బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక

చతుర్థదృశ్యము – యామిని అంగీకారము

పల్లవి:
20సరసుఁడౌ ద్విజరాజు సన్నిధిని నేను
చక్కగా నేర్తును సాహిత్య విద్య
చరణం1:
21అచ్చమగు కరములన్ యామినిం బొదివి
పులకింపఁగాఁ జేయు పూర్ణచంద్రుని లీల
కమనీయపాండితీకరముల న్నను గప్పు
సరసుఁడౌ ద్విజరాజు సన్నిధిని నేను
చక్కగా నేర్తును సాహిత్య విద్య
చరణం2:
22చక్కనౌ రూపంబు, చక్కనౌ గాత్రంబు
చక్కనౌ సాహిత్యశాస్త్ర విజ్ఞానంబు
చిక్కగాఁ గలయట్టి శృంగారమూర్తియు
సరసుఁడౌ ద్విజరాజు సన్నిధిని నేను
చక్కగా నేర్తును సాహిత్య విద్య
చరణం3:
23నవరసంబుల మీరు నాటకావళుల
కమణీయ రసపూర్ణ కావ్యరత్నాల
పట్టుగా పఠియించి పాండిత్య మమర
సరసుఁడౌ ద్విజరాజు సన్నిధిని నేను
చక్కగా నేర్తును సాహిత్య విద్య


 1. ద్విజరాజు=బ్రాహ్మణశ్రేష్ఠుడు. ఇక్కడి వర్ణన అంతా మునుముందు యామినీబిల్హణులకు మధ్య సాగే ప్రణయాన్ని సూచిస్తూ సాగింది.
 2. తా॥ స్వచ్ఛమైన కిరణాలతో రాత్రి అనే నాయిక నావరించి, పులకింపజేసే చంద్రునిలాగ, రమ్యమైనపాండిత్యమను చేతులతో నన్నావరించు బ్రాహ్మణశ్రేష్ఠుని సన్నిధిలో నేను సాహిత్య విద్యను చక్కగా నేర్చుకుంటాను.
 3. ముందుగల కథలో బిల్హణునికి గల సౌందర్యము, శ్రావ్యమగు మగు కంఠధ్వని, సాహిత్యవిజ్ఞానము, శృంగారరసాత్మకమైన రసికత్వము ఇందులో సూచింపబడింది.
 4. తానుగూడ నవరసాత్మకమైన నాటకాలను, శృంగారకరుణాది రసములు గల ఉత్తమమైన కావ్యములను చదివి బిల్హణునితో సారూప్యమైన సాహిత్యసంస్కారమును సంపాదితునని సూచన.

పంచమదృశ్యము –బిల్హణుని రంగప్రవేశము

పల్లవి:
బిల్హణుండను నేను, సుకవీంద్రుఁడను నేను
చరణం1:
24ఘనపాండితియే తన పరిమళమై
తనులావణ్యమె తనమంజిమమై
రంజిల కాశ్మీరంబను కొలనునఁ
జనియించిన జలజంబునె నేను
చరణం2:
25యౌవనమున హృద్యంబయి
కాంతల పాలిటి కల్పకమయి
కామునికంటెను కామ్యంబయి
వెలిగెడిరూపము గల వాఁడను
చరణం3:
26సంస్కృతమందున శాస్త్రములందున
సాటి యెఱుంగని మేటి మనీషిని
కవితానాటక కాంతారంబుల
అభినవ్యంబగు అధ్వాన్వేషిని
చరణం4:
27వ్రాసితి నాటకరత్నంబుగ
కర్ణసుందరీ గాథను నేను
భారతి కింపగు హారంబుగ
రచియించితి విక్రమచరితము


