హైకూ

“సమ్‌థింగ్ రాంగ్, సమ్‌థింగ్ రాంగ్!” అంటూ గొణుక్కోసాగాడు హరి. క్లాసులో కూర్చోవాలనిపించలేదు. హఠాత్తుగా క్లాసు నుంచి బయటకు వచ్చాడు. పుస్తకాలు, కళ్ళజోడు అట్లాగే టేబుల్‌పై వదిలేశాడు.

“సార్! మీ పుస్తకాలు…” వెనుకనుండి కుర్రాడు అరుస్తున్నాడు.

వాడివైపు తీక్షణంగా చూసి, “నీ పేరు అబ్దుల్లా కదూ?” అన్నాడు ఏదో గుర్తుకొచ్చిన వాడిలా.

“అవును సార్!” అన్నాడు వాడు అర్థం కాని ముఖంతో,

“అల్లా గొప్పవాడు! ధైర్యంగా ఉండు!” అంటూ ముందుకు సాగాడు. అబ్దుల్లా తెల్లముఖం వేశాడు. వాడికేం అర్థం కాలేదు.

పరధ్యానంగా అట్లాగే నడుచుకుంటూ స్టాఫ్‌రూమ్‌కి వెళ్ళాడు హరి. “ఏం సార్! అప్పుడే వచ్చారు. క్లాస్ అయిపోయిందా?” లక్ష్మీబాయి, తెలుగు లెక్చరర్ అడిగింది. ఆయన అదేం పట్టించుకోనట్లుగా, “ఊళ్ళో గొడవలేమయినా అవుతున్నాయా?” అన్నాడు ఆందోళన పడుతున్న ముఖంతో. “లేదే!” అంటూ ఎస్.ఎస్. రావు, ఇంగ్లీషు లెక్చరర్, వింతగా చూశాడు ఆయన వంక.

హరికి ఎందుకో కంగారుగా ఉంది. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. ఏదో చెడ్డవార్త వినాల్సి వస్తుందనే భావం లోలోపల గుబగుబలాడుతోంది. అతని గుండెల్లో పదేపదే భయం లాంటి కంగారు లాంటి భావం. ‘తీతువు అరుపులాగా నా గుండెల్లో ఈ శబ్దం ఏమిటి? ఏ ఉపద్రవం రానుందో?’ అని దిగులుపడ్డాడు.

లైబ్రరీ వైపు వెళ్ళాడు. ఎంతో నిశ్శబ్దంగా వుండాల్సిన లైబ్రరీ గొడవ గొడవగా వుంది. ‘ఇన్డిసిప్లిన్! ఇన్డిసిప్లిన్!’ అంటూ గొణుక్కున్నాడు.

“మూర్తీ, ఏవైంది! ఎందుకింత కంగాళీగా వుంది లైబ్రరీ?” లైబ్రేరియన్‌పై మండిపడ్డాడు.

“ఏంలేదు సార్! పావురాళ్లు కొన్ని లోపలి గదుల్లో చేరాయి. రాక్‌లపైన కాపురం పెట్టాయి. పైనున్న గదులన్నింటిలో రెట్టలువేసి పాడుచేశాయి. ఎప్పుడూ కువకువమంటూ ఒకటే గొడవ! కుర్రాళ్ళను పంపాను తోలమని, అవి దొరక్కుండా లైబ్రరీ అంతా ఎగురుతూ గొడవ చేస్తున్నాయి,” సంజాయిషీలాగా చెప్పాడు లైబ్రేరియన్.

తెల్లని పావురం ఒకటి హరి ముఖాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. ‘కువ కువ’ హాయిగా మెత్తగా తోచింది దాని అరుపు. “పావురాళ్ళు శాంతికి చిహ్నాలు కదా! వదిలెయ్యక పొయ్యావా?” ఏదో గుర్తుకొచ్చినవాడిలా అన్నాడు హరి.

“ఊరుకోండి సార్! మీరు మరీ భావుకులైపోతున్నారు ఈమధ్య,” అంటూ ప్రేమగా కసిరాడు లైబ్రేరియన్.

లైబ్రరీ లోపలంతా హడావుడిగా వుంది. ఉఫ్, ఉఫ్ అంటూ పావురాళ్ళను తరుముతున్నారు కుర్రవాళ్లు. వాళ్ళలో ఒకడు కసిపట్టినట్లుగా కోపంగా వాటి వెంట పరుగెడుతున్నాడు. ‘రిలాక్స్ రిలాక్స్! ఇది యుద్ధరంగం కాదు!’ అని ఆ కుర్రాడికి చెప్పాలనిపించింది హరికి, వాడు వినే మూడ్‌లో లేడు.

