పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం

ఆంధ్రవారపత్రిక, ఆంధ్రప్రభ వీక్లీ చండప్రచండంగా వెలిగి కొద్దికొద్దిగా వెలుగులు తగ్గుతున్నవేళ ఆంధ్రజ్యోతి వారపత్రిక వెలుగు చూసింది. 1960లో ఆంధ్రజ్యోతి దినపత్రిక, 1967లో వారపత్రిక నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో ప్రారంభమైనాయి. పేరు నార్లదే అయినా ఆంధ్రజ్యోతి వీక్లీ బరువుబాధ్యతలన్నీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ మీదే వుండేవి. 1967 ఉగాదినాడు ఆంధ్రజ్యోతి వీక్లీ ఆరంభమైంది. అందులో ‘ఆ రోజులు మళ్ళీ వస్తాయా’ అంటూ ఒక అత్తారింటి తీపి జ్ఞాపకాన్ని ఒబ్బిడిగా, ఒడుపుగా రాశారు పురాణం. అందరూ చదివి బావుందంటే బావుందన్నారు. ఇతర్లకి వడ్డించే విషయంలో పొగడ్తలను వృధా చెయ్యని నార్ల, ‘అతగాడి కథనంలో చదివించే గుణం వుంది. పోనీ, కంటిన్యూ చేయమనండి,’ అన్నారు ఎంతో వుదారంగా. మొదటి రెండు సంచికలను నండూరి రామమోహనరావు చూశారు. అప్పటికి నండూరి దినపత్రికలో సహాయ సంపాదకులుగా వున్నారు. నండూరికి ఆంధ్ర వార పత్రిక నడిపిన అపారమైన అనుభవం వుంది. మూడోవారంలో పురాణంకి పూర్తిగా పగ్గాలు అప్పగించారు. తొలి సంచికలో రాసిన జ్ఞాపకం యిచ్చిన వుత్సాహంతో వినూత్న వొరవడిలో ఫీచర్‌కి పురాణం శ్రీకారం చుట్టారు. ఆ శీర్షికే ‘ఇల్లాలి ముచ్చట్లు’. సొంత గొంతు పక్కనపెట్టి, ఇల్లాలి గొంతుని అనుకరిస్తూ యీ శీర్షికతో పాతికేళ్లపాటు తెలుగు పాఠకుల్ని అలరించారు. స్త్రీవాద ధోరణులు మంద్ర స్వరంలో మనకు వినిపిస్తాయి. మధ్యతరగతి మందహాసాలు, రకరకాల యీతిబాధలు, నిష్టూరాలు, చిన్నచిన్న ఆటవిడుపులు, ఆనందాలు… అన్నీ కలగలిపి నవరసభరితంగా సాగింది. ఇది తెలుగు జర్నలిజమ్‌లో సరికొత్త ప్రయోగం అన్నారు కొడవటిగంటి కుటుంబరావు. ‘ఇల్లాలి ముచ్చట్లు ములుకురాళ్ల చర్నాకోల; దాన్ని ఒకసారి ఝుళిపిస్తే అనేకచోట్ల గాయాలవుతాయి. గ్రాండ్ కాన్వాస్‌లో లాగా ఒక్క ధ్వనికి అనేక ప్రతిధ్వనులు వినిపిస్తాయి. ఇట్లా రాయడం తేలిక అని ఎవరన్నా భ్రమపడితే ప్రయత్నించి చూడవచ్చు’ — అని సవాలు కూడా విసిరారు కొ.కు. తెలుగు సాహిత్యంలో సాక్షి వ్యాసాలు చెప్పుకుంటారు. వసంత లేఖలు గురించి, రావూరి సత్యన్నారాయణ వడగండ్లు గురించి మాట్లాడుకుంటారు. లత ఊహాగానం మంచి ప్రయోగం అంటారు. ఇల్లాలి ముచ్చట్లు మాత్రం నిండుగా కురిసిన పండువెన్నెల. కనీసం వంద ముచ్చట్లయినా శాంపిల్‌గా చెబితే గాని ప్రాణం కొంతైనా కుదుటపడదు.

