గురుత్వాకర్షణ సుంకం

ఉత్తరం విప్పుతుండగానే అతడి చేతులు వణికాయి. అది ఎక్కణ్ణుండి వచ్చిందో తెలుసు. ఇది మూడో రిమైండర్. మూడు నెలలుగా అతడు గురుత్వాకర్షణ సుంకం కట్టలేదు. వెంటనే కట్టేయమని చివరి రిమైండర్‌గా పోస్టల్ మెయిల్ పంపించారు. రెండేళ్ళుగానే ఈ బెడద. అంతకు ముందు ఇలాంటొక వైపరీత్య శాఖ ఉండేది కాదు.

“మేడమ్!”

“చెప్పండి, నేను మీకెలా సాయపడగలను?”

“గురుత్వాకర్షణ సుంకం చెల్లించమని రిమైండర్ వచ్చింది.”

“ఎవరు మాట్లాడుతున్నారో మీ వివరాలు చెప్పగలరా?”

“నేను 14 లారన్స్ వీధి నుండి మాట్లాడుతున్నాను.”

“సరే. మీ సమస్యేంటో చెప్పండి.”

“ఈ గురుత్వాకర్షణ సుంకం చాలా ఎక్కువగా ఉంది. మరోసారి పరిశీలించగలరా?”

“ఒక నిముషముండండి. మీ అకౌంట్‌లోకి లాగాన్ అవుతాను. గతనెల కూడా మీతో మాట్లాడాము కదా? అంతకు మునుపుకూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు. మొదట్లో చక్కగా చెల్లించుకుంటూ వచ్చారు. ఉన్నట్టుండి మీకేమైంది? మూణ్ణెల్లనుండి కట్టట్లేదు.”

“నా ఆర్థిక స్థితి క్షీణించిపోయింది.”

“దానికి మేమేం చెయ్యగలం? మా శాఖ నియమాలు షరతులు ఉన్న బ్రోషూర్ మీకు ఇచ్చాము కదా, దానికి లోబడే అన్ని చార్జీలూ వేయబడి ఉన్నాయి.”

“మేడమ్, మీ బ్రోషూర్ చాలా ఘనంగా ఉంది. అందులో నలుసంత అక్షరాల్లో రాయబడిన వాక్యాలు. ఒక్కో వాక్యం అర్థం చేసుకునేలోపు పూర్వం చదివిన వాక్యాలు గుర్తుండట్లేదు. అసలు అర్థమే కావట్లేదు. క్లిష్టంగా ఉంది మీ చార్జీల లెక్కల విధానం! చాలా అన్యాయం అనిపిస్తున్నాయి ఈ చార్జీలు.”

“అర్థం కానంత మాత్రాన, క్లిష్టంగా ఉన్నంత మాత్రాన అవి అన్యాయంగా ఉన్నాయని ఎలా అంటారు? మీరు నీటికి బిల్లు కడుతున్నారు, కరెంటుకు బిల్లు చెల్లిస్తున్నారు. గ్యాస్ బిల్లు, సూర్యరశ్మి బిల్లు, గాలి పరిశుభ్రత చార్జీలు అని అన్నిటికీ చెల్లిస్తున్నారు. టీవీ, సెల్‌ఫోను, బ్రాడ్‌బ్యాండ్ ఇలా అన్ని సబ్‌స్క్రిప్షన్‌ల బిల్లులూ సరిగ్గా టైముకు చెల్లించేస్తున్నారు. ఈ ఒక్క గురుత్వాకర్షణ చార్జీల బిల్లులో మాత్రం ఏం లోపం ఉందని కట్టకుండా సతాయిస్తున్నారు?”

“మేడమ్, భూగురుత్వాకర్షణ శక్తికీ నాకూ ఏంటి సంబంధం? ఆది నుండి అది ఉంటూనే ఉంది. న్యూటన్ దాన్ని కనుగొనే ముందు కూడా అది ఉందనే అంటున్నారే, మరి ఇంతకాలం దానికి చార్జీలు చెల్లించమని బిల్లులు పంపించలేదే! ఇప్పుడీ రెండేళ్ళుగా దానికీ సుంకం చెల్లించమంటే ఎలా?”

