రవిశంకర్ కవిత్వంలో నేను – పుస్తక పరిచయం

వచన కవిత్వం అందరికీ అర్థం కాదు.

వచనేతర కవిత్వం మాత్రం అందరికీ అర్థం ఔతుందా?

ఒక తేడా వుంది, ముఖ్యంగా సంప్రదాయ కవిత్వంతో పోలిస్తే. సంప్రదాయ పద్య కవిత్వం విషయంలో– నిఘంటువుల సాయంతో ప్రతిపదార్థము, కవిసమయాల గురించిన అవగాహనతో తాత్పర్యము, ఎలాగో తిప్పలు పడి తెలుసుకోవచ్చు. అంతటితో ‘కవిహృదయం’ అర్థమైపోతుందని కాదు గాని పద్యభావం కొంతవరకైనా గోచరిస్తుంది.

భావకవిత్వం, దాని తర్వాత వచ్చిన ఇతర కవితాప్రక్రియలు పాఠకుడి paradigmని తల్లకిందులు చేసినయ్. వీటిలో పదాలకి అర్థాలు తెలిస్తే పద్యం అర్థం తెలిసే అవకాశం చాలా తక్కువ. కవిసమయాలకి counterparts ఇక్కడ ఉండవు; ఏ కవికి ఆ కవి తన కవిసమయాల్ని తనే తయారు చేసుకుంటారు కనుక.

కవితాస్వాదనలో కవీ పాఠకుడూ ప్రధాన పాత్రలని ఎప్పట్నుంచో తెలిసిన విషయమే. ఐతే ఈ కొత్త కవితామార్గంలో కవి, పాఠకుల మధ్య సంబంధం చాలా దగ్గరిది. ఒకానొక కవికి, ఆమె భావాల్ని అందిపుచ్చుకుని సహానుభూతి పొందగలిగే పాఠకులే నిజమైన పాఠకులు. వాళ్లే ఆమె కవిత్వాన్ని లోతుగా అర్థం చేసుకోగలరు. అలా సహానుభూతి పొందలేనివారు ఎంత ఉద్దండపండితులైతే అంతగా నీళ్లు నమలక తప్పదు.

భావకవిత్వపు రోజుల్లో కవులే పనిగట్టుకుని ఊరూరా తిరిగి వారి కవిత్వాన్ని ఎలా చదువుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో పాఠకులకి బోధించుకున్నారు. శ్రీశ్రీ మహాప్రస్థానానికి చెలం ముందుగా వ్యాఖ్యానం రాయాల్సొచ్చింది. ఆరుద్ర త్వమేవాహం అర్థం కాక పాఠకలోకం దిక్కులు చూస్తుంటే శ్రీశ్రీ, దాశరథి దాన్నెలా చదవాలో అర్థం చేసుకోవాలో వివరించాల్సొచ్చింది. దిగంబర కవులు, ఇంకా ఎందరో వారి తర్వాత వచ్చినవారు వారి పద్యాలకి వారే అర్థాలు వివరించుకుంటూ వ్యాసాలు రాసుకోవలసొచ్చింది. వెల్చేరు నారాయణరావుగారు తన తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అన్న గ్రంథంలో ఒక్కో కాలపు కవితల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో వ్యాఖ్యానించాల్సొచ్చింది.

ఆ తర్వాత కవుల కవితా సంకలనాలకి ఇతర కవులు ముందుమాటలో చివరిమాటలో రాసి అందులో ఏముందో దాన్ని ఎలా చదవాలో అర్థం చేసుకోవాలో వివరించటానికి ప్రయత్నించారు. ఇలాటి ప్రయత్నాలు చాలా ‘అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్టు’ జరగటం ఈ కవిత్వాన్ని అర్థం చేసుకోవటంలో వున్న క్లిష్టతని సూచిస్తుంది. చేరా వచనకవితా వ్యాఖ్యాతగా పెద్ద పేరే తెచ్చుకున్నారు. ఐతే ఆయనైనా చాలావరకు పైపైన స్పృశించారే తప్ప లోతుగా చూసిన సందర్భాలు తక్కువ. కాకుంటే చేరాతల వల్ల కొంతమంది కవులకి మంచి గుర్తింపు వచ్చినమాట వాస్తవం.

రవిశంకర్ లక్ష్యం అది కాదు.

విన్నకోట రవిశంకర్ ఈమాటకి చిరపరిచితులు. కవిగా కవితలల్లటమే కాకుండా ఇతర కవుల కవిత్వాన్ని గురించి లోచూపుతో రాసిన వ్యాసాలు కూడ ఈమాటలో చాలానే వచ్చాయి. వాటిలో చాలాభాగం, ఇంకా ఇతర వాహికల్లో ప్రచురించిన అనేక వ్యాసాలు కలిపి ఇప్పుడు ఓ పుస్తకంగా ప్రచురించారు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు. అదే ఈ కవిత్వంలో నేను. ఈ ఫౌండేషన్ వారి ఇదివరకటి చాలా ప్రచురణలు అచ్చుతప్పుల తడకలుగా వుండేవి. అదృష్టవశాత్తు ఈ సంకలనానికి ఆ వారసత్వం వర్తించలేదు. బహుశా చాలా భాగం ఇదివరకే ప్రచురించబడటం దీనికో కారణం కావొచ్చు. ఏమైనా, ఇది భవిష్యత్తుకి శుభసూచకం ఔతుందని ఆకాంక్ష.

