జాగారం

నిద్దర్లు పోవే
ఆకాశ దీపాలు?

నిగనిగ
కన్నులు
నల్ల నేరేళ్ళు

ఆడవే
కంచు డంకాలు?

వెన్నెలకందు
వెనకని
కొబ్బరాకు
చాపాలు

చెదరవే
మబ్బు నురగలు?

మంటపాన
యక్షిణుల
కొప్పులు

కదలవే
పాల చారికల
పడగ నాగులు?

విచ్చని
చీకటి చలి
చలి రేతిరి
వాసనలు

రాడే
వెలుగు బండెక్కి
బూడిద రేకల
జంగమయ్య?