ఎగిరే పెళ్లాలు

అప్పట్లో ఎగిరే పళ్లాలు (ఫ్లయింగ్ సాసర్స్) పేరిట ఆసక్తికర వార్తలు తరచు పత్రికల్లో వస్తుండేవి. వెంటనే ‘ఎగిరే పెళ్లాలు’ శీర్షికన ఇల్లాలి ముచ్చట్లు కనిపించేవి. అలాగ వార్తల్లో వున్న వింతని వాడుకుంటూ కొన్నిసార్లు రక్తికట్టించేవారు. ఈ శీర్షిక రచయిత్రి పురాణం సీత తరచుగా ఇంగ్లిష్ పదాలు వాడుతుంది. సంస్కృతం కోట్ చేస్తుంది. బోలెడు నాటకం పద్యాలు సందర్భోచితంగా వుటంకిస్తుంది. ఒక్కోసారి ఏమీ తెలియనట్టు ‘ఐ డోంట్ నో’ అనేస్తుంది. ఆనాటి సగటు ఇల్లాలికి పురాణం సీత ప్రతీకగా నిలిచింది. కష్టసుఖాలు, డబ్బు యిబ్బందులు, అత్తగారి దాష్టీకాలు, శ్రీవారి మురిపాలు కలగలిసిన గడుసుతనపు అమాయకత్వాలు అన్నీ మోతాదులు మించకుండా వారం వారం తొంగి చూస్తుండేవి. ‘మంచంకింద మరచెంబు’ అని పేరెట్టి నాలుగైదు పేజీలు ఏకబిగిన చదివించేసి, చివరాఖర్న కళ్లు చెమరింపచేయడం ఆ మహానుభావుడికే చేతనవును. ఆ తరవాత ఎన్నో సంవత్సరాలకు శంకరాభరణంలో ప్రేమకథకి రాయబారం నడిపిన మరచెంబుని అన్నవరంలో చూసినపుడు తెగ మురిసిపోయాను. ‘హార్మణీ పెట్టెలో ప్రేమలేఖలు’ మరో మంచిముత్యం. ఒకనాటి ప్రేమలేఖలు హార్మణీ పెట్టె మడతలో వుండిపోతాయి. పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు. ఇక ప్రేమలేఖల ధ్యాస ఎందుకుంటుంది! పిల్లలు ఆటల వయసొచ్చాక, వాటిని అందరికీ పంచిపెడుతూ పోస్ట్‌మాన్ ఆట ఆడుకుంటారు!