ఓ పుస్తకానికి ముందుమాట రాస్తే సాధారణంగా అది అందులోని కవితల గురించే ఐవుంటుంది. పైగా మొహమోటం కొద్దో, మరే కారణాల వల్లనో, ముందుమాటలు కవిని పొగుడ్తూ రాసేవో, లేక ఆ రాసేవారు కవి కన్నా తను ఎంతో ఎత్తులో వున్నాననుకుంటే తన గురించి పొగుడుకునేవో అయుంటాయి తప్ప నిష్పాక్షికంగా లోతుపాతుల్ని చర్చించటం చాలా అరుదు. రవిశంకర్ అలా కాకుండా ఒక టాపిక్ తీసుకుని దాని గురించి అనేకమంది కవులు ఎలా వ్యక్తీకరించారో చూస్తూ వారి వారి భావాల్ని తులాధ్యయనం చెయ్యటం వల్ల పాఠకులకి చాలా విస్తృతమైన ప్రయోజనం చేకూరుతుంది. ఒకేచోట ఎందరో కవుల భావవ్యక్తీకరణల్ని గుర్తించటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకోవటానికి ఇది బాగా పనికొస్తుందని నా నమ్మకం.

వృత్తిపరంగా ఇంజనీర్ ఐన రవిశంకర్, ఎంచుకున్న వస్తువుల్ని నిశితంగా పరిశీలించి వివిధ కవుల కవిత్వాల్ని (చాలావరకు) నిర్మొహమాటంగా నిర్మాణాత్మకంగా వివరించటానికి నిజాయితీ ప్రయత్నం చేశారీ వ్యాసాల్లో. ఏ వ్యాసానికి ఆ వ్యాసం చదవటం వేరు, అన్నిటిని ఒకేచోట చదవటం వేరు. ఇలా ఇన్ని వ్యాసాలు ఒకచోట వుండటం వీటి లోతుని ఇంకా పెంచుతుంది, రవిశంకర్ ఆలోచనల్లో పరిణామక్రమాన్ని కూడ ప్రతిబింబిస్తుంది.

ప్రస్తుత తెలుగు కవిత్వవిమర్శకులలో చాలామంది స్వయంప్రకటిత తారలు. వారెంత గొప్పవారో చూపటానికి ఏ రష్యన్ కవుల్నో లాటిన్ అమెరికన్ కవుల్నో పట్టుకొచ్చి వాళ్ల కవిత్వం గురించి ఎక్కడో ఎవరో అన్న మాటల్ని తెలుగులోకి తర్జుమా చేసి అవి తమ సొంత అభిప్రాయాలుగా ప్రకటించుకోవటం, ఆ కవుల్తో వర్ధమాన తెలుగు కవుల్ని పోలుస్తూ వీళ్ల మీద వాళ్ల ప్రభావం బలంగా కనపడుతున్నదనో వీళ్లు వాళ్లని మించిపోయారనో కితాబులివ్వటం చేస్తుంటారు. రవిశంకర్ అలా కాదు. కవిగా తను ఇతరుల కవిత్వానికి పొందే స్పందనని ఎలాటి భేషజాలు లేకుండా, గొప్పలకి పోకుండా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. కవులెంత పేరున్నవారైనా, లేనివారైనా వాళ్ల కవిత్వంలో తనకి నచ్చిన విషయాల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాడు. ఎక్కడన్నా తనకి నచ్చని విషయాలున్నా సున్నితంగా, మెత్తగా ఆ విషయం చెప్తాడు తప్ప ఆవేశపడిపోయి అధికప్రసంగం చెయ్యడు. ఉదాహరణకి, ‘కవిత్వానికి ప్రేరణ’ అనే ఒక చక్కటి వ్యాసంలో కొప్పర్తి కవితాసంకలనం విషాద మోహనంలో Nightmare అనే కవితని మెచ్చుకుంటూ వెంటనే దాన్లోనే వున్న మరోకవిత కవి రాయవలసింది కాదు అంటూ ‘కవి తనకు ఎదురైన ప్రతి సంఘటనకి స్పందించి కవిత్వం రాయడం కూడ అభిలషణీయం కాదు,’ అంటాడు. ఇంతకన్నా అండర్ స్టేట్‌మెంట్ మరొకటుంటుందా? ఈ వ్యాసంలో ఎన్నో ఉదాహరణలు చూపుతూ ఎలాటి ప్రేరణలు ఆర్ద్ర కవితలకి, ఎలాటివి లోతులేని వాటికి దారితీస్తాయో చక్కగా విశ్లేషించాడు. ఈ సంకలనంలో ఉన్న వ్యాసాల్లో నాకు బాగా నచ్చిన వాటిలో ఇదొకటి.