 1. కాశ్మీరమనే కొలనులో పుట్టిన తామరను తానని బిల్హణుడు చెప్పుకుంటున్నాడు. తా॥ గొప్పనైన పాండిత్యమే తనకు పరిమళమై, నిగనిగలాడే శరీరకాంతియే (తనులావణ్యమే) తనయొక్క మంజిమయై(సౌందర్యమై), రంజిల (ప్రకాశించుచుండగా), కాశ్మీరమను కొలనులో బుట్టిన పద్మమునే నేను. జలజము=పద్మము.
 2. అతిసుందురుడు, యౌవనుడూ, స్త్రీలచే కోరబడేవాడూ తానని చెప్పుకుంటున్నాడు. తా॥ యౌవనోదయమువల్ల అందమై, పురుషుల గోరు స్త్రీలకు వరము లిచ్చే కల్ప వృక్షమువంటిదై, మన్మథునిరూపముకంటెను కోరదగినదై (లేక సుందరమైనదై) ప్రకాశించు రూపము గలవాడను. కామ్యము=కోరదగినది,సుందరమైనది.
 3. తా॥ సంస్కృతంలో, (వ్యాకరణ,న్యాయ,వేదాంతాది) శాస్త్రాలలో, సాటిలేని మేటి (గొప్ప) పండితుడను. కవిత్వము, నాటకము అను ఈ అడవులలో నూతనమార్గములను (నూతనశైలిని) వెదకువాడను. అధ్వాన్వేషి=మార్గమును వెదకువాడు; కాంతారము=అడవి; అభినవ్యంబగు=క్రొత్తనైన.
 4. తా॥ కర్ణసుందరి కథను ఉత్తమమైన నాటకంగా వ్రాసినాను. సరస్వతికి అలంకార మైన హారమువలె విక్రమ (విక్రమాంకదేవ)చరిత్ర మనే కావ్యమును వ్రాసినాను. కర్ణసుందరి అనే నాటకం, విక్రమాంకదేవచరితం అనే కావ్యం ఇప్పుడు మనకు లభ్యమగుచున్న బిల్హణుని రచనలు.

షష్ఠదృశ్యము – రాజు మదనాభిరాముడు, మంత్రి విద్యాపతి, బిల్హణుల ప్రవేశము

నేపథ్యంలో: జయము జయము పాంచాలరాజులకు మదనాభిరామ సార్వభౌములకు, జయము జయము మహామాత్రులకు విద్యాపతి మహోదయులకు – అని వినపడుచుండగా రంగముపై వారు కన్పడుదురు.

మదనాభిరాముడు:

తే.గీ.
28స్వస్తి! సచివేంద్ర! కావలె సత్వరముగ
రాకుమారికి యామినీరాజముఖికి
సంస్కృతంబును నేర్పంగ చక్కగాను
పూజ్యుఁడగు సాహితీశాస్త్ర బోధకుండు.

విద్యాపతి:

తే.గీ.
29వ్యాకరణమందు, తర్కశాస్త్రాదులందు
జ్యోతిషమునందు, స్మృతులందు, శ్రుతులయందు
కోవిదులు మన నగరాన కొల్లలుగను
కలరు; చాలరా వారలు క్ష్మాతలేంద్ర?

మదనాభిరాముడు:

కం.
30వారలఁ దలఁచును తండ్రిగ,
కూరిమి తోబుట్టువుగను, గురువర్యునిగన్,
కోరదు కవితాకన్యక
నీరసశాస్త్రంబు లెల్ల నేర్చినవారిన్.
చ.
31సరసుఁడు, కావ్యశాస్త్రములఁ జక్క నెఱింగినవాఁడు, స్వీయసుం
దరకవితావిదగ్ధుఁడయినట్టి కవీంద్రుఁడు గాక యన్యు లౌ
దురె బుధవర్య! యామినికిఁ దూర్ణముగా వరసాహితీమనో
హరవిదుషీత్వకౌముదిని నంటఁగఁజేయ నఖండితంబుగన్.


 1. సచివేంద్ర=మంత్రిశ్రేష్ఠుడా; సత్వరముగ=త్వరగా (వెంటనే); రాజముఖి=చంద్రునివంటి ముఖముగలది.
 2. స్మృతులందు= భగవద్గీత, ధర్మశాస్త్ర, పురాణాదులందు; శ్రుతులయందు=వేదములందు; కోవిదులు=పండితులు; క్ష్మాతలేంద్ర=రాజా!
 3. తా॥నీవు చెప్పిన వ్యాకరణ,తర్క,వేదాంతపండితులను కవితాకన్యక తండ్రిగాను, తోబుట్టువుగాను, గురువుగాను భావిస్తుంది గాని రసహీనమైన ఆవిద్యలను నేర్చినవారిని ప్రియునిగా వరింపగోరదు. వారు కవిత్వజ్ఞానశూన్యులనుట.
 4. తా॥ రసికుడు, ప్రధానముగా కావ్యములను, పైవిధమగు శాస్త్రములను చదివిన కవీంద్రుడే యామినికి (రాత్రికి) వెన్నెల నంటగట్టినట్లు మన యామినికి (తెల్లని) సాహిత్యపాండిత్యమనే వెన్నెలను అంటింపగలడు. ఇతరుల కది అసాధ్యము. తూర్ణముగా=త్వరగా, విదగ్ధుడు=నేర్పరి, పండితుడు

