బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక

త్రయోదశదృశ్యము – యామినీవియోగపరితాపము

యామిని శోకము

పల్లవి:
86నినుఁబాసి కవిరాజ నేనెట్లు జీవింతు
కనుపాప కరవైన కనులెట్లు కనిపించు
అ. పల్లవి:
87నీప్రేమరహితమై నిర్జీవమైయున్న
ఈతనువు నేనింక నేరీతి ధరియింతు
చరణం1:
88మనమనంబుల తీరు కనలేని నాతండ్రి
నినుఁ జేసె వధ్యునిగ వినడింత నామొఱ
ఎడఁబాపు నేమొ నాతఁడు నీతనువు గాని
ఎడఁబాపఁజాలునా యెదలోనఁ గల నిన్ను
చరణం2:
89నీవలపుతోటలో నిత్యంబు కుసుమింప
కలగాంచు నాబ్రతుకు కన్నీటిపాలయ్యె
నీవలపుకౌఁగిటను నిత్యంబు వసియింప
భావించు నాబ్రతుకు వహ్ని పాలయ్యె


 1. కనుపాప లేకుంటే కనులు కన్పడక జగమంతా ఎట్లు శూన్యంగా దోచునో అట్లే నీవు లేకుంటే నాకు బ్రతుకంతా శూన్యము, నేను జీవింపలేను. దృష్టాంతాలంకారము.
 2. నీప్రేమ లేకుండ నిర్జీవమై, కట్టెవలె నున్న కాయముతో నేనెట్లుందును?
 3. ప్రేమించుకొన్న మన మనస్తత్వముల నెఱుగక నాతండ్రి నిన్ను చంపదగినవానిగా శాసించెను. నేను వలదన్న వినడు. నీ భౌతికశరీరాన్ని అతడు రూపుమాపుతాడో యేమొ కాని, నా యెదలో స్థిరంగా ఉండే నీరూపాన్ని మాపలేడుగదా!
 4. నీప్రేమ అనే తోటలో ఎప్పుడూ వికసించాలనే (అంటే సంతోషంగా ఉండాలనే) కలగనే నా బ్రతుకిప్పుడు కన్నీటి పాలైంది. నీప్రేమయొక్క కౌగిలిలో (లేదా ప్రేమతో గూడిన నీ కౌగిటిలో) నిరంతరం ఉండాలనుకొనే నాబ్రతుకు అగ్ని(వహ్ని) పాలై పోయింది.

చతుర్దశదృశ్యము – బిల్హణుని నిరాశాపూరితసంతాపము, వీరసేనుడు బిల్హణుని పద్యములను వ్రాసికొనుట

పల్లవి:
సుకుమారి యామినీ సుందరీ నిన్ను
స్మరియించుచుందునే మరణించు దాఁక
అ. పల్లవి:
నీప్రేమరహితమై నిస్తేజమైయున్న
బ్రతుకుకంటెను నాకు మృతియే ప్రియంబు
చరణం1:
90నాయాత్మలో భాగమై యుండె నీయాత్మ
కాయంబు నశియించు కాని యాత్మ వసించు
ఆయాత్మతో బుట్టి అన్యభవ మందైన
నీయోగమును బొంద నే నిపుడు భావింతు.
చరణం2:
91ఈభవంబున మన కింతయే కాబోలు
రాబోవు భవమందు ప్రతిరోధమే లేని
అనురాగబంధాన అలరారుచున్మనము
జనియింపవలెనంచు సర్వేశు నర్థింతు.

వీరసేనుడు: (ప్రవేశించి) వచనం: కవీంద్రా! మీకెంతటి దారుణస్థితి సంభవించినది. రాజాస్థానములయందు బ్రాహ్మీపీఠ మలంకరింపవలసిన మీకీ కారాగారశిక్ష యేమి? మరణదండన మేమి?
బిల్హణుడు:(వచనం) విధికృతమంతయును. నేను నిశ్చింతగా నున్నాను. మరణమన్న వెఱవను.

తే.గీ.
92తనువు నశియించు, నశియింపదాత్మ యెపుడు
అట్టి ప్రియురాలి యాత్మ నాయాత్మలోన
లీనమైయున్న దిఁక నష్టమైనఁగాని
తనువు, ఆత్మయుండుగద నిత్యంబుగాను.
కం.
93ఆరుచిరాంగియె మంత్రా
కారాన్వితయై మదాత్మకమలమునందున్
జేరిన దింకేటికి భయ
మూరకయే వీరసేన! ఉర్విని వీడన్.

వీరసేనుడు: ధీరోదాత్తులు స్వామీ మీరు.

