తెరచాటు-వులు: 6. ఆస్సెం

కాదేదీ కామిడీ కనర్హం

కింద అంతస్తులో, బాత్రూమ్‌లో ప్రకృతిని పలకరిస్తున్న అబ్బాయి, ఎదురింటి పై అంతస్తులో కిటికీ దగ్గరకు చేరి బట్టలు మార్చుకుంటున్న అమ్మాయిని ఒక పాలరాతి గ్రీకు శిల్పాన్ని తన్మయత్వంతో చూసినంత అబ్బురంగా చూడటాన్ని అమ్మాయి యథాలాపంగా తల తిప్పి చూడగా, అప్పటి వరకూ కళ్ళప్పగించి చూస్తున్న అబ్బాయి ఒక్కసారి ఉలిక్కిపడి, చేస్తున్న పని మర్చిపోయి, జిప్పు బలంగా పైకి లాక్కుంటాడు. [అబ్బాయి మొహం మీద క్లోౙప్] చిటికిన వేలు రోలులో పడి చితికిపోయినంత బాధ. రోలైతే పోనీ వేలు చటుక్కుని లాగి ఊదుకొనో, ఎగిరిపడో, బాధని వ్యక్తం చేసే పని! ఇక్కడ వచ్చిన చిక్కు- పట్టమంటే కప్పకి, విడవమంటే పాముకి… పైకీ పోలేడు, కిందకీ రాలేడు, బాధతో విలవిలలాడిపోతూ ఉంటాడు. సహజంగా జోకు ఇక్కడికి ముగించినా రావాల్సిన నవ్వు వచ్చేస్తుంది. There’s something about Mary రచన-దర్శక ద్వయం ఫారెల్లీ సోదరులు (Farelly brothers) అక్కడితో ఆపరు. అబ్బాయి అరుపుకి హడలెత్తిన చుట్టూపక్కా వచ్చి, తలో సలహా చెప్పి, తలో చేయి వేసి కలుగులోని ఎలుకను జాగ్రత్తగా లాగే ప్రయత్నం చేయడం, ఈ లోపల ఆ అబ్బాయి, అమ్మాయి తన వైపు చూస్తోందన్న సిగ్గు ఒక పక్క, మగవాడికి మాత్రమే అర్థమయ్యే వర్ణనాతీతమైన బాధ మరో పక్క, ఈ రెండూ కలిసి చేస్తున్న దాడితో మెలికెలు తిరిగిపోతూ ఉండడం… ఇలా ఆ సన్నివేశం కనీసం ఒక పది నిముషాల పాటు ఎక్కడా బిగువు సడలకుండా, మూడ్ చెడకుండా, ప్రేక్షకుల పొట్టల్నీ కళ్ళనీ వీలైనంత ఇబ్బంది పెడుతూ సాగిపోతూ ఉంటుంది. కంటి ముందు ఎవరన్నా అరటి తొక్క మీద కాలేసి జారిపడితే అసంకల్పితంగా నవ్వు వస్తుందన్న ప్రతిపాదనకు ముకుతాడు కట్టి సభ్యత చివరంచుల వరకూ లాక్కెళ్ళిన ఘట్టం అది. ఇక్కడ ప్రశ్న హాస్యం అంటే ఏమిటని కాదు. తెగకుండా ఎంత దూరం వరకూ లాక్కెళ్ళచ్చు అనేదే.

