సడి లేని సంభాషణలు

నీతో ఒక మాట మొదలు పెట్టాక ఎక్కడ ముగించాలో తెలీదు
ఇటు రాలే చినుకులకి అటు చాచిన ఒక దోసిలి
నిశ్శబ్దంగా బదులు చెప్తున్నట్టే ఉంటుంది!

నీకు నేను పూర్తిగా తెలుసా? అంటే నవ్వుతావు
అనుకొనేవాటన్నిటికీ మాటలు ఎందుకులెమ్మని కదూ!
ఒకటికి పదిసార్లు అడుగుతాను, నువ్వు బాగానే ఉన్నావు కదా? అని.
ఆకాశం వైపు సారించిన నీ చూపు మెలిపెడుతుంది,
అది అలా అక్కడ ఉంటే చాలు వద్దకొచ్చి ఓదార్చక్కర్లేదు అన్నట్టు!

నా చేతిలో పెన్సిల్ ఊరుకోదు…
ఏవో పైకిరాని పదాలని గీతల్లో గీస్తూ ఉంటుంది
వాటి అంతరార్థాలు నీ కళ్ళలో రంగులద్దుకుంటూ ఉంటాయి
ఆ కాగితాన్ని భద్రంగా మడతవేసి గుండెవైపున్న జేబులో సర్దుకుంటావు
మన ఈ కాసిన్ని క్షణాల్లోని పరిమళాలలో మరెప్పుడైనా మునక వేసేందుకు!

ఎప్పుడు ఎవరు ముడి పెట్టారో తెలియదు కదా
మనుషులని ఈ గడియారపు ముళ్ళకి?

మరి కొన్ని కాలాలు ఇక్కడే విడిచిపెట్టినా
మరొక్క మాటా పెగలని మన మర్యాదల మీద
ఒక్క అడుగు ఎటూ కదలని మన విడి విడి కథల మీద
ఇవాళ కాస్త ఎక్కువ జాలిపడుతూ చెరో దారికి విడిపోతాం
ఎప్పటిలాగే నువ్వు తూర్పుకి, నేను పడమరకి!