Breakrooమోపాఖ్యానము

Job running…

అబ్బో నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు
అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే పోకళ్ళు
కైపెక్కే ఆకళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళూ…
అబ్బో నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు
అల్లో నేరేడు పళ్ళు

ఆ…హా…హెహే…యాయయయాయయా…యా…

అమ్మో గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు
గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కె చెక్కిళ్ళు
యెదలోన ఎక్కిళ్ళు
కోరేది కొబ్బరి నీళ్ళూ…
అమ్మో గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు…హా

లేలేత కొబ్బరి నీళ్ళూ…
కోరేది కొబ్బరి నీళ్ళూ…

ఏవిటో వేటూరిగారు ఏమి చెప్పదల్చుకుంటిరో, రిడండంట్ అవలేదూ?

హుఁ! హుమ్మ్!

అచ్చోట ఇంకో మాట వాడరాదూ?

చిన్న మాట… ఒక చిన్న మాట…
చిన్న మాట… ఒక చిన్న మాట…
చిన్న మాట… ఒక చిన్న మాట…

సందె గాలి వీచె… సన్నజాజి పూచె
సందె గాలి వీచె… సన్నజాజి పూచె
జలదిరించే చల్లని వేళ…
చిన్న మాట… ఒక చిన్న మాట…
ఊఁ… ఊఁ… ఊఁ…
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె…

హుమ్మ్! ఇచ్చోటనూ సరిగ్గా పడలేదో మాటలు?

ఛాంగురే బంగారు రాజా
ఛాంగు ఛాంగురే బంగారు రాజా…

అడవులలో రాక్షస జాతి స్త్రీ పాడుతోన్న పాట కదా, బంగారు రాజా, పచ్చల పిడి బాకు వంటి రాచరికపు పదాలు వెయ్యడం అతుకుతోందీ ఇక్కడ?

ఛాంగురే, మజ్జారే, అయ్యారే, అమ్మక చెల్లా – ఒక్క పాటలో ఇన్ని ఆశ్చర్యార్థకాలూ?

ఆ చూపు పచ్చల పిడిబాకు అంటూనే మళ్ళా పచ్చల పిడిబాకో, విచ్చిన పువు రేకో గుచ్చుకుంటే తెలుస్తుంది రా​! అని సందేహమేలనో? గడుసు పులకింతా?

ప్రేమ అనే బ్రహ్మ పదార్థం మీద బతుకుతోన్న ఈ సినిమా ​ఎన్ని వేల వలపు పాటలు కుమ్మరించిందో జనాల మీద? ​

అని పరిపరి విధముల నేను ఆలోచించుకొనుచూనుండగా-

Job aborted! యని స్క్రీనుపైన బ్లింకుట గని ఆ జాబు 226 తప్పులతో ఆగిపోయిందని తెర మీద వివరము కనిపించగా హతాశురాలనైతిని.

దిక్కు తోచక, బిక్కుమనుచు, ఏదో ఒక పక్కకు గ్రక్కున కొంతసేపు పారిపోదలచి బ్రేక్‌రూమ్ అనబడు ఉచిత కాఫీ, టీ సేవన స్థలమునకు బోయితిని.

అచ్చట, ఈ కంపెనీ ఉద్యోగస్థురాలివై రేయింబవళ్ళూ సంస్థ అభివృద్ధి జెందుటకు కృషి జేయుచున్న నీ కోసమే మే వేచియుంటిమని, అమ్మా రమ్మా మమ్ము వాడుకొనుమా! అని దీనముగ వేడుకొనుచున్న కాఫీ యంత్రములను జూచి ముచ్చట పడి, ఫోమ్ కాఫీ కప్పు వలె మనసును కొంత తేలికగా జేసుకుంటిని.

కొంత కాఫీ గలుపుకొని ఆ యంత్రముల ఉనికికి సార్థకత నాపాదించి తద్విధమున వాటిని ఆనందింప జేయవలెనన్న సద్బుద్ధితో నేఁ యాప్రయత్నములో నుండగనే, ఇంతలో యచ్చటికి గొంత తత్తరబిత్తరతో ఒక కుఱ్ఱవాడు ప్రవేశించి ఆ కాఫీ యంత్రముపై దాడి జేయదొడంగెను.

కాఫీలో పాలు గలుపవలెనా, పాలలో కాఫీ గలుపవలెనా ఆన్న డోలాయమాన స్థితిలో నున్న ఆ అర్భకుని వాలకము జూచి అతగాడు కొత్తగా రెక్కలొచ్చిన కోడిపిల్లయని ఇట్టే గ్రహించితిని. ఆతనికి గొంత సాయము చేయదలచి కాఫీ కషాయమును తయారుజేయు వైనమును ఆతనికి చక్కగా వివరించి, ఆతడునూ ఆ కషాయమును సేవించుచుండ, ఆతనికి గొంత బెరుకుఁ బోగొట్టుట సహోద్యోగినిగ నా ధర్మమని ఎంచి, ఎఱింగి – యాంగ్లమున నా నామధేయమును దెల్పి, ఆతని నామధేయమడుగగా, ఆతడు ‘సుభా’ అని పలికెను.

