పుస్తక పరిచయం: ఎర్రని ఆకాశం

ఇది ఒక అరుదైన పుస్తకం. సాధారణంగా ఎవరూ స్పృశించటానికి సాహసించని అంశాలలో ఒకటైన వేశ్యలకు సంబంధించిన విషయాన్ని తీసుకుని ఇటు భారతీయ సాహిత్యంలోను, అటు పాశ్చాత్య సాహిత్యంలోను ఆ అంశానికి సంబంధించిన ప్రస్తావనల గురించి విస్తారంగా చర్చించిన రచన ఇది. రచయిత డా. పి. రమేష్ నారాయణ ఎరుపు వేశ్యావృత్తికి, ఆకాశం విషయ వ్యాప్తికి సంకేతాలుగా స్వీకరించి ఈ పుస్తకానికి ఎర్రని ఆకాశం అనే పేరు పెట్టడం ఔచిత్యంగా ఉంది.

ఆర్ష భారతీయ సంస్కృతికి మూలాలైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వైదిక సాహిత్యంలో ముఖ్యమైన ఆపస్తంబన సూత్రాలు, యాజ్ఞవల్క్య స్మృతి, సంవర్త, శంఖ, మనుస్మృతులు, బోధాయన ధర్మశాస్త్రం, మహా భారత, భాగవత, రామాయణాది మహా కావ్యాలలో వివాహేతర సంబంధాలు, లైంగిక సంబంధాలు, స్త్రీపురుషుల కామవికారాలు, బహుభార్యాత్వం, వేశ్యాధోరణులకు ఈ పుస్తకంలో ఉదాహరణలు లభిస్తాయి.

నాట్యశాస్త్రంలోను, వాత్స్యాయన కామసూత్రాల్లోను, సురవరం ప్రతాపరెడ్డిగారి ఆంధ్రుల సాంఘిక చరిత్రలోను ప్రస్తావించబడిన వేశ్యాసంస్కృతికి చెందిన విషయాలను ఇందులో చర్చించారు. తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగంలో వెలువడిన ప్రసిద్ధ కావ్యాలలో; ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలైన కథలు, నవలలు, నాటకాలు, కవితలు, వ్యాసాలలో; వేశ్యా ప్రసక్తిని ఈ పుస్తకం తడిమింది. తెలుగు స్త్రీవాద సాహిత్యంలో అక్రమ లైంగిక సంబంధాలు, వ్యభిచార ధోరణులు, వేశ్యావృత్తి వంటి అంశాలు భిన్న కోణాల్లో చిత్రించిన నవలలు, కథలు, కవితలు మొదలైనవాటిని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఇతర భారతీయ భాషలైన మరాఠీ, గుజరాతీ, హిందీ, ఉర్దూ, అస్సామీ, తమిళ, కన్నడ, బెంగాలీ, మళయాళ సాహిత్యాలలో వేశ్యాప్రసక్తిని మనకు పరిచయం చేస్తుంది. ప్రపంచ సాహిత్యాలలో ఆంగ్లసాహిత్యం, ఫ్రెంచి సాహిత్యాలలోని వేశ్యలకు సంబంధించిన ప్రస్తావనలను మనకు వివరిస్తుంది. చిత్రకళారంగంలోను, భారతీయ, ప్రపంచ చలనచిత్ర రంగాలలోను వ్యభిచార ధోరణులకు సంబంధించిన వివరాలున్నాయి.

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో వేశ్యా సంబంధమైన ఒక బూతు పదం ఉందని రచయిత అంటారు. ఈ పుస్తకంలో ఆ బూతు పదం మినహా వేశ్యలకు సంబంధించిన రూపజీవ, వారాంగన, పణ్యాంగన, వ్యభిచారిని, వారస్త్రీ, వారవనిత, వారమణి, వేశ్య, శ్యాలభంజిక, నర్మవీధికా, గణిక, భంజిష్ట, బర్బర, మందహాసిని, బోగముది, సాని, కులట, దేవదాసి, బసివిని, మాతమ్మ, జోగిని, దాసి, రూపదాసి, స్వైరిణి వంటి అనేక పేర్లు పేర్కొన్నారు.

