త్రిక గణములను గుఱించిన కొన్ని విశేషములు

సులభ సూత్రాల గుఱించి బ్రౌన్ దొర ఇలాగంటాడు: To aid the memory, a learned German friend has given me the following sentence – మాయావీ యతాత్మా రావణః సహసా తంత్రాణి జజాప భావయ న ఇతి.

దీనికి బ్రౌన్ దొర అనువాదము – The deceitful self-controlling Ravana uttered his spells in haste, beginning with “Preserve us” (from death). ఈ గణవాక్యములోని పదములలోని మొదటి అక్షరములు గణముల పేరులతో ఆరంభమవుతాయి. [Sanskrit Prosody and Numerical Symbols Explained – Charles Philip Brown, Trubner and Co., London, 1869. page 3]

ఇలాటి ఒక గణ వాక్యమును తెలుగులో కూడ నేను కల్పించినాను, అది – మారాజా యశస్వీ రాడ్వరా సరసా తథ్యమ్ము జయమ్ము భావియు నవము.

+-+-+-+

గణములను జ్ఞాపకము పెట్టుకొనుటకై సులక్షణసారములో క్రింద ఇచ్చిన పద్యములు గలవు. అవి-

మగణము శ్రీనాథా యన
భగణము కేశవ యనంగఁ – బరికింపంగా
జగణము ముకుంద యనఁగా
సగణము వరదా యనంగ – సర్వజ్ఞనిధీ

నగణము వరద యనంగ
జగతి మురారీ యనంగఁ – జను యగణంబున్
రగణంబు మాధవా యనఁ
దగణము దైత్యారి యనఁగఁ – దామరసాక్షా

ఇట్లే మిగిలిన ఛందోగ్రంథములలో కూడ ఇట్టి పద్యములు గలవు. ఈ పద్యములలో ప్రతి గణమునకు ఉదాహరణము నిచ్చినను, పద్యము మొత్తము జ్ఞాపకము ఉంచుకొన్నప్పుడు మాత్రమే గణముల స్వరూపములు అర్థమగును.

క్రింద నేను ఉదాహరణ పదములతో గణముల పేరులు కూడ వచ్చునట్లు పదములను ఏరినాను. మొదటి మూడు అక్షరములు గణముల ఉదాహరణ, నాలుగవ అక్షరము గణము పేరు. మూడు అక్షరముల పదము, నాలుగు అక్షరముల పదము – ఇవి రెండు అర్థవంతములే. (ఏమయ్యా మగణము. కాని ఏమయ్యామ అంటే కృత్రిమముగా అర్థములేక ఉండును.)

మొట్ట మొదట పద్యములను క్రింద ఇచ్చుచున్నాను-

తేటగీతి-
దేవదేవ, సంపన్నామ, – దితిజదమన,
రాజసభలోన నీకెప్డు – పూజ జరుగు
నో సురాగ్రజ, గొల్చు నిన్ – వాసవుండు,
విమల వరహాస, విశ్వేశ, – విష్ణుమూర్తి,
మునిజనవినుత, సుకుమార, – మోహనాంగ,
భువనమును సదా మాయలోన – ముంతు వీవు,
కృష్ణ, వనమాలి, మాధవా, – కీర్తిభార,
నీదు సత్సంగతమె నాకు – మోద మొసఁగు

ఇందులోని గణముల కుదాహరణ పదములు-
సంపన్నామ – సంపన్నా – మ
రాజసభ – రాజస – భ
సురాగ్రజ – సురాగ్ర – జ
వరహాస – వరహా – స
మునిజన – మునిజ – న
సదామాయ – సదామా – య
కీర్తిభార – కీర్తిభా – ర
సత్సంగత – సత్సంగ – త

ఛందస్సును నేర్చుకొనునప్పుడు ఇట్టి పదములు చాల ఉపయోగ పడును. రెండు అక్షరముల గణములకు ఇట్టి పద్యము-

తేటగీతి-
పృథివి, పృథులాంబరము నిండె – విమల కాంతి
భామహ పదార్థముల నింపి – పాట నేను
భాసురముగ సురావముల్ – పాడుచుందు
మృదువుగాను దివ్యాంగా సు-మధురముగను

ఇందులోని గణముల కుదాహరణ పదములు-
పృథులా – పృథు – లా (లల)
భామహ – భామ – హ
సురావ – సురా – వ
దివ్యాంగా – దివ్యా – గా (గగ)

(భామహుడు గొప్ప అలంకారికుడు. పదమునకు, దాని అర్థమునకు నిర్దోషమైన సంబంధము కావ్యములలో నుండవలయు నని ఇతడు చెప్పెను. భామహుని కాలము భరతముని తఱువాత.)

