ఒకనాటి యువ కథ: శుభవార్త

ఆ సాయంత్రంలో ఏమీ ప్రత్యేకత లేదు ఒకరకంగా చూస్తే. డిసెంబరు నెల కావడంవల్ల చలి కాస్త ఎక్కువగా వేస్తోంది. ఆరు కాకుండానే చీకటి కమ్ముకొస్తోంది. నెలలో మొదటి వారం కావడం వల్ల కాస్త హడావిడిగా అటూ యిటూ రిక్షాల్లో సామాన్లు చేరవేసుకుంటున్నారు.

పుతిలీబావిడీ నుంచి జంటలు జంటలుగా సీతాకోక చిలుకల్లాగ వస్తున్నారు సుల్తాన్ బజార్లోకి అందరూ…

సుల్తాన్ బజార్లో సుల్తానూ ఫకీరూ ఒకటే. ఏమీ పని లేకపోయినా ఏదో పని ఉన్నట్లు అటూయిటూ తిరుగుతారు. కాస్త కాళ్ళు నొప్పి పుట్టగానే జంక్షన్‌లో ఆగుతారు. ఆ ఇరానీ కేఫ్‌లో ఒక కప్పు టీ తాగుతారు. మళ్ళా తిరగడం మొదలెడతారు. ఇదో వరస.

కృష్ణారావు సైకిల్ దిగి స్టాండువేసి ఇరాను హోటల్లోకి వెళ్ళాడు. టీ త్రాగుతూ కూర్చున్నాడు. అక్కడకు తను ఏళ్ళతరబడి వస్తున్నాడు. ఎన్ని గాలన్ల టీ త్రాగాడో తను ఇక్కడ! తనతోబాటే క్లాస్‌మేట్ శంకర్ వచ్చేవాడు అక్కడికి. ఇప్పుడు శంకర్ తహసీల్దార్ అయి ఊరుకున్నాడు. ఆ ఉద్యోగానికి తనకూ ఇంటర్వ్యూ వచ్చింది కాని సెలక్టు కాలేదు. తనకి కావలసిన సిఫార్సు లేదు. ఉద్యోగం రాకపోవచ్చని తెలిసినా దరఖాస్తు పెట్టాడు. పరీక్ష రాశాడు. ‘ఇంటర్‌వ్యూ’కు వెళ్ళాడు. ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ నవ్వుతూనే వున్నారు. వాళ్ళ ముఖాల్నిబట్టి చూస్తే తనకు ఉద్యోగం వచ్చేసినట్లే అనిపించింది. ఆ తర్వాతను సెలక్టు కానట్లు తెలిసింది. ఆ ఉద్యోగం వస్తుందని దరఖాస్తు పెట్టేటప్పుడే తెలుసునట శంకర్‌కు. అయినా గడుసువాడు గనుక ఎవ్వరికీ చెప్పలేదు.

ఇంతెందుకు? కృష్ణారావుకు ఆ ఉద్యోగం రాలేదు. ఇంతకుముందు ఇట్లాగే ఇంతకన్నా పెద్ద ఉద్యోగాలు దరవాజాదాకా వచ్చి వెనక్కి పోయాయి. దాంతో ముఖం మొత్తిపోయి ఒక్క విషయం తేల్చుకున్నాడు; తను ఇంక ఏ పెద్ద ఉద్యోగానికీ దరఖాస్తు పెట్టడు. దరఖాస్తు పెట్టకపోయిన తర్వాత ఉద్యోగం రావటమన్న సమస్యే ఉందదు. అంటే, పెన్షన్ కోసం మృత్యువు కోసం ఎదురుచూస్తూ గుమాస్తాగా స్థిరపడి పోవడమేనన్నమాట.

కృష్ణారావుకు పెళ్ళి అయి రెండేళ్ళయింది. భార్య లత మెట్రిక్ ప్యాసైంది. ఇద్దరిదీ చక్కని జంట అని అనుకున్నారందరూ. ఈ రెండేళ్ళ వైవాహిక జీవితంలో చూడవలసిన అన్ని స్థితులూ చూసేశాడు.

కృష్ణారావుకు జ్ఞాపకం వచ్చింది, లత సినిమాకు వెడదామంది సాయంత్రం. అవాళ అయిదో తారీకైనా పర్సు ఖాళీగా ఉంది. పాలవాడికి ఇంకా నాలుగు రూపాయల ముప్పయి నయాపైసలు యివ్వాలి. ఈ నెల నుంచీ పేపరు వాడికి అక్కర్లేదని చెప్పాలి. వెధవది- పేపరు కొనుక్కోవడానికిగూడా… సిగరెట్ల బ్రాండు మార్చాలి. సరుకుల దుకాణంలో పూర్తిగా బాకీ చెల్లించలేదని వాడు ధరలు విపరీతంగా వేస్తున్నాడు. అక్కడ కాతా ఎత్తేయాలి. డబ్బు ఇచ్చెయ్యాలి. మళ్ళా అదే చిక్కు. ఏమైనా సరే తప్పదు. ప్రతివాడూ తన నెత్తిన బురద పూస్తూనే ఉన్నాడు.

