గతం

నూటారెండోసారి మథనపడినంత మాత్రాన
నేను దాన్ని ఏమీ చేయలేనని తెలుసు.
గొరిగించుకున్న జుట్టు కాదు
కొంతకాలం వేచివుండటానికి.
అయితే వివేకంగల మూర్ఖుడినంటావా?
చద్దరు నాలుగు మూలలు
సరిగ్గా వచ్చేలా మడతపెట్టడం కూడా
చాలా పెద్ద విషయం అయినప్పుడు,
ఎంత చిన్న విషయానికైనా
నూటా ముప్పైరెండోసారి బాధపడటం
ఏమంత పెద్ద విషయం?
నేను బతికేదంతా
నేను జార్చుకున్న క్షణాల్లోనే.