సుభాయనగా సుభాషా లేక సుభానీనా యని సందేహపడుచూ, ఆతని రూపుఱేకలు, చర్మఛాయ, మెల్లని చూపులూనూ గని, తెలుగువాడే అయివుండవచ్చునని నమ్మిక కలిగి, నీ పూర్తి నామధేయమేమనగా, ఆ బాలకుడు కొంత సందేహించుచూ సుబ్బారావని పలికెను. సుబ్బారావుకొచ్చిన తిప్పలు గని, సుబ్బా రావుని కత్తిరించి తగిలించుకున్న ముక్కనిగూడ సరిగా పలుకలేని, సుబ్బాలో బ్బాని వత్తి పలుకలేని, వానిని చూచి ‘నీ మొహం లాగుంది. ఏడవలేకపోయావూ?’ అని మనసులో అనుకొని, ఆ పిమ్మట అట్లనుకొనుట సంస్కారము గాదని ఎంచితిని.

ఆతనితో అచ్చికబుచ్చిలాడుట మొదలు బెట్టి, ఆతని పలుకులను బట్టి తెలిసికొనినదేమన, తెలుగునాట ఆతనొక డకోటా కాలేజీలో జేరినవాడని, ఎట్లో ఢక్కామొక్కీలు తిని దిగ్విజయముగ జదువు పూర్తి జేసి, ఇచ్చట నానా రకరంగురుచిదిక్కులు మాలిన వృత్తులు జేపట్టి, చివరికెట్లనో సౌత్ డకోటాలో ఉన్నత విద్య బూర్తి చేసుకొనినాడని.

ఈ జదువు నిమిత్తమై ఆతనికి ఆంధ్రరాష్ట్రమందు తిరుపతి వెంకన్నస్వామి కుబేరునికి జెల్లింపవలసినంత ఋణము గలదని, అందు నిమిత్తమై డాలర్ల వేటలో అతగాడు కన్సల్టంట్లనే కాలకేయుల జెంతజేరినాడని, వారు నానా రకరంగురుచిదిక్కుల అబద్ధాలతో అతని పరిచయ లేఖను కుట్టి, ఎట్లో అతగానిని అమెరికన్ సైబీరియా అనదగిన ఈ ప్రాంతమునకు ఉద్యోగిగా పంపిరని, అతగాని దీనదయాళ గాథని, చతుర్లోచనిని, సూక్ష్మగ్రాహిని, గాన గ్రక్కున గ్రహించి విజయవాడ కనకదుర్గమ్మ కొండంత విచారమును వెలిబుచ్చితిని.

ఈ ప్రియభాషణములతో ఆ బాలకునికి ఒక సోలెడు బెంగ వదిలినట్టయినది గాబోలు, మొగము క్రొంత తేటపడ కొంత కచ్చాపచ్చాగను, కొంత సాయిలాపాయిలాగనూ కబుర్లు జెప్పదొడంగెను.

ఆ మాటలలో తెలుగు వానికి అస్థిమూలగతమై ఒనరెడు సినిమాల పిచ్చి అతగానికీ గలదని, చిరంజీవి నట కుటుంబమన్న ఒళ్ళు మరచునని తెలిసికొని నవ్వితిని. చిరంజీవి సినిమా పాటలన్న ప్రాణమని, ఆ పాటలు చెవుల బడినంతనే అశక్తుడై ఆనందము ఆపుకొనలేక బ్రేక్‌నృత్యము కూడా చేయబూనునని తెలిసి అమేజ్మెంటు నొందితిని.

అవునా!? ‘మరి మీకు నచ్చిన పాటలు చెప్ప’మనగా- అతను తనువును, తానున్న తావును, తక్షణమే మరచి వివశుడై…

ఇదేమిటబ్బా
ఇది అదేను అబ్బా

అని గొంతెత్తగా, నేను దడుచుకుని, చాలా బావుంది, చాలా బావుంది, ఇంకో పాట చెప్పుమని అడ్డుకట్ట వెయ్యగా, అతను అంతటితో ఆ పాటను వదలి మరియొక గీతము ఆలోచించుకొని, ఆఁ! తట్టినదని…

కోలో కోలమ్మ
గళ్ళ కోకే
కాకెత్తుకెళ్ళ
కోరింది ఇచ్చుకోవా!

అని ఎత్తుకోగా, హతవిధీ అని చెవులు మూసుకోబోయితిని.

