మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు – అన్యభాషల ప్రభావం

కొన్ని సందర్భాల్లో ఆంగ్ల భాషా ప్రభావంవల్ల విభక్తి ప్రత్యయాలను తారుమారుగా ప్రయోగించటం జరిగింది. ఉదాహరణకు, జానపదం ప్రాచీన కాలంలో అనాగరిక స్థితితో సంబంధించినది; శ్రీ రాముడు సీతాదేవి లక్ష్మణుడు 14వ సంవత్సరాల (సంవత్సరాలు) కోసం వనవాసానికి వెళ్లారు. 14 సంవత్సరాల కోసం, స్థితిలో సంబంధించినది – related with, for 14 years అనే పదాల్లోని ఆంగ్ల విభక్తుల ప్రయోగాన్ని అనుసరించి తెలుగు భాషలో కూడా వాడటంగా గమనించవచ్చు.

కొన్ని చోట్ల కొంత మంది విద్యార్థులు ఆంగ్ల పదాలను వాడారు. అతను ఒక one of a kind అమ్మాయితో పెళ్లి చేయమని ఆశిస్తున్నాడు; అతను లచ్చుమమ్మ గడతో (bundle of grass) చూసింది; Ladybird వేషంలో వానదేవుడు…; కాని సీతకు ఎలా అతనికి recognize— మొదలైన వాక్యాల్లో ఆంగ్ల భాషా పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు భాషలో ఈ పదాలను ఏమనాలో తెలియక, ఈ విద్యార్థులు వాటికి సమానార్థకాలైన ఆంగ్ల పదాలను (code-switching) వాడారు.

మందిరానికి వెళ్లి తమ భార్య ఊర్మిళా కనిపించాడు; ఆమె ఒక వేరే స్త్రీని కనిపించింది ఎలా అసూయ పడింది; ఒక రోజు ఆమె సరస్సులో చంద్రుడు, తుమ్మెదను కనిపించింది; జానపదుల ఎన్నో నమ్మకాలు ఉంటారు; హనుమంతుడు సీతమ్మను కనబడితే, ఆమెను ఎలా గుర్తిస్తుంది; వాళ్లకు బహుమతిగా పురుషులకు సంబంధించిన కత్తి, దుస్తులు, అభరనాలను లభిస్తారు— మొదలైన వాక్యాలను పరిశీలిస్తే, విద్యార్థులకు- కనిపించు, ఉండు, లభించు వంటి క్రియలను ఎలా వాడాలో అని తెలియదని చెప్పవచ్చు. పై పేర్కొన్న వాక్యాలో కర్త – క్రియ – విభక్తి మధ్య అన్వయం సరిగ్గా జరగకపోవటంవల్ల వాక్యార్థానికి భంగం కలుగుతున్నది.

కొందరు విద్యార్థులు విభక్తి ప్రత్యయాలను కూడా సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారు. ప్రాథమిక స్థాయిలోనైనా, మాధ్యమిక స్థాయిలోనైనా అనుకూలమైన బోధన పద్ధతిని అనుసరించి విద్యార్థులకు విభక్తి ప్రత్యయాలను గురించి బోధించటం జరగకపోవడం దీనికి ముఖ్యమైన కారణమని చెప్పవచ్చు. చాలా మంది విద్యార్థులకు- ఏ స్థాయిలోనైనా– కు/ను అనే విభక్తి ప్రత్యయాలను ఎప్పుడు ఎక్కడ వాడాలో అని తెలియదు. దీనికి నిదర్శనం ఈ వాక్యాలు: కోడలు అత్తయ్యకు పీడించటం; సీతాదేవి తల్లిదండ్రులు ఆమెను ఒక ఉంగరం ఇచ్చాడు; ఆమె తల్లి లేదు. ఆమె ఒక సవతి తల్లి ఉంది. (కు- విభక్తి ప్రత్యయ లోపం), తన వదినెలు లచ్చుమమ్మకు బాగా చూడాలి. తెలుగు భాషలో ‘కు, ను’ అనే విభక్తి ప్రత్యయాలను గురించి చేకూరి రామారావు ఈవిధంగా స్పష్టీకరించారు:

ను కర్మార్థంలోనూ (accusative), కు సంప్రదానాది (dative) అర్థాల్లోనూ నామానికి చేరుతాయి (ibid, పుట. 106)[16].

