సినారె: ఒక స్మరణ

సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి జూలై 29, 1931 – జూన్ 12, 2017) మరణంతో పాండిత్యం పునాదిగా గల ఆధునిక కవుల తరం ముగిసిందేమో అన్పిస్తుంది. శ్రీశ్రీ, శేషేంద్ర, సోమసుందర్, ఆరుద్ర, దాశరథి మొదలైన ముందు తరం గొప్ప కవులంతా ప్రాచీన సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాళ్లు. ఆంగ్ల సాహిత్యంతోనూ గాఢ పరిచయం గలవాళ్లు. అది వాళ్ల సాహిత్య కృషికి నిరంతర పాథేయంగా ఉపయోగపడింది. ఎన్నో కొత్త కొత్త పోకడలకు వెన్నుదన్ను అయింది. కడదాకా ఆగిపోకుండా సాయపడింది. సినారె కవిత్వం చదివేటప్పుడు ఆయనకున్న భాషాధికారం, ఛందోవ్యాకరణాలంకార పరిజ్ఞానం పక్కపక్కనే తెలుస్తూనే ఉంటాయి. వ్యక్తీకరణకు అనువైన, అక్షర రమ్యత గల పద సమూహాన్ని ఎన్నుకోవటం, అవలీలగా వైరంలేని సమాసనిర్మాణం చెయ్యగలగటం, అనురూప శబ్ద సంయోజనం, ఎక్కడా వ్యాకరణ భంగం లేకపోవటం- ఇవన్నీ ఆయన రచనల్లో కనపడే అంశాలు. జాగ్రత్తగా గమనిస్తే సినిమా పాటల్లోనూ యతిప్రాసల్ని పాటించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాశరథి పాటల్లో ఛందోబంధం లేని నిసర్గత ఉండగా, సినారె పాటల్లో ‘ఛందో బందోబస్తు’ గల నిర్దుష్టత ఉంటుంది.

అటువంటి పాండిత్య భూమిక ఉన్న వర్తమాన కవులు తక్కువ. ఎంత తక్కువంటే అంత తక్కువ! ఇప్పటి కవిత్వంలో పరిమిత పదసామగ్రికి, వదులుతనానికి అదొక కారణం. భాషావైవిధ్యం చూపటానికి, వ్యక్తీకరణ నైపుణ్యానికి, నిర్మాణ చాతుర్యానికి ప్రాచీన సాహిత్య అధ్యయనం ఎంతగానో తోడ్పడుతుందని నా దృఢాభిప్రాయం. అటువంటి సాధన ముఖ్యంగా యువకవులకి చాలా అవసరమని సినారె వంటి కవులు పరోక్షంగా చెపుతారు.

యువకవుల్ని ఆయన ప్రోత్సహించినంతగా మరెవ్వరూ ప్రోత్సహించలేదేమో. ఆయన మెప్పు పొందాలని ఆశించని వర్ధమాన కవులు తక్కువ. ఆ మెప్పుదలను పెద్దమనస్సుతో ఆయన ఉదారంగా పంచిపెట్టాడు. ఏ యువకవి ఏ పుస్తకం పంపినా అందులో ఏదో ఒక కవితను ఉటంకిస్తూ తిరుగుటపాలో అభినందన లేఖ రాకుండా ఉండదు. నేను ఆకుపచ్చని లోకంలో పంపినప్పుడూ అదే ప్రశంస. 1994లో జరిగిన దూరదర్శన్ ఉగాది కవి సమ్మేళనానికి ఆయన అధ్యక్షుడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శేషేంద్ర, ఆవంత్స సోమసుందర్ మొదలైన మహారథులు పాల్గొన్న ఆ సమ్మేళనంలో ఆకుపచ్చని లోకంలో కవితను ఆయన మెచ్చుకొన్న తీరు నాకెంతో ఉత్తేజం కలిగించింది. తదనంతరం ఒకసారి గుంటూరు మహాసభలో మాట్లాడుతూ ‘శివశంకర్ మేధావి కవి; విమర్శకుడు. ఆయన ఏమి చెపుతాడా అని ఇవాళ సాహిత్యలోకం ఎదురుచూస్తుంది,’ అని ప్రశంసించాడు. అలాంటివి ఏ యువకవినైనా పొంగిపోయేట్టు చేస్తాయి.