ఈ సినిమాలోనే మరో దృశ్యం. అమ్మాయి అబ్బాయితో ఓ సాయంకాలం బయట డిన్నర్‌కి ఒప్పుకుంటుంది. అబ్బాయి స్నేహితుడు వచ్చి ఇలా అమ్మాయితో మొదటిసారి బయటికి వెళ్తున్నప్పుడు మనసులో ఎలాంటి వికారాలు లేకుండా ప్రశాంతంగా గడపాలంటే వేడిని ఉపశమింప చేసుకోవడం తప్పనిసరి అన్న ఉచిత సలహా ఒకటి ఇస్తాడు. ప్రేమ విషయంలో మన నమ్మకాల కంటే పక్కవాడి సలహాలకే ఎప్పుడూ విలువెక్కువ కాబట్టి, అబ్బాయి వెంటనే బాత్రూమ్‌లోకి చేరి వార్తాపత్రికలోని కాస్త కంటికి ఇంపుగా ఉన్న వాణిజ్య ప్రకటనలని ముందు వేసుకుని పనికి ఉపక్రమించడం, ఈ లోపల తలుపు చప్పుడు అవడంతో శీఘ్రంగా పని ముగించి శుభ్రం చేసుకునే అవకాశం లేక తలుపు తెరవడం, ఇంతలో అమ్మాయి అబ్బాయి చెవి వెంబడి జీరాడుతున్న స్ఖలితాన్ని హెయిర్ జెల్ అనుకుని, అబ్బాయి అడ్డుపడే లోగానే చటుక్కున చేతికి తీసుకుని తన జుత్తుకి పూసుకోడం, అన్నీ లిప్తపాటులో జరిగిపోతాయి. పంచ్ లైన్ మాటకొస్తే ఆ సన్నివేశం అక్కడితోనే ముగియాలి. కాని ఫారెల్లీ సోదరులు మళ్ళీ అక్కడితో ఆపరు. వాళ్ళు రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, అబ్బాయి ఆ ఆమ్మాయిని చూస్తూ మాట్లాడలేక, అదే సమయంలో చూపు మరలించలేక తికమక పడిపోతుంటాడు (ఎందుకో కేమెరా పుల్‌బ్యాక్ వల్ల మనకూ తెలుస్తుంది). అమ్మాయి జుత్తు శిఖిపింఛమౌళికి మల్లే, జటాజూటం నుండి దివిజదేవేరి విడుదలల్లే, నిటారయి ఓ పక్కకి ఒరిగి ఉంటుంది. సంభాషణ కొనసాగుతుంది…

పులి చారలు – నక్క వె(వా)తలు

వాయిద్యపు హోరులో మాటల ఊసులు చెవికి సోకడం లేదన్న బాధతో ఎప్పుడో ఒక సారి ఎస్పీబీ అన్నట్టు– బూతు రాయించుకోండి, కాదనటం లేదు, కాని ఆ రాయించుకున్న బూతన్నా వినపడాలి కదా, అది వినపడకుండా శబ్దాల హోరు వాటిని మింగేస్తుంటే రాయించుకుని ప్రయోజనం ఏముంది. స్టేండప్ శౌరి జార్జ్ కార్లిన్ (George Carlin) ఒక సందర్భంలో, మాటలకి మంచి-చెడులు తెలియవు, అవి స్వయం ప్రకాశాలు కావు, వాటికి స్వయం ప్రతిపత్తి ఉండదు– అంటాడు. సందర్భం ఆ మాటని మంత్రపూరితం చేస్తుంది అని అతని వాదన. అలాగే హాస్యం – అశ్లీలం, సంసార పక్షం అని ఉండదు. పండితే పొట్ట చెక్కలు చేస్తుంది. చెడితే అసందర్భంగా అసంబద్ధంగానే ఉంటుంది. పై ఉదాహరణలలో మర్మావయవపు వెతలు, స్వయంతృప్తి చేష్టల వంటివి సభ్య సమాజం బాహాటంగా చర్చించుకునే విషయాలు కావు. అటువంటి వాటికి కూడా తగిన సందర్భం సృష్టించి వాటి నుండి నవ్వులను వెలికి తీయగలిగితే హాస్యానికి అశ్లీల దోషం ఎంత మాత్రమూ అంటదు.

ఈ మధ్య కాలంలో వచ్చిన పికూ (Piku) చిత్రంలో కూడా వయసు మళ్ళిన తండ్రికి ఉన్న మలబద్ధకపు బాధను కూడా జుగుప్సారకంగా కాక ఎంతో రంజకంగా మలిచారు రచయితా దర్శకులు. ఒక సందర్భంలో, అసలు మలవిసర్జనకు సరైన ఉపవిష్ట ఆసనం ఏదన్న వాదన మీద సనాతన ధర్మ సిద్ధాంతాలను ఉటంకిస్తూ, ఏదో విందు భోజనానికి సిద్ధమయినట్టు ఆసనం మీద తిష్ట వేయక, గొంతుక కూర్చుంటే, అది పొట్ట మీద, చిన్న పేగు మీద తెచ్చే వత్తిడికి సాఫీ బట్వాడా జరిగి కడుపు ఖాళీ అవుతుంది అని సాంకేతికంగా ఒక పాత్రతో చెప్పించడం ద్వారా హాస్యం పండించే ప్రయత్నం చేసి కడు కృతకృత్యులయ్యారు రచయిత, దర్శకుడూ.