ఆ చంద్రుడు ఆమె ముఖ ప్రతిబింబం ఇంకా ఆ తుమ్మెదలు ఆమె నలుపు జడ ఉందని రాముడు చెప్పాడు – ఇంతకు ముందు చెప్పినట్లు మారిషస్ దేశంలో ‘ఇంకా, యొక్క, మరి, మరియు’ వంటి పదాల ప్రయోగం ఇప్పటి వరకు ఎక్కువగా ఉంది. ఆంగ్ల భాషలో and అనే శబ్దానికి సమానార్థకంగా ఈ పదాలు వాడబడతాయి. కాని తెలుగులో అన్ని చోట్లా ఇట్లాంటి శబ్ద ప్రయోగం లేదని చేకూరి రామారావు సూచించారు:

తెలుగులో రెండు వాక్యాలను ఒకదాని తరువాత ఒకటి ప్రయోగించి వాటి మధ్య సంబంధాలు అర్థాన్నిబట్టి గ్రహిస్తాం. సంకలన సంబంధంలో ప్రత్యేకమైన శబ్దం లేదు. – (ibid: పుట. 83)[16].

ఈ పాటలు సామాజిక జీవన చిత్రింపబడతాయి; జనజీవనంలో వేరు వేరు సందర్భాలను ఉయ్యాల పాటల్లో చిత్రింపబడతాయి; వాళ్ల గర్భవతి స్త్రీలను కూడా బలి ఇవ్వబడతారు; ఇందులో వాల్మీకీ రామాయణాన్ని తక్కువగా కనబడుతుంది; ఆ కాలంలో ఏ విధంగా నివసిస్తున్న గురించి తమ సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి; ఈ ఊయాల పాటలు సామాజిక జీవనాన్ని బాగా చిత్రింపబడతాయి— అనేవి సకర్మక ప్రయోగాల (Passive voice) లోని వాక్యాలు. కాని వీటిలో కర్త – క్రియ అన్వయ దోషాలు కనిపిస్తాయి.

ఈ విధంగా విద్యార్థుల రాతల్లో భాషా సంపర్కంవల్ల పై వివరింపబడిన దోషాలు సంభవించాయి. పై పేర్కొన్న కోర్సులు చేస్తున్న వాళ్ల రాతలో మాత్రమే కాకుండా దాదాపు అన్నీ స్థాయిల్లో తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థుల లేఖనంలో కూడా చాలా వరకు ఈ తప్పులే కనిపిస్తాయని చెప్పవచ్చు.

మాధ్యమిక స్థాయి విద్యార్థుల లేఖనాల్లో ఏర్పడే దోషాలు

బహుభాషీయ వాతావరణంలో భాషా సంపర్కంవల్ల విద్యార్థుల లేఖనంలో ఎక్కువ తప్పులు సంభవిస్తాయని తెలుస్తోంది. మాధ్యమిక స్థాయి విద్యార్థుల లేఖనాల్లో ఏర్పడే దోషాలను పరిశీలించేందుకు వాళ్లను కొన్ని వ్యాసాలు రాయమనటం జరిగింది. వాటిలో సంభవించిన దోషాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

మారిషస్ ఒక చిన్న, అందమైన ద్వీపం ఉంది; మారిషస్ దేశంలో మేం చాలా మంది పండగలు జరుపుకొంటాం; ఈ పండుగలులోనే ఉగాది ఒక పెద్ద తెలుగు పండగ; మేం చాల మంది ప్రిపరేచనులు చేశాం; ఆ రొజు మేం లేచి, సాన్నాం పసుపుతో చేశాం; తర్వాత మేం మిఠాయిలు చేశాం; ఉగాది పచద్ది చేశాం; ఇది ఆరు సుతులు ఉన్నారు; తర్వాత మేం తోరనాలు చేశాం; అది తో పూలు ఉంది; పుజ; మొదలైన వాక్యాలు కనిపించాయి. కిఠ్తనలు చేశాం (కీర్తనలు పాడతాం) – క్రియోల్ భాషా ప్రభావంవల్ల (Nou fer kirtan) ఇలా రాయటం జరిగిందని చెప్పవచ్చు.

భాషా సంపర్కంవల్ల అనువాదాల్లో విద్యార్థులు చేసే తప్పులు

ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు భాష విషయ ప్రణాళికను బట్టి మాధ్యమిక స్థాయి, అంటే తొలి ఫారంనించి ఆంగ్లంనించి తెలుగు లోనికి, తెలుగునించి ఆంగ్ల భాష లోనికి వాక్యాలను అనువదించటం బోధింపబడుతుంది.

ఐదో ఫారంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నడుపుతున్న స్కూల్ సర్టిఫికేట్ పరీక్షల్లో తెలుగు భాషా ప్రశ్నపత్రాల్లో ఈ రెండు రకాలైన అనువాదాలుంటాయి. తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులు ఆంగ్లంనించి తెలుగు లోనికి, తెలుగునించి ఆంగ్ల భాష లోనికి తమ భావాలను ఎలా వ్యక్తీకరిస్తారని పరిశీలించటమే ఈ అభ్యాసాల ముఖ్యోద్దేశం. తర్వాత ఆరో ఫారంలో కూడా తెలుగు భాషను ప్రధానాంశంగా గాని, ఆనుషంగిక అంశంగా గాని అభ్యసించే విద్యార్థులు కేంబ్రిడ్జ్ హైయర్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షల్లో ఆంగ్లంలో ఇవ్వబడిన పేరాను తెలుగులోనికి అనువదించవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్షలు పూర్తి అయిన తర్వాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల సామర్థ్యాన్ని గురించి చర్చించే ఒక రిపోర్టును తయారుచేస్తారు. ఆ రిపోర్టులో విద్యార్థుల బలహీనతలను గురించి కూడా వివరిస్తారు.

