తెరచాటు-వులు : 9. అప్పిచ్చువాడు వైద్యుడు!

ఇక్కడ నించి మురుగు వస్తుంది సార్! అక్కడ నించి నీళ్ళు వస్తాయి సార్!”
“డబ్బు ఎక్కడ నించి వస్తుందో చెప్పవయ్యా!”
– ఇంద్రుడు చంద్రుడు (1989).

కొంచెం సృజనాత్మకత నించి పక్కకు తప్పుకుని వ్యాపారాత్మక అంశాల మీద దృష్టి సారిద్దాం. (తెనాలి రామకృష్ణ సినిమాలో సముద్రాల శలవిచ్చినట్టుగా, ‘మతపరమైన విషయాలైతే మాడు వాయకొట్టేవాడిని, వ్యాకరణం అయిపోయింది…’) సినిమా కళాత్మకమైనా వాణిజ్యాంశాల భూయిష్టమైనా బాక్సాఫీసు గల్లాపెట్టె గలగలలాడితేనే ఒక ఊరూ పేరూ ఇంకో బొమ్మ తీయాలన్న హుషారూ. సినిమా పురుగు మొదటగా తొలిచేది ఇద్దరి మెదళ్ళను- ఏదో చెప్పాలన్న రైటరుది, ఏదయినా తీయాలన్న నిర్మాతది. పూర్వ కాలంలో (సినిమా పరిభాషలో క్రీ.పూ. అంటే యాభయిలూ అరవైలూ అని!) బడా ఆసాములకి ఊళ్ళో ఉన్న ఎకరాలని ఓ పదో ఇరవయ్యో పక్కన పెట్టి, మద్రాసుకి బండి కట్టి, సినిమా వోళ్ళ పక్కన నిలబడి ఒక బొమ్మ దిగాలని, వీలైతే వాళ్ళని పెట్టి ఒక బొమ్మ తీసి వూళ్ళో తమ బాకా ఊదుకోవాలన్న కుతికొద్దీ నిర్మాతలైన బాపతే ఎక్కువ. ఆ వచ్చిన వాళ్ళలో కాలం కష్టం కలిసొచ్చి, వేళ్ళు ఊడలు పాతేసుకుంటూ పోయి, వ్యాపకం కాస్తా వ్యాపారం చేసుకుని, సినిమా నిర్మాణం అనేదాన్ని వంశ పారంపర్య వృత్తిని చేసుకున్న వర్గం ఒక వైపు. నెలసరి జీతభత్యాల మీద బండి నడుపుకునే మధ్య తరగతి కుటుంబీకుడల్లే అప్పో సప్పో చేసి సినిమా మొదలు పెట్టి, తలలు మార్చో తాకట్టు పెట్టో ఎలాగైనా సరే సినిమా తీసి విడుదల చేసి, రాత బావుండి బొమ్మ గట్టెక్కితే మళ్ళీ ఈ వైకుంఠపాళి ఆడడానికి సిద్ధపడే విక్రమార్కులు; తారుమారైతే అప్పిచ్చిన వాళ్ళకి మొహమూ వెండి తెరకి మళ్ళీ తమ పేరూ చూపించకుండా అదృశ్యమయిపోయే ప్రవరాఖ్యులు మరో వైపు.

జోబ్స్ కాంప్లెక్స్

ఉన్న అంతటినీ నెలల తరబడి ఒక్కొక్కటీ పణంగా పెట్టించి, వేసిన పాచిక విడుదల తేదీ నాడు పారుతుందో లేదో తెలియక కొట్టుమిట్టులాడేట్టుగా చేసే దారుణమైన ద్యూతం ఇది, వింత వ్యసనం ఇది. మరి ఎవరికోసం, దేనికోసం ఇదంతా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండదు. సినిమా హిట్టయ్యింది అన్న ఒక్క వార్త కోసమా ఇంత తపన, తాపత్రయం, తలకాయ నొప్పులూనూ? నిర్మాత దృష్టి నించి సినిమా వ్యాపారం అనుకుంటే, ముడి సరుకు మొదలు చివరి ఫలితం వరకు దేని మీదా పూర్తి స్థాయి నియంత్రణ ఉండని ఒకే ఒక వ్యాపారం సినిమా నిర్మాణం. మరి ఇంత సాహసం చేసేది కేవలం డబ్బు కోసమేనా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పుకోవాలి. ఇంత కన్నా భేషుకైన లాభాలు, ఫలితం చావుబతుకుల దాకా తీసుకురాని వ్యాపారాలు కోకొల్లలు. అయినా సినిమా వైపు ఏమిటి ఈ అయస్కాంత ఆకర్షణ? కొవ్వొత్తి-కీటక న్యాయం అంటే ఇదేనేమో!

