తెరచాటు-వులు: 8. కప్పు, లిప్పు – సిప్పా? స్లిప్పా?

సినిమా వాచక మాధ్యమం కాదు. పాత్రలతో ఒక్క మాట కూడా మాట్లాడించకుండా సినిమా తీయడం, ఆ విషయం ప్రేక్షకులకు అసలు గుర్తు రాకుండా పైపెచ్చు దానిని ఆసక్తికరంగా మలచడం సాధ్యమే అని సింగీతం శ్రీనివాసరావు పుష్పక విమానం సైగలు చేసి మరీ చూపింది. విచిత్రంగా, సినిమాకి మాట ఆటంకమే కానీ ఆలంబన కాదు అన్నది పొదుపు మాటల బేహారి ముళ్ళపూడి వాదన. దృశ్యమైనా మాటైనా రెంటి ప్రయోజనం ఎఫెక్ట్ కలుగజేయడం ఒక్కటే అయినప్పుడు (జయవిజయుల మూడు జన్మల శత్రుత్వం, పది జన్మల మిత్రుత్వమల్లే, మొదటిది దగ్గర దారి అంతే!) మాటని ఆ పనికి ఎంచుకోవడం అనేది, ఎదురుగా రాచబాటని వదలి, పక్క రాళ్ళ దారి పట్టడం లాంటిది. కళ్ళ ద్వారా భావాన్ని పలికించగల నటులు దొరికినప్పుడు మాట యొక్క నిష్ప్రయోజకత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పేజీల కొద్దీ డైలాగులు ఒక్క బిగిని లాగవతల పారేయడం అన్నది నటుడి ధారణ శక్తికీ అతని వాచక పటిమకూ ప్రతీకలు కావొచ్చు కాని, అతన నటనకి ఏమాత్రం కొలమానం కావు. (సరే, ఇప్పటి రోజుల్లో తెలుగు నాట అసలు భాషనే సరిగ్గా ఉచ్చరించలేని నటులు తయారయ్యారు కాబట్టి, సినిమాలో డవిలాగుని పక్కన పెట్టి దృశ్యానికి పట్టం కట్టబెట్టే పరమార్థం మరో విధంగానైనా నెరవేరుతోందనే చెప్పుకోవచ్చు.) అందుకనే సినిమా రాయడం అని కాక సినిమా కూర్చడం అని అనడం సబబేమో. ఏ సందర్భంలో, ఏ భావాలని, ఎంత నిడివిలో చెప్పగలిగితే ఆ సీనుకి ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకోవడమే కూర్పరి పని. ఈ పని సినిమా అంతా చిప్పులో సర్దేశాక, ఎడిటింగ్ టేబుల్ దగ్గరే జరుగుతుందనుకోవడం పొరపాటే.

ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని. ది ఎక్సార్సిస్ట్ (The Exorcist) సినిమా చివరిలో దయ్యం పట్టిన అమ్మాయిని రక్షించే క్రమంలో, ఇంటికి వచ్చిన భూతవైద్యుడికి ఆ కేసు పూర్వాపరాల గురించి చెప్పబోయిన ఫాదర్‌ని వారించి, ‘ఎందుకూ?’ (why?!) అంటాడు ఆ భూతవైద్యుడు, చేయాల్సిన పనికి ఈ కథాకమామీషుల అవసరం ఎంత మాత్రం లేదన్నట్టు. క్లుప్తత పరంగా రచయిత చేసిన గొప్ప కట్ అది. ఒక సినిమా జీవ దశలో సృష్టి, స్థితి, లయకారకుల పాత్రలు పోషించే రచయిత, దర్శకుడు, కూర్పరి ముగ్గురి పరమార్థం ఒకటే – చెప్పే మాట, చూపించే దృశ్యం, చెప్పాల్సిన విషయానికి ఎంత చేరువగా చేరుతోందనే. The last draft of the script is the first cut of it అన్న ప్రచారంలో ఉన్న నానుడి రాత కోతలకు ఎంత అవినాభావ సంబంధం ఉందో తెలియజేస్తుంది. పైన ఉదహరించిన The Exorcist సినిమాని నవలనుండి చిత్రానువాదం చేసే పనిలో దర్శకుడు విలియం ఫ్రీడ్కిన్ (William Friedkin) చేసిన మొదటి పని, సినిమాకి వేరే (సినీ)రచయితని ఎంచుకోకపోవడం. విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆ నవలని తెప్పించుకుని దాన్నే స్క్రిప్టుకి ఆధారం చేసుకోవడం, దర్శకుడిగా కన్నా ఎడిటర్‌గా ఉంచవలసిన భాగాలేమిటో, ఉత్తరించవలసినవేమిటో ఆ నవలలోనే కూడికలు కొట్టివేతలతోనే నిర్ణయించుకోవడం, ఆ నలిగిన నవలనే సెట్ మీద కూడా తన దిక్సూచిగా చేసుకోవడం చూస్తే, నటీనటులను కథానుగుణంగా నడిపించడం అన్న పనిని వదిలేసి (విద్య తెలిసిన వాళ్ళైతే ఆ మాత్రం కూడా అక్కర్లేదు), సినిమాకు త్రిమూర్తుల అవసరం లేదని అర్థం అవుతుంది. కేవలం రచయిత, ఎడిటర్- ఈ నరనారాయణులే చాలు.