పద్యం కన్న మాత్రాఛందస్సును ఆయన తిరుగులేకుండా వశం చేసుకొన్నాడు. కర్పూర వసంతరాయలు దానికి గొప్ప ఉదాహరణ. పాదాలమధ్య కచ్చితమైన విరుపు, అకృత్రిమమైన అనుప్రాసలు. ఊహించని విధంగా ఒక పాదం చటుక్కున విరిచి, తర్వాతి పాదం లోకి దూకటం, నిశితమైన వ్యక్తీకరణ ఆయన మాత్రా గేయాలకి అలంకారాలు. సాధారణంగా పన్నెండు, పద్నాలుగు, పదహారు- ఇట్లా సరిసంఖ్య మాత్రలతో తూగుతో నడుస్తాయి మాత్రాగేయాలు. అయితే అరుదుగా పదమూడు మాత్రలతో, ఏమాత్రం లయభంగం కాకుండా ఆయన నడిపిన గేయాన్ని గుంటూరు సభలో నేను ప్రస్తావించినప్పుడు అది తనే గుర్తించలేదని ఆశ్చర్యపోయాడు. ఉర్దూ గౙల్ ప్రక్రియను తెలుగులోకి తీసుకురావటంలోను ఆయన ప్రత్యేకత ఆయనదే. ప్రణయ విషాద మాధుర్యాలకు నిలయమైన గౙల్‌లో మానవతా దృక్పథాన్ని, సామాజిక విషయ విశ్లేషణని ప్రవేశపెట్టాడు. అందులో అవసరమైన విసురును అలవోకగా సాధించాడు. అంతకన్న మధురంగా గానం చేశాడు.

సినారె కవిత్వంలో శబ్దలయకు ప్రాధాన్యం ఉంటుంది. బహుశః ఈ లయ ప్రాచీన పద్యకవిత్వం నుంచి, మాత్రాచ్ఛందస్సుల నుంచి సంక్రమించి ఉండాలి. వచన కవితల్లోనూ ఆయన ఒక అంతర్లయ పాటించాడు. శబ్దమాధుర్యం ఆయన కవిత్వానికి ఆలంకారికత్వాన్ని, ఆ క్రమంలో శ్రావ్యతనీ సమకూర్చింది. కవిత్వంలోనూ వెలుపలా చాలా సందర్భాల్లో శబ్దప్రేమికుడుగా కనిపిస్తాడు సినారె. చమత్కారభరితమైన ఈ శబ్దాశ్రయత్వం ఆయన ఉపన్యాసాలకు తక్షణ ఆకర్షణీయత కల్పించింది. ఏ విశేషమూ లేనిచోట, ఏ విశేషమూ వివరించని చోట సైతం, అర్థగాంభీర్యం కరవైన చోటసైతం అది శ్రోతల్ని మైమరపించింది. దానికి ఆయన స్వరమాధుర్యం తోడయ్యింది. ఎడారివంటి సభాంగణాన సైతం ఒయాసిస్సు కల్పించగల ఇంద్రజాలికుడాయన.

కాల్పనిక యుగంలో కృష్ణశాస్త్రిలాగా అభ్యుదయ సాహిత్య కవిత్వానికొక గ్లామర్ కల్పించినవాడు సినారె. తన ఆహార్యంతో, స్ఫురద్రూపంతో, వాక్చాతుర్యంతో, ఈ అన్నిటి చాటున దాగి ఉన్న పాండిత్యంతో కవిత్వాకృతికి బాహ్య ఆకర్షణీయత సమకూర్చాడు. ఇది సమకాలికులైన ఆరుద్ర, దాశరథి వంటి కవుల పద్ధతికి భిన్నమైంది. కవి అంటే ఇలా ఉంటాడు, లేదా ఉండాలి అనే ఊహ ఆయన్ని చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది. రకరకాల అవార్డులు, గౌరవాల ద్వారా అయన లోకానికి తోడు తనకు తానే ఒక ఔన్నత్యాన్ని కల్పించుకొన్నాడు. అందరితో సన్నిహితంగా ఉంటూనే ఒక ఉన్నతస్థాయిని ‘మెయిన్‌టైన్’ చేశాడు. ఇది శ్రీశ్రీవంటి మహాకవుల్లో కనపడనిది. నా మట్టుకు నాకు సరిపడనిది కూడా. ఒక రకంగా చెప్పాలంటే సినారె శిరస్సు కీర్తి కిరీటంలో ఇరుక్కుపోయింది. దానినుంచి అది ఎన్నడూ బయటపడలేదు.

సినీకవిగా ఆయన రంగప్రవేశం అద్భుతంగా జరిగిందని మనకు తెలుసు. చెలులు హృదయంలో నిదురిస్తున్న తరుణంలోనే వాళ్లచేత దోపిడీలు(నన్ను దోచుకుందువటే) చేయించినవాడు సినారె. ప్రారంభంలోనే కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై అంటూ లలితలలిత ప్రణయభావన పలికించాడు. కన్నెవయసు తొలివలపు పులకరింతల దగ్గరనుంచి నిండుప్రణయ భావనల దాకా సినిమా పాటల్లో శృంగారాన్ని రసరాజంగా నిలిపాడు. అదే సమయంలో దానిని సభ్యత హద్దు దాదాపుగా దాటనివ్వలేదు. స్వయంగా సంగీతజ్ఞుడు కావటం ఆ గీతరచనకి బాగా ఉపకరించింది. ముఖ్యంగా, ఏకవీర వంటి చిత్రాల్లో పాటలు క్లాసిక్స్ స్థాయివని నాకనిపిస్తుంది.

