భూమి చాలని మనిషి

– ఎవరైనా ప్రయాణాలు ఎందుకు చేస్తారూ?!

అదేం ప్రశ్న? ఒకచోట నుంచి మరో చోటకు చేరడానికి చేస్తారు. ఎవరితోనన్న పనిబడితే ఆ మనిషిని కలసి వాటిల్ని చక్కబెట్టుకోడానికి వెళతారు. భక్తులు మొక్కుబడి ఉంటే ఆయా పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తారు. కాస్తంత ఉత్సాహవంతులూ ధనవంతులూ అయితే గొప్పగొప్ప దేశాలూ నగరాలూ వెళ్లి అక్కడి వింతలూ విశేషాలూ చూసివస్తారు.


భూభ్రమణ కాంక్ష – ఎం. ఆదినారాయణ
బాటసారి బుక్స్ ప్రచురణ, 2016.
(పేజీలు: xvii+385, వెల: రూ.250/-, $15.00)

భూభ్రమణ కాంక్ష అంటూ రాసి ఏడెనిమిది నెలల క్రితం ప్రచురించిన మాచవరపు ఆదినారాయణ ఇవేమీ చెయ్యలేదు. అతని ప్రయాణాలకు ప్రేరణలు వేరు. అతని యాత్రల బాణీయే వేరు.

తాను సంచారానికి తప్ప సంసారానికి పనికిరానని ఆయనకు చిన్నప్పుడే అర్థమయిందట. కాలిబాటల స్వర్గ ద్వారాలగుండా సాగి దిగంతాలవరకూ అడుగులు వేసి ప్రపంచాన్ని ప్రేమగా పలకరిస్తూ వెళ్లడం తన ఆశయమట. ఆ ప్రపంచాన్ని కేవలం కళ్లతోనే చూడటం గాకుండా పంచేంద్రియాలకూ ఆ అనుభవాన్ని పంచాలట. భారతదేశంలో తిరిగినంత స్వేచ్ఛగా ప్రపంచం మూలమూలలా తిరగాలట. మనవి కాని ఇళ్లలో అవి మన ఇళ్లే అన్నంత ఆత్మీయంగా మసలుకొని వాళ్ల మనసుల్లో గూళ్లు కట్టాలట. ఏదో అమ్మమ్మ వాళ్లింటికెళ్లినంత సరళంగా ఒక జత బట్టలూ నాలుగు పెయింటింగ్సూ పట్టుకొని ఆర్కిటిక్ వలయంలోని దేశాలకు వెళ్లిపోవాలట. నేల మాళిగల్లోని గుప్తనిధులు దొరికినప్పటికన్న ఎక్కడో బ్రెజిల్ దేశపు పేరులేని దీవిలోని అందాలు అందించే సంబరాల కోసం అన్వేషణ సాగించాలట…

ఇవన్నీ ఓ శృతిమించిన భావుకుని ఊహలూ పగటికలలూ కావు. ఆదినారాయణ ఆలోచనలివి. వాటిల్ని ఆచరణలో పెట్టి ఆ అనుభవాలను అక్షరాల్లో పరచి మనకు అందించిన ఓ స్కాలర్ జిప్సీ చెపుతోన్న యాత్రా నిర్వచనాలివి.

– బాగానేవుంది కానీ ఆయన అన్నన్ని దేశాలు తిరిగి ఏం తెలుసుకున్నారూ?

ప్రపంచమంతా తనదేననీ, అందరూ తనవాళ్లేననీ తెలుసుకొన్నారట. నడవగలిగితే నాట్యమాడగలనని, మాట్లాడగలిగితే పాట పాడగలననీ తెలుసుకొన్నారట. యాత్రల్లో పరాయివాళ్లు సొంతవారయిపోతారని, దూరం దగ్గరవుతుందని, మన మనసులు విశాలమవుతాయనీ తెలుసుకొన్నారట. 2009లో మొట్టమొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తూ నేపాల్ వెళ్లినపుడు కొత్త మిత్రులతో, ఐయామ్ ఫ్రం ఇండియా! అని అంటూ వింత అనుభూతికి లోనయిన మనిషి కాస్తా 2016లో బ్రెజిల్ దేశంలో ఎవరో ‘ఇండియన్‌వా?’ అని అడిగినపుడు, ‘కాదు. గ్లోబియన్ని!’ అని చెప్పారట.

– తను తెలుసుకోడం సరే; మరి పాఠకులకు కాస్తంత కొత్త విషయాల పరిజ్ఞానం కలుగుతుందా ఈ భూభ్రమణకాంక్ష చదివితే?

