బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక

సప్తమదృశ్యము – విద్యాభ్యాసమునకు యామిని సంసిద్ధత

పల్లవి:
అభ్యసింతును అమరభాషను
అలరు కావ్యము లన్ని వైళమె
చరణం1:
46అంధుఁడైనను అమరభాషను
సత్కవీంద్రుఁడు సరసుఁడై తగు
బిల్హణుండను విప్రవర్యుని
జ్ఞానవాహినిలోనఁ దోఁగుచు
పూని నేర్చెద, జ్ఞాని నయ్యెద.
చరణం2:
47అందగాఁడే ఆతఁడైనను
అంధుఁడగుటను అతని వదనము
నరయఁజాలను, అరయనంటిని
అరయకున్నను, అతని గళమును
విన్నఁ జాలును, విదుషి వయ్యెద
వంచు నెదుటను తెరను గట్టిరి.


 1. అమరభాష=సంస్కృతము; విప్రవర్యుడు=బ్రాహ్మణశ్రేష్ఠుడు; జ్ఞానవాహిని=జ్ఞానమను నది, వాహిని అంటే నది.
 2. అరయు=చూచు, అరయజాలను=చూడజాలను; గళమును=కంఠధ్వనిని, విదుషి=పండితురాలు.

అష్టమదృశ్యము – విద్యాధ్యాపనకు బిల్హణుని సంసిద్ధత

పల్లవి:
48అవనీశ పుత్రియఁట, అందాల రాశియఁట
అమరభాషను నేర్వ అరుదెంచునంట
చరణం1:
యామినీపూర్ణయఁట ఆమె నామంబు
చిత్రరేఖంబోలె చేయునట నాట్యంబు
49అసక్తి గొనెనంట ఆవధూరత్నంబు
సత్వరంబుగ నేర్వ సారస్వతంబు
చరణం2:
50ఇందునిం బోలు నా సుందరీ ముఖమందు
కొంతగా నున్నదట కుష్ఠరోగపుకందు
అరయలేనట్టి యాస్యంబు నే నంటి
తెర నడ్డముగఁ గట్టి తీర్చి రా శంక


 1. అవనీశపుత్రి=రాజకుమారి; అమరభాష=సంస్కృతము;
 2. చిత్రరేఖ అనునదొక అప్సరస. ఆవధూరత్నంబు=ఆస్త్రీరత్నము. వధూశబ్దము సామాన్య స్త్రీ అను అర్థములోను, పెండ్లికూతురు అను అర్థములోను ఉన్నది. ఇచ్చట దీనిని సామాన్యస్త్రీ అర్థములో వాడినను, మునుముందు యామినికి సిద్ధించు పెండ్లికూతురుతనమునుగూడ సూచించుచున్నది. సారస్వతంబు=వాఙ్మయము, భాష.
 3. ఇందునింబోలు=చంద్రునివంటి, ఇందుడనగా చంద్రుడు; కుష్ఠరోగపుకందు= కుష్ఠరోగమువల్ల కల్గిన మచ్చ లేక పుండు; తీర్చిరి=తొలగించిరి; శంక=సంకోచము.

నవమదృశ్యము – యామిని విద్యాభ్యాసము

తెరకు కుడివైపు బిల్హణుఁడు, ఎడమవైపు యామిని ఉందురు. బిల్హణుఁడు శ్రావ్యముగా సరస్వతి పాటను పాడుచుండఁగా, తానును దానిని పలుకుచు యామిని భావయుక్తముగా నభినయించి కూర్చొనును.

యామిని:

తే.గీ.
51స్వస్తి! గురువర్య! సుమరసపానలోల
మైన తేఁటిచందాన నాయత్త యయ్యె
యామినీపూర్ణ యిట, భాష నభ్యసింపఁ
జేయ రావలయుఁ దమరు శీఘ్రముగను.

బిల్హణుడు:

52స్వస్త్యస్తు! ప్రియాంతేవాసిని! ఇహాగచ్ఛామి.

అనుచు వచ్చి కూర్చొని, నాట్యకత్తెవు గాన నీవు భారతికి నాట్యనీరాజన మర్పించి పాఠమును ప్రారంభింపుమనును

నాట్యకత్తెవు గాన నాట్యనీరాజనము
ముందుగా నర్పించి ముదమార భారతికి
నేఁటి పాఠము నీవు నేర్వంగఁ బూనుము
ఆదేవి కరుణించు యామినీ నిన్ను.


 1. తా॥ గురువుగారూ! పుష్పమకరందాన్ని ఆస్వాదించుటకు వచ్చిన తుమ్మెదవలె యామినీపూర్ణ ఇచ్చట సిద్ధమైనది. తమరు త్వరగా భాషను నేర్పుటకు రావలెను. తేఁటి చందాన=తుమ్మెదవలె; ఆయత్త యయ్యె=సిద్ధమైనది.
 2. అర్థము:శుభమగు గాక, ప్రియశిష్యురాలా! ఇదిగో వస్తున్నాను.

