తెరచాటు-వులు: 10. టక్కుటమార గజకర్ణ గోకర్ణ…

భర్త అనగా భరించువాడు

సినిమాకి సంబంధించినంతవరకూ సృష్టి, స్థితి, లయకారకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నిర్మాత మాత్రమే. కథకుడు కాదు, దర్శకుడు కాదు; నటీనటులు, తత్తిమా సాంకేతిక వర్గం వీరెవరూ సినిమాకి ప్రధానం కారు, ఒక విధంగా అవసరమూ లేరు. వీరెవరి తోడ్పాటు లేకపోతే ‘మంచి’ సినిమా రాకపోవచ్చు కాని, నిర్మాత లేకపోతే అసలు సినిమానే బయటకు రాదు. ఈ మధ్య కాలంలో మంచి అభిరుచిగల నిర్మాత కాట్రగడ్డ మురారి నవ్విపోదురుగాక అన్న ఆత్మకథ రాసి వెలువరించారు. ఆత్మకథల్లో సామాన్యంగా కనపడే ఆత్మస్తుతి-పరనింద గోలని పక్కన పెడితే (అసలు అదంతా ఉత్తరిస్తే, పుస్తకంలో అసలు ‘ఇది’ తక్కువే అని చెప్పుకోవాలి), తను చిత్రాలు నిర్మిస్తున్న కాలంలో (80వ దశకం) తెలుగులో తక్కిన నిర్మాతల పరిస్థితి ఎలా ఉండేది అన్న విషయం మీద కుండ బద్దలు కొట్టినట్టు (దర్శకుల చెంపలు పగిలేట్టు) ఏకరువు పెట్టాడు. కళాత్మక చిత్రాలకు పుట్టిల్లు అయిన పూర్ణోదయ సంస్థ (శంకరారాభరణం, సితార, సాగర సంగమం, స్వాతి ముత్యం, స్వయంకృషి, శుభలేఖ) నిర్మాత ఏడిద నాగేశ్వరరావుని ఆ సంస్థకి ఎక్కువ చిత్రాలు తీసిపెట్టిన కె. విశ్వనాథ్ ఏ విధంగా కథాచర్చలు జరుగుతున్నప్పుడు గదిలోకి కూడా రానిచ్చేవాడు కాడో వివరిస్తున్నప్పుడు అసలు చిత్ర నిర్మాణంలో నిర్మాత పాత్ర ఏమిటి అన్న మౌలికమైన సందేహం రావచ్చు.