“సార్, మీ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఈ ప్రశ్న రెండేళ్ళ క్రితమే అడగాలని మీకెందుకు అనిపించలేదు? ప్రభుత్వం నీరుని పైపుల్లో మీ ఇంటిదాక తెచ్చి సరఫరా చేస్తుంది. గాలిని శుభ్రపరిచి శ్వాసించడానికి పంపిణీ చేస్తుంది. ఇంటి కప్పు మీద పడే సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చుకోడానికి అనుమతిస్తుంది. చాలనప్పుడు కరెంటు ఇస్తుంది. వంట గ్యాసు ఇస్తుంది. వీటన్నిటికీ బిల్లులు సకాలంలో కట్టేస్తున్నారు. అయితే గురుత్వాకర్షణశక్తికి మాత్రం బిల్లు కట్టమంటే ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. ఆలోచించండి. గురుత్వాకర్షణశక్తి లేకుంటే మీరొక్క నిముషమైనా బ్రతగ్గలరా? కారు నడపగలరా? నడవగలరా? మీ పిల్లలు ఆడుకోగలరా? లఘుశంక తీర్చుకోవడంవంటి అతి చిన్న కార్యం కూడా చేసుకోలేరు ఈ గురుత్వాకర్షణశక్తి లేకుంటే…”

“మేడమ్, నా చిన్న బుర్రకి ఇవన్నీ అర్థం చేసుకోడానికి సమయం పడుతుంది. ఇందులో మీ శాఖ ఏం చేస్తోంది? గురుత్వాకర్షణని శుభ్రపరుస్తోందా? ప్రతి ఇంటికీ తీసుకెళ్ళి సరఫరా చేస్తోందా? ఇవేవీ చెయ్యనప్పుడు బిల్లెందుకు చెల్లించాలి? మీకు ఇది అన్యాయం అనిపించట్లేదా?”

“ఈ దేశంలో ఉన్న అందరూ గురుత్వాకర్షణ సుంకం కడుతున్నారు. ఐరోపా దేశాల్లోనూ అందరూ కడుతున్నారు. కొన్ని ఆఫ్రికా దేశాలు కూడా ఈ సుంకం కట్టడం మొదలుపెట్టాయి. ప్రపంచం అతివేగంతో అభివృద్ది దశలో ముందుకు సాగిపోతూ ఉంది. మీరు సుగుణాలున్న దేశపౌరుడిగా నడుచుకోవట్లేదు. గురుత్వాకర్షణశక్తి అవశ్యకతని గ్రహించి, దానివల్ల లబ్దిపొందుతూ కూడా దానికి చెల్లించాల్సిన సుంకం చెల్లించకుండా ఉండటం చాలా బాధాకరం. దీని గురించి మా పైవాళ్ళకి నేను రిపోర్ట్ పంపించక తప్పదు.”

“మేడమ్, మీ తీయని స్వరంలో రిపోర్ట్ అన్న మాట రావచ్చా? ఈ శాఖ మొదలైనప్పట్నుండి నేను బిల్లులన్నీ సరిగ్గానే చెల్లిస్తూ వస్తున్నాను. నాకు దేశభక్తి, భూభక్తి, భూగురుత్వాకర్షణభక్తి మెండుగానే ఉన్నాయి. గురుత్వాకర్షణ గురించి ఒక కవితైనా చదవకుండా ఏ రోజూ నేను నిద్రపోయినవాడిని కాను. మేడమ్, ఎలాగైనా నేను ఈ బిల్లు చెల్లించేస్తాను. శ్రమ కలిగించినందుకు క్షమించండి. సెలవు.”

“సెలవు.”


“హలో!”

“హలో!”