1962-64లో అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి నడుచుకొంటూ ఆసియా ఐరోపాల మీదుగా అమెరికా వెళ్లి జపాన్ శ్రీలంకల మీదుగా తిరిగి ఇండియా చేరిన ప్రభాకర మీనన్, సతీష్ కుమార్‌ల స్ఫూర్తిదాయకమైన శాంతియాత్ర గురించి మనకు ఈ పుస్తకంలో తెలుస్తుంది. మధ్య యుగాలలో చైనా దేశం వాళ్లు తమ దేశంలో కనిపెట్టబడిన సిల్కును ఐరోపా దేశాలకు ఎగుమతి చెయ్యడం కోసం ఎలా సిల్క్ రూట్‌ను ఆవిష్కరించుకొన్నారో తెలుస్తుంది. ఆ సిల్క్ రూట్‌కు మన పాట్నా, మచిలీపట్నాలు కూడా ఆ రోజుల్లో అనుసంధానించబడి ఉన్నాయని తెలుస్తుంది. చైనాలోని కాంటన్ రేవు నుండి జావా, మలయా, సిలోన్, అరేబియా, ఎర్ర సముద్రం, ఈజిప్టు, మధ్యధరా సముద్రం మీదుగా ఐరోపా చేరిపోయే సముద్రాల సిల్కురూటు కూడా అప్పట్లో ఉండేదనే అరుదైన విశేషమూ తెలుస్తుంది. నైజీరియాలాంటి దేశంలో నెలలో చివరి శనివారం అందరికీ శలవు ఉంటుందని, దాన్ని శానిటరీ సాటర్‌డే అని పిలుచుకుంటారని, ఆరోజు అందరూ ఇళ్లల్లో ఉండి తమ పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోవాలి అనే చట్టం ఉందని, తెలుస్తుంది.

అలాంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.

పద్దెనిమిదో శతాబ్దం చివరి రోజుల్లో తెల్లని పెద్ద తెరచాప ఓడల్లో తమ దీవుల్లోకి వస్తోన్న తెల్లవారిని చూసి, దేవదూతలే వస్తున్నారు! అని సంబరపడిన వేలాదిమంది టాస్మానియా స్థానికులైన నల్లవారిని, నరమాంస భక్షకులన్న ముద్ర వేసి ఊచకోత(Cape Grim massacre) కోసి వాళ్ల ఆనవాలు లేకుండా చేసిన తెల్లవారి గురించి; వారిని ఎదురించి పోరాడి ఉరికంబం ఎక్కిన టున్నర్‌మిన్నర్‌వైట్ (Tunnerminnerwait) గురించి; మొదట్లో ప్రేమ గీతాలే పాడినా క్రమేణా సామాజిక సాంస్కృతిక కేంద్రంగా మారి, మిలిటరీ పాలకుల మీద పాటలతో తిరుగుబాటు చేసి, ఆ పాలకుల దమనకాండకు గురి అయిన తల్లి శవపేటికతో ఊరేగింపుగా వెళ్లి, కాఫిన్ ఫర్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ అనే గీతం ద్వారా తన ఆవేదన వ్యక్తపరచి, చివరికి నైజీరియా దేశపు వైతాళిక గాయకుడిగా పరిణమించి 1997లో నిష్క్రమించిన పాటలకోట ఫేలా కూటీ (Fela KuTi) గురించి వివరంగా చెప్తారు ఆదినారాయణ.

అలాగే ఇరుగుపొరుగు భాషల్లో ఉన్న యాత్రా సాహిత్యాన్నీ లీలగా మనకు పరిచయం చేస్తారు. ఎప్పుడో 1778-86ల లోనే భారతదేశాన్ని భారతీయులే పాలించాలి అన్న పట్టుదలతో థోమా కథనార్ (Thoma Kathanar) అన్న కేరళ మతగురువు రోమ్‌లోని పోప్‌ను కలుసుకోడానికి చేసిన సాహసోపేత సముద్ర యాత్రానుభవాలను వర్తమానప్పుస్తకంలో విపులంగా రాసిన వైనం చెపుతారు. ఇది భారతీయభాషలలో వెలువడ్డ మొట్టమొదటి యాత్రాగ్రంథం. అలాగే పొరుగున తమిళదేశానికి చెందిన ఎ. కె. చెట్టియార్ (A. K. Chettiar) అన్న మహానుభావుడు ఆమధ్య తన విదేశీ యాత్రల గురించి పదిహేడు పుస్తకాలు రాయడం గురించి కూడా చెపుతారు ఈ పుస్తకంలో మన స్కాలర్ జిప్సీ.