పాలిటిక్సు, సినిమాలు, ఆటలు, చదువులు, ఆచార వ్యవహారాలు, ధరవరలు, ఏదైనా కావచ్చు- ఓ సామాన్య గృహిణిలా ఆలోచించి, ఆమెకు అనువైన భాషలోకి దించేవారు పురాణం. ఈ క్రమంలో అప్పటికే మరుగున పడిన సామెతలు, జాతీయాలు తళుక్కున మెరిసేవి. పూర్వకవుల కోటబుల్‌కోట్స్, జెండాపై కపిరాజు లాంటి నాటకం పద్యాలు, తొలినాళ్ల సినిమా పాటలు ఆ ముచ్చట్ల వాక్ప్రవాహంలో నందివర్ధనాల్లా ముద్దమందారాల్లా కొట్టుకొచ్చేవి. ప్రతి ఇంటి ముచ్చట ఒక గంగాతరంగం. ‘కన్నతల్లి-పట్టుచీర’, ‘రంగుల డేరా’, ‘నాన్నగారి శవం’, ‘వంటచెయ్యని రాత్రి’- వీటిని మణిపూసలుగా భావించి గుర్తుచేసుకోకుండా వుండలేను. పురాణం జీవితంలో కావల్సినంత విషాదం వుంది. తత్త్వచింతన వుంది. భావుకత వుంది. భాష మీద పట్టుంది. విడమరచి చెప్పగల విజ్ఞతతో పాటు కొంటెతనమూ వుంది. అంతకుముందు ఈ ఫీచర్ రాయడానికి వారంవారం ఎంత టైము తీసుకుంటారోనని రకరకాలుగా వూహించుకొనేవాణ్ణి. ఆ తర్వాత అదృష్టవశాత్తూ దగ్గరగా వారిని గమనించే అదృష్టం పట్టింది. కాదు, ఆయన చెబుతుంటే న్యూస్‌ప్రింట్ కాగితాలమీద రాసే భాగ్యం కలిగింది. వాయిదాలు వేస్తూ వేస్తూ చివరిదాకా నెట్టుకొచ్చేవారు. కంపోజింగ్ సెక్షన్ నించి ఫోర్‌మాన్ వినయంగా వచ్చి నిలబడి, ‘సార్! ఓవర్ టైం పెట్టాల్సి వస్తుంది…’ అంటేగాని డప్పు వేడెక్కేది కాదు. వెంటనే మొదలైపోయేది. పత్రికల్లో వాడే కట్‌వేస్ట్ పేపర్ పాడ్ మీద చెప్పింది గిలికేసి ఆ కాగితాలు నిమిషానికొకటి యిచ్చేసేవాణ్ణి. నాలుగైదు వాక్యాలు ఒక్కో కాగితంపై కదిలి వెళ్తుంటే అరగంటలో పూర్తయేది, అంత వేగంగానూ స్టిక్స్‌నీ గ్యాలీలనీ సమర్థించి తడిపొడి కాగితం మీద సింగిల్ కాలమ్ ప్రూఫ్ తీసిచ్చేవారు. చిన్నచిన్న సవరణలు చేసిస్తే ఆంధ్రజ్యోతి వీక్లీ పేజీల్లో ఆ శీర్షిక పొందిగ్గా అమరిపోయేది. జడల మీద, పూలజడల మీద పురాణానికి బలే మోజు. పూల బజార్ పేరుతో ఇల్లాలి ముచ్చట్లు ఒక చిన్న సంపుటి వచ్చింది.

ఇల్లాలి ముచ్చట్లు రాసేప్పుడు పురాణాన్ని ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఆవహించేవారు. జాషువా స్మశానవాటిక (అందరూ హరిశ్చంద్ర నాటకంలోవనే అనుకుంటారు) పద్యాలను తరచు ప్రస్తావించేవారు. విశ్వనాథ సరేసరి. కన్యాశుల్కం ఆయనకు పూర్తి బట్టీ. పాత ఇంగ్లిష్ ఆథర్స్‌ని కూడా పురాణం బాగా చదివారు. ఆయన సృజనశక్తి ఎక్కువభాగం ఇల్లాలి ముచ్చట్లతోనే ఆవిరైపోయింది. ఫర్వాలేదు. తగిన కీర్తిప్రతిష్టలు ఆ ముచ్చట్లలోనే లభించాయి.