ప్రస్తుత పరిశోధన ప్రధానోద్దేశ్యం మారిషస్ దేశంలో ద్వితీయ భాషగా తెలుగు భాష మీద వేరే భాషల ప్రభావాన్ని పరిశీలించటం కాబట్టి ఈ ప్రభావాన్ని పరిశీలించేందుకు, దేశంలో నలు మూలల్లో మాధ్యమిక స్థాయిలో తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులకు అనువదించటానికి కొన్ని ఆంగ్ల వాక్యాలు ఇవ్వబడ్డాయి. తర్వాత వారు చేసిన అనువాదాలు సేకరించి వాటిని పరిశీలించటం జరిగింది. వాళ్ల అనువాదాల మీద ఆంగ్ల, క్రియోల్ భాషల ప్రభావం ఎక్కువగా ఉందని ఈ ప్రయోగం వల్ల తెలిసింది.

మామూలుగా ఆంగ్లంలో to be అనే క్రియతో కూడిన ఏదైన ఒక వాక్యంలో అనువదించాలంటే చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. To be అనే క్రియ తెలుగులో ‘ఉండు’ అని వస్తుంది కాబట్టి కొన్ని వాక్యాలు అనువదించేటప్పుడు ‘ఉండు’ అనే క్రియను విద్యార్థులు వాడతారు. ఉదాహరణకు: She is a follower of Mahatma Gandhi అనే వాక్యం తెలుగులోనికి అనువదించాలంటే చాలా మంది విద్యార్థులు ఆమె మహాత్మా గాంధీ అనుయయురాలు ఉంది, అని రాశారు. విద్యార్థుల లేఖనం మీద ఆంగ్ల భాషా ప్రభావానికి చక్కటి నిదర్శనం ఈ ఉదాహరణ. కొంత మంది విద్యార్థులకు Follower అనే ఆంగ్ల పదాన్ని తెలుగులో ఏమంటారో తెలియక, దాన్ని ‘ఫొలోవ/ ఫొలొవర్’గా అనువదించారు. ఇద్దరు విద్యార్థులు పై వాక్యాన్ని ఆమె మహాత్మా గాంధీ ఫోలోయిందిగా కూడా అనువదించారని గమనించాను. అనేక మంది విద్యార్థులు పై వాక్యాన్ని ఆమె మహాత్మ గాంధికి ఫొలొవ ఉంది, అని అనువదించగా, ఇంకా కొందరు దాన్ని followerగానే రాశారు. వాళ్లలో ఒకరు దాన్ని ఆమె ఒక ఫోలోవ మహమ గాండి – అంటే ఆంగ్ల భాషా వాక్య నిర్మాణ సూత్రాన్ని పాటించి అనువదించారు. ఇక్కడ వర్ణక్రమానికి (spelling) సంబంధించిన దోషాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రత్యేకంగా భాషా సంపర్కంవల్ల ఏర్పడే ప్రభావాన్ని పరిశీలించటం జరిగిందని గమనించవలసినది.

అదే విధంగా, He is a teacher అనే వాక్యాన్ని, అతను ఉపాధ్యాయుడు ఉన్నాడు, అతను ఒక పంతులుగారు ఉంది అని తప్పుగా అనువదించారు.

తెలుగు భాషలో క్రియలేని వాక్యాలు కూడా ఉంటాయనే విషయం మరచిపోయి, (ఆంగ్ల భాషా వాక్య నిర్మాణాన్ని అనుసరించి) ఆంగ్ల వాక్యంలో ఉన్న is అనే క్రియకు -ఉంది, -ఉన్నాడు వంటి క్రియలు వాడటం జరిగింది. ఇటువంటి తప్పులు చాలా మంది విద్యార్థులు చేస్తారని తెలుగు భాషోపాధ్యాయులు తెలియజేశారు. ఆంగ్లంలోని is, హిందీలోని है తెలుగులోకి అనువదించనవసరం లేదని ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పిస్తే ఇటువంటి దోషాలు జరగకుండా నివారించవచ్చు.