బిల్హణుని సభాప్రవేశము

ప్రతీహారి ప్రవేశించి బిల్హణుని రాక నెఱింగించును.

ప్రతీహారి: జయము మహారాజులకు

ఉ.
32ఫాలము బ్రహ్మతేజమున భాసిలువాఁడు, సుదీర్ఘబాహువుల్
కాలులనంటువాఁడు, రతికాంతుని యందముఁ గ్రిందుసేయఁగాఁ
జాలిన యందగాఁడు, ఎలసంపెఁగఁబోలిన మేనిడాలుతోఁ
గ్రాలెడువాఁడు, పాఱుఁడు, ధరాపతి! వాకిట వేచియుండెడిన్.

మదనాభిరాముడు:

తే.గీ.
33మాన్యులగు విప్రవరుల సన్మానమెసఁగ
గారవించుటచేతఁ బెంపారు మాదు
వంశగౌరవంబే కాన వైళ మతనిఁ
గనెడు భాగ్యము కల్గును గాక మాకు!

(బిల్హణుడు సభలో ప్రవేశపెట్టబడును.)

విద్యాపతి:
వచనం:అయ్యా! తమరెవ్వరు?
బిల్హణుడు:

34కవిరత్నఖనియైన కాశ్మీరదేశమున
జనియించినాఁడ, బిల్హణకవీంద్రుఁడను
విరచించినాఁడను విక్రమాంకచరితమ్ము
కర్ణసుందరీనామ కమనీయరూపకము.


 1. తా॥ బ్రహ్మవర్చస్సు నుదుట భాసిల్లువాడు, కాళ్లను దాకుచున్న పొడవైన చేతులు గలవాడు (ఆజానుబాహుడు), రతికాంతుని(మన్మథుని) అందమునే లోకువ చేయునంత అందము గల్గినవాడు, సంపెంగపూవువలె పచ్చనిదేహకాంతిగల విప్రుడు మీకై వేచియున్నాడు. మేనిడాలుతోన్=శరీరకాంతితో, క్రాలెడువాడు=అతిశయించువాడు.
 2. తా॥ గౌరవార్హులైన బ్రాహ్మణోత్తముల గౌరవించుటచేత మావంశగౌరవమే (ప్రతిష్ఠయే) అభివృద్ధి యగును. కావున వైళము=త్వరగా, అతని దర్శనభాగ్యము మాకు గలుగనిమ్ము.
 3. తా॥ కవులనెడు రత్నములకు గనివంటిదైన కాశ్మీరదేశమున బుట్టినాను. బిల్హణుడను పేరుగల కవీంద్రుడను. విక్రమాంకచరితమను కావ్యమును, కర్ణసుందరి యను రమ్యమైన నాటకమును రచించినాడను.

బిల్హణుని రాజవర్ణనము

ఉ.
రాజట గాని శూన్యమట రాజ్యము, వైభవలేశ మున్నచో
భ్రాజిలునంట యద్ది యొకపక్షముమాత్రమె రాత్రులందు, ఆ
35రాజొక రాజె? శ్రీమదనరాజ! అహర్నిశలందు లోకవి
భ్రాజితకీర్తివైభవము రాజిలు మీరలు రాజు గాకిలన్?

