యుద్ధం

ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు. అతని కత్తికి ఎదురు లేదు, బాణానికి తిరుగు లేదు, అతను గెలవని యుద్ధం లేదు. రాజు మెచ్చి ఆదరించి పదవులు ఇచ్చాడు. పురజనులు అతని పరాక్రమాన్ని వేనోళ్ల పొగిడేవారు.

అతన్ని పెళ్లాడాలని ఎంతమంది యువతులో కలలు కనేవారు. కానీ అతను ఆమెని చూడగానే మోహంలో పడిపోయాడు. పెళ్లి చేసుకుని ప్రేమలో మునిగిపోయారు.

అవి అందమైన రోజులు. వాళ్లు గాలిలో తేలీ తేలీ పిట్టలయ్యారు. నీళ్లలో ఈదీ ఈదీ చేపలయ్యారు. నేలమీద పరుగెత్తీ పరుగెత్తీ జింకలయ్యారు.

మళ్లీ ఇంకో యుద్ధం. ఈ సారి పెద్దది. ఓడినవాళ్లంతా కలిసికట్టుగా దండెత్తి వచ్చారు.

రాజు నుంచి కబురు. దిగాలుగా కూచున్న అతన్ని అడిగింది.

నాకు యుద్ధం చేయాలని లేదు. ఎవరినీ చంపాలని లేదు. ఎప్పుడూ లేని భయం. పారిపోదాం మననెవరూ గుర్తు పట్టని చోటికి.

విస్మయంగా చూసింది అతన్ని. నీకు భయమేమిటి? నువు వీరుడు ధీరుడు శూరుడివి.

నిన్ను వదిలివెళ్లాలని లేదు. వెళితే తిరిగి వస్తానని లేదు. చెప్పలేనంత బెంగ. పారిపోదాం మననెవరూ గుర్తు పట్టని చోటికి.

విసుగ్గా చూసింది అతన్ని. నిన్ను వలచిందే నువు వీరుడూ ధీరుడూ శూరుడివని. యుద్ధానికి పోని నువ్వు నాకెందుకూ?

నన్ను నన్నుగా ప్రేమించడం లేదా? ప్రేమ చాలదా మనకి? పారిపోదాం మననెవరూ గుర్తు పట్టని చోటికి.

జాలిగా చూసింది అతన్ని. నువ్వు వీరుడు ధీరుడు శూరుడివి. నీ కత్తీ కవచమూ, కొలువూ వలువలూ తీసేస్తే ఇంకో పురుషుడికీ నీకూ తేడా ఏముంది?

ఆ దుర్దినాన అతడు చనిపోయాడు. అప్పుడు సగం. మిగతా సగం ఆ యుద్ధంలో. అంత ఉగ్రంగా అతన్నెప్పుడూ చూడలేదని, యుద్ధంలో అతని ముందు ఎవరూ నిలబడలేకపోయారని, వందలమంది అతన్ని చుట్టుముట్టి చంపేలోగా ఎన్నడూ చంపనంతమందిని చంపాడనీ చాలా కాలం పాటలు కట్టి పాడుకున్నారు; కథలుగా చెప్పుకున్నారు ‘ఒకానొక కాలంలో ఒక వీరుడు ధీరుడు శూరుడు ఉండేవాడు…’ అని.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...