తే.గీ.
94ఆర్య! మీదు కవిత్వమాధుర్యమహిమ
చాలకాలము గ్రోలంగఁజాల మింక;
కాన నుడువుఁడు కొన్ని శ్లోకములు మీరు
వ్రాసికొందును మత్పుణ్యఫలముగాఁగ.

బిల్హణుడు: అట్లె యగుఁగాక, పత్రముల్, గంటమ్ము గొనిరమ్ము వీరసేన!


 1. (గాఢంగా ప్రేమింపబడే) నీయాత్మ, నాయాత్మలోనే ఒకభాగమైంది. భౌతికకాయం నశించినా గాని, ఆత్మ నివసించే ఉంటుంది. అట్లు నశింపని ఆత్మతో పునర్జన్మను పొంది, ఆజన్మలో నైన నీయొక్క కలయికను (యోగమును) పొందుతానని నేను అనుకొంటున్నాను.
 2. ఈజన్మలో మనకు ఇంతమాత్రమే ప్రాప్తం కాబోలు. వచ్చే జన్మలో ఏ అడ్డంకులూ లేని అనురాగబంధంతో ఉండేట్లు జన్మించాలని నేను భగవంతుని కోరుకొంటున్నాను. భవము=పుట్టుక, జన్మ; ప్రతిరోధము=అడ్డంకి.
 3. తా॥ తనువు(శరీరము) నశిస్తుంది. కాని ఆత్మ నశింపదు. నాప్రియురాలి ఆత్మ నా ఆత్మలో లీనమై యున్నది. తనువు నష్టమైతే కానిమ్ము. కాని నాప్రియురాలి ఆత్మతో లీనమై యున్న నా ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కదా!
 4. తా॥ ఆ అందాలరాశియే (ఆమెనే సంతతము జపించుచుండుటచేత) మంత్రరూపమున నా ఆత్మకమలములో చేరినది. అట్లామె నాఆత్మలో ప్రవేశించడంవల్ల, ఈభూమిలో నా తనువును విడిచిపోవుటలో నాకేమీ భయం లేదు.
 5. తా॥ అయ్యా! మీకవిత్వమాధుర్యముయొక్క మహిమను మేమింక అధికకాల మాస్వాదింపజాలము. అందుచే (చివరిగా) మీరు కొన్ని శ్లోకములను చెప్పుడు. నాపుణ్యఫలముగా నెంచి నేను వాటిని వ్రాసికొందును.

పంచదశదృశ్యము – రాజసభ: రాజు, రాణి, మంత్రి ప్రవేశము

రాజు:

పండితుండైన ఆబ్రాహ్మణోత్తముని
శిక్షింప నిర్ణయించిన క్షణమునుండి
సంక్షుభితమగుచుండె స్వాంత మెంతొ.

మంత్రి:

95నిర్ణయం బది యంత నీతిబద్ధమొకాదొ
మఱల యోచింపుడొకమారు క్ష్మాతలేంద్ర
క్షత్రియాంగనతోడ క్ష్మాసురోద్వాహమ్ము
సమ్మతించునుగదా సర్వశాస్త్రములును

రాణి:

‘కన్యా వరయతే రూప’ మని ఉన్నదే కదా!
చ.
96అతిశయరూపనిర్జితసుమాస్త్రుఁడు, విశ్రుతశాస్త్రపాండితిన్
ప్రతినవపంకజోద్భవుఁడు, రమ్యకవిత్వ సుధాభివర్షణా
మృతకరుఁ, డుత్తముం, డతని మించినవాఁడు, త్వదీయపుత్త్రికిన్
హితుఁడగు నల్లువాఁడు లభియించునొ యోచనసేయుమో నృపా!


 1. క్ష్మాతలేంద్ర=ఓరాజా! మీ నిర్ణయం నీతిబద్ధమో కాదో మఱొక్కసారి ఆలోచించండి. క్షత్రియస్త్రీతోడ బ్రాహ్మణుని వివాహము అన్ని శాస్త్రాలూ అంగీకరిస్తాయి కదా!
 2. తా॥ ఓ రాజా (నృపా)! విశిష్టమైనరూపముచే జయింపబడిన సుమాస్త్రుడు గలవాడును, ప్రసిద్ధమైన పాండిత్యమునందు క్రొత్తనైన బ్రహ్మదేవునివంటివాడును, రమ్యమైనకవిత్వమను అమృతవర్షముచే అమృతకరుడైన చంద్రునివంటివాడును, ఉత్తముడును, మీ పుత్రికకు తగినవాడును ఐన అల్లుడు, అతని మించినవాడు లభిస్తాడా అను విషయమును యోచింపుము.

ప్రతీహారి ప్రవేశించి వీరసేనుని రాక నెఱింగించును.