వాళ్ళ హడావుడికి పుస్తకాల రాక్‌లు పక్కకు వొరిగి దబ్‌దబ్ మంటూ పుస్తకాలు నేలపై జారాయి. వందలాది పుస్తకాలు మొదటి అంతస్తులోంచి కిందకు జారి నేలపై గుట్టలుగుట్టలుగా పడ్డాయి. కోపంగా పరుగిడుతున్న కుర్రవాడి చేతిలోని కర్ర తగిలి ఒక పావురం కువకువమని మూలుగుతూ నేలపై పడింది. ముక్కులోంచి రక్తం, అది గిలగిలలాడుతోంది. నేలపాలైన పుస్తకాలు, గిలగిలలాడుతున్న పావురం, హరికి బాధాకరమైన ప్రతీకలా తోచింది. ఆయన లోపలి తీతువు మళ్ళీ అలజడి మొదలుపెట్టింది. ఒక అనీజీనెస్ ముఖమంతా పాకింది. “మూర్తీ! ఏమిటీ రాక్షసం? ఇట్లా పావురాల్ని చంపటం, పుస్తకాల్ని నేలపాలు చేయటం!” కోపంగా అరిచాడు హరి.

ఎపాలజిటిక్‌గా చూశాడు లైబ్రేరియన్. “మీరట్లా పది నిముషాలు బయట నిలబడండి. క్షణాల్లో అంతా సర్దేస్తాను,” అని ఆయనకు నచ్చజెప్పి, “రంగారావూ! ఇంక పావురాళ్ళ వేట ఆపి, పుస్తకాలు సర్దండి.” అంటూ వాళ్ళకు ఆజ్ఞలు జారీ చేశాడు లైబ్రేరియన్.

పెరుగుతున్న అనీజీనెస్‌ను ఎట్లా కంట్రోలు చెయ్యాలో అర్థం కాలేదు హరికి, ‘ఏదైనా మందు వేసుకుంటేనో?’ అని ఆలోచించాడు. బి.పి. కోసం డాక్టర్లు ఇచ్చిన ఎటెనలాల్ బిళ్ళలు జేబులోనే ఉన్నాయి. ఈ వచ్చిన ఇబ్బంది బి.పి. లాగా తోచటం లేదు. ఇది పూర్తిగా మానసికమైన ఇబ్బందిలాగే తోస్తోంది. గతంలో కూడా ఇట్లా వచ్చినట్లు గుర్తు. కానీ ఎప్పుడు ఎట్లా వచ్చిందో గుర్తుకు రావటం లేదు. చాలాసేపు ఆలోచించి ప్రస్తుతానికి ఒక ఎటెనలాల్ టాబ్లెట్టు వేసుకుందాం అని నిర్ణయించుకున్నాడు.

క్యాంటీన్‌కు వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేశాడు. క్యాంటీన్ కుర్రవాళ్ళతో కిక్కిరిసి ఉంది. నలుగురైదుగురు కుర్రవాళ్ళు బల్లలపై విలాసంగా కూర్చున్నారు. వాటిచుట్టూ ఒక పెద్ద గుంపు. స్టీరియోలో వస్తున్న సినిమా పాటకు రెస్పాన్స్‌గా టేబుల్ పై తాళం వేస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఆ పాటను హమ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని పట్టించుకోనంతగా ఆ పాటలో లీనమైపొయ్యారు. హరి రాకను కూడా గమనించలేదు. ఇద్దరు కుర్రవాళ్ళు మాత్రం మేనేజర్‌తో పెద్దపెద్దగా వాదిస్తున్నారు. కాసేపటికి మేనేజర్ ఓడిపోయినట్లుగా ముఖం పెట్టి స్టీరియో ఆపివేశాడు. హఠాత్తుగా ఆగిపోయింది. డాన్స్ చేస్తున్న కుర్రవాళ్ళలో ఒకడు ‘ఇట్ ఈజ్ బార్బేరియస్!’ అంటూ పెద్దగా అరుస్తూ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. ‘ఇట్ ఈజ్ ఇన్సల్టింగ్ అవర్ సెంటిమెంట్స్!’ కౌంటర్ దగ్గరనున్న కుర్రవాడు వాదిస్తున్నాడు. హరి వాణ్ణి గుర్తుపట్టాడు. అబ్దుల్లా, పొద్దున పలకరించిన డిగ్రీ సూడెంట్! ‘ఈ పిల్లలెందుకు ఇట్లా పోట్లాడుకుంటున్నారు!’ అనుకుంటూ విసుగ్గా కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు హరి.

