ఏదో కనికట్టు

అంతా కొత్తగానే
వున్నట్లుంటుంది
కానీ యేదీ వుండదలా

అందరూ నీ వారిలా
చూస్తున్నట్లూ
మాటాడుతున్నట్లే వున్నా
ఎవరూ కాదలా

కథ మొత్తం తెలిసినట్లే
గుప్పిట్లో వున్నా
అంతమై పోదలా

వాటేసుకోడాలూ
వద్దనుకోడాలూ
తెరపై బొమ్మల్లా

కాసిన్ని నవ్వులూ
ఆపైని ఏడ్పులూ
భ్రమలో ఆటలా

మొగ్గ తొడగడం
పువ్వు రాలడం
తెరలేని
నాటకంలా

క్షణమై ఆవిరయే
పరిమళం
ఆద్యంతాల నడుమ
విరామపు నవ్వులా

నువ్వూ నేనూ
మంచె ముందు
కూచోని ప్రేక్షకుల్లా

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...