ఆంగ్లంలో ప్రొడ్యూసర్ అన్న పదం కూడా ఒక విధంగా విరోధాభాస వంటిదే. ఇందులో తను సృష్టించేది ఏమీ లేదు, సృజించేది ఏమీ లేదు, ఉత్పత్తి చేసేది అంతకన్నా లేదు. ఈ సందర్భంలో ప్రొడ్యూస్ అన్న పదానికి ఎదురుగా సాక్షాత్కరింప చేయడం అన్న వ్యుత్పత్తి మాత్రమే అతికినట్టు ఉంటుంది. సినిమా నిర్మాణంలో కావలసిన ధన వస్తు వాహన తదితర షోడసోపచార ద్రవ్యాలను సకాలంలో సాక్షాత్కరింప చేయడమే నిర్మాత విధి, పరిధి అన్నది సినిమా పుట్టినప్పటి నుండీ వ్యాప్తిలో ఉన్న విచారం. ‘డబ్బు పెట్టు. బాగా పోతే వచ్చే డబ్బుని లెక్కపెట్టు. బాగోపోతే, అన్నీ కట్టిపెట్టు; కొట్టు కట్టు!’ అన్నది నిర్మాత తక్షణ కర్తవ్యం అయిపోయింది. ఇది వాంఛనీయమేనా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. పైన ఉదహరించిన కె. మురారి లాంటివాడు– అరిచి గీపెట్టి, తనకు కావలసిన విధంగా కథ తయారు చేయించుకుని, పాటలు తన అభిరుచికి తగ్గట్టు సంగీత దర్శకుని నుంచి రప్పించుకుని, తన కష్టాన్నంతటినీ దర్శకుడి చేతిలో పెట్టి, మంచి సినిమా తయారు కావడానికి ఇతోధిక సాయం చేసి, ఆనక పక్కకు తప్పుకునేవాడు– ఒక విధంగా ఉత్తమ నిర్మాత. ఈ విధమైన అభిరుచి, అవగాహన, అధికారం (కొండకచో అహంకారం) ఉన్న నిర్మాతల కోసం సినిమా పుట్టిన కాలం నించీ చూస్తే, తెలుగులో అయితే వేళ్ళ లెక్క దాటదు. ఎక్కడో ఒక దుక్కిపాటి మధుసూధనరావు, మరెక్కడో ఓ రామోజీరావు, అక్కడక్కడా ఇలాంటి కె. మురారి లాంటి వాళ్ళని తప్పిస్తే, మిగతా అంతా ఆ పైని ‘డబ్బు పెట్టు, బాగా పోతే…’ సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్ముకుని చెల్లుబాటు అయిపోతున్నవాళ్ళే. ‘మంచి’ (సినిమా) అన్న విశేషణానికి నిర్వచనం కేవలం ప్రేక్షకాదరణే అన్నది కేవలం ఇప్పుడు ఉన్న పలుకుబడి కాదు. అది తరాల నాటి నానుడి. ‘మంచి’ సినిమా ఆర్థిక కళాఖండమై మిగిలిపోయిన దృష్టాంతాలు, మఖలో పుట్టి పుబ్బలో పోయినా (ప్రేక్షకుల స్మృతిపథం లోంచి) ఆడినంత కాలం దుమ్ము దుమారం లేపిన సందర్భాలు, అభిరుచి అన్న పదానికే అర్థం లేదన్న వాదనకి ఆలంబననిస్తాయి.

రాసి – వాసి

శతాధిక చిత్ర నిర్మాత రామానాయుడుగారి ఖాతాలో మంచి చిత్రాలు అని (కాల ప్రభావానికి తట్టుకుని నిలబడినవి) చెప్పుకోదగ్గవి, తీసిన వందలో- ఓ పదో పాతికో ఉన్నా విజయవంతమైనవి సగానికి పైగానే ఉన్నాయి. సినిమా తరాజులో కళకీ కాసుకీ సమతౌల్యం చెడకుండా చూసుకోవడమే నిర్మాత కర్తవ్యం. ఇందులో ఏ వైపు తక్కెడ పూర్తిగా ఒరిగిపోయినా ప్రయాస మిగిలిపోతుంది కానీ పూర్తి స్థాయి తృప్తి మాత్రం కలగదు. కేవలం డబ్బు చేసి పోతే సినిమా పని పూర్తి స్థాయి వ్యాపారమయిపోతుంది; పేరు మాత్రం మిగిలి నిర్మాతే పోతే తనకు మాలిన ధర్మమయిపోతుంది. సొంత డబ్బులు పెట్టి ‘సుడిగుండాలు, ‘మరో ప్రపంచం’ తీసి ఏఎన్నార్; ‘పిచ్చి పుల్లయ్య, ‘తోడు దొంగలు’ తీసి ఎంటీయార్, వాటిల్లో ఆర్టు మరీ ఎక్కువైపోయి డబ్బులకు మారు పేరు మాత్రమే తిరిగి వచ్చిన సంగతి గ్రహించి, తాము తీసిన తదుపరి చిత్రాల్లో పోపు ఘాటు కాస్త గట్టిగా ఉండేలా జాగ్రత్త పడి, విషయంతో పాటు వినోదం కూడా ఉండేలా చూసుకుని, మునపటి కన్నా మేలు విజయాలు పొందేరు. ఒక పది సినిమాలు తీయడానికి పూనుకుంటే అందులో ఒక రెండు సినిమాలన్నా డబ్బు చూసుకోకుండా తీయడం కూడా ఒక విధంగా వ్యాపార మెలకువే. తీసిన ప్రతి చిత్రమూ కళాఖండం చేయాలనుకోవడం, లేదా పూర్తి స్థాయి వాణిజ్యాంశాలు గుప్పించేసి దిమ్మతిరిగే హిట్టు కొట్టాలనుకోవడం, రెండూ కూడా ఆత్మహత్యా సదృశాలే. ఈ రెంటిలో ఇంకాస్త మొదటి దానికే కనీసం పేరన్నా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి (బీరం మస్తాన్ రావు ‘సువర్ణ సుందరి’ వి. శాంతారామ్ ‘నవ్‌రంగ్’ చిత్రానువాదం చందాన).