+-+-+-+

య-మా-తా-రా-జ-భా-న-స-లగం సూత్రములోని గణములతో కల్పిత వృత్తము ఘనానంద –
ఘనానంద – య/మ/త/ర/జ/భ/న/స/లగ
IUU UU UU UIUI – UI UIU IIIII IIUIU
26 ఉత్కృతి 25122050

అనంగుండై యీ డెందమ్మందు నీవు – హర్ష దీపమై వెలుఁగులను విరజిమ్మరా
అనంతుండై యీ డెందమ్మందు నెప్పు – డంతు లేని ప్రేమ మను కృతి నిఁక వ్రాయరా
ఘనానందా యీ డెందమ్మందు గొప్ప – గానవాహినీ లయగతుల సుధ నింపరా
కనంగా రా కామాక్షా జన్మలోనఁ – గాలచక్రిగా మొదలు తుది ముడి విప్పరా

+-+-+-+

య-మా-తా-భా-న-స-జ-రా-ల-గం సూత్రపు గణములతో కల్పిత వృత్తము తపన –
తపన – య/మ/త/భ/న/స/జ/ర/లగ
IUU UU UU UIU – IIIII IIUI UI UIUIU
26 ఉత్కృతి 22412546

మురారీ హారీ నీకై వేచితిన్ – ముద మొసఁగఁ ద్వరగాను ముందు రమ్ము మోహనా
వరాంగా పద్మాక్షా నీరాకకై – వ్యధల నడు నిశిలోనఁ దార లెన్నుచుంటిరా
నిరాశా భావమ్ముల్ డెందమ్ములో – నెలవుకొనె విరహమ్ము హెచ్చ వేఁగుచుంటిరా
దరిన్ రా దాహమ్మున్ దీర్చంగ రా – తపన లను యనలమ్ము నార్ప నీకె యౌనురా

+-+-+-+

జ-రా-య-మా-తా-భా-న-స-ల-గం సూత్రపు గణములతో కల్పిత వృత్తము అజర –
అజర – జ/ర/య/మ/త/భ/న/స/లగ
IUIU IUIU – UU UU UU – IUIII III IUIU
26 ఉత్కృతి 25116758

వరాకృతీ స్ఫురద్యుతీ – భావానందా నీకై – పదమ్ములను మురిసి రచింతురా
హరీ యనన్ హరించుఁగా – నార్తుల్ బాధల్ నీయా – హసన్ముఖము గనఁగఁ దపింతురా
చిరమ్ముగా మనస్సులో – శ్రీపాదమ్మే యెప్డున్ – స్థిరమ్ముగను నునుతు శివప్రదా
విరాణ్ముఖా విలక్షణా – ప్రేమింతున్ రా నీవీ – వియోగినిని గనర భవప్రదా

+-+-+-+

చతురస్రగతిలో అన్ని త్రిక గణములతో తొలకరి అను కల్పిత వృత్తము –
తొలకరి – మ/ర/న/స/భ/త/జ/య
UU UU IUI – IIII UU IIU – UII UII UU
24 సంకృతి 3565521

దేవీ రావా రయమ్ము – తెనుఁగునఁ బాటన్ వినఁగాఁ – దేనియ బారఁగ నేఱై
జీవ మ్మీవే నిజమ్ము – సిరులిఁక నేలా చెలియా – సిందఁగ హాసము జల్లై
పూవుల్ బూయన్ వనమ్ము – ముదమున నిండెన్ గనఁగా – మోహన మామని రీతుల్
త్రోవల్ సూడన్ నవమ్ము – తొలకరి చుక్కల లలితోఁ – ద్రుళ్లెను నామదిఁ బ్రీతుల్

+-+-+-+

ఖండగతిలో అన్ని త్రిక గణములతో కల్పిత వృత్తము సొలపు –
సొలపు – భ/మ/న/య/జ/స/త/ర
UIIU UUI IIIU – UIU IIIU – UUI UIU
24 సంకృతి 5362631

భావములోఁ దారాడు సొలపులా – వ్యక్తమౌ పదములా – పాలూరు పల్కులా
రాగములో రంజిల్లు స్వరములా – రావ రాసకములా – రమ్యాంశ జ్యోత్స్నయా
యోగములో భోగాల పనసలా – యుగ్మ భాషణములా – యువ్విళ్లు మోహమా
వేగముగా వెంటాడు తలపులా – వింత చింతనములా – ప్రేమప్రయాణమా

+-+-+-+

అన్ని త్రిక గణములతో షణ్మాత్రల త్ర్యస్రగతిలో కల్పిత వృత్తము వసంత –
వసంత – ర/జ/భ/య/త/న/మ/స
UIUI UIUI – IIUU UUII – IIUU UIIU
24 సంకృతి 6538155
వందనమ్ము లెన్నొ యిత్తు – వరవీణన్ మ్రోఁగించుము – వనజాక్షీ రాగమయీ
సుందరమ్ముగాను గీతి – శ్రుతి కింపై శోభించఁగ – శుభవేళన్ బాడుదమా
చిందులేయు కాల మిప్డు – సిరి యబ్బున్ జ్ఞానమ్ముగ – చెలువమ్ముల్ బూయుఁ గదా
మందహాసమౌను నాకు – మధురమ్మై దీపమ్ముగ – మసృణమ్మౌ వెల్గు లిడన్

