సార్థకనామ వృత్తములు – 1

పరిచయము

పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో అనే ప్రశ్న నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తాలలో ప్రతి వృత్తమునకు దాని గురులఘువుల నిర్ణయానుసారము ఒక వృత్త సంఖ్య ఉంటుంది. వృత్తపు ఛందస్సు సంఖ్య (అనగా పాదములోని అక్షరాల సంఖ్య), వృత్త సంఖ్య ఉంటే దాని గణస్వరూపమును తెలిసికొన వీలగును. యత్యక్షరములు వృత్తపు లయను బట్టి, విఱుపు బట్టి ఉంటాయి. వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా?

య, మ, త, ర, జ, భ, న, స, హ, వ, ల, గ అనే గణములతో పేరును బెట్టవచ్చును. అక్షరములోని హల్లు, గణాన్ని తెలుపుతుంది. అచ్చు ఆ గణము ఎన్నిమార్లు ఆవృత్తి అవ్వాలన్న విషయము తెలుపుతుంది (అ-కారమునకు ఒకటి, ఆ-కారమునకు రెండు, ఇ-కారమునకు మూడు, ఇలా). మిగిలిన అక్షరాలను నిరాకరించవచ్చును, ఒత్తునకు ఒకే గణము. అనుస్వారమును నిరాకరించుటయా లేదా అనే విషయమును గుఱించి ఆలోచించాలి. ఉదాహరణముగా భారతికి భ/భ/ర/త/త/త, సరస్వతికి స/ర/స/వ/త/త/త, రాత్రికి ర/ర/త/త/త/ర, హరికి హ/ర/ర/ర. ఒత్తులను తెలుగు రీత్యా అనుసరిస్తాను నేను. రాత్రిని మనము రా వ్రాసి తి వ్రాసి క్రింద ర ఒత్తును వ్రాస్తాము. కాబట్టి రాత్రి వృత్తమునకు రెండు ర-గణములు, మూడు త-గణములు, ఒక ర-గణము. నాగరి లిపిలో ఇలా ఉండదు. స్తుతి అని వ్రాసినప్పుడు అక్కడ తు-కారమునకు ప్రాధాన్యతన్యం (स्तुति). అనుస్వారము ఒక shorthand పద్ధతి. మంత్ర, రంభ రెండింటిలో అనుస్వారము ఉన్నా, నిజముగా అవి మన్త్ర, రమ్భ. ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను. ఒక్కొక్క వృత్తములో ఒక ఉదాహరణమును మాత్రమే ఇస్తున్నాను. ఈ వృత్తములకు పేరులు ఛందశ్శాస్త్రములో ఉన్నప్పుడు వాటిని కుండలీకరణములలో తెలిపినాను.