ప్రతీహారి: జయము రాజేంద్ర। వీరసేనుఁడు మిముఁజూడ వేచియుండె
రాజు: ఏల వచ్చెనొ కాని, ఇట కాతనిం బంపు.
వీరసేనుఁడు:

తే.గీ.
97స్వస్తి రాజేంద్ర! మఱికొన్ని క్షణములందె
కలుగు బిల్హణునకు శిరఃఖండనమ్ము
ఈక్షణంబునఁగూడ వచించె నతఁడు
అద్భుతంబగు శ్లోకంబు లక్కజముగ
సత్కవిత్వరసాస్వాదసక్తులైన
తమకుఁ జూపఁ దెచ్చితిని తత్కవిత నేను.

రాజు: ఏదీ యిటు దెమ్ము.

వీరసేనుడు శ్లోకములు గల పత్రిక నిచ్చును. రాజు క్షణకాలము చూచి, ఈ క్రింది పద్యమును బిగ్గరగా చదువును.

సీ.
98క్షోణ్యంశ మాఘనశ్రోణి చరించెడు
క్షేత్రంబునందునఁ జేర్పుమయ్య !
ఆపంబు నాయమృతాధర నిత్యంబు
జలకమాడెడి నీటఁ గలుపుమయ్య!
తేజంబు నాతటిద్దేహ దర్శించు నా-
దర్పణాంతరమందుఁ దార్పుమయ్య!
గంధవాహాంశ మాగంధిలశ్వాసకుం
బట్టు వీవనలోనఁ బెట్టుమయ్య!
తే.గీ.
ఆకసంబును శూన్యమధ్యాంఽగణంబు
నందు లీనంబు గావింపుమయ్య నలువ!
మేను పంచత్వమొందినఁ గాని, నాదు
పంచభూతాత్మ చెలితో వసించునట్లు.


 1. రాజశ్రేష్ఠా జయము. ఇంక కొన్నిక్షణాలలో బిల్హణునికి శిరశ్ఛేదనం జరుగబోతున్నది. ఈసమయంలో గూడ ఆశ్చర్యకరముగా నతడు అద్భుతమైన శ్లోకములను చెప్పినాడు. సత్కవిత్వమును ఆస్వాదించుటలో ఇష్టముగల తమరికి చూపుటకై అతడు చెప్పిన కవిత్వమును(వ్రాసికొని) తెచ్చినాను.
 2. ఇది యొక పరమాద్భుతమైనపద్యము. మరణమునకు పంచత్వమని పేరు. పంచభూతాత్మకమైన శరీరము భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము అను పంచభూతములలో కలిసిపోవుటకే పంచత్వము=మరణము అని పేరు. ఈ పద్యములో బిల్హణుడు తాను మరణించిన తర్వాత తన పంచ భూతాత్మకశరీరములోని పంచభూతములను మరణానంతరమునగూడ యామినితోనే వసించునట్లు చేయుమని, సృష్టికర్తయైన నలువను=బ్రహ్మను ప్రార్థించుచున్నాడు. అదెట్లనగా, ఓ నలువా=ఓబ్రహ్మదేవుడా, మేను పంచత్వమొందినగాని=శరీరము మరణించినా గాని, పంచభూతాత్మ=పంచభూతాత్మకమైన నా ఆత్మ, చెలితో=ప్రియురాలితో, వసించునట్లు=ఉండునట్లుగా (చేయుము. అదెట్లనగా),
  1. క్షోణ్యంశము=భూమియొక్క అంశమును, ఆఘనశ్రోణి =గొప్పనైన పిఱుదులు గల ఆ స్త్రీ (యామిని), చరించెడు= తిరుగాడెడు, క్షేత్రంబునందున= భూమిలో, చేర్పుమయ్య. స్త్రీయొక్క కటిభాగమును భూమితో బోల్చుట కవిసంప్రదాయము. ఇచ్చట క్షోణ్యంశప్రసక్తి వచ్చినది కావున, ఆ క్షోణిని బోలు ఘనమైన పిఱుదులు గల స్త్రీ అని సాభిప్రాయముగా చెప్పబడినది. ఇతర పాదములందును ఇట్టి సాభిప్రాయతయే ఉన్నది. గమనిక: మూలశ్లోకములో ఇట్టి సాభిప్రాయత లేదు.
  2. ఆపంబున్=నీటిని, ఆ అమృతాధర=అమృతమువలె తీయనైన అధరము గల స్త్రీ, నిత్యంబు=ఎప్పుడును, జలకమాడెడి నీటన్=స్నానము చేయు నీటిలో కలుపుమయ్య. తన శరీరములోగల జలముయొక్క అంశమును, ఆమె జలకాలాడే నీటిలో గలుపమని వేడికొనుచున్నాడు. అమృతాధర సాభిప్రాయపదము. ఇక్కడ జలప్రసక్తి వచ్చినది గనుక జలమునకు సామ్యమైన అమృతముతో కూడిన అధరమని చెప్పబడినది.
  3. తేజంబున్=తనలోని తేజస్సుయొక్క అంశమును, ఆ తటిద్దేహ=మెఱుపుతీగవంటి శరీరముగల ఆమె, దర్శించు=చూచే (చూచుకొనే), ఆ దర్పణాంతర మందు=ఆ అద్దంలో, తార్పుమయ్య=ఉంచుమయ్య. ఇక్కడ తేజస్సును చెప్పినాడు గనుక, తేజోమయమైన మెఱుపువంటి దేహము గలది అను పదము సాభిప్రాయముగా వాడబడినది.
  4. గంధవాహాంశము=వాయువుయొక్క అంశమును, ఆ గంధిలశ్వాసకున్= సుగంధయుతమైన శ్వాసగల ఆమెకు, పట్టు=పట్టునటువంటి, వీవనలోన=విసన కఱ్ఱలో, పెట్టుమయ్య=ఉంచుమయ్య. ఇచ్చట గంధవాహమును చెప్పినాడు గనుక సాభిప్రాయముగా ఆమె గంధిలశ్వాస గలదానిగా చెప్పబడినది.
  5. ఆకసంబును=ఆకాశముయొక్క అంశమును, శూన్యమధ్య+అంగణమునందు=(ఆమెయొక్క) సన్ననైన నడుము గల ఆ స్త్రీయొక్క అంగణమునందు, లీనంబు కావింపుమయ్య= కలిసిపోవునట్లు చేయుమయ్య. శూన్యమంటే లేనిది, ఆకాశము అని అర్థములు. అందమైన స్త్రీల నడుము సన్నగా నుండునని వారిని శూన్యమధ్యలని కవులు వర్ణిస్తుంటారు. అట్టి శూన్యమధ్యయొక్క అంగణంలో తనయొక్క ఆకాశాంశమును విలీనం చేయుమని కవి బ్రహ్మదేవుని ప్రార్థించుచున్నాడు. అంతటా వ్యాపించియున్న ఆకాశంవలె అంగణం విస్తారంగా ఉందని, అందుచే నామెయొక్క అంగణంలో ఆకాశముయొక్క అంశమును కలుపమని కవి చెప్పుచున్నాడని వ్యాఖ్యానింపవలెను. పైపద్యము ఈక్రింది బిల్హణుని శ్లోకమునకు నేను చేసిన భావానువాదము.