మదనాభిరాముడు:

ఉ.
36చూచితి కర్ణసుందరిని చోద్యము మీరఁగ సూరివర్య! ఎం
తో చవి యౌచుఁ దోఁచెనది; తొల్లిటిపుణ్యమొ యేమొ, నేఁడు నిన్
జూచెడు భాగ్యముం గలిగె; చొక్కఁగనెంతు భవత్కవిత్వధా
రా చిరగాహనంబున, స్థిరంబుగ నుండుము మాపురంబునన్.
చ.
37అనుపమమైన యీమణులహారము స్వాగతచిహ్నకంబుగాఁ
గొని కవివర్య! తావులను గుప్పెడు మా విరితోఁటచాటునం
గొనకొనియున్న సౌధమునఁ గోరినవెల్లను గూర్చు సేవకుల్
పనుపడ నుండి, పెంచుము భవత్కవితాలతికావితానముల్.

బిల్హణుఁడు:

తే.గీ.
38స్వస్తి! రాజేంద్ర మీదయాప్రాప్తిచేత
మేలునుం గంటి, మీయాన మీరకుండ
నిందె యుందును నేనొకయింత కాల
మైనఁ గలదు నా దొక్క యభ్యర్థనంబు.
తే.గీ.
39కుష్ఠరోగులఁ జూచిన క్రుంగిపోవు
మానసంబెల్ల నందుచేఁ గాన లేను
కలలయందైన వారల క్ష్మాతలేంద్ర!
ఉండవలె వారి దర్శన మొదవకుండ.
రాజు:

వలదు సందేహంబు 40వసుధాసుపర్వ!
కలుగదింతయు నట్టి కష్టంబు మీకు.

బిల్హణుడు:

హర్షంబు గూర్చె మీ యాదరం బెంతొ,
పోయి వచ్చెద నింక భూపాలచంద్ర! (బిల్హణుడు నిష్క్రమించును)


 1. రాజు అంటే చంద్రుడు, రాజు అని రెండర్థములు. ఇక్కడ ఆ రాజు(చంద్రుడు) మదనరాజుతో సరిగాడని బిల్హణుడు వర్ణిస్తున్నాడు. తా॥ఆరాజుకు రాజ్యము శూన్యము (శూన్యమంటే ఆకాశమని సున్నా అని అర్థములు). ఒకవేళ వైభవ మేమన్న ఉంటే అది ఒకపక్షం పాటు రాత్రులకుమాత్రమే పరిమితం. కాని, మదనరాజా! మీ కీర్తివైభవం అహర్నిశలు ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉంది. అందుచే రాజంటే మీరే రాజు. ఆరాజు (చంద్రుడు) పేరుకు మాత్రమే రాజు.
 2. తా॥ సూరివర్య=పండితశ్రేష్ఠుడా!కర్ణసుందరి నాటకమును ఆశ్చర్యముతో చూచితిని. నాకది చాలా రుచించినది. నా పురాపుణ్యమేమొగాని నిన్నిపుడు చూడగల్గితిని. నీకవిత్వధారలో శాశ్వతముగా మునిగి పరవశింపగోరుదును. (అందుచే) నీవు స్థిరముగా మానగరమందే ఉండుము. భవత్కవిత్వ…గాహనంబున=నీకవిత్వధారలో శాశ్వతముగా మున్గుటచే.
 3. తా॥ సాటిలేని ఈ మణిహారమును మా స్వాగతచిహ్నముగా గ్రహించి, ఓకవీంద్రా! పరిమళభరితమైన మా విరితోట (ఉద్యానవనం) చెంతనున్న సౌధంలో సేవకులు నీకు పరిచర్య చేస్తుండగా నుండి, నీ కవిత్వమనే తీగలగుంపులను (భవత్కవితాలతావితానముల్) పెంపొనరింపుము.
 4. తా॥ మీదయచేత నాకు మేలు (ఉపకారము) జరిగినది. మీ ఆజ్ఞ మీరకుండ ఇచ్చటనే కొంతకాలముపాటు ఉంటాను. ఐతే నాదొక్క విన్నప మున్నది.
 5. తా॥ కుష్ఠరోగులను చూస్తే నామనస్సుకు చాలా కష్టమౌతుంది. వారిని కలలోగూడ నేను చూచి సహింపలేను. అందుచేత అట్టివారు నాకు కనపడకుండ ఉండవలె. అట్టివారి దర్శన మొదవనిచోట ఉంచుమని రాజునకు విన్నవించుకొనుచున్నాడు.
 6. వసుధాసుపర్వ=బ్రాహ్మణుడా!