ఇతర రచనలు

నీలి కథ పురాణానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి మిత్రుడు వున్నట్టుండి వుద్యమంలో చేరిపోయి మమ్మల్నందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. ఎమర్జన్సీ తీవ్రంగా భయపెడుతున్న రోజుల్లో ఆ మిత్రుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు మమ్మల్ని చూడవచ్చాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. పురాణం ఆ మిత్రుణ్ణి దృష్టిలో పెట్టుకుని శివకాంత కథ రాశారు. చాలా ఆర్ద్రంగా ఉంటుంది. అప్పుడే రాసిన ఉప్పు బస్తాలు కథ ఎకనమిక్స్ నిండిన గొప్ప కథ. ‘రాజనీతి’లో మంచి కథా వుంది, గొప్ప సత్యమూ వుంది. భోజనం, కుంకుడు చెట్టు, ఒంటరి బంగళా గుర్తుండిపోయే మంచి కథలు. పూర్తి హాస్యపు దినుసుతో రాసిన కథలూ కొన్ని వున్నాయ్. చంద్రుడికో నూలుపోగు కాకుండా మరో రెండు మూడు నవలలు రాశారు. అవి అంతగా రక్తి కట్టలేదు. సాహిత్య సమీక్షలు; పెన్ పోర్ట్రెయిట్స్, ముందుమాటలు వృత్తిరీత్యా పురాణం కోకొల్లలుగా రాశారు. అన్నింటా ఆయన స్వీయ ముద్ర ప్రస్ఫుటమయ్యేది.

పత్రికా సంపాదకునిగా పురాణం

పాప్యులర్ వీక్లీలో ఎలాంటి దినుసులు వుండాలో, దాని పాఠకులెవరో, ఎట్లావుంటే చదువుతారో పురాణానికి స్పష్టంగా తెలుసు. ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆయన సంపాదకత్వంలో సాహితీ విలువలను కూడా సంతరించుకుంది. ఆనాటి ఆంధ్రజ్యోతిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, నండూరి రామమోహనరావు కూర్చిన నరావతారం, విశ్వరూపం ధారావాహికలుగా వెలువడి పత్రిక స్థాయిని పెంచాయి. కొమ్మూరి వేణుగోపాలరావు, యద్దనపూడి, కోడూరి లాంటి లబ్ధప్రతిష్ఠుల సీరియల్స్ ఉండేవి. శంకరమంచి సత్యం అమరావతి కథలు వంద వారాలపాటు తెలుగు పాఠకులను విశేషంగా అలరించాయి. తెలుగు సాహిత్యంలోనే ఒక అద్భుతంగా ఆ ప్రయత్నం నిలిచిపోయింది. పురాణంకి అటు తూర్పు వైపు కొంచెం మొగ్గు వుండేది. కాదు, నిజానికి కాల్పనిక సాహిత్యం ఆ దిక్కున నూతన కాంతులీనింది. కాళీపట్నం, చాసో, రావిశాస్త్రి రచనలకు ముఖ్యవేదిక ఆంధ్రజ్యోతి అయింది. ఎమర్జన్సీ సమయంలో డిటెన్యూగా జైల్లో వున్న రావిశాస్త్రి అక్కడనించే రత్తాలు-రాంబాబు రాసి పంపేవారు. బీనాదేవికి పేరు తెచ్చిపెట్టింది కూడా ఆంధ్రజ్యోతే. కొత్తదనాన్ని పురాణం రిస్క్ వున్నా ఆహ్వానించేవారు. వడ్డెర చండీదాస్ హిమజ్వాల భారీ సీరియల్ అలాంటిదే. కాని, దాన్ని పాఠకులు బాగా స్వీకరించారు. చండీదాస్ జాఁ పాల్‌ సార్త్ర్ (Jean Paul Sartre) మీద అధ్యయనం చేసి డాక్టరేట్ తీసుకున్నారు. జటిలమైన అస్తిత్వవాద ప్రతిపాదనల్ని కాల్పనిక సాహిత్యంలో పొదగడంతో వడ్డెర కృతకృత్యులయారు. ఈ నవల కోసం రచయిత కల్పించుకున్న అనేక తెలుగు మాటలు చదువరులను పట్టుకున్నాయి. ఆ రోజుల్లో హిమజ్వాలను ప్రచురించడం నిజంగా సాహసమే. తర్వాత శేషేంద్ర కామోత్సవ్ నవల అప్రతిష్ఠని మూటకట్టింది. హద్దులుమీరిన రాతలతో అసహనానికి గురిచేసింది. ఆఖరికి సంపాదకుడు కోర్టుకెక్కాల్సివచ్చింది. పురాణం హయాంలో యమ్వీయల్ ‘యువ జ్యోతి’ శీర్షిక యువతని విశేషంగా ఆకర్షించింది. సరదా ప్రశ్నలకు జవాబులు, కొంచెం సినిమా ఫ్లేవరు, ఇంకొంచెం ఆధునిక కవిత్వ ధోరణులు కలగలిసి వీక్లీ సెంటర్‌స్ప్రెడ్‌గా యువజ్యోతి వచ్చేది. మినీ కవితలను విపరీతంగా భరించింది పురాణమే. ధరించింది ఆంధ్రజ్యోతే! దాన్నొక ఉద్యమంగా మలిచిన ఘనత ఆయనదే. అలాంటిదే ‘కొత్త కలాలు’ శీర్షిక. బోలెడుమంది బడ్డింగ్ రైటర్స్ వికసించి, కవులుగా ప్రసిద్ధులయ్యారు. ఇదంతా పురాణం పుణ్యమే.

