బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక


దశమదృశ్యము – యామిని వనవిహారము

సంధ్యాకాలమున యామిని చంద్రికామధురికలతో వనమునందలి తరులతాదులను చూస్తూ ఈక్రింది పాటను పాడుచు విహరించుచుండును.

పల్లవి:
58చైత్రమాసపువేళ చక్కగా నరుదెంచె
చిత్రముగ వనమెల్ల సింగార మొలికించె
చరణం 1:
నీతనూలతతోడ నిలువెల్ల పెనవేసి
కౌఁగిలించితి గాని గాటముగ వీఁడెవఁడె
మాకందపురుషుండొ మన్మథుండో వీఁడు
చెప్పవే మాధవీ సిగ్గేల నీకు ।చైత్రమాసపు॥
చరణం 2:
59వలవంత బూనకే కలువకన్నియ చాల
పులకింపఁజేయుచున్ భువినెల్ల త్వరలోన
వెలయునే నీరాజు, వేయిచంద్రులలీల
వెలుగునే నీమోము కలత నీ కేల ॥చైత్రమాసపు॥
చరణం 3:
60తెలిపూలవలిపంబు నిలువెల్ల ధరియించి
సరిలేని జ్యోత్స్నాభిసారికం దలపించు
మల్లికా నీవింత తల్లడిల్లెద వేల
వచ్చులే నెలరాజు త్వరగ నిను జేర ॥చైత్రమాసపు॥
చరణం 4:
61కోకిలా నీకెంత కోప మింతులపైన
పంచమంబునఁ బాడి పతిలేక వెగడొందు
విరహార్తలను చాల వెతలపా లొనరించి
గుట్టుగా దాగెదవు చెట్టుచాటునను ॥చైత్రమాసపు॥


 1. సింగారము=శృంగారము, అందము; తా॥ మాకందమనగా మామిడిచెట్టు. అది పురుషునిగా భావింపబడ్డది. దాని చుట్టును మాధవీలత (బండిగురువెందతీగ) చుట్టుకొన్నది. ఆ తీగ స్త్రీగా భావింపబడినది. ఆతీగను చూస్తూ అమ్మాయిలు చిలిపిగా, అడుగుతున్నారు. ‘ఓమాధవీ! సిగ్గెందుకు? నీవు కౌగలించుకున్నవాడు మాకందుడా, మన్మథుడా చెప్పు!’
 2. ఇంతలో కొలనులో కలువను చూచినారు. ఆకలువ కాస్త పాలిపోయి ఉన్నది. కలువలు వెన్నెలలో రాత్రి వికసిస్తాయని, కలువలకు, చంద్రునికి నాయికానాయకసంబంధం కవులు కల్పిస్తారు. ‘ఓకలువకన్యా! వలవంతతో అతిగా కలవరపడకు. త్వరలో చంద్రుడు వస్తాడులే. అప్పుడు అనందంతో నీముఖం వేయిచంద్రులలాగ వెల్గుతుందిలే’ – అని అమ్మాయిలు ఓదార్చుతున్నారు. వలవంత=విరహవేదన.
 3. ఇంతలో తెల్లనిపూలతో నిండిన మల్లెతీగ కనబడింది. అది వెన్నెలలో తెల్లచీరగట్టి ప్రియునికై వేచే జ్యోత్స్నాభిసారికలాగుంది. ‘ప్రియుడింకా రాలేదని తల్లడిల్లకు. నీ ప్రియుడైన నెలరాజు (చంద్రుడు) త్వరలోనే వస్తాడు లే!’ – అని ఊరడిస్తున్నారు.
 4. ఇంతలో చెట్టుచాటున దాగి గానం చేసే కోకిలధ్వని విన్పడింది. ‘ఓ కోకిలా! ఎందుకు స్త్రీలపై నీకింత కోపం? పంచమంలో పాడి, ప్రియుని ఎడబాటుతో శోకించే స్త్రీలకు మఱి కొంత కష్టం కలిగించి అపరాధం చేసిన దొంగలా చెట్టుచాటున దాగుతావు?’ అని అమ్మాయిలు కోకిలను ప్రశ్నిస్తున్నారు.