తెలుగు భాషలో క్రియారహిత వాక్యాలను గురించి చేకూరి రామారావు (2016) స్పష్టంగా వివరించారు:

క్రియారహిత వాక్యాల్లో కొన్ని సహజంగా క్రియలేని వాక్యాలు, మరికొన్ని క్రియ లోపించిన వాక్యాలు ఉంటై. సహజంగా క్రియలేని వాక్యాల్లో రెండు నామబంధాలుంటై. అందులో ఒకటి ఉద్దేశ్యం, ఇంకొకటి విధేయం. ఉద్దేశ్య విధేయనామాలు రెండూ ఏకవస్తు బోధకాలు. ఉద్దేశ్య నామాలు ఏ నామాలైనా కావచ్చు. సర్వనామాలు కూడా కావచ్చు. విధేయనామాలు సిద్ధనామాలు, విశేషాలనుంచి సాధించిన నామాలు ఉంటై, విధేయనామాలు ఉద్దేశ్య నామాల్ని గురించి సాధారణంగా ఏదో ఒక విశేషాన్ని బోధిస్తై. ఉద్దేశ్య, విధేయ నామాలు రెండూ విశేషణపద పూర్వకమై ఉండవచ్చు. ఈ విశేషణాలలో వాటిల్లో భేదాల్ని బట్టి వాటి క్రమం ఉంటుంది. – (ibid: పుట. 1)[16].

క్రియలేని వాక్యాల విషయంలో మాత్రమే కాకుండా కర్తలేని వాక్యాలను అనువదించాలంటే విద్యార్థులు ఎక్కువ ఇబ్బందులకు గురి అవుతారని కూడా తెలుస్తుంది. మామూలుగా ఆంగ్ల వాక్యాల్లో to get, to feel వంటి క్రియలుంటే, విద్యార్థులు వాటిని సరిగ్గా అనువదించలేకపోయారు. ఉదాహరణకు: I got the job అనే ఆంగ్ల వాక్యాన్ని, నాకు ఉద్యోగం దొరికింది- అనడానికి బదులు చాలా మంది విద్యార్థులు, నేను ఉద్యోగం దొరికాను, నాకు పని దొరికాను, నేను దొరుకు పనిగా అనువదించి రాశారు. క్రియోల్, ఆంగ్ల భాషల ప్రభావంవల్ల ఇటువంటి తప్పులు ఏర్పడతాయని తెలుస్తుంది. క్రియోల్ భాషలో Monn gagn travay అనే వాక్యాన్ని అనుసరించి నేను ఉద్యోగం దొరికానుగా అనువదించారని కూడా చెప్పవచ్చు. పై ఆంగ్ల వాక్యాన్ని నేను దొరుకు పనిగా విద్యార్థులు అనువదిస్తే, ఇది తెలుగు భాష మీద ఆంగ్ల భాషా ప్రభావంవల్లనే ఏర్పడుతుందని తెలుస్తుంది. తెలుగు భాషలో వాక్యాలు రాయటానికి ఆంగ్ల భాషలో కర్త క్రియ కర్మ అనే వాక్య నిర్మాణ సిద్ధాంతాన్ని అనుసరించటంవల్ల ఇటువంటి వాక్యాలు రాయటం జరుగుతుంది.

అనువాద విషయంలో మాత్రమే కాక, మాట్లాడేటప్పుడుగాని, రాసేటప్పుడుగాని -దొరుకు, -లభించు, -కలుగు, -వేయు వంటి క్రియలను ఏ విధంగా వాడాలో చాలా మందికి తెలియదు. She was sad అనే ఆంగ్ల వాక్యాన్ని, ఆమెకు దుఃఖం కలిగింది- అనటానికి బదులు, ఆమె దుఃఖం వచ్చింది, ఆమె దుఖం ఉంది, ఆమె విచారం ఉంది, ఆమెకు విచారంగా కలిగింది, అని రకరకాలుగా అనువదించారు విద్యార్థులు. అదే విధంగా, She was hungry అనే ఆంగ్ల వాక్యాన్ని, ఆమెకు ఆకలి వేసింది- అనటానికి బదులు “ఆమె ఆకలి వచ్చింది, ఆమె ఆకలి ఉంది, ఆమె ఆకలి కలిగింది, ఆమెకు hungry ఉంది” అనే అనువాదాలూ కనిపించాయి.

ఇటువంటి వాక్యాలకు కర్తృపద నిర్ణయం కష్టమని, ఉద్దేశ్యపదం సులభంగా గ్రహించవచ్చుననీ చేకూరి రామారావు తెలియజేస్తారు. సాధారణంగా, She was hungry అనే ఆంగ్ల వాక్యాన్ని ‘ఆమెకు ఆకలిగా ఉంది’ అనే వాక్యంగా అనువదించటం జరుగుతుంది. ఈ వాక్యంలో మొదటి పదం ఉద్దేశ్యం. కాని కర్తృపదం ఏది అని చెప్పటం కష్టం.