ఇక్కడే ఒక ఆర్థిక సూత్రం అక్కరకు వస్తుంది, అదే spreading the odds/bets. తాతల నాటి all eggs in one basket వారింపుకి కాలానుగుణ సవరణ ఇది. ప్రస్తుత హాలీవుడ్ బాక్సాఫీస్ సూత్రం కూడా ఇదే. వేసవి కాలంలో బళ్ళొదిలి పిన్నలూ పెద్దలూ ఊరి మీద పడి తిరుగుతూ వినోదం వెతుక్కునే రోజుల్లో వాణిజ్య ప్రధానమైన చిత్రాలు విడుదల చేసుకోవడం; ఇక చలి కాలంలో అందరూ గొళ్ళేలూ గడియలూ బిడాయించుకుని ఇల్లు కదలని వేళల్లో వాళ్ళని కదిలించే కథా బలమున్న సినిమాలు వదలడం ప్రస్తుత హాలీవుడ్ తంత్రం. కథా చిత్రానికి ఖర్చు నియంత్రించగలిగితే తీసే ఒక్క కమర్షియల్ సినిమా ఖర్చుతో ఒక పది చిన్న సినిమాలన్నా తీయచ్చు. ఆ తీసిన పదిలో హీన పక్షం ఒక రెండో మూడో నిలబడినా, తీసిన ఆ పది చిన్న సినిమాల పెట్టుబడి ఇబ్బడిముబ్బడిగా తిరిగి వచ్చేస్తుంది. 80వ దశకంలో నిర్మాతలు దర్శకులు ఇలా పదులేసి వందలేసి చిత్రాలు తీయడానికి గల కిటుకిదే! ఆ కాలాల్లో ఖర్చులూ ప్రస్తుతమున్నట్లుగా తారాపథాల్లో కాకుండా కాస్త నేల మీద నడవడం కూడా ఇందుకు ఉపకరించింది అనేది నిర్వివాదాంశం.

70వ దశకంలో హాలీవుడ్లో గొప్ప పరిణామం (ప్రయోగం) చోటు చేసుకుంది. స్టూడియోల పద్ధతి పూర్తిగా అంతరించి పోయాక, అప్పుడే ఫిల్మ్ స్కూల్స్ నుంచి బయటికి వస్తున్న కొత్త తరం దర్శకులకు (కొపోల, స్కోర్సెసీ, లూకస్, డి పాల్మ) పూర్తి స్వేచ్చ ఇచ్చి, వాళ్ళు కొత్త వాళ్ళను పెట్టి తీసిన కళాత్మక చిత్రాలను పెద్ద సినిమాలుగానే పరిగణించి, విస్త్రుత ప్రచారం చేసి, చివరికి వాటితోనే అద్భుత విజయాలు సొంతం చేసుకోవడం అన్నది అప్పటి వరకూ ఎవరి ఊహకూ రాని ఒక వింత ఆలోచన. (గాడ్ ఫాదర్, టేక్సీ డ్రైవర్, కేరీ, అమెరికన్ గ్రఫిటీ.) తెలుగులో ఈ మధ్య వినిపిస్తున్న కొత్త తరం దర్శకుల చిన్న సినిమాల ప్రయోగాలకి, అవి సాధిస్తున్న అఖండ విజయాలకి, నాటి 70వ దశకపు హాలీవుడ్ పరిస్థితికీ సామ్యం కనిపిస్తోందా? చిత్రసీమని, అది ఎక్కడిదైనా సరే, బ్రతికించేది అందరూ అనుకునే వాసి ఎంత మాత్రమూ కాదు, అది ఖచ్చితంగా రాశే. గంగిగోవు పాలు పండగలకు పనికొచ్చినా, దైనందినాన అక్కరకు వచ్చేది ఖచ్చితంగా ఖరము పాలే!