సరస్వతీస్తుతి

పల్లవి:
53ఓంకారనాదస్వరూపిణి సరస్వతీ!
పంకేజముఖి నిన్ను ప్రణుతింతు భారతీ!
చరణం1:
ఆధారమే నీవు అన్నికళలకు భువిని
శ్రీధరాభవవినుత! శ్రీచక్రవాసినీ
చరణం2:
అమరభాషాభ్యాస మవలీలగా సాగ
కమలాక్షి! యొసఁగవే కరుణించి దీవెనలు

బిల్హణుడు (తనలో)

54ఉఱిమినంతనె పురిని విప్పుచు
ఆడు నెమలిని అనుకరించుచు
నాదుపాటకు నర్తనంబును
చేయుచున్నది ఈయువాంగన
ఆమె గజ్జెలయందుఁ జొరఁబడి
మానసంబిదె మఱలకున్నది

ఇట్లాలోచించుచు కొంత పరాకుగానుండగా, యామిని ‘గురుదేవా’ అని పిలుచును. అప్పుడు తేరుకొని

శ్లో॥
55వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే।
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ॥
కం.
56శ్రీగౌరీపరమేశుల
వాగర్థములవలెఁ గూడి వరలెడివారిన్
వాగర్థజ్ఞానార్థము
నేఁగొల్తు జగత్పితరుల నిశ్చలమతితోన్.
57కవిచక్రవర్తియౌ కాళిదాసుఁడు వల్కు
మంత్రబులంబోలు మధురవాక్యము లివ్వి
వాగర్థములఁ బోలి పార్వతీశంకరులు
ఎడఁబాయకున్నారు ఈసృష్టియందు
ప్రకృతికి రూపంబె పార్వతీదేవి
పురుషునికి రూపంబె పురవైరి భువిని
ప్రకృతీ పురుషులా ప్రణయరూపంబె
ఈసృష్టి యంతయు – (ఇంతియే ప్రకృతీ
పురుషుండె పురుషుండు – ధర వీరి ప్రణయంబె
అఖిలసృష్టికి మూల మని దీని యర్థంబు.)


 1. పంకేజముఖి=పద్మమువంటి ముఖముగలదానా; ప్రణుతింతు=మిక్కిలి స్తుతి చేతును; శ్రీధర+అభవ+వినుత=విష్ణువుచేత, శంకరునిచేత పొగడబడినదానా!
 2. తా॥ (వర్షాకాలంలో) మేఘములు ఉఱిమినంతటనే ఆశబ్దమున కనుగుణముగా నర్తించే నెమలిలాగ నేను పాడే (సరస్వతి)పాట కనుగుణంగా ఈ యౌవనవతి నాట్యం చేస్తున్నది. ఆమె పదవిన్యాసంవల్ల కదలి ధ్వనించే గజ్జెలలో దూరిపోయి వానినుండి నామనస్సు తిరిగిరావడం లేదు. ఆమె కన్పడడం లేదు గాని, కన్పడకున్నా ఆమె పదవిన్యాసములను చూస్తున్నట్లుగానే, ఆమె గజ్జెలలో నా మనస్సు దూరిపోయింది – అని అనుకుంటున్నాడు.
 3. తా॥ వాగర్థములవలె ఎప్పుడును కూడి యుండెడు జగత్పితరులైన పార్వతీపరమేశ్వరులను వాగర్థములజ్ఞానసిద్ధికై నమస్కరించుచున్నాను (కాళిదాసు రఘవంశంలోని మొట్టమొదటి శ్లోకం)
 4. ఈ కందపద్యం పై కాళిదాసశ్లోకానికి అనువాదము.
 5. ఎడబాయకుండా ఉండే పార్వతీశంకరులలో పార్వతి ప్రకృతికీ, పురహరుడు(శివుడు) పురుషునికీ ప్రతిరూపాలనీ, ఈసృష్టి సమస్తం ఇటువంటి ప్రకృతి పురుషుల ప్రణయ మూలకమైనదే అనియు, మఱొకవిధంగా చూస్తే, స్త్రీయే ప్రకృతి యని, పురుషుడే పురుషుడని వీరి ప్రణయమే సమస్తసృష్టికి మూలమని బిల్హణుడు పైశ్లోకానికి విశేషార్థం చెపుతున్నాడు. (సూచన: అవసరమనిపించినచో ఈ బ్రాకెట్లలో గల పంక్తులను విడిచివేయవచ్చును)

యామిని: (తనలో)

అంధుఁడైనను అద్భుతంబుగ
చెవుల కింపును జేయు స్వనమున
మధురమంజులమైన మాటల
విషయమెల్లను విశదపఱచుచు
నాదుడెందము నంతకంతకు
దోఁచుచుండెను దొంగచందము

ఇట్లనుకొనుచుండఁగా నేపథ్యమునుండి ‘ యామినీ ఈనాటి సాయంకాలం చంద్రికామధురికలతో గూడి నీవుద్యానవనవిహారం చేసే సమయ మాసన్నమౌతున్నది. త్వరగా బయల్దేరు’ – అను వాక్యములు విన్పించును.

యామిని:

సెలవు నొసఁగుడు గురుదేవ! చెలులఁగూడి
చైత్రవనశోభఁ దిలకించు సమయమయ్యె

బిల్హణుడు:

చైత్రపూర్ణిమ గద నేఁడు, సకులతోడ
పూర్ణచంద్రునిఁ గని ముదమొందవమ్మ!

కల్యాణమస్తు! సంపూర్ణద్విజరాజసందర్శనప్రాప్తిరస్తు!