ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు

సంతోషాన్నయితే యితరులతో పంచుకోవచ్చుగానీ విషాదాన్ని మాత్రం యెవరికి వారే భరించాలి. నలుగురితో కలిసి నవ్వుకోవచ్చుగానీ యేడుపు మాత్రం యెవరి యేడుపు వారు ఏడ్చుకోవల్సిందే! నేను చెప్తున్నది డా. వి. చంద్రశేఖర రావు అనే మంచి మిత్రుడు మరణించడమనే విషాదాన్ని గురించి మాత్రమే కాదు; ఆయన రచనలన్నింటిలోనూ వ్యాపించిన విషాదపు కంఠాన్ని గురించి, మౌర్నింగ్ వాతావరణం గురించీ కూడా! మానవజాతినంతా వుద్ధరిస్తాయనుకున్న గొప్ప వుద్యమాలను మనుషులెంత దుర్మార్గంగా నీరుగారిస్తున్నారన్న వేదనకయితే ఆయన సాహిత్యంలో కారణాలను వెదుక్కోవచ్చు. కానీ ఆ వేదనకంతా మూలభూతమైన ఆయన జీవితంలోని విషాదపు మూలాలను తెలుసుకోవటం సాధ్యంకాదు. వ్యక్తిగా చంద్రశేఖరరావు ఆంతరంగిక జీవితం ఆయన ఆత్మీయ మిత్రులకు కూడా మూసిన పిడికిలేనని క్రమంగా తెలిసివచ్చింది. అది ఆయన జాగ్రత్తపడి దాచిపెట్టుకున్నదేమీగాదు. తన వ్యక్తిగత కష్టసుఖాలను యితరులతో పంచుకునే వ్యక్తిగాడాయన. యీ గుంభన, యీ మొహమాటమే ఆయన రచనలనంతా ఆయనదైన విభిన్నమైన మార్గంలోకి తీసుకెళ్ళాయి.

1994 మే 28న బెంగళూరులో జరిగిన ‘కథ 93’ ఆవిష్కరణ సమావేశానికి వెళ్ళినప్పుడే చంద్రశేఖర రావును తొలిసారిగా చూసిన జ్ఞాపకం. ఆయనను తొలిసారిగా తెలుగు కథానికా ప్రపంచానికి పరిచయం చేసిన ‘జీవని’ కథానిక అప్పటికే 1991లో ‘కథ 91’లో వచ్చింది. ’93 కథ’ సంకలనంలో ‘డియర్ కామ్రేడ్’ అనే కథానిక వుంది. ఆ రోజు సమావేశంలో పాల్గొన్న విమర్శకులొకరిద్దరు అప్పటి తెలుగు కథ చాలా చప్పగా, స్టేల్‌గా వుంటోందనీ, దాన్ని వుత్తేజితం చేయడం కోసం రచయితలంతా లాటిన్ అమెరికన్ కథలను అధ్యయనం చేయాలనీ చెప్పడం నాకింకా బాగా గుర్తుంది.

ఆ మాటలు చంద్రశేఖరరావుపైన యెంత ప్రభావాన్ని చూపెట్టాయో యిప్పుడు వెనుదిరిగి చూస్తే స్పష్టంగా కనబడుతోంది.

తెలుగు కథకుల్లో చంద్రశేఖరరావంత యెక్కువగా పాశ్చాత్య సాహిత్యాన్ని – అందులోనూ లాటిన్ అమెరికన్ రచనలను – చదువుకున్న రచయితలు చాలా అరుదు. 1997లో ఆయన రాసిన ‘చిట్టచివరి రేడియో నాటకం’ పైన లాటిన్ అమెరికన్ రచయితల ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. తర్వాత క్రమంగా ఆయన తనదైన విలక్షణ పద్ధతిలో కథలు రాయడం మొదలుపెట్టారు.

మాజిక్ రియలిజంను – మాంత్రిక వాస్తవికత – నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యంకాదు. వేర్వేరు రచయితల మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. చంద్రశేఖరరావు కూడా తనదైన చిత్రమైన మాంత్రిక వాస్తవికతను క్రమంగా సృజించుకోగలిగారు. ఆ తర్వాత ఆయన రాసిన కథలన్నింటిలోనూ అదే మౌర్నింగ్ వాతావరణం, గుడ్డసంచి భుజానికి తగిలించుకుని తిరిగే మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహిని, పార్వతిలాంటి అవే పాత్రలూ, అదే విషాదభరిత కథనమూ… 2000 సంవత్సరం వచ్చేసరికే ఆయనను జాగ్రత్తగా గమనిస్తున్న పాఠకులంతా ఆయన ఒకే కథను రాస్తున్నారని గుర్తించేశారు. అయితే ఆ కథలలో పునరుక్తి లేదు. వొకే కథకుండే భిన్న పార్శ్వాలను పెంచుతూ ఆయన కథలు రాయసాగారు. ఈ శకలాలన్నింటినీ కలిపితే వచ్చే అసంపూర్ణ చిత్రం సమకాలీన సమాజానికి ప్రతిబింబమేనని తెలిసివచ్చింది.