No good movie is too long, no bad movie is short enough.

‘సినిమా నిడివెక్కువయ్యిందండీ, సెకండాఫ్‌లో ఒక పది నిముషాలు తగ్గించుంటే ఇంకా రక్తి కట్టి ఉండేది,’ ‘ఎడిటింగ్‌లో లేగ్‌లు ఉన్నాయి,’ వంటి మీడియా సమాసాలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి ఉబుసుపోక అభియోగాలకు సమాధానమే ఆ పై మహావాక్యపు అర్థం, (సినిమాల వరకు) మంచిచెడులకు మితులు లేవు- అని. చెప్పవలసినదానిలో ‘విషయం’ లేకపోతే ఎన్ని కోతలేసినా, ఎంత కుప్పనూర్చినా, చేతికందిన పంట ఎందుకూ పనిరాదు. మేటి నటీనటులు, గొప్ప దర్శకులు, కర్కశులైన ఎడిటర్లు లేని విషయాన్ని సృష్టించలేరు; దృష్టి మరల్పగలరు, దృక్కోణం మార్చగలరుగాని సృష్టికి ప్రతిసృష్టి చేయలేరు. దీనికి కూడా ఒకటి రెండు ఆక్షేపణలు ఉన్నాయి. డి-డే(D-Day) అనే పేరుతో చరిత్రలో నమోదయిన ఘట్టం రెండవ ప్రపంచ యుద్ధసమయంలో జూన్ 6, 1944న ఫ్రాన్స్ లోని నార్మండీ తీరం మీద సంయుక్త సేనలు (Allied forces) మొదటి సారి జర్మన్ సేనల మీద దాడి చేసిన సందర్భం. ఈ ఘట్టం సేవింగ్ ప్రైవేట్ రయన్ (Saving Private Ryan) చిత్రంలో మొదటి అరగంట పాటు పరుచుకుని ఉంటుంది. యుద్ధ వాతావరణం అత్యంత సహజంగా మొట్టమొదటి సారి తెర మీద ఆవిష్కరించిన సందర్భం అది. స్క్రిప్టులో దీని నిడివి 6 పేజీలు. స్క్రిప్టులో పేజీకి తెర మీద నిముషం చొప్పున తర్జుమాలో పట్టుమని పది నిముషాలు కూడా ఉండకూడని సన్నివేశం. చలనచిత్రాలలో యుద్ధ ఘట్టాలకు మార్గదర్శకమై, మకుటాయమానంగా నిలిచే ఈ ఖండం మొత్తం దర్శకుడి (ఎడిటర్‌ల) స్వకపోల కల్పితం. ఇందులో రచయిత పాత్ర నామమాత్రం.