ఒకప్పుడు (1951-61) ఆంధ్ర వారపత్రికలో వెలువడిన ‘తెలుగు వెలుగులు’ శీర్షిక స్ఫూర్తితో ఆంధ్రజ్యోతిలో ‘కొత్త కెరటాలు’ ప్రారంభించారు. అందులో వచ్చిన పెన్‌పోర్ట్రెయిట్స్‌లో సింహభాగం పురాణమే సమకూర్చారు. సులోచనారాణి గురించి నండూరి, శేఖర్ అనే పేరుతో రాశారు. అందులోనే హరిపురుషోత్తమరావు రహి పేరుతో ఆత్రేయను చిత్రిస్తూ- ‘రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడు’ అని తేల్చాడు. చెట్టు ఇస్మాయిల్, ఖాళీ సీసాలు స్మైల్, స్వగతంబు రాసిన తంబు, క్రిటిక్ కె.రామమోహన్‌ రాయ్ ఇత్యాదులు పురాణం ఆప్తవర్గంలోని వారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రేడియోకి వెళ్లేదాకా కొన్నాళ్లపాటు ఆంధ్రజ్యోతికి పురాణానికి సహాయకులుగా వున్నారు.

అప్పుడేమైందంటే…

1970 ఫిబ్రవరిలో మహాకవి శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భం. విశాఖపట్నంలో వుత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. అనేక అభిప్రాయాలు, అభిప్రాయభేదాలు వేదికల మీద, పక్కన, కింద పొడసూపాయి. ‘మేధావుల్లారా! మీరెటువైపు…’ అంటూ ప్రశ్నిస్తూ, నిగ్గదీస్తూ, నిలదీస్తూ ఓ కరపత్రం జనంలోకి వచ్చింది. దాన్ని సంకల్పించి కల్పించిన ఆకాశరామన్న మరెవరో కాదు, వెల్చేరు నారాయణరావని చెప్పుకున్నారు. అయితే కావచ్చు, కాకపోయినా కాపోవచ్చు. ఇంతకూ పర్యవసానం ఏమంటే- అరసం చిరిగిపోయింది. విరసం ఆవిర్భవించింది.