ప్రపంచంలోని చాలా విశిష్టమైన రచనల్లాగే ఇది కూడా రచయిత అన్‌కాన్షస్‌గా చేపట్టి స్పాంటేనియస్‌గా కొనసాగించిన ప్రణాళిక. తానీపని చేస్తున్నానన్న స్పష్టమైన స్పృహ చంద్రశేఖరరావుకున్నట్టుగా నాకు కనిపించలేదు. అయితే ఆ పని చేయడం ఆయనకొక మానసికావసరం అయిందని మాత్రం అవగతమవుతోంది. అలా తప్ప మరోలా రాయలేకపోవడం, అలా రాయక తప్పని పరిస్థితి యేర్పడటం జరిగినట్టుంది. అది రచయితకు అనివార్యమైపోయింది. అలా జరిగి వుండకపోతే యీ ఇబ్బందికరమైన మొనాటనీని ఆయనెప్పుడో ఒకప్పుడు పగలగొట్టివుండేవాడు. అలా పగలగొట్టగల శక్తి ఆయనకుందని నల్లమిరియం చెట్టు నవల నిరూపిస్తోంది. కానీ ఆ శక్తికి మించిన మానసికావసరం యేదో – ఆయనకున్న దుఃఖాన్నీ, విషాదాన్నీ, బాధనూ మరోలా తగ్గించుకునే మార్గం లేకపోవడంతో – ఆయనీ రీతిలోనే కథలు రాయడానికి కారణభూతమయ్యాయి. వెరసి డా. వి. చంద్రశేఖరరావుదే అయిన వొక వినూత్నమైన కథన ధోరణి ఆవిష్కరించబడిపోయింది. యిలా జీవితకాలమంతా వొకే కథకున్న భిన్న పార్శ్వాలను కథలుగా మలచిన రచయిత ప్రపంచ సాహిత్యంలో నాకు మరెవరూ కనిపించడంలేదు. చాలామంది రచయితలు యితరుల కథలు రాస్తుంటారు. తమవైన కథలు మాత్రమే రాసే రచయితలు మాత్రమే యిలాంటి పని చేయడం సాధ్యమవుతుంది.

చంద్రశేఖరరావు యెప్పుడూ వర్తమానంలోనే బతికే కథకుడు. వర్తమానానికి భూమికైన భూతకాలాన్నీ దానిలోంచి రాబోయే భవిష్యత్తునూ చిత్రిస్తూనే యెప్పుడూ వర్తమానపు కథలే రాసే సమకాలిక కథకుడు. ఆయన కథలన్నీ అప్పటి సామాజిక జీవితానికి ప్రత్యక్షవ్యాఖ్యానాలుగా తయారయ్యాయి. అందుకే వాటిలో చాలావాటికి తుదీ మొదలూ వుండదు. కొన్ని పూర్తిగా డాక్యుమెంటరీల్లాగే వుంటాయి. ఒక మూడ్‌లో ప్రణాళిక లేకుండా రాసుకుంటూ పోవడంతో వస్తువులో ఐక్యత కూడా వుండదు. వాక్యాన్ని ప్రారంభించినప్పుడు దాన్నెలా ముగించాలో తనకైనా తెలుసునా అని సందేహించే అసంపూర్ణ వాక్యాలు, కాలక్రమం లేని క్రియాపదాలు, వ్యాకరణానికి లొంగని పదబంధాలు, తెగని ఆలోచనాధారలు, ముక్కలుముక్కలైపోయే అవరోధాలు, దారి తెలియని అడవుల్లా తయారైన కథనాలూ… ఒకానొక అంతర్గ్రాహ్యచరిత్ర (inclusive account) కుండే శకలంలా మాత్రమే కొన్ని కథలు మిగులుతాయి. ప్రదేశాలూ పాత్రలూ సంఘటనలూ మన దేశానివేనా అన్న అనుమానం కలిగించే కథలు కొన్ని. వొక రకమైన మెలోడ్రమటిక్, హలూసినేటింగ్ గాథిక్ (gothic) వాతావరణమూ సన్నివేశాలూ ఆయన రచనంతా పరుచుకునివుంటాయి. తిరుపతిరావుగారి మాటల్లో చెప్పాలంటే ‘వొక అరాచకమైన’ ధోరణి వ్యక్తమవుతూ వుంటుంది. అయితే యీ శకలాలన్నింటినీ వొకసారి చూసినప్పుడు కలిగే అనుభవం చిత్రమైన కళాత్మకతకు దగ్గరగా వుంటుంది. ఒక కొలాజ్ లాగా, ఛిద్రమైన భావాలను కలిపి చూడమని సవాలు చేసే జిగ్‌సా పజిల్‌లాగా అది రకరకాలుగా కనబడుతుంది. ఆ విషయం చంద్రశేఖరరావు ఆ ధోరణిలో రాసిన కథల్లో కొన్నింటిని రెండేళ్ళకు ముందు ‘చిట్టచివరి రేడియో నాటకం’ అన్న కథా సంపుటంగా తీసుకొచ్చినప్పుడే అవగాహనకు వచ్చింది.