“ఇది 14 లారన్స్ వీధి ఇల్లేనా? ఇంటి పెద్దేనా మాట్లాడేది?”

“అవును, నేనే! చెప్పండి.”

“సార్, నేను గురుత్వాకర్షణ శాఖనుండి మాట్లాడుతున్నాను. మీరు నాలుగు నెలలుగా మా సేవలు వాడుకుంటూ మాకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడంలేదు. మీ మీద చర్యలు తీసుకోవలసిన సమయం దగ్గరపడుతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాను.”

“మేడమ్, ఇదేం బాగాలేదు. నేను కొంచం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. కట్టనని చెప్పడం లేదు, కొంచం అవకాశమివ్వండని అడిగాను. గురుత్వాకర్షణ నిండుకునే లోపు ఎలాగైనా కట్టేస్తాను.”

“మీరు తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నారు. దీనితో మీకు ఎనిమిది అవకాశాలు ఇచ్చేశాము. మా రికార్డ్‌ల ఆధారంగా చూస్తే మీరు పెద్ద మోసగాడని తెలుస్తోంది. మీరు వెంటనే మొత్తం బాకీ చెల్లించకపోతే ఘోరమైన పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.”

“మేడమ్, అంత పెద్ద మాటలెందుకండీ! మోసం అన్న పదానికి స్పెల్లింగైనా తెలుసుకోగల మేధస్సు లేనివాణ్ణి. నేను అలాంటివాడిని కాను. చిన్నతనంలో అమ్మ పెంచిన కోడిపిల్లల్లో ఒకదాన్ని ఆమెకు తెలీకుండా దొంగిలించి అమ్మిన సంఘటనని మీకెవరో చెప్పేసినట్టున్నారు. గంధర్వ సంగీతంలాంటి మీ స్వరంలో ఇలాంటి మాటలు పలక్కండి. వచ్చేనెల మొత్తం చెల్లించేస్తాను.”

“మంచిది. అలానే చెయ్యండి. వచ్చేనెల మా డిపార్ట్‌మెంట్ నుండి ఎవరూ మీకు ఫోన్ చెయ్యకుండా చూసుకోండి.”

“సంతోషం మేడమ్. ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి.”

“అడగండి.”

“ప్రతినెలా ఈ చార్జీలు పెరుగుతూ ఉన్నాయి! అదెందుకండీ?”

“మేము పంపించిన సర్కులర్ 148.8ని మీరు చదవలేదా?”

“లేదు మేడమ్!”

“అందులో నలభై ఎనిమిదో పేజీ చదవండి. గురుత్వాకర్షణశక్తిని మీరు వాడుతున్నారు, మీ ఆవిడ వాడుతున్నారు, మీ ఇద్దరు పిల్లలు వాడుతున్నారు, మీ అత్తగారు వాడుతున్నారు. ప్రతినెలా మీ బరువు పెరుగుతోంది కదా? అందుకే చార్జీలూ పెరుగుతున్నాయి. మీ ఎనిమిదేళ్ళ పిల్లాణ్ణి అడిగినా దీనికి జవాబు చెప్పుండేవాడు!”

“మా అబ్బాయికి ఎనిమిదేళ్ళని మీకెలా తెలుసు? నా ప్రైవసీకి భంగం వచ్చేలా ఉందే!”

“సార్, మాకు అన్నీ తెలుసు. మీ బాబు పుట్టింది రెయిన్‌బో హాస్పిటల్స్‌లో. పుట్టినప్పుడు వాడి బరువు 2కేజీల 700ల గ్రాములు అని నమోదయ్యుంది. మీ భార్య చుట్టుకొలత పెరుగుతూ ఉంది, దాన్ని గమనించారా?”

“మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు…”

“బిల్లెందుకు పెరిగిందంటే దానికి వివరణ ఇస్తున్నాను. ఈ వేరియబుల్ చార్జెస్ వల్ల లబ్ది పొందినవాళ్ళే ఎక్కువ. కొంతమంది దీన్ని సవాలుగా తీసుకుని విపరీతంగా బరువు తగ్గిపోయారంటే చూసుకోండి!”