పాపం అరసీయులు తుమ్మల వెంకట్రామయ్య, రాంభట్ల, శ్రీశ్రీకి హైదరాబాదులో బ్రహ్మాండమైన సన్మానం నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో జరిపించాలని మహా సంకల్పం చేశారు. ఒక వర్గం శ్రీశ్రీ ఆ సర్కార్ సన్మానానికి వెళితే మైలపడిపోతాడని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పుడు అక్కడే ఉన్న పురాణం కూడా హైదరాబాద్ సన్మానం మంచిది కాదన్నారు. ‘చూశారా, పురాణంగారు కూడా వ్యతిరేకిస్తున్నారు!’ అంటూ శ్రీశ్రీని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయబోతే, శ్రీశ్రీ ఓసారి తీవ్రంగా కలయచూసి, ‘పురాణమిత్యేవ నసాధు సర్వమ్’ అన్నారు గంభీరంగా. పాత పురాణాన్ని అక్కడున్న పురాణంగా తీసుకుని తెలివిగా కౌంటర్ చేశారు శ్రీశ్రీ. పురాణం శాన్నాళ్లు విరసాన్ని విపరీతంగా అభిమానించాడు. అయినా ఆంధ్రజ్యోతి విరసం పత్రిక కాకుండా కాపాడాడు. క్రమంగా విరసం బరువుని తగ్గించుకుంటూ వచ్చాడు. పురాణంకి యిష్టాయిష్టాలు చాలా గాఢంగా వుండేవి. శ్రీశ్రీ షష్టిపూర్తినాటికి ఆంధ్రజ్యోతి చుక్కాని నార్ల చేతుల్లోనే వుంది. పురాణానికి స్వయంనిర్ణయాధికారం లేదు. అయితే వుత్సాహంగా శ్రీశ్రీపై రెండు ప్రత్యేక వ్యాసాలు అడిగి తెప్పించారు పురాణం. ఒకటి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి వ్యాసం, రెండోది పురిపండా అప్పలస్వామి వ్యాసం. పురాణం వెళ్లి నార్లని అడిగితే, ‘ఒక ఆర్టికల్ వెయ్యండి చాలు’ అన్నారు కరాఖండిగా. పురాణం రెండింటినీ ప్రచురించారు, కాకపోతే వరసగా రెండు సంచికల్లో. నార్ల పిలిచి, ‘ఏమిటిది, నే వద్దన్నా కదా?’ అన్నారు. ‘మీరు ఇష్యూకి ఒకటి వేయమన్నారని అపార్థం చేసుకున్నా… సారీ’ అని బయటపడ్డారు పురాణం.

మిరియాల కషాయం

ఏది వచ్చినా విపరీతమే పురాణానికి. మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ సాహిత్యం మీద పరిశోధన చేసి రాసిన థీసిస్‌ని బృహద్గ్రంథంగా అచ్చువేశాడు. అది ఆంధ్రజ్యోతి వీక్లీకి సమీక్షార్థం వచ్చింది. పురాణం చదివారు. ఆయనకు బొత్తిగా నచ్చలేదు. మహాప్రస్థానంలోనూ ఇతరత్రా రచనల్లోనూ శ్రీశ్రీ వాడిన అనేకానేక పదజాలానికి మిరియాల విపరీత భాష్యాలు చెప్పారు. ఆధ్యాత్మిక రామాయణం, అద్భుతరామాయణం లాంటి గ్రంథాల్లో ప్రతిమాటకీ తోచినవిధంగా స్వారస్యాలు పీకుతూ వుంటారు. అలాంటిదే ఈ థీసిస్‌లో జరిగిందని పురాణం అభియోగం. దానిపై సమీక్షని ‘శ్రీశ్రీకి మిరియాల కషాయం’ పేరుతో 7 వారాల పాటు సీరియల్‌గా వడ్డించారు పురాణం. సమీక్ష శీర్షిక ‘ఫిడేలు రాగాలు’. ఎప్పుడైనా మరీ అలుపు వస్తే నాకు పని చెప్పేవారు. సాహితీవేత్తలు మరీ ఇంత శిక్షా అన్నారుగాని సమీక్షలో చూపిన దోషాలను ఎవరూ కాదనలేదు. అసలు మిరియాల రామకృష్ణకి డాక్టరేట్ వచ్చిందని తెలియగానే— Dear Doctor Rama Krishna, Hearty Congratulations! – your patiently SriSri — అని ఓ కార్డుముక్క రాశారు శ్రీశ్రీ.