అలాగే కవిత్వంలో “నేను” అన్న వ్యాసం కూడ లోతైనది. ‘నేను’ దృక్పథం నుంచి సాగే కవితల్లో ఆ ‘నేను’ ఏయే పరిస్థితుల్లో ఎవరి వేషం వేసుకుంటుందో ఉదాహరణలిస్తూ విశదీకరిస్తుందీ వ్యాసం. అలా ‘నేను’గా ఒక వస్తువునో, వ్యక్తినో, సమూహాన్నో చిత్రిస్తున్నప్పుడు ఏయే సందర్భాల్లో ఆ ప్రయోగాలు విజయవంతమౌతాయో ఎప్పుడు కాకపోవచ్చునో లోతుగా ఆలోచించి వివరించటం ఈ వ్యాసం ప్రత్యేకత.

ఈ సంకలనంలో అనేక పార్శ్వాలున్నయ్. తన వ్యక్తిగత విషయాల గురించి, ఉదాహరణకి ఇస్మాయిల్‌తో తన పరిచయం, తన బాల్యం, ఇలాటి అంశాల్ని స్పృశించిన వ్యాసాలున్నయ్. సినిమా పాటల గురించి విశ్లేషించిన వ్యాసాలున్నయ్. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు అన్న కొంత దీర్ఘమైన వ్యాసంలో ఎన్నో విశేషాల్ని ఒకచోట కూర్చటం జరిగింది. ఇది బహుశా చాలామందికి ఉబుసుపోక టాపిక్, ఈ అంశం మీద దాదాపు అందరికీ కొన్ని అభిప్రాయాలుంటయ్. ఐనా చర్వితచర్వణంలా అనిపించకుండా అనేక పార్శ్వాల్ని స్పృశిస్తూ చక్కగా సూటిగా వివరించిన ఈ వ్యాసం కూడా అందరూ చదవదగ్గది.

ఈ సంకలనంలో మొదటిమూడు వ్యాసాలు కూడ ఆలోచనాత్మకాలు, మామూలుగా ఆలోచించని దారుల్లో నడిచేవి. మొదటిది ప్రతీకగా శరీరం. అన్నమయ్య నుంచి ఆధునికుల దాకా శరీరభాగాల్తో ఒక ఉన్నతమైన అంశాన్ని కవులెలా చిత్రించారో వివరిస్తుంది. రెండవది కళలు ప్రేరేపించే సృజన. ఇది సంగీతం, చిత్రలేఖనం లాటి కళలు కవిని ఎలా తట్టిలేపుతాయో విశ్లేషిస్తుంది. చీకటి చిత్రాల మీద కాంతి కిరణం మూడోది, వీటన్నిట్లో లోతైనది. ‘కవిత్వం చేసే ఒకపని ఎదురుగా ఉన్నా సామాన్యులకి కనిపించని వస్తువులు, విషయాల మీద కాంతిని ప్రసరింపజేసి అందరికీ కనిపించేట్టు చెయ్యటం’ అనే ప్రతిపాదన ఈ వ్యాసానికి మూలం. చక్కటి ఉదాహరణలు కూడ ఉన్నయ్. ఇదొక ఆలోచించదగ్గ ప్రతిపాదన. బహుశా ఇంకా లోతుగా పరిశీలించి విస్తరించాల్సిన ప్రతిపాదన. ఒక విధంగా చూస్తే ఇది మంచికవిత్వానికి నిర్వచనంగా కూడ అనుకోవచ్చు. మనకి కనిపించేదాన్ని మనం చూడని విధంగా చూడగలగటం మంచికవికి సాధ్యమౌతుంది. అలాగే మనకి కనిపించని దాన్ని చూపించటం కూడ.

ముందే చెప్పినట్టు ఈ సంకలంలో ఉన్న చాలా వ్యాసాలు ఇదివరకు ఈమాటలో వచ్చినవే. కనక తొలిసారిగా వీటిని చదవాలనుకున్నవారికి, ఇదివరకు చదివినా మళ్లీ మరోసారి చూడాలనిపించినవారికి అందుబాట్లో ఉన్నయ్.

నాదొక సూచన – ఎలాగూ ఇందులోని వ్యాసాలన్నీ ఆన్‌లైన్‌లోనే వున్నాయి కనుక ఇదే వరసలో ఒక వెబ్‌పేజ్‌లో వుంచితే ఈ పుస్తకం అందరికీ తేలిగ్గా అందుబాట్లోకి వస్తుంది.

పుస్తకరూపంలో కావలసిన వారు వంగూరి ఫౌండేషన్ వారిని సంప్రదించొచ్చు. ఇండియాలో కాపీలకు జె.వి. పబ్లిషర్స్‌ కాని నవోదయ బుక్‌హౌస్ వారిని సంప్రదించండి.

రవిశంకర్ నుంచి కవితల్తో పాటు ఇంకా ఇలాటి లోతైన వ్యాసాలు కూడ ఎన్నో రావాలని నా అకాంక్ష, వస్తాయని ఆశ.