సినారె విమర్శ ‘అప్రీసియేషన్’ అనే ఆంగ్ల విమర్శ పరిభాషకి ఉదాహరణగా నిలుస్తుంది. ‘ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు’ ఇప్పటికీ పరిశోధక విద్యార్థులకు ప్రాథమిక ఆకర గ్రంథమే. సమగ్ర పరిశీలన, విషయ విశ్లేషణ, మృదువైన ప్రతిపాదన మొదలైన లక్షణాలు గల విమర్శ ఆయనది. అది స్థూలంగా సమన్వయ దృక్పథం. అటు ప్రాచీనత – ఇటు నవ్యత, అటు కాల్పనికత – ఇటు అభ్యుదయం– అన్నిటినీ కలుపుకుంటూ అన్నిటిలోని అంశాలను స్వీకరిస్తూ సాగుతుంది ఆయన విమర్శ పద్ధతి.

ఒకసారి తన కవితా సంపుటి పంపినప్పుడు గౌరవంగా ఉత్తరం రాశాను. విద్యార్థి దశలో ఆధునిక కవిత్రయంగా నేను భావించినవారిలో (శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, సి. నారాయణరెడ్డి) ఆయన ఒకరని, మాత్రబద్ధ గేయరచనకి, సినిమా పాటలకి, గౙల్ ప్రక్రియకు ఆయన చేసిన దోహదం దొడ్డది అని- ఇట్లా. తొందరగానే ఆయన నుంచి లేఖ వచ్చింది. నా అభినందనకు సంతోషం ప్రకటిస్తూ వచన కవిత్వానికి కూడా తను విశిష్ట దోహదం చేసినట్టు మిత్రులు పేర్కొంటూ ఉంటారని తెలిపాడు. ఆ అభిప్రాయంతో నేనిప్పటికీ ఏమంత ఏకీభవించలేను. సినారె వచన కవిత్వంలో- మధ్యతరగతి మందహాసం, మట్టీ మనిషీ ఆకాశం, విశ్వంభర వంటి రచనల్లో తాత్విక అన్వేషణ కన్పిస్తుంది. అయితే వచన కవిత్వాన్ని గొప్ప మలుపు తిప్పినవాడుగా సినారె నాకు కన్పించడు.

అమూర్తత(abstraction) సినారె కవిత్వంలో ప్రధాన లక్షణం. నిర్దిష్ట సంఘటనలకి, ఉద్యమాలకి ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు అరుదు. నిర్దిష్టతను గుర్తించి స్పందించాల్సిన సందర్భాల్లోనూ ఆయన అమూర్త వ్యక్తీకరణనే ఆశ్రయించాడు. భావ సంయమనం పాటించాడు. ఆయనది పెద్దమనిషి తరహా కవిత్వం. ఆయన కవుల్లో లౌక్యుడు. లౌక్యుల్లో కవి.

అవసరమైనప్పుడు వ్యవస్థని, వ్యవస్థీకృత విలువల్ని ధిక్కరించటం మహాకవుల స్వభావం. అటువంటి ధిక్కార స్వరం, ఆగ్రహ భాస్వరం సినారె కవిత్వంలో తక్కువ. అమానవీయత పట్ల ఒక నిరసన, మానవత్వంపై ప్రేమ, సమాజం మంచివైపు ప్రయాణించాలనే ప్రగాఢవాంఛ ఆయన దృక్పథంలో ఇమిడివున్నాయి. ‘ఎవడాపును మానవతా రవి రుక్కును, కవి వాక్కును?’ అన్నాడాయన.

పాండిత్య సంపద, అభ్యుదయ దృక్పథం, యువతరంపై నమ్మకం, బహుముఖీన ప్రజ్ఞ- ఇవన్నీ సినారెని తలచుకున్నప్పుడు గుర్తొస్తాయి. ఒక ప్రభావశీలమైన కవి దాటిపోయినాక విమర్శను సంధించటం చాలా తేలిక. ఆయనపట్ల గౌరవంతోపాటు కొంత నచ్చనితనం కూడా ఉంది నాకు. అయితే ఎవరిలోనైనా ముందుగా వెలుతురు చూడాలి. మనం మనుషుల్లో, ప్రపంచంలో చీకటినే చూడటానికి అలవాటు పడ్డవాళ్లం. నామట్టుకు నాకు సినారెలో ఇప్పుడు ఆ వెలుతురు చూడటమే యిష్టం.