Nails

వెళ్ళాలమ్మా నెయిల్స్‌కి.

కాలి గోళ్ళు, వేలి గోళ్ళు శుభ్రంగా కడిగి, గీరి, తుడిచి నీటుగా రంగులేసి పెడతారమ్మా శుభ్రజ్యోత్నా పులకిత యామినిలాగానూ.

వేళ్ళేమో మరి ఇలాగిలాగిలాగ పట్టుకుని గిలిగింతగా మస్సాజు చేస్తాంటే ఆ తర్వాత ఇంత బారు పెరిగిన నీ పిచ్చి గోళ్ళను రౌండ్‌గా, ఓవెల్‌గా షేప్ చేస్తాంటే, అది నీకు అప్పుడేమో,

నీలాలకా జాల ఫాల కస్తూరికా
తిలకంబు నేమిట దిద్దువాడ
నంగనాలింగనా నంగ సంగర ఘర్మ
శీకరం బేమిట జిమ్మువాడ
మత్తేభగామినీ వృత్తస్తనంబుల
నెలవంక లేమిట నిల్పువాడ
భామామణీ కచాభరణ శోభితమైన
పాపట నేమిట బాపువాడ
ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి
కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి
…అహహ!
పోయె నా గోరు తన చేతి పోరు మాని

అని గుర్తొచ్చి నవ్వొస్తే ఆ హాస్ అర్తం కాక ఆ ఆరడుగుల చయినావోడు ఈస్ తిస్ ఓఖే అని ఖంగారూగా అడిగితే నీకేమో కొస వెర్రి చక్కిలిగిలి.

మరి సుక్రోరం గోళ్ళు తీకూడదంటాది నీ వైజాగు రూమ్మేటు గరల్. మా పెకాశంలోనూ అంతే అంటావు నువ్వు అనకపోతే ఏం తంటాలో అని.

మరి సుక్రోరంనించే బడ్వైజరులు విత్ చికెన్ అండ్ అదీ ఇదీ మొదలౌతాయమ్మా మనోళ్ళ దగ్గిర. సంగతి తెలీక నువ్వేమో చలవ చేస్తాదని బాగా కొబ్బెరి నూనీ తలకి రాసుకోని, నీ మార్కాపురం మొగమేసుకుని ఆళ్ళ కాడకి పోతావా, deterministic system analysis సిలువని, neural networks సిలువని భారంగా మోసుకుంటూ, ఆదుర్దాగా ప్రోజెక్ట్ డెడ్‌లైన్ వచ్చేసిందని– ఆళ్ళేమో నీకు లిఫ్ట్ దగ్గిరే ఎదురౌతారు డవ్వు సబ్బు వాసనల్తో నీలి మబ్బు నురగలో కాలు జారి పడ్డ వేళ నీకు నిద్దరే నో నో అనేసి న్యూడ్ బార్స్‌లో లాప్పులమ్మా, అప్పల్నర్సమ్మా నువ్వెళ్ళి సాగర సంగమం, శంకరాభరణం సూసుకో బుజ్జమ్మా, మేవలా పోయొస్తామని–చిలిపి చిలిపి కవ్వింత కబుర్ల కళ్ళతో అలాలాలా లిఫ్టు దిగిపోతా ఉంటే, ఆళ్ళు కుర్రోలమ్మా ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సందుగొందుల సీక్రెట్లన్నీ ఔపోశన పట్టి జయించాలమ్మా పెపంచకాన్ని రేప్పొద్దున్న.

నువ్వేటమ్మా గోళ్ళకి మాచింగు రంగులేసుకో బాగుంటాది. భారత దేశము-భౌగోళిక స్వరూపము, ఇండియా-చైనా-రష్యా అంతర్జాతీయ సంబంధాలు, మిరప పంటకి గిట్టుబాటు ధరలు, కారంచేడు సంఘటన, ఎంపీల రాజీనామాలు సమంజసమా అసమంజసమా, వద్దమ్మా తల్లీ. చేతి వేళ్ళు. కాలి వేళ్ళు. వాటి గోళ్ళు. ఇంకా మాంచి బ్యూటీఫుల్‌గా డ్రెస్సప్పవ్వాలమ్మా ఏ జిల్లా జిల్లా పిల్లా నీది పెకాశం జిల్లా చిన్నమ్మా. ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా మొత్తం కావలెనా చిట్టి పిల్లడూ అనుకుంటానూ.

గోళ్ళకి రంగంటేనూ గోరుచుట్టు లేసినట్టు మొగం పెడతావు. అంతుకే నీకు పోతన, శ్రీశ్రీ, ఆరుద్రారుద్ర నన్నయ్యా ఆయినికి అన్నయ్య తప్ప ఎవురూ మిగల్లేదు సుబ్బలచ్చిమీ.

ఆ సునీతాని చూడు ఫేక్ గోళ్ళు అంటిపించుకుని ఆకుపచ్చ రంగు, పసుప్పచ్చ రంగు ఓ గోరుకది ఓ గోరుకిదీ ఏసుకునొత్తాది. దానికి కాంపస్ నిండా ఫాన్ ఫాలోయింగు. సబ్బవరమే పిల్లా మాది సుబ్బులోళ్ళమే పిల్లా మేమూ అనుకుంటా.

గోరింటాకు చేతులు, ఆ కృష్టశాస్త్రి, ఆ అష్టపదులు, ఆ పుస్తకాలు, కవిత్వాలూ సాహిత్యాలూ ఎవడికమ్మా దిబ్బలోకి. ఎంసెట్టు, జీఅరీ, టోఫెల్- యూ సీ, సీ, సీ ప్లస్, సీ ప్లస్ ప్లస్ ఇంకా నోరూరించే జావా, ఆర్, డాట్ నెట్టు పైతానమ్మా. ఉజ్జోగం అంటే సాఫ్ట్వేరేనమ్మోయి.

ప్రియే చారు శీలే
నాపైని అలకేమి ఓ కామిని
నా మేన నఖ ముద్ర కెంపులే వెలుగని.

నీలి నీలి సినేమాలు చూసుకుంటా రూమ్ రెంటు షేర్లు లెక్కలేసుకుంటా ఖాళీ బడ్వైజరు టిన్నులు పోగేసి అమ్ముకునే చెత్తనాకొడుకుల్లో నా రాకుమారుడు లేడంటావు గానీ అదే రియాలిటీరా వెర్రి తల్లీ. ఆ పుష్కాల్లోంచి పుట్టిన తలకాయని శీకాయి వేసి వేళ్ళతో బాగా రుద్దు.

అంతకు ముందు వెళ్ళు నెయిల్స్‌కి ముందు.

Pedicure $27
Manicure $16.