ముగింపు

అతని కథలు చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వించేవి. ప్రేమ ప్రేమగానూ, సరదా సరదాగానూ, గమ్మత్తు గమ్మత్తుగానూ. స్నేహంగా అతని జీవితంలోకి ప్రవేశించి, ప్రేయసిగా మారిన ఆమె ఉన్నట్టుండి ఒకనాడు తన జీవితాన్నుండి అతన్ని బహిష్కరించింది ఎందుకెందుకెందుకెందుకని అడిగేందుకు వీలివ్వకుండానే. ఒకే చరణం పదే పదే పాడే అరిగిపోయిన గ్రామఫోను రికార్డ్ లాగా ఆమెనూ, ఆమె జ్ఞాపకాలనూ మించి ఆలోచించలేకపోయాడు అతను. చక్రాలు తిరిగినకొద్దీ గాడి లోతై మరింతగా ఇరుక్కుపోయిన బండి లాగా అక్కడే కూరుకుపోయాడు. కలం మూతబడింది. స్నేహితులూ, అభిమానులూ కథలు రాయవేమని వెంటపడుతూ ఉన్నారు. చీకట్లుగా పగుళ్ళిచ్చిన పగళ్ళు కొన్నీ, కళ్ళల్లో నలకలయిన రాత్రిళ్ళు కొన్నీ గడిచిన తరువాత, తన పాత కథలే తీసి చివర రెండు వాక్యాలు మాత్రం జోడించి పంపసాగాడు– ‘కొన్నాళ్లకు అతడూ, ఆమే మరణించారు. ఆ తర్వాత మిగతా వాళ్లు కూడా.’ రానురానూ తను చదివిన ప్రతి కథకూ, నవలకూ కూడా చివర అవే వాక్యాలు జత చేసేవాడు, పిల్లలు పుస్తకాల్లో ప్రతి మొహానికీ మీసాలూ గడ్డాలూ పెన్సిల్తో గీసినంత దీక్షగా. ముగింపు మార్చిన అతని కథలు చదివి అతన్ని ప్రయోగాత్మక రచయిత అని కొందరూ, తత్వవేత్త అని కొందరూ పిలవడం మొదలెట్టారు. కొన్నాళ్లకు అతడూ, ఆమే మరణించారు. ఆ తర్వాత మిగతా వాళ్లు కూడా.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...