజం!
ఈమధ్య తరచుగా ఇక్కడిక్కడే తిరుగుతోంది
అసలు ఇక్కడేమిటి అక్కడేమిటి
అన్నిచోట్లకీ వెళుతుంది! ఏవేళలోనైనా వెళ్తుంది!

నేను గమనించలేదనుకుంటోంది!
వాకిట్లోనూ వంటింటి గుమ్మంలోనూ
డాబా మీద పిట్టగోడ దగ్గర
ఆరుబయట ఆకాశం క్రింద
పడకగది కిటికీ ప్రక్కన, సరేసరి.
ఉదయపు నిశ్శబ్దంలో కాఫీకప్పుతో కూర్చుంటే…
డైనింగ్ టేబిల్ అంచున నిలబడి నన్నే చూస్తున్నట్లుంటుంది!

నా దృష్టి మళ్లించేందుకన్నట్టు
పెళ్లికో పేరంటానికో వచ్చినట్టు
నావాళ్లు నలుగురూ కూడబలుక్కునే వచ్చారు!
అప్పుడే పుట్టిన పసి దేహాన్ని చూసినట్టు
అంతా వివరంగా తెలుసున్నట్టే నన్ను చూస్తున్నారు!
నా కళ్లు కప్పి గుసగుసలాడుకుంటున్నారు!
నిజంగా వీళ్లంతా అనుకుంటున్నట్టే నేను ఇదివరకటి నేను కాను.

నా ఒళ్లంతా కళ్లు, చెవులు
క్రొత్తగా మొలుచుకొస్తున్నట్టున్నాయి!
ఇంటి నిండా పరుచుకున్న పండుగ సంరంభం
నా పెరటి గాలి అబద్ధం కాదంటోంది!
దేశ దిమ్మరినై తిరిగే నా యాత్రాకాంక్ష తెలిసున్నట్టు
వీళ్లంతా పచ్చ జెండా పదిలంగా పుచ్చుకుని మరీ వచ్చేసేరంటోంది!
ఎందుకో నాకు నేనే పరాయిదానిలా కనిపిస్తున్నాను!

నా ఇష్టాయిష్టాలు తెగ చెప్పుకొస్తున్నారు
ఆల్బం తిరగేస్తూ, యథాలాపంగా
పాత జ్ఞాపకాలు తోడిపోస్తున్నారు!
గుండె బరువెక్కుతుంటే
విశాఖ తీరంలో సముద్రపు నురగలు గుర్తొచ్చి
ఆ వెనుక యారాడ కొండలూ గుర్తొస్తున్నాయి!
వెచ్చని దుఃఖమూ వస్తోంది!

నాకేదో అయిపోయినట్టు, అంతలోనే ఏమీ కానట్టు…
రెండు రెండుగా ఆలోచిస్తున్నారు
రెండు రెండుగా చూస్తున్నారు
జాలిచూపులు దాచుకోలేక అవస్థ పడుతున్నారు!
నిజం నాకు తెలుసని వాళ్లకీ
వాళ్లకి తెలుసని నాకూ తెలియనిదేమీ కాదు.
ఇక ఈ దోబూచులాట నేనాడలేను!

ఏమరుపాటు వదిలి ఆమె కోసం చూస్తే
నమ్మకస్తురాలైన నేస్తంలా
నా వెనుక సిద్ధంగానే ఉన్నానంటోంది!

ఇక ఆమెతో ఒకే ఒక్క విషయం తేల్చుకోవాలనుంది –
నేను లేని ప్రపంచం ఇలానే ఉంటుందా?
నేను లేనని దిగులు పడి బెంగెట్టుకుంటుందా?