మరొక ఉదాహరణ- నేడు కామిడీ కావ్యంగా శ్లాఘించబడుతున్న ఆనీ హాల్ (Annie Hall). రాసినది తీసి ఎడిటింగ్ టేబుల్ మీద చూసుకున్న తరువాత, ఇది అసలు ఏ జాన్రాకి సంబంధించదో తెలిసింది కాదుట రచయిత-దర్శకుడు ఉడీ ఆలెన్‌కు (Woody Allen). అయ్యవారిని చేయబోతే కోతి అయిన చందాన, హాస్యం అని మొదలెట్టుకున్నది ఒక మానసికతత్వ శాస్త్రం మీద ట్రియటైస్‌లా తయారయిందని వాపోయి, ఆ రీళ్ళను ఎడిటర్‌కు అప్పగించాడుట. మనం ఆ సినిమాలో ఇప్పుడు చూస్తున్న చురకలు, చెణుకులు, ఛలోక్తులు, అన్నీ ముందు రాసినవే అయినా, వాటిని సరైన (సందర్భపు) ఆలుచిప్పలో పడేట్టుగా చూసి మంచి ముత్యాలుగా మార్చి అందించిన ఆ ఎడిటర్(ల)ని అభినందించకుండా ఉండలేము.

దీనికి మరో పార్శ్వం- ఎడిటింగ్ వెతలు. రాసేటప్పుడు రచయిత ఊహించుకునేదానికి, అది చదివి దర్శకుడు చిత్రీకరించేదానికీ చాలా అరుదైన సందర్భాలలోనే ఒక సామ్యత కుదురుతుంది. రాసినదానికంటే గొప్పగా తీయడమో, లేదా ఊహించినదానిని అందుకోలేకపోవడమో- ఈ రెండే సాధారణంగా పరిణమించే ఫలితాలు. రాసింది ముందు అర్థం కాక, తీసింది అంతకన్నా అయోమయంగా అనిపించి, ఈ రెంటినీ కలిపి సినిమాని అసలు ఏ విధంగా ప్రేక్షకులకి చేర్చాలో తికమక పడిపోయి, అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని వేడుకుంటూ కొద్దోగొప్పో పేరున్న ప్రతి ఎడిటర్ని ఆశ్రయించడం, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అన్న సామెత చందాన వారు సదరు కళాఖండాన్ని ఖండఖండాలుగా కోసి పోగులు పెట్టడం, ఆనక ఆ కుక్కలు చింపిన విస్తరిని ప్రేక్షకుల ముందు ఉంచి, వాళ్ళ ఛీత్కారాలనీ హాహాకారాలనీ మూటకట్టుకున్న సందర్భాలు తెలుగులో అంత వినపడకపోయినా, హాలివు‌డ్‌లో చర్విత చర్వణం. ఈ సందర్భంలో బ్లేడ్ రన్నర్‌కి (Blade Runner) మించిన ఉదాహరణ దొరకదు. మూడు దశాబ్దాల క్రితం రిడ్లీ స్కాట్ (Ridley Scott) తీసిన ఈ చిత్రానికి ఇప్పటికి ఆరు వేర్వేరు ఎడిటర్‌ల కట్లు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో థియేటర్లో విడుదలైన స్టూడియో కట్- మొదలుకుని, డీవీడీలు ప్రాచుర్యం పొందాక దర్శకుడికి తన పేరు మీద చలామణీ అవుతున్న వర్షన్లు నచ్చక మళ్ళీ మూడు పదుల ఏళ్ళ నాటి కథను ముందేసుకుని తను మొదట తీయాలనుకున్న కట్- వరకు, ప్రతి ఐదు పదేళ్ళ కొకసారి ఈ బ్లేడ్ రన్నర్ సినిమా వర్షన్లు పంచ వర్ష ప్రణాళికల్లే కొత్త పునురుద్ధరణలు పొంది రకరకాల ‘కట్‌’లుగా మార్కెట్లో విడుదల కాబడుతూ ఉంటాయి.

ఎందుకొచ్చిన కొచ్చిన్?