కంప్యూటర్ రంగంలో సృజనాత్మకతకు పెద్ద పీట వేసి, తన జీవితపు చివరి మజిలీలో అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకున్న స్టీవ్ జోబ్స్‌ది (Steve Jobs) కూడా ఇదే రకమైన సినీ నిర్మాత మనస్తత్వం. అంత వరకూ ప్రపంచం చూడనిదేదో పరిచయం చేయాలన్న తపన, దాని కోసం తననీ తన చుట్టు పక్కల వాళ్ళనీ శారీరక హింస తక్క మిగతా అన్ని రకాల మానసిక బాధలు, కష్టాలు, క్షోభలు, ఒత్తిళ్ళకు గురి చేసి, చివరికి అందరూ విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండగా లోకానికి మొట్టమొదటిసారి వేదిక మీద నించి తన కలను పరిచయం చేసి, వాళ్ళ హర్షధ్వానాల మధ్య ఒక చిరునవ్వు చిందించి ‘పుత్రోత్సాహము తండ్రికి…’ అన్న బద్దెన మాట చందాన, ఆ గంట సేపు చిన్న పిల్లాడల్లే సంబరపడతాడు. పక్క రోజునుండీ మళ్ళీ కొత్త కల, సరికొత్త హింస, తప్పని మథన. ఈ శ్రమ, ఈ కష్టనష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇవన్నీ కేవలం ఆ గంట సేపు సంబరానికా అన్నది మానసిక తత్వ నిపుణులకు నిజంగా ఒక సవాలు.

బహు భర్తృక

తెలుగు పాట పంచ భర్తృక అన్నది వేటురి వాపోత. వంక పెట్టగలిగిన ప్రతివాడు (దర్శకుడు, నిర్మాత, సంగీత శాసనుడు, నాయకానాయికలు) వేలు పెట్టక అపడు అన్నది వారి వేష్ట. సినిమాలో ఒక పాట పరిస్థితే ఇలా ఉంటే, అసలు సినిమా అస్తిత్వానికే కారణభూతులైన వితరణ శీలురే కత్తి ఝళిపిస్తే కథ వింత పోకడలు మానకుండా ఉంటుందా? ‘సార్, మీరు కూడా ఏమన్న చెప్పదలిస్తే చెప్పండి సార్!’- సంగీత దర్శకుడు యస్. రాజేశ్వరరావు, మ్యూసిక్ సిట్టింగ్ గదిలోకి కాఫీలు అందించ పోయిన బోయ్‌తో- అప్పటికి గదిలో కూర్చున్న నిర్మాత తాలూకూ బంధు గణం తమ వాడు నిర్మించబోయే సినిమా సంగీతం ఎలా ఉండాలన్న విషయంలో ఆయనకు తమకు తోచిన సలహా ఇతోధికంగా అందచేస్తున్న నేపథ్యంలో. కథకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఈ మధ్య హాలివుడ్ సినిమాల్లో పాత్రలు ఏదో పనుందన్నట్టుగా చైనా వెళ్ళిరావడమో లేదా వాళ్ళు అమెరికా రావడమో అక్కడి జాతీయుడు మన కథానాయకుడికి ఏదో ముఖ్య ఘట్టంలో చేయవలసిన సాయం ఏదో చేయడం వంటి ఆటల్లో అరటిపండు వేషాలు గమనించారా? పాత హిచ్‌కాక్ సినిమాల్లో ఏదో ఒక చోట ఆయన దర్శనం ఇచ్చినట్టు! కారణం మరేమీ కాదు, ఈ మధ్య హాలివుడ్ సినిమాలకి, చిన్నా పెద్దా తేడాలు లేకుండా, అధిక శాతం పెట్టుబడులు చైనా దేశం నించి రావడం, 80-90వ దశకాలలో జపాన్ నించి వచ్చిన విధంగా, దీనికి ముఖ్య కారణం.