– ‘స్కాలర్ జిప్సీ అంటే గుర్తొస్తోంది – లండన్ నగరంలో ఆదినారాయణగారి హోత మార్క్స్ సమాధి చూపిస్తానంటే వద్దని ఎవరో జార్జ్ బరో సమాధి చూడ్డానికి వెళ్లారట ఈ జిప్సీ నారాయణ – నిజమేనా?’

అది ముమ్మాటికీ నిజం. తనకు కార్ల్ మార్క్స్ అంటే ఎంతో గౌరవం ఉన్నా లండన్లో తనకు జార్జ్ బరో (George Borrow) , మాథ్యూ ఆర్నల్డ్‌ల సమాధులు చూడటమే ముఖ్యమన్న స్పష్టత ఉన్న మనిషి ఆదినారాయణ. ప్రకృతిలో తిరుగుతూ శాంతిసాధనా రహస్యాన్ని అన్వేషించిన దేశద్రిమ్మరితనపు దిక్సూచి అయిన జార్జి బరోకూ, అతని జీవితాన్ని ఆధారంగా చేసుకొని ది స్కాలర్ జిప్సీ (The scholar gypsy) అన్న కవిత రాసిన మాథ్యూ ఆర్నల్డ్‌కూ (Mathew Arnold) నివాళి అర్పించడం తన కనీస కర్తవ్యం అని గుర్తెరిగిన యాత్రికుడు మన ఆదినారాయణ. మరో సందర్భంలో ఇలాగే- నాకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడటంకన్నా ఆ గోడను నిర్మించిన గ్రేట్ పీపుల్‌ను చూడటం ముఖ్యం- అంటారు మన గ్రంథకర్త!

– ఇంకా ఏం విశేషాలు కనిపిస్తాయీ ఈ పుస్తకంలో?

చాలా. రోమ్ నగరాన్నంతా 2014లో కాలినడకన తిరిగేసిన ఆదినారాయణ ఆ నగరపు వివరాలను, కళా విశేషాలనూ కళ్లకు కట్టినట్టు చెపుతారు. వెంటనే మనకు రోమ్ వెళ్లిపోవాలనిపిస్తుంది. మరో సందర్భంలో ఏటా జరిగే సిడ్నీ-హొబార్ట్ యాట్ రేస్ (Sydney-Hobart yacht race) గురించి చెపుతారు. టూర్ డి ఫ్రాన్స్ (Tour de France) అనే మూడువేల కిలోమీటర్ల సైకిలు రేసు గురించి చెపుతారు. అలాగే ఒకప్పుడు వందలాదిమందితో కళకళలాడిన ఓ అతిచక్కని ఫ్రెంచి గ్రామం క్రమేణా మనుషులంతా ఉద్యోగాల కోసం నగరాల బాట పట్టగా, కేవలం డెబ్బైమందే మిగిలిపోయిన వైనం వివరిస్తారు. ఇలా ఈ పుస్తకం పొడుగునా సందర్భానుసారం అనేకానేక విశేషాలు కనిపిస్తూనే ఉంటాయి.

– ఈ భూభ్రమణకాంక్షలో కవిత్వం బాగా ఒలికిందని వింటున్నాం, నిజమేనా? అసలు ప్రయాణాలకీ కవిత్వానికీ ఏమిటి సంబంధం?

బావుంది ప్రశ్న! రామాయణమంతా విని, రాముడికి సీత ఏమవుతుందీ? అని అడిగినట్లు ఉంది.

అసలు యాత్రికుడంటేనే అనుభూతుల పుట్ట. మానవ హృదయ స్పందనలు గుర్తెరిగిన మనిషి. భావుకత లేని మనిషి యాత్రికుడు కాలేడు. అనుభూతులూ భావుకతా కవిత్వానికి పునాదిరాళ్లు. మరి అవి ఉన్న మనిషి తన యాత్రల గురించి చెప్పినపుడు గాలి వీచినంత సహజంగా కవిత్వపు పరిమళం ఆ కథనం నిండా పరచుకొని వుంటుంది. ఇహ ఉపమానాలూ ఉపమేయాలూ సరేసరి!

