ఒక్క మలుపు!

ఈ మునిమాపు వేళ
గుబురుకున్న పొదలమధ్యలోంచి
తాటిచెట్ల నీడలు మొలిచినట్టున్న
వూరి అంచులోకి
నా నడకకు
సందిగ్ధంగా దారిగీస్తూ
అక్కడేదో ఓ మలుపు-

సగం జీవితాన్ని నింపుకున్నా
కదిలీ కదలనట్లున్న
హృదయం లాటి బాట యిది

ఓ పక్క వడిగాలికి
రాలిపడిన ఎండుటాకులు
అమాయకంగా
అన్నిటికీ తలలూపుతూ
పెరుగుతున్న గడ్డి చామంతులూ
లోలోపలగా కురుస్తున్న
సన్నటి వుద్వేగపు జల్లులూ
ఈ సాయంత్రపు ప్రతిబింబాల్లాటి
ఇపుడే నిలిచిన వాన అడుగులూ
వద్దన్నా వచ్చి ఆప్యాయంగా
ముఖాన్ని చుట్టేస్తూ
జీవితపు మధురిమను
ఆస్వాదించమంటున్న
చల్లని గాలీ-

కొన్ని అస్థిరమైన ఆలోచనలను
నవ్వులను
కన్నీళ్ళను
దాచుకున్న
యీ సవ్వడి చేయలేని
గుండె వాగునుంచి
నన్ను నేను దాటుకునేందుకు
కొన్ని పచ్చని ఆశలు
నింపుకు నిలిచేందుకు
కొత్త ఊపిరి పోసుకునేందుకు
మనుషులను కొత్తగా
చూసేందుకు కూడా
నా లోపలా ఒక మలుపైతే
తప్పక వున్నట్లే గుర్తు!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...