లతకు వెడ్డింగ్ ఏనివర్సరీకి ఒక సిల్కు చీర కొందామనుకున్నాడు. అవాళ కలిసి సినిమాకు వెడదామనుకున్నాడు కాని ఆనాడు బయట తిరగటానికి రిక్షా డబ్బులుకూడా లేకపోతే!

ఎదురుగా కప్పులో తాగగా మిగిలిన టీ చల్లారిపోయి చాలాసేపయింది. ఎంతకీ లేవడేం వీడు అన్నట్లుగా చూస్తూ క్లీనర్ టేబుల్ తుడిచేశాడు. ఒకటి రెండు టీ చుక్కలు లాగూ మీద పడ్డాయి. ఏమీ అనలేకపోయాడు. డబ్బు ఇచ్చి టీ తాగుతున్నామని ఏ కోశానా తెలియదు ఈ క్లీనర్లకీ సర్వర్లకీను. తింటుంటే యింకా ఎంత తింటావన్నట్లూ యింకెంతసేపు ఉంటావన్నట్లూ కసిగా చూస్తారు.

తన జీవితంలో ఎన్ని కలలు కన్నాడు! అప్పట్లో ఆ కలలన్నీ నిజాలవుతాయనే అనుకున్నాడు.

అద్దెయిల్లు చిన్నదీ అనువైనదీనూ. హాలులో చక్కగా రెండు కుర్చీలు, ఒక టీపాయ్, దానిమీద ఎంబ్రాయిడరీతో కుట్టిన టేబుల్ క్లాత్ ఒక ప్రక్కన, యింకో చిన్న బల్లమీద రేడియో, పైన ఫ్లవర్ వేజ్. ఇంటికి రాగానే చిరునవ్వుతో భార్య తలుపు తియ్యాలనీ. తర్వాత యిద్దరూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుని హైదరాబాదువాళ్ళ ప్రాణానికి బీచిలాంటి టాంక్‌బండ్‌కు షికారు వెడతారు. అక్కడ బాగా చీకటి పడేదాకా ఉండి రిక్షా మీద యింటికి వచ్చేస్తారు. ఇంటికొచ్చి భోజనం చేసి చల్లని తియ్యని కబుర్లతో గడిపేస్తాడు.

అబ్బ! ఇవన్నీ ఎంత మామూలుగా కనిపించాయి! ఒకప్పుడు శుద్ధ మామూలుగా కనిపించినవి ఆకాశ సుమాలై ఊరుకున్నాయి యీనాడు.

ఎట్లాగైనా సరే, అందని వాట్లను అందుకోక తప్పదు. తను గుమాస్తాగా ఉండిపోగూడదు. తనకు మార్పు కావాలి. అవును, చాలీచాలని జీతంతో జీవితం నలిగిపోనివ్వకూడదు. లతకు ఎన్ని ఆశలు చూపించాడు తను! డబ్బుదేముందనీ అంతా హృదయంలోనే ఉందనీ చెప్పాడు. అన్యోన్యంగా ఉంటే స్వర్గం దిగివస్తుందని చెప్పి నమ్మించాడు; తను నమ్మాడు కూడా! ఇప్పుడు కోర్కెల సంగతి అట్లా వుంచి కనీసావసరాలు కాటేస్తూ ఉంటే ఊరుకోవలసివస్తోంది.

బుర్ర వేడెక్కి గబుక్కున సైకిలెక్కాడు హోటలు బయటకు వచ్చిన కృష్ణారావు. సైకిలు ఎక్కగానే పోలీసు కాన్‌స్టేబులు చెయ్యి చూపించాడు ఆగమని. మరో నిమిషానికి వెళ్ళిపోయిన కార్లను చూస్తూ బద్దకంగా సైకిల్ తొక్కుతున్నాడు.

కళ్ళు తిరిగాయి. లోకం తనని తాను పోగొట్టుకున్నట్లు అపస్మారకంగా తిరిగింది ఒకే ఒక క్షణం!

వెనకాలనుంచి రిక్షా ముందుకు వెళ్ళి మిగతా రిక్షాల్లో కలిసిపోయింది. ఫుట్‌పాత్ మీది జనం అమూల్యమైన ఒక్క క్షణం క్రిందకు దిగి అటుచూశారు. ప్రవహించే నది ఆగిపోయినట్లు ట్రాఫిక్ ఆ క్షణం ఆగింది. అవతలపడ్డ సైకిల్ తీసుకుని యివతల ప్రక్కనున్న కృష్ణారావు వళ్ళు దులుపుకుని మళ్ళీ మాట్లాడకుండా సైకిలెక్కి వెళ్ళిపోయాడు.

