అదే మబ్బు

నిన్న నీ ఇంటిపై వాలిన మేఘమే కదా
ఇక్కడ నా ఒంటిపై చినుకై జారింది
ఇక్కడ తళుక్కున మెరిసింది అక్కడి నీలాల రూపమే కదా
వానలో తడిసింది ఈ సాయంత్రం
తడిసింది ఈ హృదయం కూడా

ఈ కరిమబ్బే కదలబారి అలనాడు యక్షిణికి
ఆషాఢ ప్రథమ దివసాన
ప్రేమలేఖై పయనించి ఉంటుంది
అడవులు దాటి అర్ణవాలు దాటి కొండలూ కోనలూ అధిగమించి
ఒకానొక రహో హృదయవేదనని
ఉరుముగానో మెరుపుగానో ఉగ్గడించి ఉంటుంది
మహా స్నేహదూత మేఘం దయార్ద్ర హృదయ
అది బయటే కాదు లోపల కూడా
ఇంద్రధనస్సులు మొలిపించగలదు

తెరల తెరల ఈ వాన గాలి సువాసన నిండిన
నీ గాఢ నిశ్వాసమే అయ్యుండాలి
ఇప్పుడిక్కడ మెరిసిన మెరుపు
అక్కడి కన్నుల కాంతిని లీనం చేసుకొని ఉండాలి
తనలాగే తెలి నలి తలపులేవో నింపుకొని
అంబరాన సంబరంగా విహరించమని
ఎదురు చూసే ఏ ఎదపైనో చినుకుల్లా ఒలికించమని
నీకు చెప్పానని నాకు చెప్పటానికే వచ్చి ఉండాలి

మేఘం మనిషైతే ఎంత బాగుండును
నాలుగు మాటలు చల్లగా విన్పించేది
మనిషైనా మేఘమైతే బాగుండును
వేచిన ఏ మనసుపైనో పన్నీటి జల్లు కురిసేది

ఇదే మేఘమాలని ఈ నేల సిగ పువ్వుని
రేపు నువ్వు తప్పక చూస్తావు
దూరతీరాల నిసర్గ కాంక్షల్ని శుభ కామనల్ని
దమ్ముకున్న ఈ చెలిమి తలపుల్ని
చెమ్మగిలిన కళ్ళతో ఆత్రుతగా అందుకుంటావు
ఇక్కడా ఒక మబ్బు కమ్మిన మనస్సుందని గుర్తిస్తావు
ఖండాల మధ్య అఖండ అనుబంధమే ఇది
కాలం ఏదైనా మేఘం మేఘమే
సందేశం సందేశమే