కొండ – మహమ్మదు

ఇలా సినిమాని రెండుగా విభజించి (ప్రజాత్మక, ప్రతిష్టాత్మక) వాటిని శలవలు, పండగలు, పరీక్షలు వంటి సామాజిక పరిస్థితులతో మేళవించి, ఏ కాలానికి తగ్గ ప్రయోజనాలు ఆ కాలంలో పొందడంలో హాలీవుడ్ స్టూడియోలు సిద్ధహస్తులయిపోయినాయి. వేసవి కాలానికి కాలక్షేపం బఠానీలు, చలి కాలానికి అవార్డుల సినిమాలు, ఈ రెంటికీ సంధి కాలంలో బతికుంటే బలుసాకు దక్కు సినిమాల సమయాలుగా వర్గీకరించుకుని ఏ కాలం ఫలాలు ఆ కాలంలో దక్కించుకుంటూ సుఖంబుగ ఉండెరని సూత మహాముని… ఇక ప్రపంచీకరణ పుణ్యమా అని ఆ వ్యాపార మెలకువలు, కిటుకులు మనవారు కూడా బాగా వంట పట్టించుకునే క్రమంలో భారత చిత్ర పరిశ్రమ కూడా ఈ మధ్య కాలంలో మంచి విజయాలనే మూటకట్టుకుంటోంది.

సినిమా ఆర్థిక విజయానికి అతి ముఖ్యమైనవి కథ, కాకరకాయ ఇవేమీ కావు, అది ప్రేక్షకుల అంచనాలకు, పరిధులకు మేర గీయడం. ఒక విధంగా ఈ అంచనాలను సరిదిద్దే పని, నిర్మాణం కన్నా అమ్మకం (మార్కెటింగ్) కోవకు వస్తుంది. సినిమా ఎంత కళాత్మకంగా ఉన్నా, గొప్ప అంచనాలు పెట్టుకుని వచ్చిన ప్రేక్షకులకు అవి ఏ మాత్రం చేరకపోయినా, ఫలితం పెదవి విరుపే. ఈ ఒక్క కారణం చేతనే ‘మంచి’ అని ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రాలకు విడుదలైన సమయంలో పెద్దగా ప్రేక్షకాదరణ లభించలేదు. టైటిలు పేరు ‘అత్తను వలచిన అల్లుడు’ అని పెట్టి లోపలికి వచ్చిన ప్రేక్షకుడికి గొప్ప ప్రబోధాత్మక చిత్రం చూపిస్తే, చెప్పేది ఎంత నీతిదాయకమైన విషయమైనా, చెప్పిన తీరు ఎంత హృద్యంగా ఉన్నా, డబ్బులు పెట్టిన ఇద్దరికీ -నిర్మాతకీ, ప్రేక్షకుడికీ- చివరకు మిగిలేది నిరాశే. ఇది చెత్త సినిమా అని ముందస్తుగా హోరెత్తించి, ఆ చెత్తనే తెర మీద చూపిస్తే, ప్రేక్షకులు ఆ నిజాయితీకి నిర్మాతకి సన్మానం చేయకపోయినా కనీసం ఉదయం ఆట రోజే డబ్బాలు వెనక్కి పంపించే పని మాత్రం చేయరు.