సానుభూతి గుమ్మరించడంకోసం అక్కడ మూగబోతున్న వాళ్ళందరూ నిరాశగా ఫుట్‌పాత్ మీదకు వెళ్ళిపోయారు.

ప్రపంచంలో మొట్టమొదటి మెట్టుపై ఉన్నట్లనిపించింది కృష్ణారావుకు. జీవితంలో సాధించేదీ సాధించవలసిందీ వాట్లకోసం పడే పాట్లూ అగచాట్లూ కట్టుకునే ఆశల భవంతులూ కూలిపోయే పేకమేడలూ సరిహద్దులు దాటి నీరైపోయే ఆవేశం – ఇవన్నీ గోడమీద నీడల్లాగా కదిలాయి. పొగమంచులోంచి విడివడ్డ సూర్యబింబంలాగ కృష్ణారావు ముఖం వెలిగిపోతోంది.

నారాయణగూడా జంక్షన్ ప్రక్కన తను ఉంటున్న యింటిదగ్గరకు రాగానే సైకిల్ దిగాడు కృష్ణారావు.

రోజూకన్న చాలా ఉత్సాహంగా యింటికి వచ్చిన కృష్ణారావును చూసి లత ‘ఏమిటి సంగతి!’ అన్నట్లు కళ్ళల్లోకి చూస్తూ, కళ్ళతోనే అడిగింది.

ఊరుకోలేక, “ఏమిటి మహా ఉషారుగా ఉన్నారు యివాళ?” అన్నది చిలిపిగా కోటు విప్పదీస్తూ.

“నాకో కప్పు కాఫీ ఇచ్చి, దబ్బున ‘డ్రెసప్’ అయిరా. ఈలోగా పక్కింటి మిత్రుడు రంగనాథం దగ్గరనుంచి అయిదు రూపాయలు బదులు తెస్తాను. మనం సినిమాకి వెడదాం, ఆలస్యం అయినా సరే…”

“ఏమిటి సంగతి? ఏమిటో ఆ శుభవార్త? నా చెవిలో వేస్తే నేనేం పన్ను వెయ్యనులెండి…” అన్నది గారాబంగా లత.

అనుకున్నట్లు అన్నీ ‘రెడీ’ అయ్యాయి పది నిమిషాల్లో. సినిమాకు వెళ్ళారు, పిక్చర్ మొదలెట్టినా. పెళ్ళయిన క్రొత్తలో ఉన్నట్లుగా ఉన్నారు వాళ్ళు ఆ సాయంత్రం. సినిమాలో ఎన్నిసార్లు అడిగినా చెప్పనేలేదు కృష్ణారావు ఆ సంగతేమిటో.

“పోనీ మీరే దాచుకోండి…” అన్నది కోపంగా, పిక్చర్ అయిపోతుందనగా యింక ఆపుకోలేక.

“నీకు చెబితేనేగాని నా అనుభూతి ఎట్లాగూ పూర్తికాదు. అయినా యింటికి వెడతాముగా? ఇక్కడే ఉండిపోముగా?” అన్నాడు.

అది ఇంగ్లీషు పిక్చరు. తొందరగానే అయిపోయింది. ఇంటికి తాపీగా నడిచి వచ్చేశారు. భోజనం చేసిన తర్వాత, “మనం బయటకు వెడదామా?” అన్నాడు కృష్ణారావు.

“ఊ… అంతకంటేనా! కానీ ఒక్క షరతు మీద. మీరు సాయంత్రంనుంచీ దాస్తున్న మాటను చెప్పాలి మరి.”

“ఇంక తప్పదా? అయితే విను. సాయంత్రం ఆఫీసునుంచి వస్తూంటే ‘కోటీ’ దగ్గర accident అయింది. వెనకనుంచి రిక్షా ‘డాష్’ ఇచ్చింది. సైకిల్ మీదనుంచి పది గజాల దూరంలో ఎగిరిపడ్డాను. అర క్షణంలో ప్రాణాపాయం తప్పింది. నేను ఇంకా బ్రతికున్నానని చెప్పడంకంటే శుభవార్త ఏముంటుంది లతా?”

‘షాక్’ తగిలినట్లు కొన్ని క్షణాలు అట్లాగే ఉండిపోయింది లత. కళ్ళు తెరిచి చూసేసరికల్లా అన్నీ క్రొత్తగా, వింతగా, నిండుగా, బరువుగా, శోభగా వెల్లివిరుస్తూ వెలిగిపోతూన్నట్లనిపించింది.

(ఫిబ్రవరి 1962)