   శ్లో॥ పంచత్వం తనురేతు, భూతనివహే స్వాంశా మిళన్తు ధ్రువం
         ధాతః త్వాం ప్రణిపత్య సాదరమిదం యాచే నిబద్ధాఞ్జలిః।
         తద్వాపీషు పయః, తదీయముకురే జ్యోతిః, తదీయాంగణే
         వ్యోమః స్యాచ్చ, తదీయవర్త్మని ధరా, తత్తాళవృన్తేఽనిలః॥


రాజు: (మహోత్తేజితుడై పల్కును)

పల్లవి:
కవనమందున భువనమందున
లేరు నీసరివారు బిల్హణ!
చరణం1:
99మరణముఖమును అరయుచున్నను
ఇంత చక్కగ, నింత భావస
మంచితంబుగ నల్లినాడవు
మేదినీసుర! నీదు కవితను
చరణం2:
100నీదుమహిమను నేనెఱుంగక
నీకు వేసితి నిధనశిక్షను.
నాదు సుతపై నీదు ప్రేమము
ఉత్తమాశయయుత మద్వితీయము.

(వచనం) వీరసేనా! తక్షణము సంకెలలు తొలగించి, ఆ బ్రాహ్మణు నిటకు దెమ్ము.
రాణీ! యామిని నిటకు రప్పింపుము. మంత్రివర్యా! యామినీబిల్హణుల శుభవివాహమును నేఁడే ప్రకటించుము.


 1. అరయుచున్నను=చూచుచున్నను; మేదినీసుర!=బ్రాహ్మణుడా! ఇట్లు సంబోధించుటవల్ల నీవు నా క్షత్రియ కన్యకను వివాహమాడినను సరియే యని సూచించుచున్నాడు.
 2. నిధనశిక్ష=మరణశిక్ష, నిధనము=మరణము; ఉత్తమాశయయుతము= ఉద్రేకపూరితము గాక ఉదాత్తమైనది; అద్వితీయము=సాటిలేనిది, నాప్రేమకంటెను అధిక మనుట.