వ్యక్త నిర్మాణంలో కర్తలేదు. గుప్తనిర్మాణంలో కర్తను సూచించాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించదు. ఇట్లాంటి వాక్యాలలో ఉద్దేశ్యాన్ని అనుభోక్త (experiencer)గా భావించవచ్చు. అనుభవం (experience) దేహ, మనఃస్థితి బోధకం కావటం విశేషం. – (ibid, పుట. 2)[16]

ఈ విషయాన్ని గమనించక, మారిషస్ దేశంలోని ద్వితీయ భాషగా తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులు క్రియలేని వాక్య నిర్మాణంలో అనేక తప్పులు చేస్తారు. పై పేర్కొన్న వాక్యాలను మాత్రమే కాకుండా, ప్రత్యక్ష కథనం (Direct Speech) కలిగిన వాక్యాలను కూడా చాలా మంది విద్యార్థులు తెలుగులోకి సరిగ్గా అనువదించలేకపోతారని తెలుస్తుంది.

ఉదాహరణకు: He came to me and said, ‘Friend, I need money.’ అనే వాక్యాన్ని, అతను నా దగ్గరికి వచ్చి, ‘మిత్రుడా, నాకు డబ్బు కావాలి’ అన్నాడు- అనటానికి బదులు విద్యార్థులు “అతను నాకు వచ్చి ఇంకా చెప్పు, ‘మిత్రులారా నేను డబ్బు కావాలి’; అతను నన్ను వచ్చి ఆ తరువాత చెప్పి, ‘మిత్రుడా, నాకు డబ్బు ఇచ్చు’; అతను నా దగ్గరికి వచ్చి ఇంకా చెప్పి, ‘మిత్రమా, నాకు డబ్బు కావాలి’; ఇలా అనువదించారు. ఇంతేకాకుండా వాక్యంలోని మొదటి భాగాన్ని, అతని దగ్గరికి వచ్చాడు ఇంకా చెప్పాడు; అతని దగ్గరికి వచ్చి ఇంకా/ మరి/ మరియు చెప్పాడు; అతను నా దగ్గర వచ్చి, చెప్పి– ఇలా వివిధ రకాలుగా అనువదించారు.

ఈ విషయం ప్రత్యక్ష కథనంలో (active voice) మాత్రమే కాక, పరోక్ష కథనంలో (passive voice) కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. దీన్ని గురించి ఇంకా వివరాలిస్తూ, ఉమామహేశ్వరరావు (2014: పుట. 2) చేకూరి రామారావు ప్రయత్నాన్ని ఇలా వివరించారు[17].

ఉదాహరణకు, ప్రత్యక్షానుకృతిలోని వాక్యం “అతను (నాతో) నేను ఉంటాను అన్నాడు” => పరోక్షానుకృతిలో ఉత్తమపురుషకు తన్వాదేశంతో ‘అతను (నాతో) తను ఉంటాను అన్నాడు’ ఔతుంది. దీన్ని పరిష్కరించటానికి అనేక ఎత్తుగడలను చేరా ఎన్నుకొన్నారు. చివరికి, ‘ఉత్తమపురుష పరివర్తిత సర్వనామం కర్తగా ఉన్న వాక్యాల్లో వర్తించరాదు’ అనే ఆంక్షను విధించి క్రియా విభక్తి సంధాన సూత్రాన్ని అణిచిపెట్టి సాధిస్తారు. కానీ ఈ ప్రక్రియ సూత్ర రచనపై అధికభారాన్ని మోపుతుందనీ ఐనా, ఈ ఆంక్ష భాషాసిద్ధాంతానికి అవసరం కావచ్చు కాబట్టి చివరికి దీన్ని భాషా సిద్ధాంతంలో భాగంగా ప్రతిపాదిస్తారు.

విద్యార్థులు రాసిన వాక్యాల్లో తెలుగు భాషపై క్రియోల్, ఆంగ్లం మొదలైన భాషల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య వాక్యాలు (కర్త, కర్మ, క్రియలున్న వాక్యాలు) ఉంటే, వారు బాగానే అనువదించగలరు కాని కర్తలేని లేక క్రియలేని వాక్యాలుంటే వారు తప్పుగా రాస్తారు. ఆంగ్ల, ఫ్రెంచ్ భాషల్లో ఇటువంటి వాక్యాలు లేకపోవటంవల్ల ఇలా జరుగుతుందని చెప్పవచ్చు.

సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలను అనువదించటం కూడా విద్యార్థులకు కష్టంగా అనిపిస్తుందనీ తెలుస్తుంది. ఆంగ్లంలో and అనే పదానికి సమానార్థకంగా మారిషస్ దేశంలో ఎక్కువ మంది (విద్యార్థులు మాత్రమే కాక, ఉపాధ్యాయులు కూడా) ఇంకా, మరియు/మరి వంటి పదాలను వాడతారు. (ఉదా: అతను వచ్చాడు ఇంకా అన్నం తిన్నాడు.) ఇటువంటి వాక్యాలు చెప్పేటప్పుడుగాని, రాసేటప్పుడుగాని ఆంగ్ల భాషా ప్రభావం మాత్రమే కాకుండా హిందీ భాషా ప్రభవం కూడా ఉంటుందని కూడా చెప్పవచ్చు. మారిషస్ దేశంలో హిందీ, హిందూస్తానీ భాషలకు ఎక్కువ ప్రచారం ఉంది కాబట్టి ఈ ప్రభావంవల్లనే హిందీ పదమైన और्కు సమానార్థకంగా కూడా తెలుగువారు -ఇంకా, -మరి అనే పదాలు వాడతారని కూడా చెప్పవచ్చు.

కొన్ని సమాన ప్రతిపత్తిగల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే సంయుక్త వాక్యమవుతుంది. వాక్య సంయోగాన్ని సూచించటానికి ఇంగ్లీషులో ‘and, or, but’ వంటి శబ్దాలను, హిందీలో ‘ఔర్, యా, మగర్’ వంటి శబ్దాలను ప్రయోగిస్తారు. పై శబ్దాలు వాక్యాల మధ్య భిన్న సంబంధాల్ని వ్యక్తంచేస్తాయి. ‘and’ అనే శబ్దం సంకలన సంబంధాన్ని or శబ్దం వికల్ప సంబంధాన్ని, but – వైరుధ్యాన్ని సూచిస్తాయి. తెలుగులో అన్ని చోట్లా ఇట్లాంటి శబ్దప్రయోగం లేదు. – (అనంతరామశాస్త్రి, 2001: పుట. 164)[18].

ఆంగ్ల భాషా ప్రభావంవల్ల మాధ్యమిక స్థాయికి చెందిన విద్యార్థుల లేఖనంలో ఏర్పడే ఇంకొక సమస్య – సాధారణంగా విద్యార్థులు సంశ్లిష్ట వాక్యాలు అనువదించేటప్పుడు లేదా వాక్యాల్లో although, when, without మొదలైన పూరక పదాలున్నప్పుడు (correlatives) వాటిని సరిగ్గా అనువదించలేకపోవటం. తెలుగు భాషలో ఇటువంటి పదాలకు సమానార్థకంగా ప్రత్యేక పదాలు లేకపోవటం దీనికి కారణంగా పేర్కొనవచ్చునని భావిస్తాను.

ఉదాహరణకు: Although he came late, mother did not scold him అనే వాక్యాన్ని అతను ఆలస్యంగా వచ్చి, అమ్మ అతన్ని కొట్టలేదుగా అనువదించారు కొందరు విద్యార్థులు. పై అనువాదాన్ని బట్టి విద్యార్థులకు although అనే పదాన్ని తెలుగులో ఎలా అనువదించాలంటే తెలియదని వ్యక్తమవుతుంది. (ఆలస్యంగా వచ్చినా కూడా, లేదా వచ్చినప్పటికీ అని చెప్పాలి) పై వాక్యాన్ని వారు- ఆలస్యంగా వచ్చి, అమ్మ అతనికి కోపం చేయదు; అతను ఆలస్యం వచ్చి కూడా అమ్మ అతనికి కొట్టలేదు; కాబట్టి అతను ఆలస్యంగా వచ్చి, అమ్మ అతనికి కొట్టలేదు; అతను ఆలస్యం వస్తే, అమ్మ అతనికి ఏమి చెప్పలేదు– వంటి వాక్యాలుగా అనువదించారు. ఇంతేకాకుండా scold అనే ఆంగ్ల పదానికి -తిట్టు అనే క్రియ వాడకుండా -కొట్టలేదు అనే క్రియ వాడటం జరిగింది. ఆలస్యంగా వచ్చి, అమ్మ అతనికి కోపం చేయదు.

అదే విధంగా, They went to school without eating అనే వాక్యాన్ని, -వాళ్లు తినకుండా బడికి వెళ్లారు, అనటానికి బదులు విద్యార్థులు వాళ్లు బడికి వెళ్లి, తినలేదు; వాళ్లు బడికి వెళ్లి, అన్నం తినలేదు; వాళ్లు తినలేదు, బడికి వెళ్తారు; తినకుండా, వాళ్లు బడికి వెళ్లారు అనే వాక్యాలుగా అనువదించారు. కొన్ని చోట్లలో వారు ఆంగ్ల భాషా వాక్య నిర్మాణాన్ని అనుసరించి పదాలను రాశారని కూడా తెలిసింది. పై వాక్యాన్ని నలుగురు విద్యార్థులు వాళ్లు… బడి తినకుండా అనే అసంపూర్ణ వాక్యంగా కూడా అనువదించారు.