అందువల్ల తెలిసేది: హాస్యానికి వెన్నుగడ సందర్భం. ఏ సందర్భంలో హాస్యం పండుతుందో తెలుసుకోవడమే సెన్స్ (సెన్స్ – సెన్సిబిలిటీ ద్వయంలో). బ్రహ్మానందం తెర మీద కనిపించగానే, అతను ఏమీ చేయకుండానే ప్రేక్షకులు పెదవి విరిచి (నవ్వు కోసం) సిద్ధపడతారు. అది చిరునవ్వుగా మిగిలి చివరికి సరసం విరసం అవుతుందా, లేక ఆ చిరునవ్వు పెరిగి పెద్దయి ఉదరకోశానికి ప్రమాదం తెచ్చిపెడుతుందా అన్నది, బ్రహ్మానందాన్ని వాడుకున్న సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో రామ్‌గోపాల్ వర్మని అభినందించక తప్పదు – ఒకటి క్షణక్షణం కోసం, రెండోది మనీ కోసం, మరీ ముఖ్యంగా మనీ. ఎత్తు బరువుల విషయంలో, కండల కొండల విషయంలో భగవంతుడంతగా కనికరించని బ్రహ్మానందాన్ని, పేరు వింటేనే జనాలు ఠారెత్తి పోయే ఖాన్ దాదా పాత్రకు ఎంపిక చేసి, ఆ పాత్రని హాస్యంగా కాక ఎంతో సీరియస్‌గా వాడడం అనేది ఈ సెన్స్ అన్న పదానికి సరైన ఉదాహరణ. ఏ సన్నివేశంలో అయినా హాస్యమైన విషయం ఏది అని కనుక్కోవడమే ‘సెన్స్’. ఆ విషయాన్ని ఎక్కడి వరకూ లాగచ్చో చెప్పేది ‘సెన్సిబిలిటీ’. ఆ మధ్య ఒక వెల్లువలాగా, అరవ చిత్రాల పుణ్యమా అని, ఒక పాత్ర ఇంకొక పాత్రని పృష్ఠభాగం మీద తన్నడం, ఆ తన్నించుకున్న వాడు బురదలో పడడం అన్నది, హాస్యం పేరుతో చలామణీ అయిపోయింది. అరటి తొక్క – జారుడు సన్నివేశం కూడా ఒకసారి నవ్వు తెప్పించే కారణం అందులో ఉన్న షాక్ వాల్యూ వల్ల తప్ప మరొకటి కాదు. అదే మరొక సారి ఇంకొకళ్ళు జారి పడితే, ఆ షాక్ కాస్తా జాలిగా మారిపోతుంది. ఈ సిద్ధాంతం ద్వంద్వార్థపు సంభాషణలకి కూడా వర్తిస్తుంది. మొదటిసారి విన్నప్పుడు కలిగే షాక్, ఆ తరువాతి ప్రయత్నాలకి జావగారిపోతుంది. అందుకనే హాస్యానికి, డ్రామాకి మించిన సునిశితత్వం సున్నితత్వం కావాలి.

