చావు నవ్వు

సుబ్బారావుకి గుండె నెప్పి వచ్చింది, ఆసుపత్రిలో చేర్పించేరు. మూడురోజులు పోయాక డాక్టర్ చెప్పేడు, గుండెలో రెండు కవాటాలు చెడిపోయాయి, మరో రెండు రక్త నాళాలు దాదాపుగా మూసుకున్నట్టే. నాళాలకి రెండు స్టెంట్‌లు, కవాటాలు కొత్తవీ వేయాలి, అవి వేస్తే మరో పదేళ్ళు బతుకుతాడు. అన్నీ కలిపి తడిసి మోపెడయ్యే ఖర్చు ఉంది. లేకపోతే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు. డాక్టర్ చెప్పినవన్నీ సుబ్బారావు నలభై ఎనిమిదేళ్ళ భార్య, ఇరవై ఏళ్ళ కూతురు, పధ్నాలుగేళ్ళ కొడుకు, విన్నారు. ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఇన్స్యూరెన్స్ చాలామటుకు డబ్బులిచ్చినా ఇంకా జేబులోంచి బాగా చమురు వదుల్తుంది. అయినా సరే సుబ్బారావుకి వెంఠనే ఆపరేషన్ చేయమని డాక్టర్‌కు చెప్పేసేరు పిల్లలూ భార్యానూ. డబ్బులు పోతాయని మనిషిని వదులుకోలేం కదా?

ఆపరేషన్ అయిన నాలుగోనాడు ఇంకా హాస్పిటల్లో ఉండగానే మరోసారి గుండెల్లో నెప్పి వచ్చింది సుబ్బారావుకి. ఈ సారి రక్తంలో కట్టిన గడ్డ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పల్మోనరీ ఎంబోలిజమ్ వచ్చిందని కొత్త పేరు చెప్పేడు డాక్టరు; తాను సర్జరీ చేసినప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల రక్తం గడ్డ కట్టి, ఆ గడ్డ మెల్లిగా ఊపిరితిత్తుల్లోకి ప్రయాణించిందనే తప్పు నొక్కిపెట్టి. సర్జన్ గడ్డ బయటకి తీయడానికి ప్రయత్నం చేశానన్నాడు కానీ పరిస్థితి చేయి దాటిపోయిందనేది తెలుస్తూనే ఉంది. ఏదైతేనేం, ఇంక మహా అయితే రెండు రోజులు బతకొచ్చు. ఈ లోపుల స్పృహలోకొచ్చి మాట్లాడితే గొప్పే.

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, అనూహ్యంగా సుబ్బారావు రెండో రోజు కళ్ళుతెరిచి చుట్టూ చూసేడు. ఓ నర్సమ్మ, భార్య, కూతురు, కొడుకు కనిపించేరు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు కబురు పెడితే ఆయన వచ్చి చూసి కార్డియాలజీ సర్జన్ గారికి కబురంపేడు.