వాక్యనిర్మాణంలో మాత్రమే కాకుండా, పద ప్రయోగాల్లో కూడా వేరే భాషల పదాలు కనిపిస్తాయని చెప్పాలి. విద్యార్థులు తరచుగా హిందీ లేక ఆంగ్ల పదాలను ఎక్కువగా వాడతారు. అనువాదాలు చేసేటప్పుడు తెలుగు భాషలో ఒక పదాన్ని ఏమంటారో అని తెలియకపోతే, వారు ఆ ఆంగ్ల పదాన్ని రోమన్ లిపిలోగాని, తెలుగు లిపిలోగాని అలాగే రాస్తారని; లేక దానికి హిందీ భాషా పదం వాడతారని తెలుస్తుంది. ఉదాహరణకు ఆంగ్ల పదమైన ropeకు తెలుగు పదం తెలియని ఒక విద్యార్థి దాన్ని ‘రస్సి’గా (హిందీ భాషా పదం) అనువదించటం జరిగింది. ఈ విధంగా అనేక చోట్ల ఇటువంటి పద ప్రయోగాలు కనిపిస్తాయి. తొలి ఫారంనించి నాలుగో ఫారం వరకు తెలుగు భాషనభ్యసిస్తున్న విద్యార్థులు పైన పేర్కొన్న ఆంగ్ల వాక్యాలను అనువదించటానికి ప్రయత్నించారు. ఈ అనువాదాల మీద క్రియోల్, ఆంగ్ల, హిందీ భాషల ప్రభావం కనిపిస్తుందని చెప్పవలసినది.

ఉపసంహారం

పైన పేర్కొన్న తప్పులు ఆంగ్లంనించి తెలుగు భాషలోనికి అనువదించేటప్పుడు ఎక్కువగా సంభవిస్తాయని చెప్పవలసినది. పైన ఇవ్వబడిన వాక్యాలను అనువదించేటప్పుడు కొంత మంది విద్యార్థులు కొన్ని వాక్యాలను అనువదించటానికి అసలు ప్రయత్నించలేదని తెలిసింది. వీటిని తెలుగులో ఎలా పెట్టాలో వారికి తెలియకపోవటంవల్ల అలా జరిగిందని భావిస్తాను. కాని, విద్యార్థులు చేసే అనువాద అభ్యాసాల మీద మాత్రమే కాకుండా, వారు రాసే వాక్యాలు, వ్యాసాలు మొదలైన వాటి మీద కూడా క్రియోల్, ఆంగ్ల, హిందీ మొదలైన భాషల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని వాళ్ల లేఖనాలను పరిశీలించటం ద్వారా రుజువయింది. ఈ ప్రభావం పదాల ప్రయోగంలోనూ, వాక్య నిర్మాణంలోనూ కనిపిస్తుందని కూడా తెలిసింది.

విద్యార్థుల లేఖనాలను పరిశీలించిన తర్వాత, మారిషస్ దేశంలో తెలుగు భాష మీద వేరే భాషల ప్రభావాన్ని తగ్గించటానికి చేయవలసినది ఇంకా చాలా ఉన్నాయని గుర్తించాను. కాని ప్రస్తుతానికి విద్యార్థుల భాషణ లేఖనాల్లో భాషా సంపర్కంవల్ల ఇటువంటి దోషాలు రాకుండా చేయటానికి వారికి కొన్ని సూచనలు ఇస్తున్నాను.

విద్యార్థులకు సూచనలు:

భాషను పెంపొందించటానికి సినిమాలు తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు భాష వినటం, చదవటంతో పాటు తెలుగు సినిమాలు చూస్తే కూడా తమ భాషా నైపుణ్యాలను పెంపొందింపజేయవచ్చు. సాధ్యమైనంత వరకు ఆంగ్ల అనువాదాలు లేని సినిమాలు చూస్తే, మన ఇంద్రియాలను వినటం, అర్థం చేసుకోవటం అనే కార్యాలలో కేంద్రీకరించటం జరుగుతుంది. కొన్ని తెలుగు సినిమాల్లో “same language subtitles” ఉంటే, శ్రవణ అవగహనలతో పాటు దర్శకుల పఠన సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది.

తెలుగు భాష మీద వేరే భాషల ప్రభావాన్ని తగ్గించాలంటే విద్యార్థులు ఎక్కువగా చదవాలి. తెలుగు వ్యాసాలు, తెలుగు కథలు, అంతర్జాలం మూలంగా తెలుగు వార్తాపత్రికలు విస్తారంగా చదివితే, భాష తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. చదవటంతో పాటు విద్యార్థులు తెలుగులో మాట్లడటానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి. తెలుగు భాషోపాధ్యాయులతో మాత్రమే కాకుండా తమ తోటి మిత్రులతో కూడా తెలుగులో వ్యవహరించాలి. ఇంట్లో తమ తాత బామ్మలకుగాని, తల్లిదండ్రులకుగాని తెలుగు భాష వస్తే, వాళ్లతో నిరంతరం తెలుగు భాషలోనే మాట్లాడాలి. ఇలా చేస్తేనే తెలుగు భాష మీద నించి ఆంగ్లం, క్రియోల్ భాషల ప్రభావం తగ్గించవచ్చు.