దాదాపు మూడు దశాబ్దాలపాటు యిలా రాస్తున్నప్పుడు విమర్శలు తప్పకుండా వుంటాయి. చంద్రశేఖరరావు ధోరణిని అధిక్షేపించిన రచయితలూ విమర్శకులూ చాలామందే వున్నారు. తినితీరి కూర్చున్న రచయితలూ సమాజంలో వొదగలేని పైతరగతి వ్యక్తులూ సాహిత్య సృజనకు పూనుకుంటే యిలాగే జరుగుతుందని చీకాకుపడ్డవాళ్ళూ వున్నారు. ఆ విమర్శలకు యితరులే స్పందించారుగానీ చంద్రశేఖరరావు తనంతట తానుగా వాళ్ళతో వాగ్వివాదానికి దిగడంగానీ నిరసించడంగానీ చేయలేదు. అందరు రచయితల్లాగే ఆయన కూడా విమర్శిస్తే విలవిలలాడిపోయే సున్నితమనస్కుడే! అయినా అంత సంయమనంతో వుండడం అందరిచేతా సాధ్యమయ్యే పనికాదు.

చంద్రశేఖరరావు కథాప్రయాణంలో ఆయనలా సాగడానికి అండగా నిలబడిన వ్యక్తులు, సంస్థలూ కూడా కారణమయ్యారు. అప్పటి ఆంధ్రజ్యోతి ఆదివారం సంపాదకుడైన ఆర్.ఎమ్. ఉమామహేశ్వరరావు యిటువంటి చాలామంది సంప్రదాయ విరుద్ధమైన (avant-garde) రచయితలకు ప్రోత్సాహమిచ్చారు. చంద్రశేఖరరావు కథల సంపుటాలకు గంగాధరం సాహితీకుటుంబం, ఆటా, అభ్యుదయ రచయితల సంఘం వంటి సంస్థలు అవార్డులిచ్చాయి. వీళ్లందరికంటే యెక్కువగా కథాసాహితి (సంపాదకులు: వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్) తొలినుంచీ చంద్రశేఖరరావు కథల్ని మంచి కథలుగా గుర్తించి తమ వార్షిక కథాసంకలనాల్లో ప్రచురించింది. కె. శివారెడ్డి, వేగుంట మోహన ప్రసాద్, బి. తిరుపతిరావు, సీతారాం వంటి మిత్రులు మెచ్చుకుంటూ వచ్చారు.

రచనల్లో యెంతో వేదన, బాధ, విషాదం నింపే రచయిత అయిన చంద్రశేఖరరావు వ్యక్తిగా మాత్రం చాలా సౌమ్యుడు. మనుషుల్ని ప్రేమగా పలకరించడం మాత్రమే తెలిసినవాడు. మాట్లాడినంతసేపూ ఆశావహంగానే వుండడమే ఆయన స్వభావం. తోటి రచయితలనూ వాళ్ళ రచనలనూ ప్రశంసిస్తున్నప్పుడు ఉత్ప్రేక్షనూ అత్యుక్తినీ వాడడంగూడా ఆయన స్వభావమే! ఆయన శైలిలో, వస్తువులో, వాతావరణ కల్పనలోగూడా యీ వుత్ప్రేక్షా అత్యుక్తీ వుంటాయి.

చంద్రశేఖరరావు పరిచయమైన చాలా సంవత్సరాల తర్వాతగానీ ఆయన దళితుడని తెలియలేదు. ఆయనలో వుండే మొహమాటానికీ దాపరికానికీ అదిగూడా కారణమేమోననిపించినా, దళితుడననే హోదాతో కావల్సిన అదనపు సౌకర్యాలూ గౌరవాలకోసం ప్రయత్నమైనా చేయనందుకు గౌరవం కలుగుతుంది. కమ్యూనిజంపైన ప్రగాఢమైన విశ్వాసం వుండడంతో ప్రస్తుత సమాజంలో దాని వైఫల్యాలను విశ్లేషించడానికి పూనుకున్నారు. దళితుడే అయినా, దళిత ఉద్యమాలను దళిత నాయకులు స్వార్థప్రయోజనాలకు వాడుకునే తీరును నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ కథలూ నవలలూ రాశారు. చంద్రశేఖరరావు జీవితంలో యిటువంటి సాహసాలు చాలా వున్నాయి.

దాదాపుగా యెనబై కథలూ, మూడు నవలలూ రాసిన డా. వి. చంద్రశేఖరరావు వొక ఫినామినన్. అటువంటి ఫినామినన్ వుండడమన్నది తెలుగు సాహిత్యానికి మాత్రమే దొరికిన అరుదైన గౌరవం.