సుబ్బారావుకి అర్థమైంది- తన నోట్లోంచి ముక్కులోంచి గొట్టాలున్నాయి; అవి తీస్తే తప్ప మాట్లాడలేడు. వంటినిండా వైర్లూ వాటికి చివర్లో రకరకాల మెషీన్లూను. తన గుండె ఇంకా కొట్టుకుంటున్నట్టూ ఇ.సి.జి. స్క్రీన్ మీద ఓ చుక్క మెల్లిగా కదుల్తోంది. ఆ పక్కనే తనతో ఇరవైరెండేళ్ళు సంసారం చేసిన అర్ధాంగి. పెళ్ళిచూపుల్లో తానేమిటో, కాదో అన్నీ చెప్తే, ఒప్పుకుని తనని చేసుకున్న ఈవిడ పెళ్ళైనప్పటినుంచీ తనని సాధించని రోజు లేదు. కూరలు తరగడంలో సాయంచేసినా, వంటింట్లో అంట్లు తోమిపెట్టినా, బట్టలు వాషర్‌లో వేసి ఉతికిపెట్టినా ప్రతీదానిలో ఏదో ఒక వంక పెట్టి ఎత్తిపొడవని రోజు లేదు. గిన్నెలు కడిగినప్పుడు ఎక్కడో చిన్న చోట మరక ఉండిపోయింది. వాషర్‌లో సరిగ్గా సబ్బు వేయలేదు. ఈవిడ మేనమామ తమ్ముడి కొడుకు బావమరిది చదువుకి తాను డబ్బులిచ్చి సహాయం చేయలేదు. ఆవిడకి నచ్చినట్టు మాత్రమే తన జుట్టు కత్తిరించుకోవాలి. అడిగినవన్నీ కొనిపెట్టలేని తాను ఈవిడ దృష్టిలో ఓ చేతకాని దద్దమ్మ, అర్భకుడూను. పెళ్ళైన పదేళ్ళ తర్వాత తనతో మాట్లాడ్డానికి, తనకేసి చూడ్డానికీ కూడా ఈవిడకి ఎక్కడలేని విసుగూ అసహ్యమూను. ఇదేమిటని అడిగితే, ‘పెళ్ళయ్యాక మొగుడూ పెళ్ళాం ఆ మాత్రం మాటా మాటా అనుకోరా?’ అని సమాధానం. ఇప్పుడు మాత్రం తనకి ఇలా అయినందుకు హాస్పిటల్లో ఏడుస్తోంది. తనకి తెల్సున్నంతలో ఈవిడిక్కావాల్సింది తాను ముత్తయిదువగా సమాజంలో చలామణీ కావడం. ఈ ఏడుపు తాను పోతున్నందుకేనా లేకపోతే ప్రపంచం దృష్టిలో తనకి పసుపు కుంకాలు పోతున్నాయనా? తనలాంటి కొంతమందికి ఛస్తేనే విలువ పెరుగుతుంది, ఇన్స్యూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులవల్ల. ఆ డబ్బుల్తో బాగుపడుతుందిగా, ఇంకా ఏడుపెందుకో? ఈవిడ సాధింపు తనకి శాశ్వతంగా, హాయిగా వదలబోతోంది.

కూతురికేసి చూసిన సుబ్బారావుకి మొహంలో ఏ భావమూ లేని యువతి కనిపించింది. మెడిసిన్ లాంటిది చదివిద్దామని ఎంత ఆరాటపడ్డాడు తాను! ఎంత పోరి పోరి కష్టపడి చదివించినా, ‘నేను సైన్సు చదవన’ని మొత్తానికి పంతం నెగ్గించుకుని హిస్టరీలూ సోషియాలజీలు చదివింది. వాటిల్తో వచ్చే ఉద్యోగంతో వచ్చే జీతంతో ఎలా బతుకుతుందో? ఓ సారి ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బు, కష్టనష్టాలు తెలిశాక అప్పుడు తాను గుర్తొస్తాడేమో. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ! అప్పుడు చేసేదీ ఏమీ ఉండదు. దీని తలనొప్పి వదులుతోంది. హాయి, హాయి.

కొడుకు మొహంలోకి చూసేడు. వీడి పధ్నాలుగేళ్ళలో తాను ప్రతీరోజూ గొంతు చించుకుని అరిచాడు– సరిగ్గా చదువుకోవట్లేదని.రోజూ రాత్రి వీడిని కూర్చోపెట్టి స్కూల్ పుస్తకాలు చదివించకపోయి ఉంటే కనీసం తొమ్మిదో క్లాసులోకి వచ్చి ఉండేవాడా? కనడం తప్ప వీడి తల్లి వీడిని ఎప్పుడైనా సరిగ్గా చూసిందా? చేసే ఉద్యోగంలో రాత్రనకా పగలనకా ఫోనుమీద ఆవిణ్ణి పిలిస్తే, వీడికి తల్లీ తండ్రీ అయి చూసేడు తాను. ఏ ఒక్కరోజో ప్రశాంతంగా కూర్చుని ఓ పుస్తకమో, పేపరో చదువుకుందామనుకున్నా ఈ అయ్యవారు, నాన్నా ఇది కావాలి, ఇక్కడకెళ్దాం, అక్కడకెళ్దాం అని అనని రోజు లేదు. ఓ రోజు తనకి బాగా గుర్తు. వీడికి కొత్త బూట్లు కావాలంటే, ‘ఒరేయ్ కాస్త ఆగరా, నాకు ప్రాణం పోయేలాగ ఉంది,’ అన్నప్పుడు ఏమన్నాడు? ‘నీ ప్రాణం ఎలా పోయినా నాకు కొత్త బూట్లు కొనాల్సిందే ఈ రోజు!’ అనలేదూ. ఆ రోజునే చావొస్తే ఎంత బాగుండేదో. వాడి దారి ఎలా రాసిపెట్టి ఉందో? నేర్చుకుంటే బాగుపడతాడు. లేకుంటే పోతాడు. ఏమైతేనేం తనకి మరో బంధం వదుల్తోంది. మరింత హాయి.