రీలు (చిప్) మీద మొదటి కోత పెట్టే ముందు, ప్రతి ఎడిటర్‌ని వేధించే ప్రశ్నలు: 1. రాసిన ప్రతిని దర్శకుడు అంతా చదివేసి ఆకళింపు చేసేసుకుని, సేననంతా సమాయత్తపరుచుకుని సెట్ మీదకెళ్ళి చెడుగుడు ఆడేసి, ఎడిటింగ్ టేబుల్ మీద కొచ్చిన తరువాత కానీ స్క్రిప్టులో ఉన్న సందేహాలు, సందిగ్ధాలు, సవరింపుల విషయాలు గుర్తురావా? 2. పజిళ్ళ ముక్కలన్నీ విడివిడిగా ముందు ఒక చెత్తకుప్ప వేసి అందులోంచి అందమైన బొమ్మని కూర్చమనే పని, అసలు తలపెట్టిన రచయితదా? లేక తలకెత్తుకున్న దర్శకుడిదా? వీరెవరూ కాక గుడ్డ ఏరేసుకుని, కొలతలు కూడా అనేసుకుని, ఆ అవకతవక అమరికని సర్దుబాట్లు దిద్దుబాట్లు చేసి ఒక కొలిక్కి తీసుకురావాల్సిన దర్జీదా (కూర్పరిదా)?

ఏమి చెబుదామనుకున్నామో ముందే అవగాహన లేక, షూటింగ్ కొనసాగుతూ ఉండగా సమాంతరంగా రాత పని కూడా కానిస్తూ, ఈ రెంటి మిశ్రమ ఫలితాన్ని ఎంత పేరు ప్రఖ్యాతులున్న ఎడిటర్ ముందు పెట్టినా వాళ్ళు కూడా కళ్ళెగరేసి చేతులెత్తేయడం తప్ప చేయగలిగిందేమీ ఉండదు అని ఈ మధ్య కాలంలో విడుదలైన బాంబే వెల్వెట్ (Bombay Velvet) సినిమా మరో సారి నిరూపించింది. ఉద్దండులైన నటీనటవర్గం, దిగ్దంతులైన సాంకేతికవర్గం ఉన్నా కూడా ఉండవల్సినది విషయమే కొరవడినప్పుడు థెల్మా స్కూన్‌మేకర్‌ని (Thelma Schoonmaker) బరిలోకి దించినా ఫలితం శూన్యం. (థెల్మా ఒక ప్రఖ్యాత హాలివుడ్ ఎడిటర్, విఖ్యాత దర్శకుడు మార్టిన్ స్కోర్సీసీ (Martin Scorsese) సినీ సహచారిణి.)

ఒక విధంగా దర్శకుడు, ఎడిటర్‌ల పని ఒకటే- రాసిన కథకి ఒక దృక్కోణం (perspective) కల్పించడం. మంచి రచయితల చేతిలో ఆ పర్‌స్పెక్టివ్ ముందుగానే తెలిసిపోతుంది. మంచి దర్శకుల చేతిలో ముందనుకున్న రచయిత దృక్కోణం మార్చబడినా కూడా విషయం ఆసక్తికరంగా తయారవుతుంది. ఉదా: ప్రఖ్యాత రచయిత స్టీవెన్ కింగ్ (Stephen King) రాసిన ది షైనింగ్ (The Shining) పుస్తకం మద్యం ప్రభావం వల్ల ఒక తండ్రి పతనావస్థకు ఎలా చేరాడన్న ఇతివృత్తం, దర్శక స్రష్ట స్టాన్లీ కుబ్రిక్ (Stanley Kubrick) చిత్రానువాదంలో శ్వేత జాతీయుల వర్ణ దురహంకారానికీ నేటివ్ అమెరికన్ల పట్ల జరిగిన దౌర్జన్యానికీ ప్రతీకగా మలచబడింది!