“మేడమ్, మా బరువు పెరగడం మీకెలా తెలుసు?”

“మీరు సర్కులర్ 133.6ని చదివినట్టులేరు. నేడు మీ బరువు 79 కేజీలు. పోయిన నెల 77 కేజీలే ఉండేవారు. మీ ఇంటి లివింగ్ రూములో పెట్టిన మంత్రనయనాలు మీ బరువు డేటాని మాకు పంపుతాయి.”

“మేడమ్, మేము మధ్యలో ఓ రెండు వారాలు ఈ దేశంలోనే లేము. వెకేషన్‌కి విదేశాలు వెళ్ళాము. దాన్ని మినహాయించలేరా? నేను ఆ రెండువారాలు గుర్తుత్వాకర్షణశక్తిని ఈ దేశంలో వాడలేదు కదా?”

“సార్, వీటన్నిటి గురించీ మా డిపార్ట్‌మెంట్ ఎంతో ముందు చూపుతో ఆలోచించింది. ఎప్పట్నుండి ఎప్పటిదాక మీరు ఈ దేశంలో లేరో ఆ వివరాలూ ప్రూఫులూ పెట్టి ఒక డిక్లరేషన్ లెటర్ మాకు పంపించండి. మీరు వెళ్ళిన దేశంలో చెల్లించిన గురుత్వాకర్షణశక్తి బిల్లు రసీదు తప్పనిసరిగా జతచేయండి. మేము పరిశీలించాక ఆ క్రెడిట్‌నీ మీ అకౌంట్‌లో కలిపేస్తాము.”

“ధన్యవాదాలు మేడమ్! మీ సమర్థవంతమైన జవాబులు తూటాల్లా నా గుండెను చీల్చాయి కానీ మీ తీయని స్వరం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే ఒక్క ప్రశ్న అడగడానికి అవకాశం ఇవ్వగలరా?”

“సరే. అడగండి.”

“మా అత్తగారు మంచంపట్టారు. ఆమె ఎప్పుడూ మంచంలోనే పడుంటారు. పక్కన ఒక గ్లాసులో ఆమె తాగడానికి పాలు ఉంటాయంతే. ఆమె గురుత్వాకర్షణశక్తిని అసలు వాడటమేలేదు. దానికేమైనా డిస్కౌంట్ ఉందా?”

“ఇలాంటొక అమానుషమైన ప్రశ్న మీరు ఎలా అడగగలుగుతున్నారో నాకర్థం కావట్లేదు! మీ కాఠిన్య మనస్తత్వానికి సిగ్గుపడుతున్నాను. మీ అత్తగారు గురుత్వాకర్షణశక్తిని వాడకపోతే మంచం మీద ఎలా పడియుండగలుగుతారు? ఆమె ఎప్పుడో అంగారక గ్రహం దాటి ఎగిరిపోయుండేవారు. గురుత్వాకర్షణ శక్తివల్లే ఆమె దక్కారన్నది గుర్తించండి.”

“క్షమించండి. నాకు జ్ఞానం కలిగించారు. ఈ రోజే గురుత్వాకర్షణ సుంకం చెల్లించేస్తానని మాటిస్తున్నాను.”

“ముందు ఆ పని చెయ్యండి. సెలవు.”


“హలో!”

“హలో!”

“సార్, మీ హామీ కూడా అంగారక గ్రహం దాటుకుని ఎగిరిపోతూ ఉంది. ఈ చివరి హెచ్చరిక ఇస్తున్నందుకు చింతిస్తున్నాను. ఇంక ఒక వారం లోపు మీరు బాకీ చెల్లించేయాలి.”

“మేడమ్, ఏంటిలా సతాయిస్తున్నారు! నేనేమైనా డబ్బు ఉంచుకునే కట్టట్లేదా ఏంటి? గాలికి బిల్లు కట్టాను, గ్యాస్ బిల్లు కట్టాను, నీటి బిల్లు కట్టాను, కరెంటు బిల్లు కట్టాను.”

