శవం

మొదట్లో బాగుండేది. ముద్దుముద్దుగా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పూలు చూపించీ, వాటిమీద వాలే సీతాకోకచిలుకలు చూపించీ. మబ్బులు చూపించీ, తొంగి చూసే చంద్రుణ్ని చూపించీ. ఉలిక్కిపడేలా చన్నీళ్లు చల్లీ, ఉత్తినే భయపెట్టీ. ఒడిలో కూచోబెట్టుకునీ పడుకోబెట్టుకునీ గోరుముద్దలు తినిపించీ. చక్కిలిగింతలు పెట్టి నవ్విస్తూ. ఏవేవో పాటలు పాడీ. నవ్వుల కాంతులు చుట్టూ వెల్లివిరిసేవి.

ఎప్పుడు మారిపోయారో తెలియదు వాళ్లకి. ముందు పట్టించుకునేవాళ్ళు కాదు. గదిలో పడేసి తలుపేసే వాళ్లు తిండేమీ పెట్టకుండా. మొట్టికాయలు మొట్టేవారు. చెంపదెబ్బలు. తర్వాత తన్నులు. దేనిమీద కసో చూపిస్తూ కోపమంతా తీరేదాకా. కత్తులతో గాయాలూ, నెత్తురూ. చివరికి చచ్చేట్టు. ఆ సంగతీ గమనించలేదు వాళ్ళు కంపు కొట్టిందాకా. తెలిశాక బయటెక్కడో పడేశారు.

జనాలంతా చుట్టూ గుమిగూడారు. గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉంది శవం. చివరికి ఎవరో అరిచారు. “ఇది ప్రేమ కదా!” అని. మరు నిమిషంలో అందరూ అక్కడ్నుంచి జారుకున్నారు ఇంకో మాట కూడా లేకుండా. కొందరు నవ్వుకుంటూను.

రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...