“వాట్ హాపెండ్ అబ్దుల్లా?” విసుగ్గానే అడిగాడు.

“చూడండి, ఆ ఒక్కపాట పెట్టొద్దంటే వినటం లేదు,” అంటూ కంప్లైంటు చేశాడు.

“ఏం పాటది?” ఆసక్తిగా అడిగాడు హరి.

“అదే…” ఆ పాటను పలకడానికి ఇష్టపడలేదు అబ్దుల్లా. ‘ముస్తఫా! ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా!’ పక్కనున్న కుర్రాడు హమ్ చేస్తున్నట్లుగా చెప్పాడు. కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వారికి. ‘ఓకే! ఆపేస్తానన్నానుగా…’ కౌంటర్లో మేనేజర్ సర్ది చెబుతున్నాడు. అబ్దుల్లా కోపంగా బయటకు వెళ్ళాడు. హరి కూడా విసుగ్గా బయటకు నడిచాడు. ‘ఏం పొడుచుకొచ్చింది! గాడెస్ సరస్వతికి బట్టలు లేకుండా బొమ్మలేసినప్పడు?’ మిగిలిపోయిన కుర్రవాళ్లు స్వీపింగ్ కామెంట్స్ పాస్ చెయ్యటం మొదలుపెట్టారు. “స్టాపిట్!” పెద్దగా అరిచాడు హరి. తేనెపుట్ట చెదిరి ఈగలు ఝుమ్మని రొద పెట్టినట్లుగా అయిపోయారు పిల్లలు. ‘నేనేనా! ఎందుకింత ఉద్రేకం నాకు?’ అని తనలో తాను అనుకున్నాడు హరి. పిల్లలందరూ లోలోపల గొణుక్కుంటూ బయటకు వెళ్ళారు. కాంటీన్ ఖాళీ అయింది. ఆ నిశ్శబ్దంలో మళ్ళీ అలజడి పెరగటం మొదలుపెట్టింది హరికి.

స్టాఫ్‌రూమ్‌ వైపు నడిచాడు హరి. క్యాంటీన్లో మళ్ళీ “ముస్తఫా ముస్తఫా!” పాట వినబడటం మొదలుపెట్టింది. బయటకు వెళ్ళిన కుర్రవాళ్ళు మళ్ళీ క్యాంటీన్లోకి వెళ్ళటం మొదలుపెట్టారు పాటను హమ్ చేసుకుంటూ. లైబ్రరీ దగ్గర పావురాళ్ళ వేట ఇంకా కొనసాగుతోంది. ఒక కుర్రవాడు లైబ్రరీ పైకి ఎక్కి బురుజులాగా ఉన్న ప్రదేశాన్ని కర్రలతో తొలుస్తున్నాడు. గూడులోపల వున్న పావురాళ్ళు భయంతో టప్‌టప్ మంటూ పైకి లేచాయి. వాటి అరుపులతో ఆకాశం గొడవ గొడవగా ఉంది. ఫెళఫెళమంటూ గూడు కూలిపోయింది. అప్పుడు హఠాత్తుగా ఏదో మెరిసింది హరికి. తన మనస్సు లోపలి అనీజీనెస్‌కు కారణం అర్థమైంది. ఆ వేళ డిసెంబర్ ఆరు.

ఎస్.ఎస్. రావు ఎదురైనాడు. “క్లాసులు లేవు. ఇంటికి వెళుతున్నాను. మీరు వస్తారా! ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను” అన్నాడు.

“క్లాసులెందుకు లేవు?” కంగారుగా అడిగాడు హరి.

“ఊళ్ళో గొడవలుగా ఉన్నాయట. కలెక్టర్ ముందు జాగ్రత్తగా ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇచ్చాడట!” హరి గుండెల్లో అలజడి తీవ్రమైంది. గుండెలోపల దబ్‌దబ్ మంటూ చప్పడు. గుండె ఆగిపోతుందేమో అని భయపడ్డాడు హరి.

ఎస్.ఎస్. రావును వెళ్ళిపొమ్మని చెప్పాడు. హరి ఒక్కడే స్టాఫ్‌రూమ్ వైపు వెళ్ళాడు. హరికి చాలా దిగులుగా ఉంది. ఎవరైనా ఓదారిస్తే బాగుండు అనిపించింది. కుర్రవాళ్లు హుషారుగా, ఆనందంగా ఇళ్ళకు వెళ్ళటం ఏమి బాగా లేదనిపించింది. ‘కులాసాగా ఉండాల్సిన సమయం కాదర్రా! కళ్ళముందరో శవం వుంది!’ అని పెద్దగా అరవాలనిపించింది.