ఇంతలో చంద్రోదయమగును. ఆనిండుచంద్రుని చూచి, ఆ ఉద్యానం ప్రక్కనే ఉన్న భవనంలో నున్న బిల్హణుఁడు ఆపూర్ణచంద్రుని వర్ణిస్తూ చదివే ఈక్రింది పద్యాలు వారికి కొంచెం దూరం నుండి వినిపిస్తాయి.

బిల్హణుఁడు:
వచనం: పూర్వదిక్సతి ముఖమందు బొట్టువలె పూర్ణుఁడై వెలుగొందు నిందునిలో నీకందు వింతగా నున్న దిదియేమి?

తే.గీ.
62రాత్రి తమమెల్ల గుటగుట త్రాగివేయ
పొట్టలో నది పేర్కొని ముద్దగట్టి
కందుచందము తనువందుఁ గానుపించు
నందు నిందుఁడ! నీలోని కందు నేను.
తే.గీ.
63సుందరాంగుల సృజియించుచో విరించి
అమృతమయమైన మృత్తిక నపహరింప
నేర్పడిన కుహరంబె యౌనేమొ చంద్ర!
నీదు తనువందు నెలకొన్న నీలిమంబు.

మధురిక:

ఎవ్వరే యామినీ ఇంతశ్రావ్యంబుగా
వర్ణించుచున్నారు పూర్ణిమాచంద్రుని?

యామిని: (వినుచున్నట్లు నటించి)

మునువిన్నకంఠమే యనిపించుఁ గాని
ఇదమిత్థముగ దీని నేర్పరుపలేను.

(వితర్కించి, తనలో)

మునుపు యవనిక వెనుకనుండియె వినిన కంఠపు ధ్వనియె ఇయ్యది.
ఆర్యబిల్హణుఁడాలపించిన విధుని వర్ణనవిధమె ఇయ్యది.
ఐన నాతం డంధుడంచును తెరను గట్టిరి అరయకుండఁగ.
అంధుఁడేగతి చందురుం గను? కనక యిట్లెటు గట్టు పద్యము?
వింతవింతగ నున్నదంతయు, దీని తంతెదొ తెలిసికొనవలె.

చంద్రిక:

అరయవే యామినీ అందాల చంద్రుని
అతనిపై నొకపాట ఆలపింపవె నీవు!

యామిని:

64ఆయత్తవైనచో అభినయింపఁగ నీవు
అట్టులే పాడెద అనుమాన మేల?


 1. తా॥ ఓ చంద్రుడా! రాత్రిపూట నల్లనైన చీకటిని గుటగుట త్రాగివేయగా, అది పొట్టలో పేరుకొని పోయి, ముద్దగట్టి, మచ్చలాగ నీ (తెల్లనైన) శరీరంలో కన్పడుతూ ఉన్నదని, నీలోని మచ్చను నేను భావిస్తాను. తమము=చీకటి; కందు=మచ్చ; తనువు=శరీరము; ఇందుడు=చంద్రుడు.
 2. తా॥ ప్రపంచంలో సుందరమైన స్త్రీలను సృష్టించడానికి బ్రహ్మకు అమృతంతో కూడిన మట్టి అవసరమైంది. ఓ చంద్రా! నీవు అమృతాంశుడవు కావున, నీలో అట్టి మట్టి ఉందని, బ్రహ్మ దానిని కాస్త ఎత్తుకొని పోయినాడు. అట్లేర్పడిన పెద్ద కన్నమే నీలో నున్న నల్లని మచ్చ కాబోలు. విరించి=బ్రహ్మ; నీలిమ=నల్లదనము.
 3. (ఇక్కడ యామినిపాటకు తోటలో చంద్రిక నర్తిస్తుందనే కల్పన చేసినాను. అది సాధ్యం కాకుంటే ఈవాక్యాలను కొంత మార్చవలసి ఉంటుంది.)

యామిని నిండుపున్నమ వేళ అను పాట పాడును. అది ఉద్యానవన సమీపమునందు కిటికీగుండా చంద్రునిసౌరు నానందించుచున్న బిల్హణునికి వినపడును

బిల్హణుడు:

కం.
65‘ఆహా! ఏమీ గానము,
నా హృదయంబున కమందనందము గూర్చున్,
ఊహింప సుపరిచిత కం
ఠాహితమైన స్వనముగనె నాకుం దోఁచున్.
తే.గీ.
66సందియంబేల యీధ్వని సత్యముగను
యామినీకంఠజనితంబె; ఆ లతాంగి
సకులఁ గూడి విహారంబు సల్పఁగాను
వచ్చియుండెను గద! పుష్పవాటి కిపుడు.’
67‘పాండిత్యంబే వరపాండిమమై,
రాసిక్యంబే రమ్యామృతమై,
పరగిన విబుధప్రవరుఁడ వీవే,
యామిని వలచిన స్వామివి నీవే,
నిండుపున్నమవేళ నెనరార ద్విజరాజ!
రారమ్ము యామినిం జేరంగ ద్విజరాజ!’
తే.గీ.
68మరులు గొంటివొ నాపైని తరుణి నీవు,
ప్రణయగీతంబు నీరీతిఁ బలికెదీవు;
అరయఁజాలవొ స్వప్నమందైన నేను
కనఁగఁజాలను కుష్ఠుల ననెడు మాట!

మఱికొంత వితర్కించి…

ఆ.వె.
69కాని నియమభంగమైనను ఆస్వనం
బావహిల్లునట్టి యాననమును
కాంచు కాంచు మంచు కౌతుకాయత్తమై
డెందమెందుకొమఱి తొందరించు.


 1. తా॥ ఆహా! ఈ గానము శ్రావ్యముగానుండి నామనసున కధికమగు సంతోషమును గూర్చుచున్నది. ఆలోచించి చూడగా ఇది నాకుసుపరిచితమైన కంఠమునుండి జనించిన ధ్వనిగనే తోచుచున్నది. అమంద=అధికమైన; నందము=సంతోషము; కంఠాహితస్వనము=కంఠమునుండి ఉత్పన్నము చేయబడిన ధ్వని.
 2. తా॥ సందేహమెందుకు. ఇది సత్యంగా యామినీ కంఠంనుండి వచ్చినదే. తన సఖులను గూడి ఆమె ఉద్యానమునకు వచ్చి యున్నదిగదా! (అందుకే ఉద్యానవనమునుండి ఈధ్వని వచ్చినది. కడచిన దృశ్యము చివర ఆమె సఖులతో గూడి ఉద్యానమున కేగుచున్నట్లు బిల్హణునికి తెలిసినది.)
 3. తా॥నీ పాండిత్యమే తెల్లదనమై, నీ రసికత్వమే రమ్యమైన అమృతమువంటిదై ఒప్పారిన పండితశ్రేష్ఠుడవు నీవు. యామిని అను స్త్రీ వలచినట్టి నాయకుడవే నీవు. ఈనిండు పున్నమవేళలో నెనరార=ప్రేమతో, ద్విజరాజ=ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా ఆయామినితో గూడుటకు రమ్ము. లోగడ చెప్పినట్లుగా ఈవాక్యాలు చంద్రునికీ సమానంగా వర్తిస్తాయి. యామిని ఆఅర్థంతోటే పాడినా, బిల్హణునికి మాత్రం అది తననుగుఱించే పాడినట్లు అర్థమైంది.
 4. తా॥ ఓజవరాలా! నీవు నాపై మరులు గొన్నావా? అందుచేతనే ఈవిధంగా ప్రణయగీతాన్ని పాడుచున్నావా? కాని నీకు తెలియదా నేను కలలోనైనా(నీవంటి) కుష్ఠరోగులను కన్నెత్తి చూడనని? (బిల్హణునికి యామిని కుష్ఠరోగి అని చెప్పి, ఆమె కనిపించకుండా మధ్యన తెరను గట్టినారు.)
 5. తా॥ కాని (కుష్ఠులను జూడననే) నియమము భంగమైనను, ఆ కంఠధ్వని వెలువడే ముఖాన్ని ‘చూడు, చూడు’ మనుచు కుతూహలంతో నాహృదయం తొందరించుచున్నది.

ఏకాదశదృశ్యము – మఱునాటి యామినీబిల్హణుల సమావేశము

యథాప్రకారం యామినీబిల్హణులు తెర కిరువైపులా కూర్చొని యుందురు.

యామిని: వందనము గురువర్య! వందనం బిదె, యామినీవందనంబు.
బిల్హణుడు: కల్యాణప్రాప్తిరస్తు కంజాక్షి నీకు.

కం.
70నిన్నటి రాతిరి పున్నమ
వెన్నెలలోఁ బొనరిన వన విహరణ సుఖసం
పన్నంబగుచును యామిని
చెన్నారెనె నీకు, నీదు చెలికత్తెలకున్?