ఫార్ములా అంటూ సినిమా వాళ్ళు వెంపర్లాడిపోవడం వెనక సహేతుకమైన కారణాలే ఉన్నాయి. బ్రహ్మాండంగా పనిచేసిన ఒక పద్ధతిని పదేపదే వాడి ఆ మెరుపుని ముంతలో బిరడా కట్టి బిగించి అమ్ముకుని లాభం పొందుదామనుకోవడంలో తప్పు లేదు. హాస్యం వరకూ తెలుగు సినిమాల్లో కొన్ని నలిగిన ఫార్ములాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అత్త-అల్లుడు ఫార్ములా, షేక్‌స్పియర్ నాటకం ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ (The Taming of the Shrew) పై ఆధారితం. పేరున్న ప్రతి హీరోకీ ఇదొక కల్పతరువు. బాక్సాఫీసు దగ్గర వరస పల్టీలూ కొడుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నపుడు ఎందరో హీరోలను ఆదుకుని కొత్త జీవితం ప్రసాదించిన సంజీవనీ మంత్రం ఈ అత్త-అల్లుడు ఫార్ములా. నోరు పారేసుకునే అత్త, నోరెత్తలేని మామ, ఫస్టాఫ్‌లో పొగరు పొంగిపొరలుతూ తరువాత తప్పు తెలుసుకుని సెకంఢాఫ్‌లో నారీశిరోమణిగా మారే మరదలు (వీలైతే, ఒక పొగరు, ఒక విగరు ఉన్న ఇద్దరు మరదళ్ళైతే ఇంకా సేఫ్. క్లైమాక్సులో ఇద్దరినీ – ధర్మ బద్ధంగా – కట్టుకోవడానికి పురాణ పురుషుల ఆదర్శముండనే ఉంది), దుష్ట మేనమామ అతని పన్నాగాలు, వీరందరినీ ఆటపట్టించి వినోదం పంచడానికి మన బతికి చెడ్డ (మేన)అల్లుడి కుటుంబం.

కథ అనేది ఇది అని ఇంకా ఏమీ అనుకోకుండానే ఇలా ఫార్ములానే ఒక ఇరుసును తయారుచేసేస్తుంది. ఇక మిగలిందల్లా, ఈ పాత్రల మధ్య డైనమిక్స్. సినీజనాలు దీనిని నమ్ముకోవడానికి కారణం, చూసేవాడికీ ఏమి చూస్తున్నామో తెలిసీ, తీస్తున్నవాడికి ఏమి తీస్తున్నామో తెలిసీ, ఆ ఇద్దరి మధ్య ఉండే ముఖ్యమైన సమన్వయం, ఈ ఫార్ములా వల్ల కలగడం చేత. ఫార్ములా మూసలో పడితే పెద్దగా ప్రయోగాలు ఏమీ ఉండవు, ఉన్న దానిని చెడగొట్టకుండా ఉంటే చాలు. నలిగిన దారి, తెలిసిన నడక. ఫార్ములా అనేది ఒక కంఫర్ట్ ఫుడ్. పుష్టి ప్రసాదించేది ఏమీ ఉండదు, కేవలం సంతుష్టే. ఫార్ములా అన్నారు కదా అని వాడే ప్రతీవాడు విజయ సోపానాలు ఎక్కేయడు. ఇక్కడ కూడ సెన్స్ & సెన్సిబిలిటీ ప్రాధాన్యత ఉంటుంది. అందునా పాత్రల స్వభావం ముందే నిర్ణయింపబడే ఇలాంటి సందర్భంలో- అత్త ఇలాగే ఉండాలి, అల్లుడే పని పట్టాలి, మామ మిన్నకుండాలి, మరదలు అల్లరి చేయాలి- హాస్యం ఎక్కడుందో నిర్ణయించడం మరీ కష్టం. నలుపూతెలుపులనించి నేటి వరకూ ఈ చర్వితచర్వణ అత్తా-అల్లుళ్ళ ఉపాఖ్యానాలలో, కొద్దిగా కొత్త పుంతలు తొక్కిన సినిమా అంటే, ఖచ్చితంగా అది పరుచూరి సోదరులు రాసిన బొబ్బిలి రాజానే. కారణం, వాళ్ళు హాస్యాన్ని సాధారణంగా వాడుకునే కుటుంబ వ్యవహారాల్లోంచి తీసుకువెళ్ళి ఎక్కడో రాజకీయంతో ముడిపెట్టడం (‘రాష్ట్రాన్నైనా రాసిస్తాను గాని…’). అత్తగారి దర్పం అంతా తన పదవిని, పరపతిని చూసుకుని కాబట్టి, రాజకీయంగానే ఆమెను క్రుంగదీస్తే కాళ్ళ బేరానికి వచ్చి, కళ్ళు తెరుచుకుంటాయన్నది ఆ సోదరుల సూత్రం. అనుకునట్టుగానే ఎక్కడ వీలైతే అక్కడ సమకాలీన రాజకీయం మీద చురకలు వేసుకుంటూ పోయి (వాటితో పాటు సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టు, పోలీసుల మీద, న్యాయవ్యవస్థ మీద తలా పిడికెడు అక్షింతలు చల్లి), అన్నీ కలగలిపి పెత్తనమన్నది మంత్రిగారిదైనా, అత్తగారిదైనా (మంత్రిగారైన అత్తగారిదైనా), సామాన్యుడు (ఈ సందర్భంలో, అల్లుడు) తలవంచుకున్నంత వరకే అని, అదే తలుచుకుంటే సామ్రాజ్యాలే కదలుతాయన్న చాణక్య నీతిని, ఫార్ములాతో మిళితం చేసి మంచి పాకం తయారు చేశారు పరుచూరి సోదరులు.