యాభై ఆరేళ్ళ హరికి హిస్టరీ అధ్యాపకుడుగా పెద్ద పేరుంది. అమరావతి దగ్గర వున్న ఆర్కియోలాజికల్ తవ్వకాల్లో ఆయనకు గొప్ప పేరు వచ్చింది. ఎంచేతనో బ్రహ్మచారిగా ఉండిపోయేడు. ధార్మికుడిగా మేధావిగా ఆయనకెంతో పేరు. చరిత్రను కొత్త కోణంలోంచి చూసిన ఆధునికుల్లో ఒకడుగా ఆయన గురించి చెప్పుకుంటారు.

స్టాఫ్‌రూమ్‌లో హరి ఒక్కడే కూర్చుని ఉన్నాడు. కాలేజీ మెల్లమెల్లగా నిర్మానుష్యం అయ్యింది. వాచ్‌మన్ తలుపులు మూసివేసుకొంటున్న సమయానికి హరి మెల్లగా లేచాడు. చిన్న చేతిగుడ్డసంచిలో పుస్తకాలు సర్దుకొని బయటకు అడుగులు వేశాడు.

బజారులన్నీ భయాన్నీ దిగుల్నీ ముఖంపై తొడుక్కున్నాయి. షట్టర్లన్నీ మూసివేస్తున్నారు షాపువాళ్ళు. ఆటోరిక్షాలు, స్కూటర్లు వేగంగా పరుగులు తీస్తూ కళ్ళ ముందు నుంచి అదృశ్యం అవుతున్నాయి. రెండు మూడు జీపుల్లో దళాలు తరలివెళ్తున్నాయి. అట్లాగే వీధుల్లో మొండిగా నడవటం మొదలుపెట్టాడు హరి.

వీధులన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ పెనుశోకం ఏదో వినబడీ వినబడక వెంటాడుతున్నట్లుగా ఉంది. అంతటి నిశ్శబ్దంలో ఒక దృశ్యం హరిని చటుక్కున ఆకట్టుకొంది. విశాలమైన వీధిలో అతనొక్కడే. పన్నెండేళ్లు కూడా ఉండవు. స్కూలు యూనిఫారంలో ఉన్నాడు. కుంచె, రంగుడబ్బా, ఏకాగ్రతతో గోడపై నినాదమేదో రాస్తున్నాడు. గొప్ప దృశ్యం! ప్రపంచమంతా శూన్యమై, వాడొక్కడే మిగిలినట్లుగా, రేపటి కోసం ఇవాల్టి చరిత్రను రాస్తున్న చిట్టచివరి మానవుడిలా…

దృశ్యం చెదిరింది. పోలీసు జీపు అటుగా వెళుతూ వాడిపక్కనే ఆగింది. అందులోంచి ఖాకీమృగం. కాలరు పట్టుకొని ఆ కుర్రవాడిని వెనక్కు లాగి, నేలపై విసిరికొట్టి, నునుపైన, మృదువైన వాడి చర్మంపై లాఠీతో బాది ‘ఫో! పరిగెత్తు! ఈ మధ్యన కనిపించావంటే చంపేస్తాను!’ అంటూ గర్జిస్తున్నాడా పోలీసు.

కుర్రవాడు పక్కవీధిలోకి పరుగెత్తాడు. జీపు వెళ్ళిపోయింది. ఒక హింస తాలూకు చిహ్నాలు మాత్రం అక్కడ ఉన్నాయి. డబ్బాలోని ఎర్రరంగు ఒలికిపోయింది. కుంచె ముక్కలు ముక్కలయింది.

హరి అటువైపు నడిచాడు. గోడపైన పూర్తికాని నినాదం. “లెట్ అజ్ ఆల్ లివ్ ఇన్ పీస్!” అంటూ ఇంగ్లీషులో రాసి ఉందా నినాదం. ఆ నినాదం కిందనున్న మూడు పంక్తుల కవిత ఒకటి హరిని ఆకట్టుకొంది.

“ఒక స్వప్నం ఇంకా మిగిలి ఉంది.
వేసవిలో మొలిచే పచ్చికలా రండి!
పావురాల్ని పెంచుదాం!”

క్షణం పాటు విస్మయం చెందాడు హరి. భక్తితో కిందకు వంగి విరిగిపోయిన కుంచె తాలుకు ముక్కల్ని ఏరుకుని సంచిలో దాచుకున్నాడు. గొప్ప ఏంటిక్ సంపద పొందినట్లుగా అనిపించింది హరికి.