యామిని:

తే.గీ.
71సందియము లేదు గురువర్య చక్కగానె
సాగినది నా విహారంబు సకులతోడ;
కాని కల్గినది వనాంతికంబునందు
నున్న భవనంబునందుండి యొక్కవింత.
కం.
72చందురు వర్ణనఁ జేయుచు
సుందరమగు స్వనముతోడ శ్లోకము లత్యా
నందముఁ గూర్చుచు వినవ
చ్చెం దద్భవనంబునుండి చిత్రావహమై.

బిల్హణుడు:

73ఆశ్చర్య మొందంగ నవసరం బేమి?
అందాల చంద్రుని అవలోకమొనరించి
ఆశువుగ నేనె కవితావేశ మొదవంగ
ఆలపించిన శ్లోకజాలంబులే యవ్వి

యామిని:

74ఏమంటి రేమంటి, రేమంటి రార్య!
ఆలోకమొనరించి తంటిరా మీరు?
అంధులే మీరంచు అనృతంబు వల్కి
మోసపుచ్చిరె నన్ను భూసురేంద్ర!

బిల్హణుడు:

75కుష్ఠరోగంబుచే కోమలీ నీమోము
కాంచంగ నర్హంబు గాదంచు వచియించి
వంచించిరే నన్ను, వచియింపవే యిదియు
కల్లయో సత్యంబొ, ఉల్లంబు శాంతింప

యామిని:

76కుష్ఠరోగినె నేను? ఘోరమౌ అనృతంబు
ఇంతకంటెను గలదె యెందైన స్వామి!
కారు మీరంధులు, కాను కుష్ఠను నేను
ఇంకేల మనమధ్య ఈకాండపటము?


 1. తా॥ పున్నమవెన్నెలలో నిన్నటిరాత్రి సంభవించినట్టి (పొనరిన) వనవిహారము యామినీ! నీకును, నీ స్నేహితురాండ్రకును, సుఖమును కల్గించునదై ఒప్పారెనా? – అని బిల్హణుడు యామిని నడుగుచున్నాడు.
 2. తా॥ సందేహం లేదు. నా చెలిమికత్తెలతో (వన) విహారము చక్కగానే సాగినది. కాని (ఆ సమయంలో) వనమునకు సమీపమందున్న భవనమునుండి ఒకవింత కల్గినది. వనాంతికమునందు =వనసమీపమునందు.
 3. తా॥ సుందరమైన కంఠధ్వనితో చంద్రుని వర్ణన చేసే శ్లోకములు ఆశ్చర్యమును కలిగించుచూ, ఎంతో ఆనందమును గూర్చుచు ఆభవనమునుండి వినిపించినవి. తద్భవనంబునుండి=ఆభవనంబునుండి; స్వనము=(కంఠ)ధ్వని; చిత్రావహమై=ఆశ్చర్యమును కలిగించుచు.
 4. తా॥ అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? అందమైన చంద్రుని చూచి, కవితావేశం నాలో కల్గగా, నేనే ఆశువుగ చెప్పిన శ్లోకముల సమూహములే అవి. అవలోకమొనరించి=చూచి, శ్లోకజాలములు=శ్లోకసమూహములు.
 5. తా॥ ఏమన్నారేమన్నారు? మీరు (చంద్రుని) చూచినానని అంటిరా? ఐతే మీరంధులని చెప్పి నన్ను మోసపుచ్చినారా? అనృతంబు=అసత్యము;
 6. తా॥ఓ కోమలాంగీ! కుష్ఠరోగముండుటచేత నీముఖము చూడదగినది కాదని చెప్పి నన్ను వంచించినారా? ఇదిగూడ అసత్యమో (కల్లయో), సత్యమో చెప్పి నాకు మనశ్శాంతిని కల్గించు. ఉల్లము=మనస్సు.
 7. తా॥ నేను కుష్ఠరోగినా? దీనికంటె ఘోరమైన అసత్య మింకెక్కడైన ఉంటుందే? మీరు అంధులు గారు. నేను కుష్ఠరోగిని కాను. అటువంటప్పుడు మనమధ్య ఈ తెర యెందుకు? కాండపటము=తెర.