నేడు ఇంటర్నెట్‌లో తెలుగు భాషలో ఎన్నో వీడియోలు లభిస్తాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ భాషా నైపుణ్యాలను మెరుగుపరచవచ్చునని నా అభిప్రాయం. ఇంట్లో సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులతోగాని, మిత్రులతోగాని తెలుగు భాషలోనే వ్యవహరిస్తే, క్రమంగా దోషరహితమైన తెలుగు మాట్లాడవచ్చు, తర్వాత రాయవచ్చునని భావిస్తాను.


ఉపయుక్త గ్రంథసూచి

 1. RAJAH-CARRIM, A., (2007). Mauritian Creole and Language Attitudes in the Education System of Multiethnic and Multilingual Mauritius. Journal of Multilingual and Multicultural Development, Vol. 28 (1), pp. 51-71.
 2. MILES, W.F.S. (2000). The Politics of Language Equilibrium in a Multilingual Society: Mauritius. Comparative Politics, Vol. 32 (2), 215-230.
 3. సిమ్మన్న, వి. (2014). తెలుగు భాషా చరిత్ర (History of Telugu Language). విశాఖపట్నం: దళిత సాహిత్య పీఠం.
 4. AUCKLE, T. & BARNES, L. (2011). Code-switching, language mixing and fused lects: Emerging trends in multilingual Mauritius. Language Matters – Studies in the Languages of Africa, Vol. 42 (1), 105-126.
 5. LEKOVA, B. (2010). Language Interference and Methods of its overcoming in Foreign Language Teaching. Trakia Journal of Sciences, Vol. 8 (3), 320-324.
 6. SOMMERS, N., (1982). Responding to Student Writing. College Composition and Communication , Vol. 33 (2), 148-156; YIN, R. K. (1994). Case Study Research. London.
 7. ARCHIVES OF INDIAN IMMIGRATION – MGI.
 8. BHASKAR, T.L.S. (2015). Telugu Language in Mauritius.
 9. రెడ్డి లక్ష్ముడు, జి., (2013). మారిషస్‍లో తెలుగు భాషా బోధన – మూల్యాంకనం – Teaching of Telugu in Mauritius – An Evaluation. New Delhi: Star Publications Pvt. Ltd.
 10. BHAT, C. & BHASKAR, T.L.S. (2007). Contextualising Diasporic Identity – Implications of Time and Space on Telugu Immigrants. In OONK, G. (ed.). Global Indian Diasporas – Exploring Trajectories of Migration and Theory. IIAS – Amsterdam University Press.
 11. నరసింహారావు, కె.వి.వి.యల్. (2015). భాషాశాస్త్రం – భాషాబోధన – Linguistics and Language Teaching. హైదరాబాదు: నీల్‍కమల్ పబ్లికెషన్స్ ప్రైవేటు లిమిటెడ్.
 12. O’BRIEN, R., (1998). An Overview of the Methodological Approach of Action Research.
 13. YIN, R. K. (2009). Case Study Research: Design and methods. (4th ed.). Thousand Oaks, California: Sage.
 14. అక్కరెడ్డి, ఎస్., నిర్మలాదేవి, పి., నళిని, జి. (1989). అనువాద సిద్ధాంతాలు. మద్రాసు: శ్రీ కృష్ణ ప్రిన్టర్స్.
 15. సాంబమూర్తి, డి. (2004). తెలుగు బోధన పద్ధతులు. హైదరాబాదు: నీల్‍కమల్ పబ్లికెషన్స్ ప్రైవేటు లిమిటెడ్.
 16. MINISTRY OF FINANCE AND ECONOMIC DEVELOPMENT, (2012). Housing and Population Census 2011 Vol. II Demographic and Fertility Characteristics

 17. రామారావు, సి. (2016). తెలుగు వాక్యం, పద వర్ణ సహితం. (8th ed.). సికిందరాబాదు: కావ్య పబ్లిషింగ్ హౌస్.
 18. ఉమామహేశ్వరరావు, జి. (2014). ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం. ఈమాట – September 2014.
 19. అనంతరామశాస్ర్తి, ఎన్. (2001). ఆధునిక తెలుగు భాషా శాస్త్ర విజ్ఞానం. హైదరాబాదు: ఓరియంట్ లాఙ్మన్ లిమిటెడ్.
 20. జయప్రకాష్. ఎస్. (2007). పరిశోధన విధానం. 8వ ముద్రణ. హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.