ఆంధ్రజ్యోతి తరువాత

ఉదయం దినపత్రిక పక్షాన ఉదయం వారపత్రిక కూడా ఆరంభమైంది. ఉదయం వీక్లీకి ఎడిటర్‌గా వచ్చారు పురాణం. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా ఆ పత్రిక చెప్పుకోతగిన ముద్ర వేసుకోలేకపోయింది. నన్నెవరూ గుర్తించడంలేదు, పట్టించుకోడంలేదనే భావన ఆయనలో ఎక్కువైంది. ఆ సమయంలోనే సినారె పూనికతో తెలుగు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. పురాణం చివరిదాకా రచనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా ఆయన స్పార్క్ మసకబారలేదు. చివర్లో మిసిమి పత్రిక వ్యవస్థాపకులు ఆలపాటి రవీంద్రనాథ్ ప్రోద్బలంతో మధురవాణితో ఇంటర్వ్యూలు అని ఒక సిరీస్‌ని రాశారు. అన్నీ మాక్ ఇంటర్వ్యూలు. త్రిపురనేని రామస్వామిచౌదరి, జాషువా, నార్ల లాంటి ప్రముఖులను మధురవాణితో మాట్లాడించి, ఆ శీర్షికని అద్భుతంగా పండించారు. పురాణం సహజసిద్ధమైన శైలి, మధురవాణి పాత్రపై ఆయనకున్న పట్టు విజయానికి తోడ్పడ్డాయి.

అంతకుముందు ఒకసారి కలిసినపుడు “హైదరాబాదు జర్నలిస్టు కాలనీలో (ఇప్పుడది అపోలో హాస్పిటల్ దగ్గర వుంది) చిన్న ఇల్లు కట్టుకున్నాను. దానికి ‘సీతమ్మ గడప’ అని పేరుపెట్టుకున్నాను. బావుందా?” అని అడిగారు. “చాలా బావుంది. మొత్తానికి విశాఖ వాసన వుంది. గడపలు, వలసలు అక్కడివే కదా…” అన్నాను. ఆనందించారు. కాని పాపం ఆ ఇల్లు నిలుపుకోలేకపోయారు. ఆ ఇల్లాలికి ఏమీ మిగల్చకపోయినా ‘పురాణం సీత’ పేరు మాత్రం సుస్థిరంగా మిగిల్చివెళ్లారు.

చలం సాహిత్యాన్ని జీవితాన్ని మథించి, గొప్ప పుస్తకం రాయాలని సంకల్పించారు పురాణం. న్యూ స్టూడెంట్ బుక్‌ సెంటర్ బాబ్జీ ప్రచురణ బాధ్యతని నెత్తికెత్తుకున్నారు. అది ఎంతకీ తెమల్లేదు. బోలెడు ఆర్భాటం చేశారు. తెలుగు వెలుగు చలం పుస్తకం దిండులా తేలిందిగాని పేరు మాత్రం తేలేదు. పురాణం కొంచెం రాస్తే పేల్తుందిగాని పేజీలకు పేజీలు రాస్తే పేలదని కొందరనుభవశాలురు నిర్ధారించారు.

విజయవాడ రేడియో కోసం మంచిమంచి నాటికలు రాశారు. వాటిలో మూడంతస్థుల మేడ, సైకిల్ అప్పారావ్, సీతాపతి సంసారం సీరియల్‌లో కొన్ని భాగాలు చెప్పుకో తగినవి. అనడం, అనిపించుకోడం పురాణానికి సరదా. మంచి స్నేహశీలి. ఎందరో ఆయనని అభిమానించారు. ఇప్పటికీ ఇల్లాలి ముచ్చట్లని యిష్టపడతారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పి.యెస్. అని కూడా రాసేవారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యని క్యాడర్ అంతా పి.యెస్. అని వ్యవహరించేవారు. ఆ సంగతి పురాణానికి తెలుసు.

పురాణం శకం 1929-1996.