అని యామిని ఆవేశముతో లేచి తెరను ప్రక్కకు విసరివైచి బిల్హణునివైపు పరిక్రమించును. అట్లు పరిక్రమించి, బిల్హణుని చూచి, తనలో

77ఎంత అందగాఁడొ, ఈతడెంత అందగాఁడొ,
పూర్ణపాండితిటుల మూర్తిమంతమైనదేమొ
లేక యిట్టి రూపురేక లొందు నెందునేని?
మంత్రముగ్ధమైన మాద్రి వీని శోభలోనఁ
దేలి నాదు తనువు దూలిపోవుచున్నదేమి?
శీతమధువు ద్రావ చిత్త మవశ మైన యట్లు
వీనిఁ జూడ మనసు వివశమగుచునున్న దేమి?

అని వివశురాలై యామిని క్రింద పడబోవును. అప్పుడు బిల్హణుఁడు ఆమెను లేవనెత్తి తన ఒడిలో పండుకొనబెట్టుకొని ఆమె ముఖమును పరిశీలించుచు.

బిల్హణుఁడు:

ఉ.
78ఇంతులఁ గాంచి తెందరినొ యీజగమందున వారిలోన్
పంతముఁ బూని సత్కవులు వర్ణన సల్పిన కావ్యనాయికా
సంతతులందు, నిట్లు స్మరశక్తియె రూపము దాల్చినట్లుగన్
స్వాంతముఁ దన్పునట్టి వరవర్ణినిఁ గాంచను, కాంచనెప్పుడేన్.
79అవనికిం దిగినట్టి అచ్చెరంబోలు
ఈయింతి యాస్యంబు నాయంకమందు
కొలనులో జలజంబు చెలువునుం బూని
వెలుగుచున్ హృదయంబు వేవేగఁ దోఁచు.

యామిని:
వచనము: బిల్హణకవీంద్రా! బిల్హణకవీంద్రా! అని పలవరించును.
బిల్హణుడు:

80లేలెమ్ము యామినీ! కాలమ్ము మనదింక
తారనుం గోరెడు రేరాజు చందాన
జాహ్నవిం గోరెడు శంతనుని చందాన
నీయందు అనురక్తి నిక్కముగ నాకొదవె.

యామిని: (తేరుకొని)

ఉ.
81అబ్ధిలో లీనమౌ ఆపగం బోలి,
లీనమైపోదు నీలోన కవివర్య!
మనబంధ మనిశంబు మనుచుండుఁగాక,
గాంధర్వవిధిచేత గట్టిపడుఁగాక! (అనుచు బిల్హణుని కౌగిలించును.)

బిల్హణుడు:

తే.గీ.
82పంచభూతంబు, లష్టదిక్పాలవరులు,
హరిహరాదులు, తత్సతు లస్మదీయ
పూతగాంధర్వబంధనంబునకు సాక్షు
లగుచు దీవింత్రుగాక అత్యాదరమున.
తే.గీ.
83అబ్ధిలో లీనమౌ నది యందమెసఁగ,
లీనమైతివి చెలియ! నాలోన నీవు,
సార సంగీత సాహిత్య సంగమంబు
భంగి మనదు సంశ్లేషంబు భవ్యమయ్యె. (ఇర్వురు గాఢముగ కౌగిలించుకొందురు.)