ప్రఖ్యాత హాలివుడ్ స్క్రీన్ రైటర్ ఎరిన్ సోర్కిన్ (Aaron Sorkin) స్క్రిప్టులు నాటకాలను పోలి ఉంటాయి. (విషయం తక్కువ, వాగుడు ఎక్కువ.) ఈతని స్క్రిప్టులు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యేకనే ఇంటి నించి బయలుదేరుతాయి. వీటికి పెద్దగా ఎడిటర్ కత్తెరల అవసరం ఉండదు. ప్రతి సీనుకి ఒక బిల్డప్, ముగింపులో ఒక ఉత్కంఠతో ముగిస్తాయి. అది అతని శైలి. అతని కలం నించి జాలువారి ఈ మధ్య విడుదలైన రెండు చిత్రాలు — ది సోషల్ నెట్‌వర్క్ (The Social Network), స్టీవ్ జాబ్స్ (Steve Jobs) — ఒక విధంగా దర్శకుడు, కూర్పరులతో పనిలేకపోయినా సునిశితదృష్టి గల దర్శకుల చేతిలో– డేవిడ్ ఫించర్ (David Fincher) – సోషల్ నెట్‌వర్క్; డేనీ బోయిల్ (Danny Boyle) – స్టీవ్ జాబ్స్– కావ్యాలుగా తీర్చిదిద్దబడ్డాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది సోషల్ నెట్‌వర్క్ సినిమాలోని ప్రారంభ దృశ్యం. చాంతాడంటి సంభాషణలు తుపాకి గుండంత వేగంతో సాగిపోయే ఈ కూర్పు పనితనం మెచ్చుకుని తీరాల్సిందే. సాధారణంగా ఇదే సంభాషణని మూడు కేమెరాలతో చుట్టుముట్టి ముఖ్యమైన క్షణాలకి క్లోజప్పులు తీసుకుని మిగతా భాగం ఇద్దరూ కలిసున్న మాస్టర్ షాట్‌ని వాడుకోవడం పరిపాటి. ఇక్కడ అసలే దూసుకుపోతున్న మాటలని మరింత పరుగులెత్తించే విధంగా ఒకరి మాట తరువాత క్షణమన్నా వ్యవధి ఇవ్వకుండా మరొకరి మాట మొదలయ్యే పద్ధతి గమనించండి. సంభాషణ అయ్యేంతవరకూ పేసింగ్ (pacing) ఎక్కడా పడిపోకుండా, ఉన్న పాత్రల మధ్యలో రిలేషన్‌షిప్ క్రమేణా క్షీణిస్తున్నకొద్దీ, సంభాషణల శరాలూ, తదనుగుణంగా ఎడిటింగ్ అదే వేగాన్ని అందుకుంటాయి. ఐదు నిముషాల సీను పూర్తయ్యేటప్పటికిగాని ఊపిరి పీల్చుకునే వ్యవధి ఇవ్వని ఈ సన్నివేశంలో రచనా బలం ఎంత ఉందో, అంతే పటిమ ఆ సీన్ ఎడిటింగ్‌లో కూడా కనిపిస్తుంది. గొప్ప సన్నివేశాన్ని అసాధారణ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

కొసమెరుపు

ఫిల్మ్ స్టాక్ దిగుమతి మీద ఆంక్షలు విధించబడిన రెండో ప్రపంచ యుద్ధ రోజులవి. సినిమా అప్పుడప్పుడే నిత్యావసరంగా మారుతున్న రోజులు కూడానూ. ప్రతి సినిమాకి ఇంతే స్టాక్ అని రేషన్ చేసి, ఇచ్చిన దానిలో కథని సర్దమన్నారు ప్రభుత్వం వారు. తీసిన షాట్లలో మంచిది ఎంచుకోవడం అటుంచి అసలు రెండో షాట్ తీయడానికే అవకాశం లేని పరిస్థితి. రచయిత, దర్శకుడు, ఎడిటర్ ఈ త్రిమూర్తులూ ఒక్కటిగా కలిసి ఒక దత్తావతారం ఎత్తవలసిన ఆగత్యం. సినిమా పేరు స్వర్గసీమ. దర్శకుడు బి. యన్. రెడ్డి. నిడివి: స్టాక్ ఇచ్చినంత, ముందు అనుకున్నంత. రచన గొప్పదై, నటీనటులు సమర్థులైతే దర్శకుని అవసరం శూన్యం. దర్శకుడు స్పష్టత కలిగిన సమర్థుడైతే ఎడిటర్ పని మృగ్యం. రచన, దర్శకుడు– ఈ ఇద్దరూ ఎక్కడ పప్పులో కాలేసినా ఆదుకునే ఆపద్బాంధవుడే ఎడిటర్!

(వచ్చే భాగంలో – బలే మంచి చౌక బేరము…)