పేరుకు ఎంత హాలివుడ్ అయినా చిన్న దర్శకుల దగ్గర నించి దిగ్గజాల వరకు ప్రతి పైసాకి పెట్టుబడిదారులకి లెక్క చెప్పాల్సిన పరిస్థితే. దానికి కారణం సినిమా వ్యవస్థ కార్పరేట్ రంగం చేతికి వెళ్ళడం వలన, అక్కడ ప్రతి పెట్టుబడి షేర్ హోల్డర్‌కు జవాబుదారి కావడం. ప్రస్తుత కాలంలో దుమ్ము దులుపుతున్న అతినాయకుల (super heroes) చిత్రాలకు పెట్టుబడులు పెద్దగా గింజుకోనవసరం లేకుండానే వచ్చిపడతాయి. కథ ఎలా ఉన్నా కర్మేంద్రియాలను కట్టిపడేయగల కంప్యూటర్ పోరాటాలు ఉన్నంత కాలం ప్రపంచంలో ఎక్కడైనా భాషతో పని లేకుండా నడిచేస్తాయి. ఆర్థిక భాషలో చెప్పాలంటే ఇటువంటి సినిమాలకు పెట్టుబళ్ళు కొండకచో లాభసాటి కాకపోయినా, కనీసం డబ్బెట్టినవాడు చిప్పెత్తుకు పోడు. కనిష్ట నికరమన్నా మిగిల్చే నష్టం తేని బేరాలు ఈ చిత్త కార్తె గ్రామసింహాల సినిమాలు. ఇక రెండో వైపు, బాగా ప్రజాదరణ పొందిన సినిమాలు తీసి పేరుమోసిన పెద్ద దర్శకులు, కొంతకాలానికి ఆ వచ్చిన పేరు అత్యల్ప సాధారణ హారం (lowest common denominator) కలిగిన చిత్రాల వల్లే అని గ్రహపాటున గ్రహించి, కించిత్తు ఖిన్నులయి, పాప పరిహారార్థం అత్యంత అర్థవంతమైన సినిమా కథను చేబూని స్టూడియో ప్రాంగణమునందు అడుగిడి, దాని అధినేతతో ‘ఓయీ బేహారీ! ఇందు విత్తు మిగలకపోవచ్చును కానీ పేరు మాత్రం మన ఇరువురకూ చిత్తుచిత్తుగా వచ్చు’నని ఉవచించిన పిమ్మట, ఆమాట చెప్పీ చెప్పగానే పేరూ పరువూ చూడకుండా మెడ పట్టి బయటికి గెంటబడిన సందర్భాల్లో, దిక్కు తోచక దేశాలు దాటి, తమ పేరుతోనో కీర్తితోనో సహచర్యం అభిలషించే ఏ ఫ్రెంచి వాడితోనో చైనా వాడితోనో జతకూడి సినిమా తీసి, విడుదల చేసి, జనాలు చూసినా చూడకపోయినా తీశామన్న తృప్తి మాత్రం మిగుల్చుకున్న దర్శకులు, చేతులు డబ్బు కాల్చుకున్న విదేశీ నిర్మాతల దృష్టాంతాలు కోకొల్లలు.

ఇంతకు ముందు ప్రస్తావించుకున్న డబ్బు భూముల రూపంలో లెక్కకందకుండా పడి ఉండి, సినిమా వాళ్ళతో– పేరున్న వాళ్ళైతే మరీ భేషు!– భుజాలు రాసుకు పూసుకు తిరగాలనుకునే కోరిక మెండుగా ఉండి, ఓ పదో పాతికో తమ ముచ్చట కోసం అమ్మి జి.టి. ఎక్కి కోడంబాక్కంలో డబ్బు సంచులతో దిగి ఏదో ఒక సినిమా తీద్దాం అనుకునే బడా భూస్వాములకీ ఈ ఫ్రెంచ్, చైనా ఆసాములకీ పెద్ద తేడా లేదు. ‘అయ్యా! ఇందులో డబ్బు పెట్టండి, వెనక్కి వస్తుందని మాత్రం ఆశించకండి!’ అన్నదే భావి నిర్మాతకి సేల్స్ పిచ్‌గా ఉంటే అది విని కూడా డబ్బు పెట్టేడంటే పిచ్చయినా ఉండి ఉండాలి, కథ మీద నమ్మకమైనా ఉండి ఉండాలి. కె.విశ్వనాథ్‌ మాటల్లోనే, ఆయన ప్రతి సినిమాకీ నిర్మాతలకి చెప్పే శ్రీ సూక్తం ఇదేనట– ‘నీ కర్మ నువ్వు చేయి, పోతే నీ ఖర్మ!’ అని.

తప్పేది సినిమా కాదు, లెక్క!