తన నేపాల్ అన్నపూర్ణా పర్వతయాత్రలో పర్వతాల చాటున పైకి లేచిన ఉదయ కిరణాల వెలుగుల మంచు శిఖరాన్ని వర్ణిస్తూ ‘చీకటి గదిలో వెలుగుతోన్న దీపంలా ఉంది’ అంటారు ఆదినారాయణ. పర్షియాలోని పెర్సిపోలిస్ దగ్గర ‘ఎత్తైన శిల్పాల నుండి జారిపోతోన్న వెలుగునీడల్ని, కాలాన్ని, స్థంభింపచేయడానికి ఫోటోగ్రాఫర్లు కెమేరాలు ఎక్కుపెట్టి కింగ్‌ఫిషర్ల లాగా ఎదురుచూస్తున్నారు’ అంటారు. ఓ స్వీడన్ ద్వీపపు తీరాన మౌనంగా తిరుగాడుతున్న బాతులు ‘మా అలికిడి విని నీలాకాశానికి అడ్డంగా ఎగిరి అలా కాసేపు శూన్యపు అద్దం మీద కాసిన్ని కవితలు రాసి దూరంగా వాలిపోతున్నాయి’ అంటారు. ఆ స్వీడన్ ద్వీపంలోనే పరిచయమయిన ఆలీసా అనే స్నేహితురాలు వీడ్కోలు సమయంలో భ్యూదా అనే వాయిద్యం వాయిస్తూ పాడుతున్నపుడు, ‘ఆ తీగల మీద ఆమె వేళ్లు చేస్తున్న విన్యాసాలను చూడడానికి గది నిండా చంద్రకిరణాలు గుమిగూడాయి’ అంటారు.

ఓ చైనా బౌద్ధారామం దగ్గర కొండను రాసుకొంటూ సాగిపోయే ‘జిన్గ్‌హే నది ఎండిపోయి సిగ్గుపడుతూ ఇసుక పైటలో ముఖాన్ని కప్పుకొంది’ అంటారు. మెక్సికో దేశంలో ఒక కాంబోడియా నృత్యనాటికను చూస్తూ ‘నాట్యకారుల కదలికలకు ఒంటిమీది ఆభరణాల వల్ల ఒక నిర్దుష్టత ఏర్పడింది. అన్నిటికన్నా ఆ సంగీతం బావుంది. గాత్రం, వాయిద్యం, రెండూ సమానస్థాయిల్లో కలిసిపోయాయి. నాట్యకారుల ఆహార్యం బరువుగా ఉండటంచేత, సంగీతం అన్న వృక్షానికి ఊగుతున్న పువ్వుల గుత్తుల మాదిరిగా ఉన్నాయి వారి కదలికలు’ అంటారు.

ఇక అనుభూతుల దగ్గరికి వస్తే, ఖట్మండూ శివార్లలోని బౌద్ధాలయం దగ్గరికి వెళ్లినపుడు ఎన్నో ఏళ్ల క్రితం తన టిబెట్టు రహస్య ప్రయాణ సన్నాహాల కోసం అక్కడి గదుల్లో కొన్నాళ్లు నివసించిన రాహుల్ సాంకృత్యాయన్ ‘ఆశనిరాశల మధ్య కొట్టుకులాడిన గుండె చప్పుళ్లు ఈ నిర్మాణాల మధ్య ప్రతిధ్వనించి ఉంటాయి’ అనిపిస్తుంది ఆదినారాయణకు. చైనాలో ఒకానొకరోజున తమను కొత్తరాతి యుగాలనాటి యువతోంగ్ గుహల్నీ, మధ్య యుగాలనాటి సిల్క్ రూట్‌నీ, ఆధునిక కాలపు ఆకాశహర్మ్యాల్నీ ఒకే ఒక్క రోజులో తిప్పిచూపించిన మోటారు వాహనానికి, టైమ్ మెషీన్ అని పేరు పెట్టాలనిపిస్తుంది ఆయనకు. ఫ్రాన్స్‌లోని పిరనీస్ (Pyrenees) పర్వత ప్రాంతాల్లోని ఒక గ్రామంలో స్థానికులు సలాత్ (Salath) అనే నది ఒడ్డున చిన్న సంత పెట్టుకొని అందంగా చిన్నచిన్న దుకాణాలను తీర్చిదిద్దిన తీరు ఆదినారాయణకు ఏదో పెద్ద మ్యూజియంలో ‘ఇన్‌స్టలేషన్ ఆర్ట్’ పెట్టినట్టుగా అనిపిస్తుంది.

భావుకతామూర్తులయిన యాత్రికులకు మనుషులతోనే గాకుండా పక్షులు, పిట్టలు, పర్వతాలు, పువ్వులూ లాంటి వాటితోనూ ఆత్మీయానుబంధం కలగటం సహజం. ఆదినారాయణ విషయంలోనూ అదే జరిగింది.

