ఎదురుచూపు

పంట కోసినప్పటి నుంచి
నారు పోసిందాకా
అనుభవిస్తూనే వుంది
ఓ మాటైనా పలకలేనితనాన్ని
మూగపోయిన కవిలా
నేల!

వాన కౌగలిస్తుందనీ
గింజ పురివిప్పుకుంటుందనీ
కన్ను ఓ ఆకుపచ్చని పరదాను
చిత్రించుకుంటుందనీ
ఒక మేల్కొనని కల కోసం
పొలం గట్టునే
కూచునే వుంది
ఆశ!

చూపు నవ్వుతూ
పలకరించడాన్ని
మనసు నులి వెచ్చగా
కరిగిపోవడాన్ని
మల్లెల పరిమళం
నిలువెల్లా చుట్టుకోవడాన్ని
కోరుతూ
ఆమె!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...