1) హలి (క్షుత్) – [హ/ల/ల/ల] భ/లల UI III
5 సుప్రతిష్ఠ 31

నీలవసన
బాలక పశు-
పాలక పరి-
పాలక హలి

2) రమ (నీలతోయా, మాలినీ, కరేణు) – ర/మ UI UU UU
6 గాయత్రి 3

యోగమాతా వేదీ
రాగరత్నాంభోధీ
వేగ రమ్మోయమ్మా
భోగభాగ్యా లిమ్మా

3) లాలస (సరి) – [ల/ల/ల/స] న/స III IIU
6 గాయత్రి 32

పొగల గదిలో
రగులు మదిలో
మిగులు తలఁపా
వగల వలపా

4) నర (గిరా, మణిరుచి, శఫరికా, నిరసికా, నరమనోరమా) – న/ర III UIU
6 గాయత్రి 24

సరసభారతీ
స్వరలయాకృతీ
సరసభాషిణీ
స్వరసుభూషిణీ

5) తరఁగ (భీమార్జనము} – త/ర/గ UUI UI UU
7 ఉష్ణిక్కు 21

కాయమ్ము నీకె యిత్తున్
శ్రీయంచు నిన్నె దల్తున్
ధ్యేయమ్ము జూపఁగా రా
నా యంతరంగమా రా

6) భర్గ (హోడపదా) – భ/ర/గ UII UI UU
7 ఉష్ణిక్కు 23

భర్గుని చూడ రండీ
దుర్గకు భర్త యండీ
స్వర్గపు ద్వార మండీ
మార్గము చూపు నండీ

7) మలయ (మదలేఖా) – [మ/ల/య] మ/స/గ UUU IIUU
7 ఉష్ణిక్కు 25

చూసేవో మలయాద్రీ
నా సీతన్ బరిపూతన్
హా సీతా పవనమ్ముల్
మోసేనో వ్యధ శ్వాసల్

8) లలిత (అను) – [ల/ల/ల/ల/త] న/య/ల IIII UUI
7 ఉష్ణిక్కు 80

లలితము నీ వాక్కు
లలితము నీ ఋక్కు
లలితము నీ గీతి
లలితము నీ ప్రీతి

9) నగజ (మణిముఖీ) – [న/గ/జ] న/ర/ల III UI UI
7 ఉష్ణిక్కు 88

జగము బ్రోచు తల్లి
సుగుణ కల్పవల్లి
మొగము జూప రావ
నగజ నన్ను గావ

10) భవ్య (కృష్ణగతి) – [భ/వ/య] భ/జ/గగ UIII UI UU
8 అనుష్టుప్పు 47

అంబరము కెంపు లయ్యెన్
సంబరము లింపు లయ్యెన్
రెంబలకుఁ బూలు తోఁచెన్
గంబురపు గాలి వీచెన్

11) రామ – ర/ర/మ UIU UIU UUU
9 బృహతి 19

నామ మంత్రాలె – నా పుష్పమ్ముల్
శ్యామ జీవించ – సందీప్తమ్మై
ప్రేమతో రమ్ము – ప్రేమాధారా
రామ నా జీవ – రాజీవమ్మై

12) నర్మ – న/ర/మ IIIUI UU UU
9 బృహతి 24

పరుస మేల నాపై నీకున్
సరస మొల్కు నర్మాలాపం
బరుస మీయుఁ గాదా నాకున్
గరము లిచ్చి కావన్ రావా

13) రవి (కామినీ, భావినీ, తరంగవతీ) – [ర/వ/వ/వ] ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

జ్యోతి నీవె భూతలమ్ముపై
భాతి నిచ్చు భాస్కరా రవీ
హేతువీవె సృష్టికిన్ సదా
చేతనమ్ము జీవితమ్ములో

14) భర్త – భ/ర/త UII UI – UU UI
9 బృహతి 279

నెయ్యపు భర్త – నీవే గాదె
ఇయ్యది ప్రేమ – యెప్డున్ నీదె
ఉయ్యెల లూఁగె – నూహల్ నేఁడు
తియ్యగఁ బారె – దేనెల్ జూడు

15) మల్లియ – [మ/ల/ల/ల/ల/య] మ/న/స/గ UU UII – III UU
10 పంక్తి 249

పూచెన్ మల్లియ – పులక లివ్వన్
వీచెన్ గాలులు – విరుల నూపన్
దోఁచెన్ నా హృదిఁ – దొగరు టాశల్
వేచెన్ గన్నులు – విమలుఁ జూడన్

16) భవహర – [భ/వ/హ/ర] భ/య/జ/గ UIII UUI UIU
10 పంక్తి 335

చంద్రధర – చంద్రాగ్నిలోచనా
సాంద్ర హిమ-శైలాగ్ర కేతనా
యింద్ర హరి – బృందారకస్తుతా
మంద్రరవ – మాధుర్య నందితా

17) హరి – [హ/ర/ర/ర] ర/య/య/లగ UI UIU – UIU UIU
11 త్రిష్టుప్పు 587

ఎందుకో హరీ – యిప్పుడే చిత్త మా-
నంద మాయెరా – నాకు నీ యోచనల్
ముందు నిల్వరా – మోహనా తృప్తితో
డెంద మూగురా – డింగు నా దుఃఖముల్

18) హీర (తాల (ళ), శ్యేని. సేనికా, శ్రేణి, నిఃశ్రేణికా) – [హ/హ/హ/హ/ర] ర/జ/ర/లగ
UI UI UI – UI UIU
11 త్రిష్టుప్పు 683

హీర మేల నాకు – హేమ మేల నీ-
హార మేల పుష్ప – హార మేల నా
తార లేల మేళ-తాళ మేల నన్
జేర వేల నాదు – శ్రీలు నీవెగా

19) మాయా (వైశ్వదేవీ, చంద్రకాంతా, చంద్రలేఖా ) – మ/మ/య/య UUUUU – UIU UIUU
12 జగతి 577

ఆనందమ్మై రా – హారిణీ దివ్యదీపా
నేనే నీవై రా – నిత్య పీయూష రూపా
పాణిగ్రాహీ రా – పాహి మాయావిలాసా
ప్రాణమ్మై రావా – వైశ్వదేవీ సుహాసా

దీనినే ఇప్పుడు శాలినీవృత్తముగా వ్రాద్దామా?