స్వీడన్ దీవిలో తెల్లారగానే చెట్ల చివర్ల ఉన్న పక్షులు ‘ఏవో పాత పాఠాలు గుర్తుకు తెచ్చుకొంటున్న స్కూలు పిల్లల మాదిరిగా’ ఒక పద్ధతిలో స్వరాలను సవరించుకుంటున్నాయట. వాటికి సంగీతంకన్నా సంస్కారం ఎక్కువ అనిపించిందట. చైనా యాత్రలో బౌద్ధారామం దగ్గర అందరికీ వీడ్కోలు చెపుతూ, ‘అక్కడి ఊగుతోన్న వెదురు పొదలకీ పాడుతోన్న పిట్టలకీ – నేను మళ్లీ వస్తాను – అని చెప్పడానికి నా భాషా పాండిత్యం సరిపోలేదు’ అంటారాయన. ఫ్రాన్స్‌లోని టులూజ్ (Toulouse) స్టేషనుకు నడుచుకుంటూ వెళుతున్నపుడు వినిపించిన గువ్వల గుసగుసలు ఆయనకు ఆరౌత్ గ్రామంలోని కోళ్ల కూతలని, ఆస్లో (Oslo) నగరంలోని సీగల్స్ గొడవల్నీ గుర్తుచేశాయట. నేపాల్ పర్వత ప్రాంతాల్లోని స్థానిక స్త్రీలు పూలగుత్తుల్ని ఇచ్చి వీడ్కోలు పలికి ‘తమ కళ్లమీద వారి ముఖాన్ని ముద్రించి బైబైలు చెప్పి’ పంపారట. ‘ఆ స్త్రీలు ఎంత సౌందర్యవంతులో అంత ఆరోగ్యవంతులు కూడా. పదేళ్ల క్రితం ఈ పరిసరాలకు వచ్చివుంటే ఒంటరిగా వెళ్లడానికి ఇష్టపడేవాడిని కాదేమో!’ అంటారు బ్రహ్మచారి ఆదినారాయణ.

– ఈ పుస్తకంలో మరి తప్పులేమీ లేవా?

ఉన్నాయి. పేర్ల ఉచ్చారణ దోషాలు, అచ్చుతప్పులూ ఉన్నాయి. ప్రాంతాల పేర్లకు ఇంగ్లీష్ స్పెలింగూ ఇచ్చివుండాల్సింది. చాలా చోట్ల ప్రాథమిక వివరాల్లోనే తప్పులు దొర్లాయ్… జిబ్రాల్టర్ జలసంధి స్పెయిన్‌కూ ఫ్రాన్స్‌కూ మధ్య ఉంది అంటారొకచోట. పన్నెండు కోట్ల డెబ్బై లక్షల జనాభా ఉన్న మెక్సికో గురించి చెపుతూ సంఖ్యను కోటీ ఇరవై లక్షలకు కుదిస్తారు. టాస్మానియా వైశాల్యాన్నీ ఓ ముప్పై శాతం పెంచి చెపుతారు. ఇంగ్లండులో పదివేలమందే తెలుగువాళ్లున్నారు అంటారు. ఇవి ఘోరాపరాధాలు కాకపోవచ్చుగానీ ఒక అనుభవజ్ఞుడైన యాత్రికుడు చెప్పాడు కాబట్టి అవన్నీ నిజం అని పాఠకులు భావించే అవకాశం ఉంది కదా!

ముందే చెప్పినట్టుగా ఆదినారాయణ యాత్రల తాత్వికత తెలిసిన నిరంతర పథికుడు. నా అంచనా ప్రకారం గత పాతికేళ్లలో దాదాపు ముప్పైవేల కిలోమీటర్లు కాలి నడకన ప్రపంచమంతా తిరుగాడిన మనిషి. 1999లోనే అలాంటి మూడు ప్రయాణానుభవాలను గుదిగుచ్చి భ్రమణ కాంక్షను పుస్తకంగా ప్రచురించి తెలుగు సాహితీరంగంలో కాలుమోపిన మనిషి. గత 18 సంవత్సరాలలో ప్రయాణాలూ ప్రయాణీకుల గురించీ మరో ఆరు పుస్తకాలు రాసిన మనిషి.

– పర్లేదు. ఐతే పుస్తకం ఎక్కడ కొనుక్కోవాలిట మరి?

ఒక ప్రపంచ స్థాయి యాత్రికుడు రాసిన, ఓ ప్రపంచ స్థాయి యాత్రా రచన – ఈ నాలుగు వందల పేజీల భూభ్రమణ కాంక్ష పుస్తకం అతి తక్కువ ధరలో రచయిత వద్ద(సెల్: 98498 83570), హైదరాబాద్ కాచిగూడాలోని నవోదయా బుక్‌హౌజ్‌లోనూ దొరుకుతుంది.