వూళ్లో యిల్లు

కాగితాలు
బాగా పాతవి
వాటిలో యేదో వుంటుంది మోహపడదగ్గది
యెంత పాతవైతే అంత మోహం

అప్పుడు నువ్వు యేదో రాస్తూ వుంటావు
వారపాకు చూరులోంచి
వొక పిట్ట పిల్ల పిలుస్తుంది, వాళ్ల అమ్మను కావొచ్చు
నిన్నే అనుకుంటావు నువ్వు
అప్పుడు దాని తెరచిన నోటి లోని యెరుపు
దాని వొంటి మీద
యెప్పటికో యీకలు తొడుక్కోనున్న
రెక్కల పల్చని నగ్నత్వం…
వాటి వెంట పడి వెళ్లిపోయిన నీ
మనస్సు వెంట వెళ్తావు నువ్వు

యెప్పుడో మరి చాన్నాళ్లకు
యెక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి
అరుగు మీద గూట్లో యేదో మెరిసినట్లై
యేంటా అని వెళ్లి చూస్తావు
యేదో యెప్పుడో పగిలిన సీసా పెంకు
లేదా చిరిగిన తగరం ముక్క
సరేలే అని కన్ను తిప్పుకుంటుండగా
గూటిలో లోపల యేదో నలనల్లగా

కాగితం, బాగా పాతది
దానిలో నీ అక్షరాలు
నీకు తెలీదు
అక్షరాల్లో యింకా యీకలు రాని రెక్కల పిట్ట పిల్ల
అమ్మ కోసం యెదురుచూస్తున్న ఆకలి చూపులు
భలే వుందే అనుకుంటావు
యిన్నాళ్లయినా నీ యిల్లు నీకు వున్నందుకు
నీ పదాలు నిన్ను మోహించి
నీ కోసం యెదురు చూస్తున్నందుకు

లోపలి ఆకాశం వొక్కసారిగా
విచ్చుకుంటుంది
యీకలు తొడిగీ తొడగని
రెక్కలతో నీలి నీలి గాలిలో
పిట్టలు గిరికీలు కొడతాయి

అప్పుడు పుడుతుంది
వొక్కసారిగా యింటి మీద గొప్ప గౌరవం
యిళ్లు లేని వాళ్లందరినీ నీ యింటికి
పిల్చుకోవాలని కూడా అనిపిస్తుంది

అన్నయ్యా! యిల్లు అమ్మొద్దు
వుండనీ, యెవరినేనా వుండనీ
వాళ్లను అడిగి
అరుగు మీద గూళ్లు చూసుకుందామని…
దేశ దేశాలు తిరిగినా
తిరిగి తిరిగి రావడానికి యిల్లు వుండనీ
అందులో యెవరినేనా వుండనీ

యే గూటిలో
యే అక్షరం నిద్ర పోతుంటుందో
యీకలు వచ్చీ రాని రెక్కలతో
కొన్ని ఆకాశాల్ని కలగంటూ…