ఈ వేశ్యలలో పండిత కవయిత్రులుగా ప్రసిద్ధి చెందిన రంగాజమ్మ, రామభద్రాంబ, మధురవాణి (కన్యాశుల్కం లోని పాత్ర కాదు), ముద్దుపళని మొదలైనవారు ఉన్నారు. సాహిత్య రచనలలో పింగళ, వసంతసేన, ఆమ్రపాలి, వాసవదత్త, మధురవాణి, నానా, కామిల్, చింతామణి, థాయిస్, బాదమ్మ, రామి, విద్యావతి, టెస్, ఊన్ లీ, రత్నావళి, ఎమిలి, నతాషా మొదలైన ప్రసిద్ధి చెందిన వేశ్యపాత్రలున్నాయి.

ఈ రచనకు రచయిత ఉపయోగించుకున్న గ్రంథాలను, రచయితలను గమనిస్తే ఇక ఈ అంశంపై ఈ గ్రంథంలో ప్రస్తావనకు రాని విషయం అంటూ ఏమీ మిగిలి ఉండదని అనిపిస్తుంది.

భారతీయ కథా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలు అరబిక్ భాషలో కలీలా వ దిమ్నా (Kalila wa dimnah) అంటూ అనువదించబడి, అరబ్బుల ద్వారా ఐరోపా ఖండంలో ప్రవేశించి ఈసోప్ కథలకు (Aesop fables) మూలాధారమైనదని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. దిగంబర కవిత్వం మూడవ సంకలనం యశోద అనే వేశ్య చేత ఆవిష్కరింపబడిన విషయం కూడా ఈ పుస్తకంలో ఉంది. రచయిత లోతైన పరిశోధనకు ఇవి తార్కాణాలు.

వేశ్య అంటే వైశికీకళలో నిష్ణాతురాలైనట్టి స్త్రీ అని అర్థం. వైశికీకళ వాత్స్యాయన కామసూత్రాలలో వివరించబడిన ఒక ప్రత్యేక అంశం అంటూ రచయిత పేర్కొంటూ అదే పేరా చివరలో ‘ఇలాంటి ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానం ప్రాచీన కాలంలో వేశ్యలకు విశేషంగా ఉండడం వలన ఈ కళ వైశికీ కళగా ప్రసిద్ధి చెందింది’ అంటారు. అంటే వైశికీ కళ నుండి వేశ్య అనే పదం పుట్టిందా? లేక వేశ్య నుండి వైశికీకళ అనేది ఉద్భవించిందా? అని పాఠకులకు సందేహం వస్తుంది.

ఈ పుస్తకం వెల 200 రూపాయలు. కావలసిన వారు డా. పి. రమేష్ నారాయణ, విశ్రాంత ప్రధానాచార్యులు, 13-2-172, రామచంద్రనగర్, అనంతపురము -515001, ఆం.ప్ర. అనే చిరునామాకు వ్రాసి తెప్పించుకోవచ్చు.

రచయిత పుస్తకం చివరలో వ్రాసిన ఈ క్రింది వాక్యాలతో నా ఈ పరిచయ వ్యాసం ముగిస్తాను.

ఈ నేపథ్యంలో వెలువడిన సాహిత్యం సైతం స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, వివక్ష ధోరణులను ప్రతిఫలించే రచనలుగా వున్నప్పటికీ సమాజంలో ఒక ప్రధానమైన అంతర్భాగంగా వుంటున్న వేశ్యారంగంపై మాత్రం ప్రభావశీలకమైన ప్రతిస్పందన పూర్తి స్థాయిలో వ్యక్తపరచకపోవడం ఒక విచారించదగ్గ అంశంగా వుండిపోయింది. ఇలాంటి అంశాలను తీసుకుని సంఘసంస్కరణవాదులు, స్వచ్చందసేవాసంస్థలు, అన్ని రంగాలలో స్త్రీల వున్నతికి కృషిచేసేవారు సెక్స్ వర్కర్లకు సమాజంలో గౌరవనీయ స్థానం కలిగించే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతోవుంది. తరతరాల సాంస్కృతిక వ్యవస్థలో స్త్రీజాతిలో తమదైన విశిష్టతను ప్రత్యేకంగా రూపొందించుకుని చిరకాలంగా మనుగడ కొనసాగించిన వేశ్యాసంస్కృతికి సభ్య సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని రూపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.