మిగిలిన ముక్కలు చప్పున గుర్తుకు రాలేదేమో? కొంత బాడి ఇక ఊరుకొనగా నేను హమ్మయ్య! అనుకొని నిట్టూర్పు విడచితిని. కాని అప్పటికే ఆలస్యమయినది. పాము పుట్టను వదిలినది. జీనీ బాటిలు నుండి బయటకు వెడలినది. అక్కడికక్కడే ఇక నృత్యము చేయుటకు కూడ సిద్ధపడుతూ, ఉరకలు ఎత్తుతున్న వాలకముతో,

​జపం జపం జపం
దొంగ జపం
తపం తపం తపం
దొంగ తపం! ​

అని పాడినంతనే…

అహో! ​ఇవి పాటలా? పాషాణ పాకాలా? లేక బూర్వము రామరావణ యుద్ధములో చావక మిగిలిన రక్కసుల మిన్నంటు కేకలా? అని విచారించుచున్న నా క​న్నులలోని విభిన్న భావములను చదివిన​ ఆ ​
కుర్రవాడు వెన్వెంటనే ట్రాకు మార్చి,

అనాథ జీవుల ఉగాది కోసం
సూర్యునిలా
నే దిగి వస్తా…

అని గొంతెత్తి నా వంక చూచెను.

నేను కాఫీ చవి చూచుచూ నా మాయా పేటికలో మెసేజీలు చదువుకొనుట చూచి-

అందం హిందోళం
అధరం తాంబూలం
అసలే చలికాలం
తగిలే సుమబాణం
సంధ్యారాగాలెన్నో
పెదవుల దాగిన వేళ…

అని శృతిలయలను యడ్డదిడ్డముగ, బాలన్సు లేని సైకిలు వలె తొక్కుచు, బాల గంధర్వుని ముఖ కవళికలతో యాఁ యపశృతులు మిళాయించిన​ మరొక్క ​పాటను విని నేను తల ఎత్తి వాని వంక చూచి నవ్వితిని.

హసీ తో ఫసీ- కనుక యతను పాటలు ఆపి మహోత్సాహముతో ఏమి జదివి నారెక్కడ జదివినారని క్వశ్నించెను.

విజయవాడలో సిద్ధార్థలో చదివితినని చెప్పగా, మీరు టూ థౌజండ్ టెన్ బాచా? అని ఆశ, ఆతృత కలగలిపి వలపు ఊటలూరే గొంతుకతో అడుగుతున్న ఆ బాలకుని జూచి నవ్వాగక…

I am much senior to you అని పలికితిని.

అనునయముగనే నయిననూ, నేను అనాలోచితముగ విడచిన బాణానికి, అంతవరకూ విజయోత్సాహముతో వీరుని వలె విహారము చేయుచున్న ఆ చిన్నారి హృదయం విలవిలలాడి, మోము కొంత చిన్నబోవడము స్పష్టమై- నా వయసు ఒక దశాబ్దము తగ్గించి ఊహించుచున్న వాని పలుకులకు సంతోషించక, అయ్యో​!​ అసందర్భముగ ఆ విషయము ఇప్పుడే ఏల చెప్పవలె? చెప్పితిని ఫో! మచ్ అని విశేషణమేల వాడవలె, వాడితిని ఫో… అని పరిపరి విధముల ఆలోచించబోవ, ఆ బాలకుడు అంతలో సర్దుకుని, ఆ బ్యాచి వాళ్ళు నాకు తెలుసండీ అందుకే అడిగాననెను.

అతగాని సమయస్ఫూర్తికి మనసులోన మెచ్చుకొని, ఆ బాలకుని గొంతులో ఈసారి నాపట్ల మర్యాద, గౌరవము హెచ్చుట గమనించి సంతుష్టి జెంది, నాకే ఏ దిక్కూలేని ఆ ఆఫీసులో, come to me if you need any help అని బింకముగా పలికి అచ్చటినించి నిష్క్రమించితిని.

అహో​!​ ఈ బాలకుడే కదా మున్ముందు ఏ అనకాపల్లి పిల్లనో పెళ్ళాడి, కాలక్రమేణా అమాయకత్వమును కోల్పోయి, ఇళ్ళూ వాకిళ్ళూ కొని బతకనేర్చినతనమును జాణతనమును పుష్కలముగ సాధించి, స్థానిక తెలుగు సంఘములలో సభ్యుడై మైకులు పుచ్చుకొని వేదికలెక్కి ఎలుగెత్తి శృతిలయలు తబ్బిబ్బు యగునట్టుల తెలుగు సినిమా పాటలు పాడుతూ, సినిమా నృత్యములు ఆడుచూ, అమెరికా తెలుగు సమాజములో ప్రముఖుడై, అటు పిమ్మట ట్రెజరరు, సెక్రటరీ, ఆపై ప్రెసిడెంటయి ప్రవాసతెలుగుజగజ్జేగీయమానమై వెలుగును కదా అని అనుకొనుచూ నా కంప్యూటరు యంత్రరాజము ముందుకు జేరి ఎబార్టు కాబడిన జాబును మరల రన్నించుటకు కృతకృత్యురాలినై గూర్చుంటిని.

ఆ విధముగ భేతాళుడు తిరిగి చెట్టెక్కెను.