“అదే నేనూ అడుగుతున్నాను. అన్ని డిపార్ట్‌మెంట్లకీ కడుతున్నారు. గురుత్వాకర్షణ బిల్లు చెల్లించడానికి మాత్రం ఎందుకింత జంకుతున్నారు?”

“దానికి కారణం మీకు తెలుసు కదా?”

“లేదు. తెలీదు. దయచేసి ఆ రహస్యమేదో చెప్పి నాకు జ్ఞానోదయం కలిగించండి!”

“కరెంటు బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్ చేసేస్తారు. గాలి, టెలిపోన్, బ్రాడ్‌బ్యాండ్, గ్యాస్- అన్నిటికీ అంతే. గురుత్వాకర్షణ శక్తికి కట్టలేదనుకోండి దాన్ని కట్ చేసేస్తారా? న్యూటన్ మళ్ళీ పుట్టుకొచ్చినా అది చెయ్యడం అసాధ్యం కదా?”

“సార్, సర్కులర్ చదివి కూడా అర్థం చేసుకోలేని మీరే ఇన్ని తెలివి తేటలతో ప్రశ్నిస్తున్నప్పుడు ఈ డిపార్ట్‌మెంట్‌ని నడిపే సైంటిస్ట్‌లు ఇంకెంతగా ఆలోచించగలరో మీకు తెలిసినట్టులేదు. గతవారం పత్రికలు చదవలేదా?”

“మీరు నా నాలుగో క్లాసు టీచర్‌లా కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు.”

“సార్, మీరు మా సర్కులర్‌లు చదవరు. పత్రికలేం పాపం చేశాయని? వాటిని చదవచ్చు కదా?”

“మేడమ్, నా కలలో దుష్టదేవతలొచ్చి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నన్నేం చెయ్యమంటారు?”

“సరే, దుష్టదేవతలు వెళ్ళిపోయాక పత్రికలు చదివి తెలుసుకోండి.”

“మేడమ్, నన్నూరించి ఆసక్తిని పెంచకండి. పేపర్‌లో ఏమొచ్చిందో దయచేసి చెప్పండి.”

“ఓకాయన ఎనిమిది నెలలపాటు గురుత్వాకర్షణ సుంకం కట్టకుండా మీలాగే ఎగ్గొట్టాలని చూశాడు.”

“అవునా?”

“అతనికి పెనాల్టీ విధించాము. అతను దాన్నీ కట్టలేదు. కావున ఇతను ఇకపై గురుత్వాకర్షణ శక్తినే ఉపయోగించకూడదని నిర్ణయించాము.”

“తర్వాతేం జరిగింది?”

“అతణ్ణి స్పేస్‌షిప్‌లో తీసుకెళ్ళి భూగురుత్వాకర్షణకి బయట దింపేశాము. ఒకసారి అతడు భూమిని ప్రదక్షిణం చేశాడు. ఈలోపు మనసు మార్చుకుని కట్టేస్తానని ఒప్పుకున్నాడు. మళ్ళీ భూమ్మీదకి తీసుకొచ్చేశాము.”

“నిజంగానా?!”

“దెబ్బకి మొత్తం బాకీ, వడ్డీ, పెనాల్టీతో సహా చెల్లించేశాడు. అయితే ఒక చిక్కు…”

“ఏంటది?”

“స్పేస్‌షిప్‌లో తీసుకెళ్ళిన ఖర్చు, స్పేస్‌సూట్ ఖరీదు, ఇతర ఖర్చులన్నిట్నీ ఇప్పుడు నెలనెలా ఇన్‌స్టాల్మెంట్స్‌లో కడుతున్నాడు. 2196 నెలలు కట్టాలి.

“2196 నెలలా?!”

“అవును. మొత్తం కట్టడానికి 183 ఏళ్ళు పడుతుంది.”