ఈ అంచనాల ఇబ్బంది అధిగమించడానికి తెల్లవాడు తెలివిగా కనిపెట్టిన యుద్ద తంత్రం, విభజించు-పాలించు. ఒకే స్టూడియోలో రెండు విభాగాలు. ఒక విభాగం అచ్చంగా జనబాహుళ్యానికి నచ్చే సినిమాల వైపే కేంద్రీకరిస్తే, మరో విభాగం భృకుటి ముడిచి చూసే సినిమాలను భుజాల మీద మోసుకునే పనిలో నిమగ్నమవడం. 20th సెంచరీ ఫాక్స్‌కి ఫాక్స్‌ సెర్చ్‌లైట్ స్టూడియోస్; వార్నర్ బ్రదర్స్‌కి న్యూ లైన్ సినిమా; యూనివర్సల్ స్టూడియోస్‌కి ఫోకస్ ఫీచర్స్– పెద్ద సినిమాలు చూసే పని ఒకరిది, చిన్న సినిమాల విడుదల బాధ్యత మరొకరిది. ఈ ప్రయోగం ఎంత ఫలించింది అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ చాలు. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తూ అప్రతిహతంగా కొనసాగిపోతున్న రోజుల్లో ప్రఖ్యాత హాలీవుడ్ ఏక్షన్ తార టామ్ క్రూస్‌కి హఠాత్తుగా కథా చిత్రాల వైపు గాలి మళ్ళింది. అప్పట్లో చేసిన ప్రతి చిత్రం వరసగా వందల మిలియన్ల డాలర్ల వర్షం కురిపిస్తున్నా ఎక్కడో ఏదో మూల ఒక అసంతృప్తి- తనని తారగానే పరిగణిస్తున్న ప్రపంచం, నటుడుగా గుర్తించటం లేదే అని. అనుకున్నదే తడవుగా మంచి కథాచిత్రంలో నుంచుని మాట్లాడే (మోకాళ్ళ మీద పడి బావురుమనే కూడా) చిన్న గంభీర పాత్ర ఒకటి ఎంచుకుని సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు వచ్చిన సమస్య, ఇది హాలీవుడ్ ఏక్షన్ తార టామ్ క్రూస్ సినిమా అని తన మిగతా చిత్రాలకు మల్లే ప్రచారం చేయాలా? లేక ఒక మంచి సినిమా, అందులో మిగతా నట దిగ్గజాలతో పాటు మీ అభిమాన నటుడు టామ్ క్రూస్ అని మార్కెట్ చేయాలా? ఇటువంటి సందిగ్ధాల కోసమే ఆ విభజించు – పాలించు సిద్ధాంతం. పేరుమోసిన పెద్ద స్టూడియోలు కాకుండా వారి కురచకారుకి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించి, విడుదల కూడా వేసవి వెళ్ళిన తరువాత ప్రకటించి, సినిమాలో క్రూస్‌ది ఇత్యాది పాత్ర అని ముందే అందరినీ సిద్ధం చేసి విడుదల చేశారు. అనుకున్నట్టే డబ్బుకన్నా పేరు ఎక్కువ వచ్చింది. కుతి తీరిపోయిన తారగారు మళ్ళీ కుస్తీ పాత్రలు ఆ స్టూడియోకే (ఈ సారి పెద్దవారి బేనర్లో) చేసిపెట్టేరు. సర్వులూ సుఖులే. ఇదే తరహా నియమిత నిర్మాణం గత కొన్నేళ్ళుగా హిందీలో, ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా రావడం గమనార్హం.

ఒక సినిమా ఆడడం కోసం ఇంత డొంక తిరుగుడు యవ్వారం దేని కోసం!

(వచ్చే భాగం – క్షణ భంగురము జవరాలి చిత్తము!)