 1. తా॥ ఈతడెంత అందగాడో, ఎంత అందగాడో అని యామిని అతని అందమున కాశ్చర్యచకిత యగుచున్నది. నిండైన పాడిత్యం మనుష్యరూపం దాల్చిందేమో! లేకుంటే ఇటువంటి రూపరేఖ లెలా వస్తాయి? వీని వర్చస్సులో మంత్రమోహితమైనట్లుగా నాశరీరము (నిల్కడ దప్పి) తూలిపోవుచున్నది. చల్లని మద్యాన్ని సేవిస్తే మనస్సు వశం దప్పినట్లుగా, వీనిని చూస్తుంటే నా మనస్సు వివశత్వమును పొందుచున్నది. (ఇట్లామె మూర్ఛ యను అనంగదశను పొందుచున్నది.)
 2. తా॥ ఈప్రపంచంలో ఎందరో స్త్రీలను చూచినాను. వారందరిలోను, (నేను బాగా వర్ణిస్తానంటే నేను బాగా వర్ణిస్తానని) పంతమాడి మంచికవులు వర్ణించే కావ్యనాయికా సమూహములయందు, మన్మథుని శక్తియే స్త్రీరూపం దాల్చిందా అన్నట్లుండే ఇటువంటి ఉత్తమస్త్రీని నేను చూడలేదు.
 3. భూమికి దిగిన అప్సరసవలె ఉన్న ఈమెయొక్క ముఖము నాఒడిలో కొలనులో నున్న పద్మమువలె వెలుగుతూ నాహృదయాన్ని త్వరత్వరగా దోచుకొనుచున్నది.
 4. కాలమ్ము మనదింక=ఇక కాలము మనకు అనుకూలముగా నున్నది. రేరాజు=చంద్రుడు, అనురక్తి=ప్రేమ. జాహ్నవి=గంగాదేవి. మానవరూపములో నున్నగంగాదేవిని చూచి మోహపరవశుడై శంతను డామెను పెండ్లాడుట మహాభారతములో ప్రసిద్ధమైన ఘట్టము.
 5. అబ్ధి=సముద్రము; ఆపగ=నది; అనిశంబు=ఎల్లప్పుడు;గాంధర్వవిధి=గాంధర్వవివాహము.
 6. అస్మదీయ=మనయొక్క, హరిహరాదులు=విష్ణువు, శివుడు, మున్నగు దేవతలు, తత్సతులు=వారి భార్యలు (లక్ష్మీ,పార్వతీ, శచీదేవి మున్నగువారు); పూతగాంధర్వబంధనంబునకు=పవిత్రమైన గాంధర్వ వివాహమునకు.
 7. అబ్ధి=సముద్రము; సంశ్లేషంబు=కౌగిలింత; భంగి=విధముగా; భవ్యమయ్యె=యోగ్యమయ్యెను, సుఖకరమయ్యెను.

ద్వాదశదృశ్యము – కారాగారదృశ్యము

నేపథ్యమునుండి: ఇట్లు గాంధర్వవిధిచేత యామినిని వివాహము చేసికొన్న బిల్హణుడు ఆమె అంతఃపురములో నుండసాగెను. గురుశిష్యసంబంధమును కించపఱచి, రాజకుమారితో ప్రణయసంబంధమును పెంచుకొని, ఆమె అంతఃపురమందే నివసించుట మహాపరాధముగా గణించి, మహారాజు ఆనాడే అతనిని కారాగారబద్ధుని జేసి, మఱునాటి మధ్యాహ్నం శిరశ్ఛేదన చేయవలసిందిగా శాసించెను. భటులు బిల్హణుని శృంఖలాబద్ధుని జేసి కారాగారపతియైన వీరసేనున కప్పగించిరి.

ప్రవేశము: శృంఖలాబద్ధుని చేసి బిల్హణుని కొనివచ్చిన ఇద్దరు భటులు, శృంఖలాబద్ధుడైన బిల్హణుఁడు, వీరసేనుఁడు. స్థలము:కారాగారము

భటులు: వీరసేనా!

బ్రాహ్మణుండంట, బహుపండితుండంట
కడుచెడ్డ నేరంబు గావించినాడంట
ఈనాఁటి కీయయ్య నిచ్చోటనే ఉంచి
తెలవారినాంక తల తెగవేయవలెనంట.

వీరసేనుడు: (తనలో)

పల్లవి:
ఎంతకష్టము వచ్చె నింత మహాత్మునికి
చరణం1:
84పంతగించిన బృహస్పతిని సైతము గెల్చు
పండితోత్తమునికి, పరమేష్ఠి సమునికి
చరణం2:
85అఖిలజగమునఁ గల్గు అందంబు లెల్లను
సుకవిత్వ ముకురానఁ జూచు సత్కవికి
(ప్రకాశముగా భటులతో)
తే.గీ.
ప్రక్కగదిలోన నీవిప్రవర్యు నుంచి
చనుఁడు భటులార మీరింక సత్వరముగ.


 1. తా॥ ప్రతిన చేస్తే దైవగురువైన బృహస్పతిని గూడ గెలువగల్గిన, బ్రహ్మసమానుడైన పండితోత్తమునికి (పరమేష్ఠి=బ్రహ్మ)
 2. ప్రపంచంలో ఉండే అందాలన్నీ, మంచికవిత్వమనే అద్దంలో చూచే సత్కవికి (ముకురము=అద్దము)

భటులు ప్రక్క గదిలో బిల్హణుని ఉంచి నిష్క్రమింతురు.