“అన్నేళ్ళు బతగ్గలడా?”

“అవన్నీ నాకు తెలీదు. అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చారు.”

“మేడమ్, నేను ఇప్పుడే మీ బాకీ మొత్తం నయాపైసాతో సహా చెల్లించేస్తాను.”


“హలో!”

“హలో!”

“మీ గురించి గురుత్వాకర్షణ శాఖవాళ్ళు కొనియాడారు. మీరు వాళ్ళ బిల్లులన్నిట్నీ వెంటవెంటనే కట్టేస్తున్నారని తెలిపారు.”

“ధన్యవాదాలండి. మీరెవరు? జలుబు చేసిన బాతు గొంతులా ఉందే?”

“నేను భూప్రయాణశాఖ నుండి మాట్లాడుతున్నాను.”

“ఇదేంటి, కొత్త శాఖా?”

“సార్, మా లేఖలుగాని, సర్కులర్‌లుగాని, ఒకటీ అందలేదా మీకు? మూడు నెలలుగా మీ బాకీ నిలవ వుంది. అందుకే ఫోన్ చేశాను.”

“ఏం బాకీ?”

“భూమి ప్రయాణ ఖర్చు. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మీకు తెలుసు కదా? ఒకసారి భూమి సూర్యుని చుట్టూ తిరిగితే మీరు 92,960,000 మైళ్ళ దూరాన్ని దాటుతున్నారు. ఆలోచించండి. ఇన్ని మైళ్ళ దూరాన్ని రూపాయి ఖర్చులేకుండా మీరు ఉచితంగా వాడుతున్నారు. ఇకనుండి అది ఉచితం కాదు. ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందే.”

“అవునా?! ఎంత గొప్ప విషయం చెప్పారు! ఇకనుండి రోజులతో కాకుండా మైళ్ళతో ఎంచవచ్చు మన ఆయుర్దాయాన్ని. తలుచుకుంటేనే పులకింతగా ఉంది.”

“ముందు మూడు నెలల బాకీ చెల్లించేసి తర్వాత పులకితులవ్వండి. మీరు ప్రయాణం చేసిన దూరం 23,240,000 మైళ్ళు.”

“దాందేముంది? పాట పాడుకుంటూ ఒక చెక్కు రాసి సంతకం చేసి పంపిస్తాను. ఒక ప్రశ్న మేడమ్. ఇందులో విమానంలో ఉన్నట్టు బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాసులున్నాయా?”

“లేదు. ఇక్కడ అందరూ సమానమే.”

“చాలా సంతోషం. నాకు సమానత్వం ఇష్టమే. మా అమ్మకు కూడా ఇష్టమే.”

“మీకు మరో ఆఫర్ ఉంది. చెప్పనా?”

“అవునా, చెప్పండి.”

“లీప్ సంవత్సరంలో ఒకరోజెక్కువ కదా? అయితే మేము దానికి ఎక్కువ చార్జ్ చెయ్యడంలేదు. లీప్ సంవత్సరంలో కూడా అదే చార్జీనే!”

“నమ్మలేకపోతున్నాను. ఈ శుభవార్త అందించిన మీకు ఒక ముత్యాల హారం బహుమతిగా ఇచ్చినా తక్కువే! లేదూ, చుక్కలు పడని ఒక ఆపిల్ ఇచ్చినా తగును. వింటుంటేనే మనసు పులకించిపోయింది. మేడమ్, ధనవంతుల దగ్గర బాగా డబ్బులుంటాయి. వాళ్ళెక్కువ చార్జీలు చెల్లించచ్చు కదా?”

“చూడండి, మీ బుర్రెంత చురుగ్గా పని చేస్తోందో! మీలాంటి మనుషులే ఈ భూమ్మీద ఉండాల్సింది. మీరు విమానమెక్కేప్పుడు మీ దగ్గర ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు అదనంగా డబ్బులు కడతారు కదా? అలానే ఇక్కడ కూడా!”