శాలిని – మ/త/త/గగ
11 త్రిష్టుప్ 289

ఆనందమ్మై – హారిణీ దివ్యదీపా
నేనే నీవై – నిత్య పీయూష రూపా
పాణిగ్రాహీ – పాహి మాయావిలాసా
ప్రాణమ్మై రా – వైశ్వదేవీ సుహాసా

20) నవరాగ – [న/వ/ర/ర/గ] న/య/య/య IIII UUI – UUI UU
12 జగతి 592

అట నవరాగమ్ము – లాకాశవీధిన్
స్ఫుట నవరాగంపు – సొంపుల్ వినంగా
నటనల జాలించి – నన్ జూడ ర మ్మో
చటుల కురంగాంశ – జాలమ్ము లేలా

21) భార్య (వలభీ) – భ/భ/ర/య UII UII – UIU IUU
12 జగతి 695

భారము గాముర – భర్తలార మీకున్
భారతి పార్వతి – వాణి మాకు దల్లుల్
వారలు గాతురు – ప్రాణ మిచ్చి స్త్రీలన్
వారసు లీ ధర – వారి కెల్ల మేమే

22) విజయ – [వ/వ/వ/జ/య] జ/ర/జ/య IUI UIU – IUI IUU
12 జగతి 854

ప్రభాత మాయెగా – ప్రకాశముతోడన్
నభమ్ము నిండెగా – నవారుణ కాంతిన్
శుభమ్ము కల్గుగా – శుభోదయ వేళన్
ప్రభూ నమస్సులన్ – బ్రమోదము నిత్తున్

23) తావి (ఇంద్రవంశా, వీరాసికా) – [త/త/వ/వ/వ] త/త/జ/ర UUI UU – IIUI UIU
12 జగతి 1381

మాణిక్యవీణన్ – మఱి నేను మీటనా
గానంపు తావిన్ – గడు రక్తి జల్లనా
తానమ్ము లెన్నో – దనరార జూపనా
తానాన తానా – తనతాన తాననా

24) స్వాగత – [స/స/వ/గ/త] స/స/య/త IIU IIUI – UUU UI
12 జగతి 2140

అరుదెంచెను నూత్న-మౌ సౌందర్యమ్ము
వరుస మ్మొక నవ్య – వాతాహ్వానమ్ము
హరుసమ్ముల వేగ – మందించన్ నిండు
తరుణ మ్మిదె స్వాగ-త మ్మివ్వన్ రండు

25) గజాస్య – [గ/జ/జ/స/య] ర/స/న/ర/గ UIU IIUI – IIUI UU
13 అతిజగతి 1499

మోదకమ్ముల నిత్తు – ముదమార నీకున్
బాధకమ్ముల బాపు – ప్రణతోఽస్మి యందున్
నాదబిందు విలాస – నను గావు మయ్యా
ఆదిదేవ గజాస్య – యగజాననాత్మా

26) జలజాత – [జ/ల/జ/జ/త] జ/స/స/య/ల IUII IUII – UIU UI
13 అతిజగతి 4830

హరీ యని దలంచగ – హాయియే కల్గె
తరించఁగ సుఖమ్ములు – దాఁకఁగాఁ దోచె
స్థిరమ్మగు మనమ్మున – దీపమే వెల్గె
సరస్సను హృదిన్ జల-జాతమే పూచె

27) రాగవల్లి – [ర/ర/గ/వ/ల/ల/ల/ల] ర/ర/ర/న/ల UIU UIU – UIU IIII
13 అతిజగతి 7827

గంగగా పొంగెరా – గాన మీ మనమున
రంగుతో నిండెరా – రాగ మీ మనమున
చెంగునన్ నాట్యముల్ – జేసె నీ హృదయము
శృంగమున్ జేరెరా – తృప్తితో హృదయము

28) గజానన – [గ/జ/జ/న/న] ర/స/న/న/ల UIU IIUI – III III
13 అతిజగతి 8155

ఓ గజానన దేవ – యుమకు సుతుఁడ
వేగ మాపుమ విఘ్న – విషమములను
రాగతాళలయంపు – రవళి యలర
స్వాగతమ్మిడి లోక-వరునిఁ గొలుతు

29) గగనతార – [గ/గ/న/త/త/ర] త/స/ర/ర/లగ UUI IIU UI – UUI UIU
14 శక్వరి 5277

రావా గగనతారా వి-రాట్చిత్ర కాంతితోఁ
దేవా నవనవమ్మై సు-దీప్తుల్ ప్రశాంతితో
నీ వర్ణమయమౌ రాత్రి – యెంతెంత హాయియో
నీ విశ్వములలో నెప్డు – నిద్రించు మాయయో

30) నగవు – [న/గ/వ/వ/వ/వ/వ] న/ర/జ/ర/లగ III UI UI – UI UI UI U
14 శక్వరి 5464

నగవుతోడ వేగ – నన్ను జూడ రమ్ము, నీ
నగవు తప్ప కిచ్చు – నాకు నూత్న శక్తి, నా
సగము నీవు గాదె – సంబరమ్ములందు, రా
మొగము జూప వేల – మోము పూయు పద్మమై