పాత పద్యం

ప్రయోజకుడు కాని కొడుకు మీదే
ఎక్కువ ప్రేమ పెంపొందినట్టు
అంత ఫలవంతం కాని ఒక పాత పద్యం మీద
తెలియని ఆపేక్ష కలుగుతుంది.

పాత సంచికల చీకటి పొరల్లో
భయంభయంగా దాగిన పద్యాన్ని చూసినప్పుడు
చటుక్కున అందుకొని,
అక్కున చేర్చుకోవాలనిపిస్తుంది.

బెత్తం దెబ్బలు తిన్న అరచేతికి
వెన్న రాస్తూ కన్నీరు పెట్టే తల్లిలా
నలిగిన దీని పాదాలని మునివేళ్ళతో
మృదువుగా తాకాలనిపిస్తుంది.

ఒకసారి ఓడిపోయిన పద్యం ఇక
మళ్ళీ ఎప్పటికీ గెలవకపోవచ్చు.
తలవంచి కనులు దించిన దీనిని
ఓటమి, గెలుపులు నాకొకటేనంటూ
ఓదార్చాలనిపిస్తుంది.

మరుగుపడిన పద్యం
మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది.
నిదర పట్టని ఏ దిగులు రాత్రిలోనో తిరిగి
దీనంగా కళ్ళల్లో మెదుల్తుంది.