బిల్హణుని గురువుగా నిర్ణయించుట

మంత్రి:

తే.గీ.
41ఆడఁబోవు తీర్థం బెదురైనయట్లు
తమరు గోరెడు పండితతల్లజుండె
ఏగుదెంచెను బిల్హణాకృతిని బూని
యామినీపూర్ణ నోచిన నోము వోలె.

రాజు:

తే.గీ.
సంశయము లేదు, యోగ్యుడే సంస్కృతంబుఁ
గఱప యామిని కీతండు గాని ….
ఉ.
42పూచిన యౌవనాప్తిమెయి పుష్పశరాసనుఁబోలు వాఁడు, వా
చాచతురత్వమందు గురు సన్నిభుఁడున్, రసికుండు, వీనినిం
జూచినయంతనే మరులు సోఁకును నెట్టి లతాంగికైన, నే
యే చపలత్వ మబ్బునొకొ యీతఁడు విద్యలు చెప్పసాగినన్.

మంత్రి:

మిశ్రగతి:
43వసుమతీశ్వర మీదువాక్యము
భావ్యమే యని తోఁచు నైనను
వహ్ని కాల్చునటంచు హోమము
వదలుకొందురె బుద్ధిమంతులు?

రాజు:

44అదియు సత్యమె అట్టి కవియును
అట్టి పండితు డెందు దొరుకును?
యామినీ సుకృతంబు కతమున
అతడు వచ్చిన యట్లు దోఁచును

మంత్రి:

కుష్ఠరోగులఁ గాంచనంచును
ఘోరనియమము చేసె విప్రుఁడు
అంధులం బొడగాంచనంచును
అట్టి నియమమె చేసె యామిని

కుష్ఠరోగియె శిష్యురాలని
గురువుగారికి విన్నవింతము
గురువుగారలు గ్రుడ్డివారని
కోమలాంగికి విన్నవింతము

కాని వారల నియమభంగము
గాని యట్లుగ వారిమధ్యను
45గట్టి యవనిక గట్టి చదువును
గఱపుమందము రాకుమారికి

రాకుమారిని దీని కొడఁబడ
రాజచంద్రమ! మీరు సేయుఁడు
విప్రవర్యునిఁ జేయు బాధ్యత
వేసికొందును నాదు భుజమున.


 1. తా॥ తీర్థయాత్రకు బోతుంటే, ఆతీర్థమే తనకు ఎదురుపడినట్లుగా, మీరు కోరుకొనుచున్న పండితశ్రేష్ఠుడే, యామినీపూర్ణతిలక నోముకున్న నో మో అనునట్లు, బిల్హణుని రూపంలో వచ్చినాడు. ‘యామినీపూర్ణ నోచిన నోము వోలె’ అని చెప్పడంవల్ల ముందు జరుగబోయే యామినీబిల్హణుల కల్యాణం సూచింపబడింది.
 2. తా॥ ఇతడు వికసించిన యౌవనమువల్ల మన్మథుని బోలిన అందగాడు, వాక్చాతుర్యమందు బృహస్పతిని బోలినవాడు, రసికుడు గూడ. వీనిని చూస్తూనే ఏ స్త్రీయైనా సమ్మోహితురావుతుంది. వీని గురుత్వం ఎట్టి చాపల్యానికి కారణభూతమౌతుందో యేము?
 3. వసుమతీశ్వర=రాజా! తా॥ రాజా! మీరనుకునేది సంభవమే కావచ్చు. ఐనా, నిప్పు కాలుస్తుందని వివేకవంతులు హోమాన్ని మానుకోరుగదా!
 4. తా॥ అదీ నిజమే. అటువంటి కవి, పండితుడు ఎక్కడైన దొరుకుతాడా? యామనీదేవి పుణ్యఫలముగ (తనకుతానే) అతడిచ్చటికి వచ్చినట్లుగా దోచుచున్నది. ముందు జరిగే ప్రణయంగూడ ఆమె పుణ్యఫలమే అని ధ్వని.
 5. గట్టి యవనిక=దట్టమైన తెర; కఱపుమందము=నేర్పుమందము.