అత్తా-అల్లుళ్ళ సూత్రానికి మల్లే తెలుగు బాక్సాఫీసు ఢంకా బజాయించే ఫార్ములాలు మచ్చుకు కొన్ని (గమనించాల్సిందేమింటంటే ఇవన్నీ హాస్యాన్ని కేంద్ర బిందువు చేసుకుని దాని చుట్టు అల్లుకున్నవే): రాముడు-భీముడు ఫార్ములా (అత్తా-అల్లుళ్ళ తరువాత మన హీరోలని పిదప కాలంలో ఆదుకున్న ఎల్‌ఐసీ పాలసీ ఇదే); బంగారు పిచిక ఫార్ములా (హీరో/హీరోయిన్ డబ్బున్న ఇంటిని వదిలి పేద పంచన చేరడం, fish out of water కామిడీ); ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన బ్రహ్మానందం బకరా ఫార్ములా, ఇత్యాదులు. అందుకనే రామ్ గోపాల్ వర్మని ఇక్కడ అభినందించాల్సింది. అప్పటి వరకూ ఈ నాలుగైదు చట్రాల్లో పడి నలిగిపోతున్న తెలుగు కామిడీని, ఆ రెండు సినిమాలతో (క్షణ క్షణం, మనీ) పునరుజ్జీవింప చేశాడు. హాస్యం అంటే అప్పటివరకూ గిలిగింతలు పుట్టించే మాటలు అన్న నిర్వచనాన్నించి బయటపడేసి హాస్యానికి సందర్భం ప్రాణం అన్న ఒక పాశ్చాత్య ఆలోచనా ధోరణిని తెలుగు సినిమాకి పరిచయం చేశాడు. అప్పుకొచ్చిన వాడు అప్పు గురించి మాట్లాడక ఖాన్ దాదా(కి లేని) కండల గురించి మాట్లాడి బోల్తా కొట్టించే సందర్భం — ‘ఏంటి అన్న, నువ్వు ఇక్కడ ఉన్నవ్! ఎక్కడో సినిమాల్లో ఉండాల్సినోడివి’, ‘ఈడికి కూడా ఒక చాయి చెప్పు బే!‘. సందర్భాన్ని పక్కన పెడితే, ఆ మాటలలో పెద్ద పదును ఏమీ ఉండదు. సరైన సందర్భం పడిందో, అవి మర ఫిరంగులల్లే పేలతాయి. కానీ సందర్భాన్ని సృష్టించడం మాటలు పుట్టించినంత సులువు కాదు. ప్రతి సినిమాలోనూ ఈ మధ్య వినిపిస్తున్న ఈ ‘పంచ్’ మాటలకి అంత విలువు ఉండని కారణం కూడా అదే. సందర్భ శుద్ధి లేకుండా ప్రతి పాత్రా పంచ్‌లు పంచేస్తుంటే, నిజంగానే ఏదన్నా మంచి మాట పడితే కూడా పట్టించుకునే నాథుడు ఉండడు.

సరే, హాస్యాన్ని ఎక్కడ స్థిరపరచాలో (సెన్స్) తెలుసుకున్న తరువాత, అడగవలసిన మరో ముఖ్య ప్రశ్న, దీన్ని ఎందాక లాగచ్చు? (తెగేదాక అన్నది తార్కికమైన సమాధానం, కానీ అది ఎక్కడ తెగుతుంది?). దానికి సమాధానం- సెన్సిబిలిటీ. అది వచ్చే నెలలో.