భారత దేశ చిత్ర పరిశ్రమలోకి కార్పరేట్ సంస్థలు– రిలయన్స్, టైమ్స్, యూటీవీ, ఇవి గాక ప్రఖ్యాత హాలివుడ్ సంస్థలు ఫాక్స్, డిస్నీ, పారామౌంట్– ప్రవేశించడం ప్రారంభించాక, వారు పెట్టుకున్న ప్రప్రథమ సూత్రం, సినిమా పోయేది బాక్సాఫీసు దగ్గర కాదు, అంకెలపట్టిలో అని. బడ్జెటింగ్, ప్లానింగ్ సరిగా లేకపోయినా, దాటిపోయినా, సినిమా ఎంత గొప్పగా ఆడినా సరే, హిట్ సినిమా తీశామన్న తృప్తి తప్ప చేతిలో చిల్లిగవ్వ మిగలదు అని దాని టీకా తాత్పర్యం. దానికి అనుగుణంగానే, తెలుగులో ఆమధ్య విడుదలయి మంచి విజయం సాధించిన ‘అతడు’ సినిమా నిర్మాతకి నష్టాన్ని మిగిల్చిందనేది ఆశ్చర్యకరమైన నిజం! దీనికి లెక్కలు చాలా తేటతెల్లం. ఇందులో ఏ మతలబులు లేవు. పెట్టుబడి ఎప్పుడూ ఖరీదైనదే. సినిమా తీయాలన్న ఏ నిర్మాతా సొంత డబ్బు అంత తొందరగా పెట్టడు.

మొదలు పెట్టేటప్పటి అంచనా ప్రకారం ఒక కోటి రూపాయలు అవుతుంది అనుకుంటే, అసలు డబ్బు పెట్టే ఏ వజ్రాల వ్యాపారుల దగ్గరికో, రియల్ ఎస్టేట్ రాజుల దగ్గరకో వెళ్ళి, తమ ఆస్తులు కుదువ పెట్టి–ఎంత నమ్మకమున్నా నేటి కాలంలో నోటి మాటకి విలువ లేదు కాబట్టి– సినిమా వడ్డీకి (అవును, ఈ వడ్డీ పేరే ‘సినిమా వడ్డీ’. అంటే ఏ 35%, 40%కో) తెచ్చి, ఒక రెండు మూడు నెలల లోపు ముగించి, సినిమా బాగా వచ్చి, దానికి తగ్గట్టే చిత్రకరణ సమయంలోనే ఏ కారణం చేతనైనా దాని పేరు నాలుగు నోళ్ళలో నాని, వ్యాపారం బాగా జరిగి, కోటి రూపాయల సినిమా ఏ రెండు కోట్లకో మూడు కోట్లకో అమ్ముకోగలిగితే, అప్పులూ వడ్డీలూ ఇతర అమాంబాపతులూ పోను మిగిలే తేలికపాటి లక్షలే నిర్మాత మూడు నెలల శ్రమకు తగ్గ (‘వచ్చిన’ అనడం సబబేమో) ఫలితం. సేఠు గల్లా పెట్టె నించి దాటి నిర్మాత జేబులోకి వచ్చిన దగ్గర నుండి తిరిగే మీటరు మేటరుని కొద్దిగా సంక్లిష్టం చేస్తుంది. హీరో గారికి మూడు బావుండకో, హీరోయిను కాలు బెసికో, దర్శకుడు ఆ రోజు అసలు రాకో, ఇక వాతావరణ మార్పులు, యూనియన్ గొడవలు, ఇలా ఏ కారణం చేతనైనా ఒక రోజు షూటింగ్ ఆగినా సరే, నిర్దయ, నిర్దాక్షిణ్యం, నిర్మొహమాటం అన్న మూడు ఆకుల మీద నడిచే కాలచక్రము కన్నా కర్కశమైన సినీమావడ్డీ చక్రం రోజుకు కోటి మీద 40% వడ్డీతో– అనగా అక్షరాలా లక్ష రూపాయల పైబడి, లక్షణంగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆ మొత్తం నిర్మాత చివరి దిగుబడికి పట్టే చీడే. సినిమా వ్యాపారంలో తిరిగే ఈ ముడి సరుకుది, హాలివుడ్ అయినా, బాలీవుడ్ అయినా, మన తెలుగు నాట అయినా ఇదే కథ. ఇచ్చే వాడెవడు, తెచ్చే వాడెవడు, ఖర్చు ఎలా పోయింది, చివరికి మిగిలేది పేరా, డబ్బు కూడానా? ఇచ్చేవాళ్ళు సూట్లు వేసుకునే కార్పరేట్ సంస్థలు కావచ్చు లేదా దుబాయిలో కూర్చుకుని తమ కనుసన్నల్లో చిత్రప్రపంచాన్ని ఒకప్పుడు శాసించిన మాఫియా కావచ్చు- పెట్టేదెంత, వచ్చేదెంత అనే! ఈ మధ్యలో సినిమాకి పేరు ప్రఖ్యాతులు వస్తే అది అదనమే కానీ పరమార్థం ఎంత మాత్రమూ కాదు.

(వచ్చే భాగంలో – ఏమీ సేతురా లింగా!)