వీళ్ళని ఉద్ధరిద్దామని తన భావాలు వాళ్ళమీద రుద్దబోయేడా ఇన్నాళ్ళూ? వీళ్ళు చేసేది తనకి నచ్చక, తాను చెప్పేది వీళ్ళకి నచ్చకా గుండెని పిండుకుంటూ నిరంతరం నలిగిపోయేడు. వాళ్ళకిష్టమైనది చేయడానికి ఒప్పుకుని ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోయేడు? ఇప్పుడన్నీ పనికిరాని ప్రశ్నలు. బుద్ధుడు చెప్పినట్టూ నీకు నువ్వే ఏమీ కానప్పుడు, ఎవరికెవరు? ఆ ఆలోచనకి నవ్వు వచ్చింది సుబ్బారావుకి. నీకు నువ్వే ఏమీ కానప్పుడు…


లోపలకి వచ్చిన కార్డియాలజిస్ట్ కాబోలు అడుగుతున్నాడు- “ఇప్పుడెలా ఉంది? ఛాతీ మీద కానీ ఎడమ చేతి మీద కానీ ఏవైనా నెప్పులున్నాయా? మీకు మెల్లిగా అంతా సర్దుకోవచ్చు.”

తెల్ల కోటు వేసుకుని దబ్బపండు రంగులో ఉన్న కార్డియాలజిస్టు సుబ్బారావు కళ్ళకి నల్లగా యమధర్మరాజులా కనిపించేడు. మెడిసిన్ పట్టా చేతికిచ్చేముందు ‘ఎప్పుడూ ప్రాణం కాపాడతా’నని ప్రమాణం చేసిన ఈయనేనా తనకి గుండెలో స్టెంటులూ కవాటాలూ అమర్చింది. మంచి సర్జన్ అయితే మరి తనకెందుకిలా అయింది? తన తప్పులు కప్పిపుచ్చుకుంటూ మెల్లిగా అంతా సర్దుకోవచ్చు అని ఎలా అనగలుగుతున్నాడు?

నవ్వు వస్తోంది సుబ్బారావుకి. కుళ్ళిపోయిన మనుషులనీ కుటుంబాన్నీ చూసి. మామూలు నవ్వు కాదు, ఆపుకోలేని నవ్వు. కడుపులో చిన్నగా మొదలైన నవ్వు పెద్దదౌతూ బయటకి తన్నుకొస్తూంటే, అన్ని దరిద్రాలూ వదిలిపోతున్నందుకు, ఋణాలన్నీ తీరిపోతున్నందుకు, కడుపు పగిలేలా హాయిగా సంతోషంగా నవ్వేడు సుబ్బారావు– కనీసం అలా అనుకున్నాడు. కడుపులో పుట్టిన నవ్వు డయాఫ్రమ్ మీదకి, ఆపైనున్న గుండె మీదకీ ఎగిరి పడింది. చిరునవ్వుతో పెదాలు మెల్లిగా విచ్చుకున్నాయి. అసలు తానెందుకు నవ్వాడో చెప్దామని నోరు విప్పబోయిన సుబ్బారావు ఆనందం తట్టుకోలేక ఉధృతంగా మరోసారి గుండె నెప్పి రావడంతో గుండె ఆగి చచ్చిపోయేడు. కార్డియాలజిస్టు ఏదో చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ ఇ.సి.జి. మెల్లిగా మూగబోయింది.


పరామర్శకొచ్చిన హితుల్తో, స్నేహితుల్తో, బంధువులతో కొడుకు, కూతురు, సుబ్బారావు వాళ్ళావిడా ఆయన ఎలా పోయాడో చెప్పుకున్నారు. ఎంతో సంతృప్తిగా మొహంమీద చెరగని చిరునవ్వుతో, కుటుంబం అంతా పక్కనే ఉన్నందుకు ఎంతో ఆనందంగా పోయాడని అనుకున్నారు. అసలే చీకూ చింతా లేని మనిషి అని, చాలాకాలం నెప్పి అనేదే తెలియని మనిషి అనీను చెప్పుకున్నారు. మోర్గ్‌లో పనిచేసే మనుషులు, కాటికాపరీ కూడా మొహం మీద చిరునవ్వుతో అంత సంతోషంగా పోయిన మనిషిని తాము ఈమధ్య కాలంలో చూడలేదని కితాబిచ్చేరు.

సుబ్బారావు చచ్చిపోయేటప్పుడు ఎందుకు నవ్వాడో మాత్రం ఎవరికీ తెలియలేదు.