+-+-+-+

అన్ని త్రిక గణములతో మిశ్రగతిలో (3,4 మాత్రలతో) కల్పిత వృత్తము చారుహాసిని –
చారుహాసిని – ర/స/త/భ/న/మ/జ/య
UI UII UU – UI UII III UU – UI UII UU
24 సంకృతి 3439899

అక్షరసామ్య యతితో –
నంద ధామవిహారీ – నర్మహాసము లొలుక రావా – నన్ను జేరుము హారీ
విందు భోజన మిత్తున్ – వేగ నీదగు క్షుధయు దీరున్ – ప్రేమ పాయస మిత్తున్
వంద మాలల వేతున్ – వారిజానను సొబగుఁ జూడన్ – బాల మన్ననఁ జేతున్
ముందు రమ్మిట శౌరీ – పుల్కలీయఁగ ముదముతోడన్ – మోహనా మురవైరీ

ప్రాసయతితో –
రామ సుందరరామా – కోమలాంగుఁడ కమలనేత్రా – స్వామి శ్యామలరామా
సోమసుందర రామా – కామరూపుఁడ కరుణచిత్తా – భీమ విక్రమరామా
ఓ మనోహర రామా – భూమిపుత్రికి ననుఁగు భర్తా – భూమినాయక రామా
పామరుండను రామా – కామితార్థము లొసఁగు దేవా – ప్రేమమానస రామా

+-+-+-+

అన్ని త్రిక గణములతో మిశ్రగతిలో (4,5 మాత్రలతో) కల్పిత వృత్తము జీవానంద –
జీవానంద – మ/ర/భ/య/త/న/జ/స
UU UUI UU IIIU – UU UIII IIU IIIU
24 సంకృతి 7848849

ఏమో ఈరోజు నీవే మనములో – నీ నా యోచనలు గురిసెన్ ముసురుగా
వ్యామోహమ్మేమొ నా యీ యెడఁదలో – బాధల్ శూలములు బలమో యుడిగెనే
ప్రేమోద్రేకమ్ము నీపై గలిగెనే – ప్రేమానందములఁ గను టెప్పుడు ప్రియా
వ్యోమమ్మందుండు తారా కనుమ యీ – భూమిన్ నా దివియ ప్రియమౌ వెలుఁగులన్

+-+-+-+

అన్ని త్రిక గణములతో మిశ్రగతిలో (5,4 మాత్రలతో) కల్పిత వృత్తము సౌభాగ్య –
సౌభాగ్య – భ/య/న/మ/ర/జ/త/స
UIII UU – IIIU UU – UIU IUI – UUI IIU
24 సంకృతి 7512527

రాగసుమ వల్లీ – రజనిలో మల్లీ – రాత్రిలో జగమ్ము – రాజిల్లెఁ గనుమా
భోగముల నాడన్ – ముదముతోఁ గూడన్ – మోహినీ దినమ్ము – పూజింతు మదనున్
యోగమది యెప్డో – యుగములో నౌనో – యుల్లమా యెఱుంగ – నున్మాద మిదియా
యాఁగకను సాఁగున్ – హరుసమో కుందో – యార్తియో ముదమ్మొ – హాసమ్మొ దిగులో

+-+-+-+

అన్ని త్రిక గణములతో కల్పించిన త్రిపద మధూదయము –
మూడు పాదములలో ఏ వరుసలోనైనా క్రింది గణములు ఉండవలయును. ప్రతి పాదములో గురు లఘువుల అమరికలో దర్పణ సాదృశ్యము గలదు.

మధూదయము – మ-న-న-మ / భ-య-త-స / ర-జ-జ-ర
రాగములు పాడన్ – రంజిల్లు హృదియున్
సాఁగు నీ భవమ్ము – జ్వలించు తారగా
రాగాన్వేషణకు – రమణ మీ త్రోవల్

+-+-+-+

అన్ని త్రిక గణములతో ఒక విషమ వృత్తము ప్రమోద –
నాలుగు పాదములలో ఏ వరుసలోనైనా క్రింది గణములు ఉండాలి. త్రిక గణములలో ప్రతి గణము రెండు మారులు కనబడుతాయి. అంతే కాదు, ప్రతి పాదపు అమరికలో ఒక దర్పణ సాదృశ్యము గలదు.

ప్రమోద – మ-న-న-మ / భ-త-య-స / త-భ-స-య / ర-జ-జ-ర
దేవీ రమ్ము దశ – దిశలు వెల్గంగా
జీవమ్ము పిల్చెను – చెలువంపు వీథిన్
మోవియుఁ దెల్పెను – ముదమ్మిందుఁ గదా
నీవు నేను ప్రేమ – నిజమ్మిదే సదా

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...