“అంటే?”

“ఒక ధనికుడి దగ్గర నాలుగు ఇళ్ళు, ఐదు కార్లు, ఇంకా ఏవో వస్తువులూ ఉన్నాయనుకుందాం. అతను ఎక్స్‌ట్రా చార్జీలు చెల్లించాలి. మామూలు ప్రజలు ఎక్కువగా ఏం కట్టనవసరంలేదు. మీకు ఆ ఎక్కువ భారం ఉండదు.”

“మేడమ్, మిమ్ముల్ని ఎలా అభినందించాలో తెలీడంలేదు. ఈ రోజే నా భూప్రయాణ చార్జీని చెల్లించేస్తాను.”

“మంచిది. ఏంటక్కడ శబ్దం?”

“ఏంలేదు మేడమ్. భూమి తిరుగుతోంది కదా? ఇరుసుకి నూనె తగ్గినట్టుంది. నాలాంటి వాళ్ళు డబ్బులు చెల్లించడం లేట్ చేయడంవల్ల మీరు కందెన కొని వెయ్యలేకపోతున్నారేమో!”

“పాయింట్ బాగ పట్టేశారు. సరేలేండి. మనం మాట్లాడుకున్న ఈ పది నిముషాల్లో 1770 మైళ్ళు ప్రయాణం చేశారు. దానికీ కలిపి కట్టేయండి.”

“వెంటనే కట్టేస్తాను. దీనికంటే గొప్ప ఆనందాన్నిచ్చే పని మరొకటి నాకేముంటుంది చెప్పండి. అయితే ఒకటి మేడమ్,”

“ఏంటి?”

“నేనొక టూర్ ప్లాన్ చేశాను. ఇంత పెద్ద భూమి చేస్తున్న ప్రయాణం ముందు నేను వెళ్ళాలనుకున్న చిన్న టూరు అవసరమా అనిపిస్తోంది. దాన్నీ కేన్సిల్ చేసుకుంటున్నాను. ఆ డబ్బులుకూడా మిగలబెట్టి భూమిప్రయాణ చార్జీలు చెల్లించేస్తాను.”

“నిజమైన భూమిభక్తులంటే మీరే సార్!”

“మేడమ్, ఒక మంచి ఆలోచనొచ్చింది. మన ఆకాశంలో చుక్కలు ఊరికే మినుకు మినుకుమంటున్నయి. వాటికీ ఏమైనా చార్జీలు వసూలు చేయవవచ్చేమో. ఈ చంద్రుడు కూడా పద్దాక పెరుగుతూ తరుగుతూ ఉన్నాడు, వాడి పేరిట కూడా ఒక శాఖ పెట్టొచ్చు. వీటిని ఎవరూ పట్టించుకున్నట్టు లేదు.”

“అద్భుతమైన సలహ! వాటి మీద తక్షణమే పనులు మొదలుపెడతాం.”

(మూలం: ‘అమెరిక్కక్కారి’ [2009] కథా సంపుటంలోని “పువియీర్పు కట్టణం” అన్న కథ. )


రచయిత గురించి: శ్రీలంక, యాళ్పాణంలో జనవరి 19, 1937న జన్మించిన అప్పాదురై ముత్తులింగం విజ్ఞానశాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టర్డ్ అకౌంటంట్ గానూ, ఇంగ్లండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటంట్ గానూ పట్టా అందుకున్నారు. ఉద్యోగనిమిత్తం పలు దేశాలలో నివసించి, ఇరవై ఏళ్ళు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తరువాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలూ రాస్తున్నారు. ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తమిళ భాషకి పర్మనెంట్ ఛెయిర్ కొరకు ఒక వలంటీర్ గ్రూప్ అధ్యక్షుడుగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు రాశారు. 1964లో ప్రచురించబడిన వీరి కథల సంపుటి ‘అక్క’ ఎన్నో బహుమతులు గెల్చుకుంది.